డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--67

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోమన్ సామ్రాజ్యానికి సంబంధించిన తూర్పు దేశాల పాలనలో సర్వాధికారినైన మార్క్ ఏంటనీ ఈజిప్టు పాలనాధికారిగా ఈ అధికార పత్రాన్ని విడుదల చేస్తున్నాను.
తూర్పు దేశాల పాలకురాలుగా మహారాణి ఏడవ క్లియోపాత్రాను రోమ్ అంగీకరిస్తూన్నది. ప్రపంచంలో ఇంత కన్న గొప్ప రాణి లేదని కూడా ఒప్పుకుంటున్నాము.
ఐతే రాజకుటుంబీకులందరికీ పాలనాధికారాలుండాలి కనుక, క్లియోపాత్రా సంతానానికి కొన్ని కొన్ని దేశాలను కేటాయించవలసిన అవసరం ఉన్నది.
ముఖ్యంగా సీజర్ టాలమీని ఈనాడు మీ అందరి సమక్షంలోనూ ఈజిప్టుకు రాజుగా నిర్ణయిస్తున్నాను. తల్లితో కలసి అతను రాజ్య పాలన సాగిస్తాడు. ఇకముందు సీజర్ టాలమీ రారాజుగా ఉదహరించబడుతాడు.
క్లియోపాత్రా మహారాణి పరిపాలన కింద ఈజిప్టు, సిరియా, సైప్రస్‌లు ఉంటవి. ఇదే భాగం సీజర్ టాలమీకి సంక్రమిస్తుంది.
అలెగ్జాండర్ టాలమీ ఆర్మీనియా, మెడియా రాజ్యాలకు రాజుగా ఉంటాడు. చిన్న క్లియోపాత్రా లిడియాకు రాణి ఆఖరి టాలమీ ఫోనిషియా, సిలిసియా రాజ్యాలకు పాలకుడుగా ఉంటాడు.
ఇక ముందు ఆయా పాలనలు శాంతి భద్రతలతో కొనసాగించబడుతవనీ ప్రజానీకమైన మీ అందరి సానుభూతి సహకారాలను పొందగలవనీ విశ్వసిస్తున్నాను.
ఇట్లు
మార్క్ ఏంటనీ
ప్రాచ్య దేశాల పాలనాధికారి.
ప్రజల కరతాళ ధ్వనులు మిన్నుముట్టినవి. టాలమీ వంశచరిత్రలో ఇంత శుభకార్యం ఎన్నడూ జరగలేదు. రాజవంశీకుల్ని చూసిన వారందరూ, వీరు దైవాంశసంభూతులేనని నమ్మారు. ముఖ్యం గా క్లియోపాత్రా చాలాసేపటివరకు కదలక మెదలక కూర్చున్నది. దేవతే విగ్రహరూపంలో ఉన్నట్లు ప్రజలు భావించి స్తంభీభూతులై ఉద్రేకోత్సాహాలతో ఆమెకు ప్రణమిల్లారు.
తన నోములన్నీ పండినంతగా క్లియోపాత్రా ఆనంద పరవశురాలైంది. ఆమెకిప్పుడు సీజర్ టాలమీ యే ప్రపంచం. అతణ్ణి పట్ట్భాషిక్తుణ్ణి చేసి కృతకృత్యురాలైంది.
కానీ, చంద్రబింబం లాంటి వాడి ముఖానికి అడ్డుగా రాహువు. సీజర్ దత్తపుత్రడు అక్టోవియన్ కనిపించేటప్పటికీ క్షణకాలం ఆమె వణికిపోయింది. ఆ రాహువును తొలగించటమే తన తరువాతి కార్యక్రమంగా ఆమె నిర్ణయించుకుంది.
ఇక ఆనాడు ప్రజలందా రాజభోజనాన్ని రుచి చూశారు. మధువు ప్రవాహాలుగా పారింది. నాటకాలు, నాట్యాలు ఇతర వినోద కార్యక్రమాలకు ఎంత వ్యయమై ఉంటుందో ఎవరూ ఊహించలేకపోయారు. తమ దేశసౌభాగ్యాన్ని ప్రజలు మొట్టమొదటిసారి కళ్లారా చూసి కొంతవరకు నమూనాగా అనుభవించి గ్రహించగలిగారు.
క్లియోపాత్ర తన భర్తతోనూ, సంతానంతోను రాజభవనానికి తిరిగి వచ్చేసింది. ఈ శుభకార్యంలో నిజంగా ఆమె ఎంతో ఆనందపడి ఉండవలసింది. అలా జరగలేదు సరికదా. ఆమె సమస్యలు మరింత భారంగా ఉన్నవి. రోమన్ తాను సాధించాలి. లేనట్లయితే రోమ్ నుంచి తనకు ప్రమాదాలు తప్పవు. అంతవరకూ ఇలాంటి శుభకార్యాలు ఎన్ని జరిగినా వాటికి విలువుండదు.
ఆమె మనసులో కొత్త కొత్త పథకాలు , అంచనాలు, మోసాలు .... ఎన్నో మెదులుతూనే ఉన్నవి. సమయం కోసమే ఆమె వేచి ఉన్నది.
23
‘‘దారుణం! అక్రమం! అన్యాయం!’’ అని గర్జించాడు ఆక్టోవియన్ సర్వాధికారి సమావేశంలో. సీజర్ రక్తకణం మచ్చుకన్నా అతని శరీరంలో లేదు. ఐనా సీజర్ వలెనే ఎంతో ఉద్రేకంతో మాట్లాడటాన్ని నేర్చుకున్నాడతను.
‘‘క్లియోపాత్రా ఈజిప్టుకు రాణి కావొచ్చు. ఆమె సంతానమే ఆమెకు వారసులూ కావచ్చు. ఐతే, ఆమె సంతానానికి పట్ట్భాషేక మహోత్సవాన్ని జరిపించే బాధ్యత రోమ్‌కు ఉన్నదా? సర్వాధికార సభ్యులమైన మనందర్నీ అగౌరవపరుస్తూ, రోమన్ ప్రభుత్వాన్నీ, దాని పవిత్రాశయాల్నీ లెక్కచేయకుండా ఏంటనీ ఈ పట్ట్భాషేకాన్ని జరిపించాడంటే రోమ్‌కు ఇంతకన్నా తలవొంపులేమున్నవి? ఆ ఉత్సవానికి ముందు నిలబడి, ప్రజలందరి ఎదుటా దాసోహమన్నాడంటే, మన పరువు మర్యాదలూ, గౌరవ ప్రతిష్టలు ఏం కాను?
‘‘ఏంటనీకి క్లియోపాత్రా ప్రియురాలు కావొచ్చు. సీజర్‌కు కూడా ఆమె ప్రేయసే! అయితే సీజర్ ఆమెను ఉంపుడుగత్తెగా మాత్రమే చూశాడు. రాజకీయ రంగం నుంచి ప్రణయరంగాన్ని ఆయన దూరంగా ఉంచాడు. ఆ పర దేశస్థురాలిని తీసుకొచ్చి మన నెత్తిమీద ఎక్కించలేదు. ఆమెను ఆరాధించే నీచమైన స్థితికి ఆయన దిగజారలేదు. ఆమెను వ్యభిచారిణి వలెనే చూశాడాయన!
‘‘కానీ ఆ ఏంటనీ ఏం చేశాడో చూడండి. ఆమె ను అనుభవించటం వరకు అతని వ్యక్తిగత జీవితంగానే మనం పరిగణిస్తాం కానీ, ఆమెను పెళ్లి చేసుకున్నాడు! తెలిసి ఉండీ, వ్యభిచారిణికి పుస్తె కట్టాడు. అందునా ఆక్టోవియా లాంటి ఉత్తమ ఇల్లాలు, సంతానవతి బ్రతికి ఉండగా, చివరకు ఆమెకు విడాకులన్నా చెప్పకుండా అతను మరో పెళ్లి చేసుకున్నాడంటే ఎంత సాహసం!
‘‘రోమన్ సామాజిక నిబంధనల పట్ల అతని దృక్పథం ఎలా ఉన్నదో నేను వేరే చెప్పనక్కర్లేదు. ఇక్కడ మనందరం రోమన్ సామ్రాజ్యం పట్ల ఎంత విశ్వాసనీయంగా దేశ క్షేమకరమైన పథకాలను అమలు జరిపేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నామో, ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపేందుకు ఎన్ని అవస్థలు పడుతున్నామో, అక్కడ రాజ్యాంతఃపురాలలో తెగ తాగి, మత్తెక్కి జీవితానికి కామతృప్తి తప్ప వేరొక పరమావధి లేదని రుజువు చేసేందుకు నడుంకట్టిన ఏంటనీకి ఏం తెలుస్తుంది? రాజకీయ దురంధరులమైన మనందరం బతికి ఉండగానే, సంస్కారమనేదాన్ని కూడా లెక్కచేయకుండా, మనందరి ముఖం మీదా ఉమ్మివేసినట్లుగా ఏంటనీ క్లియోపాత్రాను పెళ్లాడాడు!
‘‘పెళ్లి! ... ఈ వివాహం ఎంతవరకూ శాస్త్ర సమ్మతమో, రోమన్ చట్టాలు ఎంతవరకూ ఆమోదిస్తాయో నేను నేరుగా చెప్పనక్కర్లేదు. క్లియోపాత్రా సీజర్‌కు కూడా ఒక కొడుకును కన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఐతే, ఆ మహనీయుడు ఆంతరంగిక జీవితంలో ఆ కుమారుణ్ని తన సంతానంగానే అంగీకరించి ఉండొచ్చు. కానీ, ఏనాడు ఆయన వాణ్ని తీసుకొచ్చి రోమన్ రాజకీయాలతో కలగాపులగం చేసి ఎరగడు! తన సంతానంగానే వాణ్ని గుర్తించమనీ, తన ఆస్తిపాస్తులకు వాడే వారసుడనీ ఏనాడూ ఆయన అనలేదు.
‘‘ఈ ఏంటనీ పాటి తెలివితేటలూ, పరాక్రమం ఆయనకు లేకనా? ఆయన వీలునామా చూసినవారు, క్లియోపాత్రాను హద్దులు మీరకుండా కట్టుదిట్టాలు చేశాడని తెలుసుకునే ఉంటారు.
‘‘కానీ, ఏంటనీ గురువును మించిన శిష్యుడుగా చెలామణీ కావాలనే దురుద్దేశంతో, గురుపత్ని అనే భావన లేకుండా, గురుద్రోహిగా ప్రవర్తించాడు. సీజర్ లాటి సింహమే సాహసించలేని నీచకార్యానికి అతను సిద్ధపడ్డాడు. క్లియోపాత్రాను బహిరంగంగా పెళ్లాడారు!
‘‘ఇంతవరకూ అతను రోమ్ పట్ల చూపిన విశ్వాసాన్నీ, ముఖ్యంగా సీజర్ లాటి మహనీయుణ్ని హత్య చేసి, దేశద్రోహులుగా తయారైనవారిని మట్టుపెట్టిన ఏంటనీని రోమన్ రాజ్యాంగం తరఫున మనం అభినందించాము! అందుకనే ఈ దారుణాలన్నింటినీ మనం సహించి, క్షమించేందుకు సిద్ధపడ్డాం.

- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు