డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--68

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘లోగడ అతను క్లియోపాత్రాను పెళ్లాడిననాడు రోమన్ ఆ క్రమంలో ఉన్న చిన్న రాజ్యాలు కొన్నింటిని ఈజిప్టుకు కానుకలుగా సమర్పించాడు. దీనికి మన అనుమతి లేదు. ఎంతవరకూ నిజమోనని కూడా వేచి ఉన్నాం కదా!
‘‘రోమన్ సైన్యాలనూ, ప్రభుత్వ ధనాన్నీ తీసుకొని వెళ్లి, పర్షియన్ దండయాత్ర మిషతో అక్కడ అంతఃపురాల్లో విలాసంగా కాలం గడిపాడు. ఒకసారి దండయాత్ర సాగించి, విశేష ధననష్టం, జన నష్టాలతో తిరిగొచ్చాడు. ఇది కేవలం అతని తప్పేనని కూడా మనం అనుకోవడం లేదు. జయాపజయాలు దైవాధీనాలు కనుక సమాధానపడుతున్నాం. తిరిగి అతను దండయాత్రకంటూ బయలుదేరి ఆర్మీనియా, మెడియాలను జయించాడు. రోమన్ సైన్యాలతో జయించిన ఇవి రోమన్ సామ్రాజ్యంలోనే జేరాలి కదా!
‘‘అలాంటిది - ఆర్మీనియా, మెడియాలను కూడా ఈజిప్టుకు అతను కలిపేశాడు. ఈనాడు ఏంటనీ రోమన్ సామ్రాజ్యానికి చక్రవర్తి కావాలనుకుంటున్నాడనుకునేందుకూ, అలాంటి అధికారాలనే చెలాయిస్తూన్నందుకూ విచారపడుతున్నాం. ఈ రాజ్యం రోమన్‌ల సొత్తు. ఏంటనీకి కానీ, నాకు కానీ, మరొకరికి కానీ ఇది వ్యక్తిగతమైన ఆస్తి కానేరదు. అలాంటిదాన్ని తన సొంతమనే ధోరణిలో ఏంటనీ దానధర్మాలుగానూ, కట్నకానుకలుగానూ సమర్పిస్తున్నాడంటే, ఇది మనకు తీరని నష్టం. మన అనుమతి లేకుండానే ఈ సంఘటనలు జరిగినవి.
‘‘కిందటిసారి జరిగిన సంధి షరతుల ప్రకారం, ఏంటనీకి తూర్పుదేశాల పాలన కేటాయించబడింది. ఆయన పాలనలో రోమన్ సామ్రాజ్యం నష్టపడింది. కొత్త భూఖండాల మాట దేవుడికెరుక. ఉన్నవీ, గెల్చుకున్నవీ కూడా పోయినవి. ఏంటనీ చేసిన నిర్వాకమేమిటో మనందరికీ తెలుసు.
‘‘సర్వాధికారిగా ఉన్న నా పట్ల కూడా అతను వ్యక్తిగతమైన ద్రోహాన్ని తలపెట్టాడు. నా చెల్లెల్ని అగ్నిసాక్షిగా పెళ్లాడి, సంతానాన్ని పొంది, ఈనాడు అమె ఖర్మకు ఆమెను వొదలేసి, అక్కడొక పెళ్లి చేసుకొని కులుకుతున్నాడు. ఇది సంధి షరతుల్ని అతిక్రమించడం, నా కుటుంబ గౌరవానికీ, వంశ ప్రతిష్టకూ తీరని అవమానం!
‘‘ఇంతటితో అయపోలేదు. ఏంటనీ ఆ మాయలాడి క్లియోపాత్రా సమ్మోహనాస్త్రానికి గురయ్యాడు. అతనికి రోమ్ పట్ల మమత ఉన్నదనేందుకు ఒక్క తార్కాణం కూడా లేదు. ఈజిప్టు పాలనాధికారిగా ఉంటున్నాడు. బహుశా రాజుగానే ఉంటున్నాడేమో?... రాణిగారి భర్త కనుక అతన్ని రాజుగా అంగీకరించేందుకు నీతి లేని ఈజిప్షియన్‌లకు ఎలాటి అభ్యంతరమూ ఉండి ఉండకపోవచ్చు.
‘‘రేపు ఈజిప్టుతో చేతులు కలిపి, స్వదేశం మీదనే అతను దండెత్తితే మనమేం చేయాలి? క్లియోపాత్రా ఎంత తెలివిగలదో, సమయం వస్తే ఎలా దెబ్బతీయగలదో మనం ఎరుగుదుం. ఆ విషమ పరిస్థితులు రాకుండానే మనం జాగ్రత్త పడాలి.’’
ఈ ఉపన్యాసం జరుగుతున్నప్పుడు మధ్యలో ఏంటనీ మిత్రులూ, అతని క్షేమాన్ని కోరేవారూ, అతనంటే గౌరవమున్న సభ్యులూ, అనేకసార్లు తమ అభ్యంతరాన్ని చెప్పారు. కానీ, కంఠతా వొచ్చిన ఈ ఉపన్యాసాన్ని ఆక్టోవియన్ కొనసాగించాడు. ఉద్రిక్త పూరితులైన కొంతమంది సభ్యులు అల్లరి చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆక్టోవియన్‌కూ ఇలాంటి రగడ జరుగుతుందని ముందుగానే ఊహించి, కొంతమంది సభ్యులకు లంచాలిచ్చి, తన పక్షాన ఉంచుకున్నాడు. అలాంటివారు తాము కూడా చాలా ఉద్రిక్తులైనట్టుగా నటిస్తూ మధ్యలో లేచి నిలబడ్డారు. దీన్ని బట్టి సర్వాధికార వర్గంలో రెండు పక్షాలు, దాదాపు సరిసమాన బలం గలవి ఏర్పడినవి తేలిగ్గా అర్థమైపోయింది.
ఆక్టోవియన్ ఉపన్యాసం మీద చర్చ ఆరంభమైంది.
ఏంటనీ పక్షంవారు ‘‘ఏంటనీని ఏమని విమర్శించేందుకైనా ముందు అసలిక్కడ అతను లేడు కనుక, అలాటి హక్కు ఆక్టోవియన్‌కు లేదు’’ అన్నారు.
‘‘అతనిక్కడ ఉండకుండా చేసిందెవరు? పర్షియన్ యుద్ధం ముగిశాక, స్వదేశ పాలనలో అతనెందుకు కుతూహలాన్ని కనబరచలేదు? అతను తూర్పు దేశాల పరిపాలనా మిష మీద వెళ్లి, రెండేళ్లకు పైగా అయింది కదా! ఈలోగా దేశం ఏమైనదోనైనా తెలుసుకున్నారా? అతని దగ్గర్నుంచి అధికార వార్తలంటూ మనకు సక్రమంగా అందుతున్నవా? ఈ తప్పులెవరివి? అతని భార్య ఆక్టోనియానా? లేక క్లియోపాత్రావా? లేక..?’’
‘‘తప్పులెవరివని కాదు. అతన్ని నిందితుడుగా పేర్కొనేందుకు ముందు, అతనిక్కడ ఉండాలి. అప్పుడే అతను తగిన జవాబులు చెప్పగలుగుతారు. సగం రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఏంటనీ లాంటి మహా పురుషుణ్ని పట్టుకొని ఇష్టానుసారంగా సర్వాధికార వర్గ సభలో తూలనాడటం న్యాయ విరుద్ధం. నిందితుని వెనుక ఏమేమో వాగటం, నోటి దురుసుతనం కాక మరేమిటి?’’ అన్నారు ఏంటనీ మిత్రులు.
ఆక్టోనియన్ లేచి కొంత సర్దుబాటు చేశాడు. మాటలు పెరుగుతున్న సంగతి అతనికి తెలుసు. ఉద్రేకాల వల్ల ఏమీ కాదు. ఎలాగైనా ఏంటనీ చాలా గొప్ప తప్పులు చేశాడని తాను అందరికీ నచ్చచెప్పుతే, తాను చేయదలుచుకున్న దానికి ఎదురు ఉండకుండా పోదు.
‘‘ఏంటనీ ఇక్కడ లేదని తెలుసు. కానీ, అతని పక్షంవారున్నారు. అతని హృదయం వారికి తెలుసు. వారు తమ నాయకుణ్ని సమర్థించుకోవచ్చు. అతని పక్షాన జవాబులు చెప్పుకోవచ్చు కదా!’’ అన్నాడు ఆక్టోవియన్.
‘‘మా జవాబులు, ఏంటనీ జవాబులు కాకపోవచ్చు.’’ అన్నారు ఏంటనీ పక్షం వారు.
‘‘అప్పుడు వారినే రోమ్‌కు రమ్మని కబురంపండి.’’
‘‘అతను వచ్చేవరకూ, మనం ఈ చర్చను వాయిదా వేయాలి!’’
‘‘వీల్లేదు... ఇది ఇప్పుడే, ఇక్కడే తేలిపోవాలి!’’ అని ఆక్టోవియన్ పక్షం వారు అల్లరి ప్రారంభించారు.
ఆక్టోవియన్ లేచి నిలబడి ‘‘ఏంటనీని అవమానించేందుకు నేనేదో ప్రయత్నిస్తున్నానని నా మిత్రులు పొరబడుతున్నారు. ఏంటనీ నాకు బావ! అతన్ని అవమానిస్తే నన్నూ, నా వంశాన్నీ నేను కించపరుచుకున్న వాణ్నవుతాను. కానీ ఇది నా వ్యక్తిగత వ్యవహారాలను తేల్చుకునే సమయం కాదు. అదేవిధంగా ఏంటనీ వ్యక్తిగత జీవితాన్ని గూర్చి నేను ప్రస్తావించుకోవటం లేదు. కానీ, అతని ప్రవర్తన వల్ల మన దేశానికి ఏం కీడు వాటిల్లుతున్నదో మీకు చెపుతున్నాను. ప్రజా ప్రతినిధులైన మీరు జాగ్రత్తగా ఆలోచించండి. రేపు ఈ ప్రజాప్రభుత్వానికీ, మిమ్ము ఎన్నుకున్న ప్రజలకూ జవాబులు చెప్పుకోవలసిన బాధ్యతలు మీకున్నవి!’’ అన్నాడు.
‘‘ఇందాకటి నుంచి మాట్లాడిందేమిటి? ఏంటనీ వ్యక్తిగత జీవితానే్న కదా విమర్శించింది? అతను అగ్నిసాక్షిగా పెళ్లాడిన క్లియోపాత్రనా, మహారాణిని పట్టుకుని ‘కులట’ అనే సాహసం నీకెక్కడిది? ఏంటనీ మీద నీకు గౌరవమంటూ ఉంటే, బహిరంగంగా ఈ విధంగా అతన్ని నీచపరుస్తావా?’’ అన్నాడు ఏంటనీకి ముఖ్య మిత్రుడైన సభ్యుడొకడు.
‘‘ఏంటనీ ప్రేమ వ్యవహారాన్ని గూర్చి నేనేమీ అనటం లేదు. కానీ, అతను ఈజిప్టుకు అంకితమైపోతున్నాడని రుజువు చేయగలను. ఇది దేశద్రోహంగా నేను అభిప్రాయపడుతున్నాను!’’ అన్నాడు ఆక్టోవియన్.

- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు