డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-39

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐతే సీజర్ వారసుణ్ణొక్కణ్ణి తాను కని, పెంచింది. ఈ రహస్యాన్ని కూడా పరోక్షంగా అతనికి తెలియ పరచాలని ఆమె నిశ్చయించుకుంది.
రెండో ఏడు ప్రవేశించిన తన పాపను తీసుకొచ్చి అతనికి చూపించింది. వాడు ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేస్తున్నాడు. ఏదన్నా ఆధారం దొరుకుతే నడిచేందుకు ప్రయత్నిస్తూ కింద పడుతున్నాడు. వాణ్ణి చూస్తే సీజర్‌ను చూడనక్కర్లేదు. తల్లిదండ్రులపోలిక బిడ్డల్లో వస్తుందంటారు. కానీ ఈ తండ్రీ కొడుకుల పోలికకు సాటైన సంఘటనలు ప్రపంచ చరిత్రలోనే బహు కొద్ది అనేందుకు సందేహం లేదు.
క్లియోపాత్రా కొడుకు చూసి అక్టోవియన్ తన ఆనందాన్ని వెలిబుచ్చాడు. బహుశా మనసులో వాణ్ణి శపించి ఉంటాడని క్లియోపాత్రా తలపోసింది. కొంతసేపు కూర్చుని అక్టోవియన్ వెళ్లిపోయాడు. తీవ్రంగా ఆలోచిస్తూ ఆమె అక్కడే కూర్చుండిపోయింది.
ఇంతలో బ్రూటస్ వచ్చాడు. అతను వచ్చి ఎదుటి నిలబడి ప్రణామం చేసేవరకూ ఆమె తిరిగి ఈ లోకంలోని వ్యక్తి అవలేదు. చప్పున లేచి నిలబడి కుడిచేతిని ముందుకు చాపింది. ఎందుకంటే ఆమె ఎడమ చేతిలో బిడ్డడు ఉన్నాడు. బ్రూటస్ మోకరించి ఆమె చేతిని ముద్దుపెట్టుకున్నాడు.
బ్రూటస్ ఎంత అందగాడు! సీజర్ కు కలిగిన అక్రమ సంతానం బ్రూటస్ అనే వదంతి ఉన్నది. అతని వయస్సు 30 సంవత్సరాలు ఉంటుంది. విశాలమైన అతని ఫాలభాగం కండలు తేరి చూడముచ్చటగా ఉన్న అతని శరీరం చూస్తే సీజర్ తప్పక గుర్తొస్తాడు. సీజర్ సంతానమైన తన కుమారుణ్ణి కూడా క్లియోపాత్రా బ్రూటస్‌కు చూపింది. అతను కూడా కొంతసేపు లోకాభిరామాయణం మాట్లాడి సెలవు తీసుకొని వెళ్లిపోయాడు.
క్లియోపాత్రా తన 24వ జన్మదినోత్సవాన్ని రోమ్‌లోనే జరుపుకుంది. ప్రభుత్వ పెద్దలందరికీ ఆహ్వానాలు పంపింది. తన దేశం ఎంత సౌభాగ్యవంతమైనదో, సిరులతో తులతూగుతుంటుందో ఈ రోమన్‌లకు తెలియజెప్పాలని ఆమె బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసింది. ఐతే ఆమె ఆశించినట్లు రుూసారి కూడా మార్క్ ఏంటనీని చూడలేకపోయింది.
రోమ్ తాను ఊహించినంత అందమైన పట్టణం కాదు. ఏ నాలుగైదు వీధుల్లో తగినంత విశాలంగా ఉన్నవి. ప్రజలందరూ వ్యాపారంలోనూ, రాజకీయాల్లోనూ మునిగి తేలుతుంటారు. రోమన్‌లకు ధాన్యం చాలావరకు అలెగ్జాండ్రియా నుంచే దిగుమతవుతుంది. రోమ్‌లో జరిగే వ్యాపారం తాలూకు సరుకుల్లో అధిక భాగం- పత్తి, గాజు సామానులు, విలువైన రాళ్ళూ- చివరకు ఏనుగులు, నైల్ నదిలో పట్టిన మొసళ్ళు, ఆఫ్రికా అడవుల్లో బంధించబడిన సింహాలు కూడా వీరికి వ్యాపార సామగ్రే! పూర్వం ఆమె రోమ్ లేకుంటే అలెగ్జాండ్రియా లేదనే భ్రమలో ఉండేది. ఇపుడు అలెగ్జాండ్రియా లేకుంటే రోమన్ సామ్రాజ్య పతనం కాగలదనే సత్యాన్ని తెలుసుకోగలిగింది. మొత్తంమీద ఆమె ఊహాచిత్రంలో రోమ్ పట్టణం మీదుండే గొప్పతనమంతా అంతరించింది.
రోమన్‌లకు దైవభక్తి చాలా తక్కువని ఆమె గ్రహించింది. మానవుని జీవితానికి గాను దేవుళ్ళూ, దేవతలూ ఏమీ చెయ్యరనే అభిప్రాయం వారిలో గాఢంగా పాతుకొని పోయింది. ఐతే తోకచుక్కలు రాలటంలోనూ, భూకంపాలూ, అసహజ జననాల్లో మాత్రమే ప్రజలకు నమ్మకముంది. ఈ రోజుల్లో దేవుడు మానవుణ్ని, మానవుడు దేవుణ్ణీ నమ్మేందుకు వీలులేని పరిస్థితులున్నవని ఆమె తలపోసింది.
క్లియోపాత్రా అనేకమంది గూఢచారుల్ని నియమించింది. పట్టణంలో ఏ మూల ఏం జరిగినా మరుక్షణంలో ఆమెకు తెలిసిపోతోంది. ముఖ్యంగా సీజర్ నీడలో కొంతమంది ఎప్పుడూ కదలాడుతూంటారు. ఇక తనను గూర్చి ప్రజలు రకరకాలుగానూ అనుకుంటున్నారని ఆమెకు వార్తలు జేరాయి.
ముఖ్యంగా తన గౌరవార్థం సీజర్ నాణాలను ముద్రించాడు. ఈ నాణాల మీద ఒకవైపున ప్రణయదేవత వీనస్ బొమ్మా, రెండోవైపున క్లియోపాత్రా బొమ్మా ఉన్నవి. ప్రజాభిప్రాయాలు చాలా తీవ్ర సంచలనంతో కూడినవని ఆమెకు తెలియవచ్చింది.
‘‘ఈజిప్టు నుంచి దీన్నొకదాన్ని రోమ్‌కు దించి, తనతోపాటు గౌరవించడమేమిటి?’’ అని కొందరన్నారు.
‘‘ఈమె అందచందాలకన్నా తెలివితేటలే సీజర్‌ను ఆకర్షించి ఉంటవి. ఈ రెండూ లేకుంటే, ఈమె ఐశ్వర్యనికైనా ఆయన దాసుడై ఉంటాడు’’ అని మరికొందరన్నారు.
‘‘ఈ ఉంపుడుకత్తెను నెత్తిన పెట్టుకొని సీజర్ ఊరేగినా ఫర్వాలేదు. ఆయన ఆమెను రాణిగా చూస్తే, మనమంతా కూడా అదే దృష్టితో చూడాలని ఈ నాణాల మీద ప్రణయదేవతను ఒక పక్క, రుూ ఈజిప్షియన్‌ను మరో పక్కా ముద్రించారు గమనించారా? ఇది ప్రజా ప్రభుత్వానికి తీరని అవమానం!’’ అని ఇంకొందరన్నారు.
‘‘అయినా క్లియోపాత్రా ఏమంత అందమైనదని? ఈజిప్టులో రుూ శే్వతజాతిది పుట్టినందుకు ఆమె అందగత్తె కావచ్చు. సీజర్‌కు ఎంతమంది ప్రియురాండ్రు లేరు! వారందర్నీ రాజకీయ జీవితం నుంచి ఎంత దూరంలోనో ఉంచాడు. కాని, క్లియోపాత్రాను మాత్రం బాహాటంగా తన భార్యవలెనూ, ఆమె తనకు కన్నకొడుకును తన వారసుడిగా మన నెత్తికి ఎక్కించేట్లున్నాడు’’ అన్నారు ఇంకొందరు.
‘‘అన్నట్లు చూశావా?’’ అన్నారు మరికొందరు. ‘‘ఈమధ్య సెనేట్‌లో నియంతలు ఎంతమంది భార్యల్నయినా చేసుకోవచ్చనే చట్టాన్ని సీజర్ ప్రవేశపెట్టాడు. దీని అర్థం ఏమిటంటే- రేపు రుూ ఈజిప్షియన్ స్ర్తి తన భార్యంటాడు. ఇన్నాళ్ళూ రోమ్ ఈజిప్టును పాలిస్తున్న గౌరవం మనకుండేది. ఇక మన కర్మ కాలి సీజర్ టాలమీగాడే మనకు పాలకుడౌతాడు కదా!’’
‘‘వీళ్ళ గతి తగలబడ్డట్లే ఉంది! ఆర్సినోయ్ టాలమీకి, క్లియోపాత్రాకు వివాహమైంది కదా! అక్కకూ, తమ్ముడికీ పెళ్ళేమిటి? ప్రపంచంలో ఇంకెక్కడా ఇలాంటి సంబంధాలు లేవు! పోనీ వాళ్ళ వంశాచారాలు అలా ఉన్నవని సరిపెట్టుకుందామంటే, వారి దాంపత్యం పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నది! వారు బతికుండగానే, రుూ మాయలాడి సీజర్‌ను బుట్టలో వేసుకుంది. చివరకు రంకు మగనిచేత, తన భర్తను చంపించింది. ఏం రాక్షసి అది? కుటుంబీకుల్లోనే బద్ధవైరాలు!.. చివరకు తన ప్రియురాలికి ఈజిప్టు రాజరికాన్ని సీజర్ ముట్ట చెప్పాడు. మొదటి భర్త పొయ్యాడు కదా! ఈ ప్రియుడితోనే ఉంటే రాణిగార్ని ఎవరు కాదన్నారు! సిగ్గులేక, తన తరువాతి తమ్ముణ్ణి పెళ్ళాడింది. ఈమెగారి వయస్సు 23 సంవత్సరాలైతే, ఈమె భర్తగారి వయస్సు 12 సంవత్సరాలు! వీరిద్దరూ దాంపత్య జీవితంలో ఉన్నారని మనమంతా అనుకోవాలి. నమ్మాలి. ఇపుడు భర్తను- ఆ బుల్లి టాలమీగాడ్ని కూడా వెంట వేసుకొని రోమ్‌కు వచ్చింది. వాడి ఎదుటనే తన ప్రియుడితో, వాడి పేరుమీదుగా దాంపత్యాన్ని నిర్వహిస్తోంది. ఈ రంకు దాని నీ నియమాలను గూర్చి మనం చర్చించరాదు! ఈజిప్టులో రుూమె ఆటలు సాగినయ్ కాని, ఆ గర్వంతో రోమ్‌లో కూడా రుూ అవినీతిని ప్రవేశపెట్టాలని ఆమె, సీజరూ ప్రయత్నిస్తే ఇక మనం బతికినట్లే!’’
ఇలాంటి అనేక అభిప్రాయాలను ఆమె విన్నది. తన నీతి నియమాలను గూర్చి ప్రజలకు చాలా దురభిప్రాయం ఉన్నది. ఐతే ఈజిప్టులో కన్నా రోమ్‌లో నీతి నిలబడిందని ఎవరైనా అనుకుంటే వారు తమను తాము మోసగించుకునేందుకు ప్రయత్నించినవారే అవుతారు.
ఎందుకుంటే ఈజిప్టులో వలె మనసులు కలిసిన మనువులనేవి ముఖ్యంగా ప్రముఖుల జీవితాల్లో మచ్చుకైనా చూడలేము. ప్రతి వివాహానికి వెనకా ఏదో ఒక దురుద్దేశం- ఆర్థిక సంపత్తి లాంటిది ఉండనే ఉన్నది. ఫలానా వివాహం చేసుకుంటే రాజకీయాల్లో పైకి వచ్చి, అధికార వర్గంలో సభ్యత్వం పొందవచ్చు.
- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు