డైలీ సీరియల్

తరచి చూస్తే అంతా శివమాయే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబట్టి ఈ కొండ చాల మహిమాన్వితమైనది. ఎఱుక జాతివారు ఈ కొండపై తిరుగాడే సమయాల్లో వారి చేతుల్లో ఉన్న ఇనుప పనిముట్లు బంగారుగా మారిపోతాయి. శబరులు వేటాడి మృగాన్ని చంపి ఈ కొండమీదకు రాగానే ఆ జంతువులు తిరిగి బ్రతుకుతూ ఉంటాయి. ఈ కొండపై గల ఆహారపదార్థాల్ని తినే వారికి వ్యాధులు- ముసలితనం-మరణం తొలగి వజ్రకాయమేర్పడుతుంది. చెంచులీ కొండమీద ఎచట నిద్రించి మేల్కొన్నా అవి ఆ సమయానికి తమ భార్యలతో కలిసి పండుకొనే శయనతల్పాలుగా మారిపోతాయి. చూచే వారి కిచట ధననిధులు ప్రత్యక్షవౌతాయి. అని ఇక్కడ తిరిగే జనమంతా ఆశ్చర్యకరంగా ఈ కొండ సానువుల మహిమ గురించి చెబుతూ ఉంటారు. వాసవ (ఇంద్ర)సుతుడైన వాలి ఆ సజ్జశివలింగాన్ని విడిచి వెళ్లలేక దుఃఖంతో పలునిట్టూర్పులు విడుస్తూ ఆ నాడంతా ఉపవాసముండి అచటనుండి వెడలిపోయాడు. వేశ్యామణులారా! ఇది ఈ తీర్థమహిమ. దీనిని బ్రహ్మ-ఆదిశేషుడు కూడ పూర్తిగా వర్ణింపలేరు. ఇక మానవమాత్రులు చెప్పగలరా? మీరు ఈ పరమేశ్వరుని ఈ దినం అర్చించి నెమ్మదిగా వెళ్లండి. అని చెప్పిన పౌరజనుల మాటల్ని విని ఆ వేశ్యాంగనామణులు ఆ రాత్రి భోజనాదులకు, శయనానికి ఒక సజ్జనుని ఇంట ఉండి మరునాడు వాలి సజ్జలింగాన్ని విడిచి సంసార సముద్రానికి అగస్త్యుని వంటివాడయిన వాలీశ్వరుని సేవించేందుకు వెళ్లారు.
సూర్యాస్తమయ వర్ణనం
అంతలో సూర్యాస్తమయమయ్యింది. అది చాల మనోహరంగా ఉంది. ఎట్లంటే సాయంకాలమనే శ్రీరామ చంద్రుని ఎర్రని ముఖమెర్రబడి చీకటి అనే తీక్ష్ణబాణాల చేత కాళ్లు విరుగొట్టగా ఆడు చక్రవాకమనే సీతాదేవికి వియోగవ్యధ కలిగింప బూని కూలిన సూర్యుడనే మాయామృగమేమొ అన్నట్లు సూర్యుడు అస్తాద్రిపై కూలిపోయాడు.
ఈశ్వర సంబంధమైన జ్ఞానం లేని మనసులో సంశయరూపమైన అజ్ఞానపు చీకటి ఆవరించే విధంగా లోకమంతట చీకటి వ్యాపించింది. భానూదయ మయినంతనే బింబదర్శనం చేత లోకంలోని పాపసమూహం అణగిపోయి తిరిగి అస్తమయ మయినంతనే ఆ పాపసమూహం బహిర్గతమైన దేమో అన్నట్లుగా అంధకారం జగమంత వ్యాపిం చింది.
చంద్రోదయ వర్ణన
కొద్దిసేపటికి చంద్రోదయమయింది. అదీ చాలా మనోజ్ఞంగా ఉంది. ఎట్లంటే వామాంగంలో నిలిచిన పార్వతీదేవి నలుపు, కంఠంమీద హాలహలం చేత ఏర్పడిన నలుపు, కేశపాశంగా ఉన్న ఆకాశపు నలుపు, ముంగురుల నలుపు, తలపై గల గంగానదిలోని నాచు నలుపు, చేతనున్న కృష్ణ సారంగపు (నల్లనివేడి) నలుపు, భూషణంగా ఉన్న ఆదిశేషుని పడగల నలుపు, నడుమునకు కట్టిన గజచర్మపు నలుపు, నల్లని త్రిశూలపు నలుపు, ఇలా నలుపులన్నింటిని సూర్యునిపై దండెత్తి పోయే చీకటికి సహాయంగా చేసి వాని వెనుక వచ్చే తెల్లని మహేశ్వరుని వలె చంద్రుడు ఉదయాద్రిపై దట్ట మైన వెనె్నలతో కూడి ఉదయించాడు.
పశ్చిమ దిక్కు అనే కాంత చీకటి అనే యమునా నదీ జలాన్ని తెచ్చి బ్రహ్మాండమనే ఘటంలో పోసి తిరిగి ఆమె చేత పూనిన పద్మరాగ మణిమయ పూర్ణకుంభం వలె సూర్యుడు అస్తాద్రి నుండి వెడలిపోయాడు. అంతేకాక తూర్పుదిక్కాంత వెనె్నల అనే గంగాజలాన్ని వడబోసే బంగారు కలశంవలె చంద్రుడు తూర్పు దిక్కున ఉదయించాడు.
ప్రేమికుల హృదయమనే పెరుగును చిలికే కవ్వం; దేవతాసమూహానికి ఆహారం; నింగి మార్గంలో ఏర్పడిన తేటయైన తేనెకు ఆధారమైన చెట్టుగనుపు; కోమలమైన కలువభామకు గర్వకారణమైనది; ఆడుచకోర పక్షుల్ని - తుమ్మెదల్ని రక్షించే ఆహారమైన చంద్రబింబం ఉదయాచలం మీద వెనె్నల కురిపిస్తూ ఉదయించింది.
వెనె్నల గుజ్జు నంజుకొని, వెనె్నల కుప్పలు భుజించి, నాలికతో వెనె్నల ముద్ద పెద్దగా తీసుకొని, తేటవెనె్నలలు త్రాగి, చిక్కని వెనె్నల జుఱ్ఱుకొని, చకోరదంపతులు విను వీథులలో ఆనందంతో విహారం చేస్తూ తమ పిల్లలకు కూడ షడ్రసోపేతంగా వెనె్నలల్ని మేపుతూ ఆటలాడసాగాయి.
ఆ సమయంలో వేశ్యభామలు వాలీశ్వరుని, భైరవేశ్వరుని పూజించి శ్రీకాళహస్తీశ్వరుని మదిలో తలంచి విడిది యింటికి తిరిగి వెళ్లారు. తదుపరి ఆ కపటజంగాలు మరియు వేశ్యలిద్దరు భోజనాలు చేసి వాలి పూజించిన వాలీశ్వరుని చరిత్రని చదువుకోసాగారు.
చంద్రాస్తమయ వర్ణన
అంతలో చంద్రుడు అస్తాద్రి మీద గ్రుంకినాడు. అది కాలమనే జాలరి ఆకాశ సముద్రంలో నక్షత్రాలనే చేపల్ని వేటాడి వాటిని ఉదయకాలమనే బుట్టలో పెట్టి చిక్కుపడిన ఆ చేపల వలను చిక్కువిడిపోయే రీతిగా గుంజి తడి ఆరిపోవడానికి అందంగా ఆరవేసిన పెద్దవలయేమో అన్నట్లుగా కాంతివంతంగా చంద్రబిం బం పడమటి కొండపై అందంగా ప్రకాశిస్తూ ఉంది.
సూర్యోదయ వర్ణన
చంద్ర అస్తమయానంతరం తూర్పుకొండపై తిరిగి సూర్యుడుదయించాడు. అది - చీకటి అనే అరణ్యానికి దావానలంగా ఈశ్వరుని వస్త్రంపై (దిగంబరుడు కాన దిక్కులని భావం) నున్న ఎర్రని రంగుగా, తూర్పుకొండకు శిరోభూషణంగా, తామరలక్ష్మికి ప్రేమపుపంటగా, చకోరపక్షుల సమూహానికి ఆకలిమంటగా, ఎఱ్ఱని కిరణాల గుంపు అనెడి గడ్డికి మూలమైన దుబ్బుగా, చక్రవాక పక్షులకు ధైర్యరాశిగా, కాలాన్ని తెలిపే ఘంటగా సూర్యుడు తూర్పుదిక్కున ఉదయించాడు.
ఆ సమయంలో భక్తుల మనస్సే గృహంగా గల మహేశ్వరుడిని ప్రాతఃకాలపూజ చేసి ఎండ క్రమంగా దిక్కులకు వ్యాపిస్తుండగా వేశ్యామణులు శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్థమై ప్రయాణమయ్యారు.
- ఇంకావుంది...

చరవాణి: 9490620512