డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-48

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏంటనీ తనకు తూర్పు దేశాల పాలన కావాలని కోరాడు. తూర్పు దేశాలలో ఐశ్వర్యమూ, అందమైన అమ్మాయిలూ, ఆహ్లాదకరమైన సహజ వాతావరణం, తియ్యని మధువు- మొదలైనవి అతన్ని ఆకర్షించినవి. అదీగాక ఏళ్ళ తరబడి అంతఃకలహాలతో తలబొప్పెలు కట్టిన రోమన్ రాజకీయాలు అతనికి విసుగు పుట్టించినవి. దూరతీరాల్లో ప్రశాంతంగా లేకపోయినా, కనీసం తగినంత స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో ఇష్టానుసారంగా కొన్నాళ్ళపాటు స్వర్గసుఖాల్ని పొందాలని అతను నిశ్చయించుకున్నాడు.
ఈ వేడిలోనే సీజర్ తయారుచేసిన పథకం ప్రకారం పర్షియాను జయించే సన్నాహాలు కూడా జరుగుతూన్నవి. దారిలో ఎక్కడా శత్రువు అంటూ లేనందువల్ల, ఏంటనీ ఆసియా మైనర్‌లోని టార్సస్ అనే రేవు పట్టణంలో ప్రస్తుతానికి స్థావరాన్ని ఏర్పరచుకొని, ముందుకుసాగేందుకు గాను తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇక్కణ్నుంచే ఈజిప్షియన్ల రాణి క్లియోపాత్రాకు ఆహ్వానం వచ్చింది.
కాని దాన్ని ఆహ్వానమనేందుకు వీల్లేదు. సీజర్ హత్య చేయబడిన రాత్రి ఏంటనీ- రోమ్‌లో, తన ఇంటికి రమ్మని క్లియోపాత్రాకు ప్రాధేయపడుతూ కబురు పంపాడు. కానీ, ఇప్పుడు రోమన్ అధికారం ధ్వనించే విధంగా తనను రమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు. సరిగ్గా ఏడేళ్ళ క్రితం- సీజర్, ఇపుడు తానున్న రాజభవనంలో కూర్చొని, తనను రమ్మని ఆజ్ఞాపించాడు. ఆనాడు తాను ఎర్ర సముద్ర తీరంలోని పట్టు గుడారంలో ఏం చెయ్యటానికీ తోచక, భారమైన హృదయంతో సతమతమైంది. ఇపుడు ఈ రాజభవనంలోని నీడలో కూర్చున్నా, ఆమె బుర్ర ఆలోచనలతో వేడెక్కిపోతోంది.
సరిగ్గా పధ్నాలుగేళ్ళ క్రితం ఏంటనీ సర్వసేనాపతిగా తన తండ్రిని తిరిగి ఈజిప్టు సింహాసనంమీద కూర్చోబెట్టేందుకు అలెగ్జాండ్రియా వచ్చాడు. తనకప్పుడు పధ్నాలుగేళ్ళ వయస్సు. ఐతే అప్పటికే పరిపూర్ణమైన యవ్వనం తనను ఆవరించింది. తన కోర్కెల్ని తీర్చే పురుష పుంగవుని కోసం ఆమె చిలిపి కళ్ళు ప్రకాశంతో వెలిగిపోతూ, తన చుట్టూ వున్న ప్రపంచాన్ని వెదుకుతూ, అసంతృప్తితో బాధపడుతున్నవి. ఆ సమయంలో విందులో ఆ రాత్రి మొట్టమొదటిసారి మార్క్ ఏంటనీని ఆమె చూసింది. మొదటి చూపులోనే మన్మథుడి గురి తప్పలేదు.
అయితే, దురదృష్టవశాత్తూ ఏంటనీ తనను గమనించలేదు. ఆ రాత్రి తాను ఎంత కుమిలిపోయింది! మర్నాడు ఏంటనీ తిరిగి వెళ్లిపోయాడని విని ఎంత బాధపడింది! ఆనాటి మొదలు ఏంటనీని తలుచుకుంటూ తాను ఎన్ని మధుర స్వప్నాలను కన్నది! చివరకు సీజర్‌తో సుఖించిన క్షణాల్లో కూడా, కళ్ళు మూసుకొని ఏంటనీ రూపాన్ని స్మరిస్తూ నిజంగానే తాను ఏంటనీ లాంటి రూపవంతుని నిండు యవ్వనాన్ని అనుభవిస్తున్నానని తలచుకునేది.
ఆ తరువాత తాను రోమ్ వెళ్ళేందుకు తహతహలాడింది- తన మానసచోరుడు, మార్క్ ఏంటనీని కలుసుకొని, అతని స్నేహాన్ని సంపాయించే అవకాశాలుంటవి కదానని తాను ఎంతో ఆశపడింది.
కానీ, తన నాయకుడు సీజర్‌కూ, ఏంటనీకి సరిపడక దూర దూరంగా వున్నారని తెలుసుకొని చాలా విచారపడింది. చివరకు సీజర్ స్పెయిన్ విజయంతోపాటు, తన స్నేహితుడు ఏంటనీని కూడా గెలుచుకున్నాడు. ఆనాడు తనెంతో సంబరపడింది. రోమ్‌లో ఉండగానే ఏంటనీని తనవాడుగా చేసుకోవాలనే ఊహ తనకు ఉండేది. కాని, అసలే రాజకీయ వాతావరణం అల్లకల్లోలంగా ఉండటమూ, వృద్ధ కేసరి సీజర్ ఇంకా బతికి ఉండటమూ, అన్నిటికన్నా తనంత తెలివిగలదైన ఏంటనీ భార్య అడ్డంకి కావటమూ తనను నిరుత్సాహపరచినవి. ఆ తరువాత సీజర్ పతనానంతరం ముందు ప్రాణరక్షణేపెద్ద సమస్య కాగా, ఆమె రుూ ప్రణయానికి ఒక నమస్కారం పెట్టి పరుగు పరుగున అలెగ్జాండ్రియాకు వచ్చిపడింది.
ఆ తరువాత ఏంటనీ యోగక్షేమాల్ని ఆమె ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నది. ఎందుకంటే, సీజర్ హత్య చేయబడినప్పుడు అతను కార్చిన కన్నీరు హృదయపు లోతుల్లోది. సీజర్ పట్ల అతనికున్న గౌరవం, సీజర్ కొడుకు మీద కూడా ఉండి ఉండాలి. ఈ బుడతణ్ణి అడ్డం పెట్టుకుని, అతను అధికారాన్ని చెలాయించే అవకాశం వుంటుంది. ఈ విధంగా ఉభయుల మేలూ ఇమిడి వున్న రుూ పథకాల్ని అతను ఏమార్చి ఉండేందుకు వీల్లేదు.
కాని, దుర్విధి వేరొక విధంగా శాసించింది. తనకు శత్రువైన ఆక్టోవియన్‌తో ఏంటనీ చేతులు కలిపాడు. రోమ్‌కు ముఖ్యంగా ఏంటనీకి తను దూరమైపోయింది. కాస్పియస్‌కు, తాను అనుకోకుండానే సహాయం చేసింది. తన తప్పేమీ లేదని అంతరాత్మ ఘోషిస్తున్నా తన మాటల్ని రోమన్ ప్రభుత్వం ఎంతవరకూ నమ్ముతుందో సందేహమే!
ఇప్పుడు ఏంటనీ తనను పిలవనంపింది. ఒకవేళ రుూ నేరాన్నివిచారించేందుకేనేమో? ఎందుకంటే ఫిలిప్పీ దగ్గర జరిగిన అంతమ పోరాటంలో ఏంటనీ చాలా జననష్టాన్ని భరించవలసి వచ్చింది! ఇందుకు తాను పరోక్షంగా, అప్రయత్నంగా, కారణభూతురాలైంది.
ఏంటనీకి తన పట్ల ఎలాంటి అభిప్రాయమున్నదో రుూనాటికీ తనకు స్పష్టంగా తెలియదు. తనకు గురుతుల్యుడూ, ప్రేమాస్పదుడూ అయిన జూలియస్ సీజర్ ప్రియురాలిగా తనను కూడా గౌరవిస్తాడా? లేక సాధారణ రోమన్ పొరునివలె, తాను సీజర్‌కు కేవలం ఉంపుడుకత్తెగా, వ్యభిచారిణిగా నీచంగా చూస్తాడా? ఈనాడు అతని దృక్పథంమీదనే తన భావి జీవితం, ఈజిప్టు సౌభాగ్యం ఆధారపడి ఉన్నవి. ఎందుకంటే, ఆమె కలుసుకోవలసింది- సీజర్‌కు నమ్మిన బంటైన ఏంటనీని కాదు, రోమన్ అధికారి ఏంటనీని!
ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు ఏంటనీ పర్షియా దండయాత్రకుగాను ఏర్పట్లు జరుపుతున్నాడు. కనుక ఈజిప్టు సహాయం ఎంతో అవసరం. తాను ఏమైనా తప్పులు చేసి ఉన్నా, రోమ్ పట్ల తనకు తెలయకుండానే అపచారం జరిగినా, ఆ పాతదంతా ఇప్పుడతను తవ్వడు. ఎలాగైనా తనతో స్నేహంగానే ఉండి, కనీసం పర్షియన్ దండయాత్ర ముగిసేవరకన్నా ఈజిప్టును పిండుకోవాలి కనుక, తనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తాడు.
కనుక, ఏదెలా వున్నా ఈ ఆహ్వానంలో సౌహార్ద్రం కనిపించక తప్పదు. ఈ స్నేహం ఎన్నాళ్ళుంటుందనేది పరిస్థితులమీద, తన తెలివితేటలమీదా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు తాను రోమ్‌కు లోబడి ఉండాలి. అంతకన్నా మార్క్ ఏంటనీకి లోబడాలి!
జూలియస్ సీజర్ లాంటి ఉక్కుమనిషిని తానెలా వశపరచుకుందో ఆమెకు బాగా గుర్తున్నది. స్ర్తిత్వానికి పురుషత్వం ఎంత బలవత్తరమైనదైనప్పటికీ, లోబడటమనేది బహుశా ప్రకృతే సిద్ధాంతీకరించిందేమో! అందునా మొదటిసారి ఏంటనీని చూసినప్పుడే అతన్ని ప్రేమించటం! కాని తాను దారిలో ఉంచిన ప్రణయ పుష్పాలను అతను గమనించకుండా పాదాలకింద తొక్కివేసి వెళ్ళటాన్ని ఆమె జన్మలో మరిచిపోలేదు. తనలాంటి అందగత్తెను, రసికురాలిని, యవ్వనవతిని రుూసారి ఏంటనీ తప్పించుకోగలదా? ఇది తన సౌందర్యానికే గీటురాయిగా రూపొందిన సంఘటన అని ఆమె నమ్మింది. అక్కడ- రుూ దూర దేశంలో, ఏంటనీ భార్య పుల్వియా తనకి అడ్డంకి కాదు. ప్రణయంతో ఏంటనీని ముంచెత్తాలి.
ఏంటనీ, ఏనాటికీ సీజర్ అవలేడని తనకు తెలుసు. అయినా, చనిపోయిన సీజర్‌ను గూర్చి రుూనాడు విచారించి ఏం ప్రయోజనం? చచ్చిన సింహంకన్నా బ్రతికి వున్న నక్క లక్షరెట్లునయం. కళ్ళు మిరిమిట్లు గొలిపే భావి జీవితం వున్న ఏంటనీ సహాయ సహకారాలతోపాటు అతని ప్రేమను కూడా సాధించుకుంటే, మరికొంతకాలం - బహుశా జీవితాంతంవరకూ తాను సుఖపడగలదు. ఇది రోమన్ దాస్యమే అయినప్పటికీ అబలగా, స్ర్తిగా తనకు ఇంతకన్నా మంచి మార్గం మరొకటి లేదు.
- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు