డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-47

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ అల్లకల్లోలం కూడా త్వరలోనే కుదుట పడింది. ఇప్పుడు రోమన్ రాజకీయాల్లో రెండు పక్షాలు ఏర్పడినవి. మొదటి పక్షంలో సీజర్ వారసుడు అక్టోవియన్, ఏంటనీ, సీజర్ మీద భక్తి విశ్వాసాలున్నవారు , రెండో పక్షంలో సీజర్ హత్యకు కారకులైన ముఖ్యులు. ఈ హంతకుల్లో చరిత్రకు అవసరమైన వారిద్దరూ కాస్పియస్, బ్రూటస్ లు వీరు రోమ్‌విడిచి చాలాకాలమైంది. రోమ్ మీద తిరుగుబాటు చేసేందుకు దూరదేశాల్లో సైన్యాలను కూడగట్టుకుని యుద్ధానికి సిద్ధపడుతున్నారు. ముందు వీరిద్ధరినీ అణచవలసిన బాధ్యత రోమన్ ప్రభుత్వానికి ఉన్నది.
ఈ ద్రోహుల్లో ఒకరు- కాస్పియస్ ప్రస్తుతం సిరియాలో ఉన్నాడు. అతని సైన్యం కూడా పెద్దదేనని ఆమెకు వార్తలు అందినవి. ఇప్పుడీ రోమన్ నాయకుడు తనకు సహాయం కావాలని ఈజిప్టును కోరితే, తనేం చేయాలి? తనకు శత్రువని తెలిసినప్పుడు అతన్ని ఎదుర్కొని జయించటమో, లేక అతనివల్ల ప్రమాదం లేకుండా రాజీ పడటమో తప్ప తనకు మరి దారిలేదు. కాని, తాను యుద్ధం చేసి గెలుస్తాననే నమ్మకం ఆమెకు లేదు. ఇంకేం చేసేట్లు?
‘‘్ఛ! వెధవ బతుకు’’ అనుకున్నదామె. ఎప్పుడూ తను రోమ్ ఎదుట చేతులు కట్టుకొని ఉండవలసిందే! తనకున్న అధికారాలన్నీ పేరుకు మాత్రమే! అసలు అధికారాలున్న రోమ్ చేతుల్లో తాను కీలుబొమ్మ!
ముఖ్యంగా రోమ్‌కు ఇంత దూరంలో ఉన్నప్పటికీ, తాను కూడా రోమన్ రాజకీయాల్లో పక్షాలు వహించవలసిన కర్మ పట్టింది. ఇప్పుడు ఈ కాస్పియస్‌కు సహాయపడక నిరాకరిస్తే, తన బుర్ర కాపాడేవాళ్ళెవరు? సహాయపడితే, రేపు రోమన్ ప్రభుత్వం తనను ద్రోహిగా గుర్తిస్తుంది. ముందు నుయ్యి, వెనుక గొయ్యిగా రుూ సమస్య పరిణమించింది.
రోమన్ ప్రభుత్వం తన రక్షణార్థం ఈజిప్టు జేరేలోగానే కాస్పియస్ ఒక పక్క అలెగ్జాండ్రియా రేవునూ, మరోప్రక్క భూభాగాన్నీ ముట్టడిస్తే, అపుడు తన గతేం కాను? సరిగ్గా ఐదేళ్ళ క్రితం సీజర్ ఈజిప్టు సర్వస్వాన్నీ హరించేందుకు ఏ ఎత్తు వేశాడో, ఈ కాస్పియస్ కూడా అదే పంథా అనుసరిస్తాడని ఆమెకు తెలుసు.
ఇలా ఉండగా రోమ్ నుంచి అధికార ముద్రలతో తనకో లేఖ అందింది. ఆ లేఖ ప్రకారం కాస్పియస్‌ను వశపరచుకునేంకు, పూర్వం నుంచీ ఈజిప్టులో ప్రభుత్వ రక్షణకై స్థావరాలేర్పరచుకున్న రోమన్ సైన్యాలను విడుదల చేయాలని క్లియోపాత్రాను కోరబడింది.
కాస్పియస్ పతనాన్ని ఆశించిన క్లియోపాత్రాకు ఇది చాలా అనుకూలంగా కనిపించింది. ముఖ్యంగా రోమ్ పట్ల రుూ సమయంలో తాను చూపిన సహృదయత, తన భావి జీవితానికి చాలా తోడ్పడి మేలు చేకూరుస్తుందని ఆమె ఆశపడింది. వెంటనే ఈజిప్టులోని రోమన్ సైన్యాలు విడుదల చేయబడినవి.
కాని, విధి వేరువిధంగా ఆలోచించింది. సిరియాలో కాస్పియస్ రుూ కొత్త రోమన్ సైన్యాలను యుద్ధంలో గెలిచే వశపరచుకున్నాడో, లేక ఆయా నాయకులకు లంచాలిచ్చి తనలో చేర్చుకున్నాడో తెలియదు. మొత్తంమీద రుూ సైన్యాలు కాస్పియస్ సైన్యాలతో కలిసిపోయినవి. ఇపుడు కాస్పియస్ అతి బలాఢ్యుడయ్యాడు.
ఈ దుర్వార్త వినగానే క్లియోపాత్రాకు మూర్ఛ పర్యంతమైంది. ఒక పక్క కాస్పియస్ వల్ల తనకు ప్రమాదం వాటిల్లవచ్చు లేక, కాస్పియస్ దృష్టంతా రోమన్ సామ్రాజ్యం మీదనే ఉన్నట్లయితే- ముందుగా అటు రోమ్‌మీద దండయాత్ర సాగుతుంది. ఆ యుద్ధంలో బహుశా, ఆక్టోవియస్ గెలవవచ్చు. ఆ తరువాత ఆక్టోవియన్, తన శత్రువైన కాస్పియస్‌కు సహాయం చేసిన కారణంగా తనను శిక్షించవచ్చు.
అదీగాక, కాస్పియస్ ముందుగానే ఈజిప్టును జయించినా, తన పతనం తప్పదు. ప్రళయం ఇంత త్వరలో ముంచుకొచ్చి, తనను సర్వనాశనం చేసే పరిస్థితులు ఏర్పడుతవని అనుకోలేదు కదా! తన స్వామి సీజర్‌ను హత్య చేసిన నీచుడికి తాను పరోక్షంగా సహాయపడ్డాను కదా అని ఆమె అంతరాత్మ క్షోభించింది. తీరా చెయ్యి జారాక చేసేదేమిటి?
కాస్పియస్ అధికారం అప్పుడే ఆరంభమైంది. సైప్రస్‌మీద ఆయన వేసిన ఆజ్ఞల్ని, అక్కడి గవర్నర్ శిరసావహించాడు. వెంటనే కాస్పియస్ తనకు కొన్ని ఓడల్నీ, ధనధాన్యాదుల్నీ పంపమని ఈజిప్టుకు ఉత్తర్వులు జారీ చేశాడు. తనేం చెయ్యాలి?
ఇందుకు తగినట్లుగా దేశ పరిస్థితులేమీ బాగాలేవు. నైల్ నదిలో ప్రవాహం లేదు. కొన్ని దశాబ్దాలుగా ఆ మహానది ఎన్నడూ ఎరగనంత తక్కువ మట్టంలో ప్రవహిస్తోంది. నీరు లేక పంటలు ఎండిపోయినవి, కరువు కాటకాలు ఏర్పడినవి. దీనికితోడు అనేక అంటువ్యాధులు- ముఖ్యంగా ప్లేగు ఈజిప్టు అంతటా పాకింది. ఈ కారణాల్ని చూపుతూ, సహాయపడేందుకు తనకేమీ అభ్యంతరం లేదనీ, కాని కొంత వ్యవధి కావాలనీ క్లియోపాత్రా కాస్పియస్‌కు కబురు చేసి, ప్రస్తుతానికి తానీ విషమ పరిస్థితిలో నుంచి తప్పించుకోగలిగాను కదానని సంతోషపడింది.
ఐతే, కాస్పియస్ ఊరుకోలేదు. ఈజిప్షియన్ రాణిమీద వొత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. అదృష్టవశాత్తూ, వెంటనే తన సేనలతో బయలుదేరి రమ్మని మాసిడోనియా నుంచి బ్రూటస్, కాస్పియస్‌కు కబురు పంపాడు. ఒకపక్క రోమన్ సామ్రాజ్యం కనిపించేటప్పటికి, అందులో ఒక భాగమే అయిన ఈజిప్టు లెక్కలోనిది కాదని కాస్పియస్‌కు తోచింది. అదీగాక తాను ముందు తేల్చుకోవలసింది రోమ్‌తోటి యుద్ధం! ఇక ఆలోచించే సావకాశం కూడా లేకుండా, కాస్పియస్ తన సేనల్ని తరలించుకొని వెళ్లిపోయాడు.
రోమన్ రాజకీయాల్లో ఇపుడు ఫిలిప్పీ యుద్ధంలో, అన్నీ పరిష్కారమవుతవని క్లియోపాత్రాకు తెలుసు. బ్రూటస్ సైన్యాన్ని నడపటంలో అందెవేసిన చేయని కూడా ఆమె విన్నది. జయాపజయాలు దైవాధీనాలుగానే ఆమెకు తోచినవి.
మొదటి దెబ్బకే ఆక్టోవియన్ సైన్యాలు చెల్లాచెదురై, ఆక్టోవియన్ ప్రాణరక్షణార్థం పరుగు లంకించుకున్నాడు. ఐతే, మరోపక్క కాస్పియస్‌తో ఏంటనీ తలపడ్డాడు. అక్కడ ఏంటనీ గెలిచాడు. బ్రూటస్, కాస్పియస్‌కు హృదయపూర్వక సహకారమిమ్వలేదు. సమయానికి ఏంటనీ, ఆక్టోవియన్ సహాయానికి రాగలిగాడు. మొత్తంమీద రుూ యుద్ధంలో ఏంటనీ, ఆక్టోవియన్‌లదే పైచేయి అయింది. జీవితంమీద విరక్తి చెంది, తాము చేసిన పాపాలకు పరిహారంగా సీజర్ హంతకులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ యుద్ధ్భూమిలో ఏంటనీ, ఆక్టోవియన్‌ను చంపి ఉన్నట్లయితే, చరిత్ర ఆకారమే మారి ఉండేది. ఏంటనీ ఇంత బుద్ధిహీనుడుగా ప్రవర్తించినందుకు అతని భార్య పుల్వియాతోపాటు, ఇక్కడ ఈజిప్టులో క్లియోపాత్రా కూడా చాలా చింతించింది. సీజర్‌మీద వున్న అనురాగంతో ఏంటనీ తలకాయలోకి వేరొక ఊహే జొరబడలేదు. సరిగ్గా రెండేళ్ళ క్రితం సీజర్ శరీరంలోకి ఏ బాకునైతే బ్రూటస్ దిగేశాడో, అదే బాకుకు తన ప్రాణాల్ని బలిపెట్టాడు. శత్రు సంహారమంతా పూర్తయింది!
***
ఆరు నెలల తరువాత క్లియోపాత్రాకు ఏంటనీ దగ్గర్నుంచి పిలుపు వచ్చింది.
సీజర్ హత్య చేయబడిన రాత్రి ఆయన పత్రాలన్నిటినీ ఏంటనీ వశపరచుకున్నాడు. వాటిల్లో పర్షియా దండయాత్రను గూర్చిన విశేషాలూ, ప్లానులూ, ఏయే విధంగా ఆ దేశాన్ని చుట్టుముట్టటమో, ఏయే మజిలీల ద్వారా ఇది సుసాధ్యమో- మొదలైన విషయాలన్నీ ఉన్నవి.
రోమన్ రాజకీయాలు కుదుటబడిన తరువాత, విజయాన్ని పొందిన వారందరూ రోమన్ సామ్రాజ్యానికి సంబంధించిన భూఖండాల పాలనను వాటాలు వేసుకున్నారు.
- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు