డైలీ సీరియల్
బ్రహ్మజ్ఞానంతో ఆత్మానందం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
స్వర్గాది దివ్యలోక పర్యంతం వ్యాపించినది, ఆశ్చర్యకరమైనది అయిన బ్రహ్మమే పిండరూపంలో తన గర్భంలో ఉండి పెరుగుతూ ఉన్న కారణంగా ఆ బ్రహ్మకు గల సర్వగుణాలు తెలుపు రీతిగా ఆ చదువుల తల్లి కొంచెం కూడ సౌఖ్యంలేని సంసార సంబంధమైన శరీరాభిమానాన్ని విడిచి స్వేచ్ఛగా తిరుగగోరుతూ ఉంది. మోక్షసామ్రాజ్య పట్ట్భాషిక్తులై విహరించే యోగసిద్ధులతో కూడి యుండాలని కోరుకుంది. వౌనదీక్ష యెడల ఆసక్తితో మనస్సుకింపయిన చోట ఒంటరిగా నివసిం చాలని వాంఛించింది. అయాచితంగా లభించే పదార్థాలతోనే పదార్థాలమీద ఉండే ఆసక్తిని తృప్తి పరచుకొంటూ ఉంది.
భారతి కోరిన కోరికకు సుముఖుడైన బ్రహ్మ మఖానక్షత్రం నాడు వ్రతాన్ని ఆరంభించి సంవత్సర కాల మాచరించినంతనే ఆ చంద్రశేఖరుని దయ వలన దంపతుల మనస్సున ఆనందం కలుగగా పుత్రోదయ కాలం ఆసన్నమయింది. వేదాంత వాఙ్మయమనే సముద్రంలో అర్థస్వరూపుడైన ఆనంద చంద్రుడు ఉదయింపగా బ్రహ్మ తనను తాను మైమరచి పోయాడు. అంతట వాణికి పుణ్యాలపంటగా తత్త్వార్థ స్వరూపమూ; మహాయోగీశ్వరులో మహాలంకారమూ; ఈశ్వరుని కృపచే వృద్ధి పొందింపబడిన దివ్యతేజమూ; నిత్యశాంతస్వరూపమూ; దుఃఖ దాయకమైన సంసారానికి దూరంగా ఉండే మనః స్వభావమూ కలిగిన ఒక శ్రేష్ఠమైన పుత్రరత్నం లోకానికి ఆనందకేళి కలిగిస్తూ జన్మించాడు. ఆవిధంగా పుత్రోదయ మయినంతనే బ్రహ్మ బ్రహ్మానంద భరితుడవుతూ గౌరీశ్వరుని భక్తితో స్తుతించాడు.
ఆ స్తుతికి సంప్రీతుడయిన శివుడు అపారకరుణా సముపేతుడై ప్రత్యక్షమై బ్రహ్మకుమారుడికి ఋభువు అని పేరును పెట్టాడు. పిమ్మట సంపత్సమృద్ధమూ - పాపరహితమూ అయిన బ్రహ్మోపదేశాన్ని బాలునికి చేసి అంతర్ధానమయ్యాడు.
తరువాత ఋషభుడు తల్లిదండ్రులు కలతచెందకుండ సాష్టాంగ నమస్కారం చేసాడు. ఆత్మ దర్శనంలో ఆనందం పొందాలనే కోరికకల ఆత్మజ్ఞానులైన కుమారులు ఏ విషయాన్ని విడిచి పెట్టలేరు అన్నమాటకు తగినట్లుగా ఋభువు తల్లిదండ్రుల్ని విడిచి బ్రహ్మజ్ఞానిగా తిరగడానికి పుణ్యారణ్యాలకు- పుణ్యపర్వత సీమలకు తరలి వెళ్లాడు. ఆ రీతిగా సంచరించే ఋభుడి వద్దకు నిదాఘుడను ఋషి వచ్చి బ్రహ్మవిద్యను (ఆత్మ-జగత్తుల స్వరూపజ్ఞానం) బోధించాడు. ఆయనకే కాక సనకుడు, సనందుడు, సనత్కుమారుడు-సనత్సుజాతుడు అనే బ్రహ్మకుమారులకు కూడ ఆ బ్రహ్మవిద్యను ప్రబోధించాడు. వారు సకలమునీశ్వరులకు తెలుపగా ఆ బ్రహ్మవిద్య జగమంతా విస్తరిం చింది.
క్షేత్రనామంగా శ్రీకాళహస్తి
ఈ విధంగా బ్రహ్మదేవుని కదను గిరిజాపతి వివరించాడు. విని ఆ యాదవేంద్రుడు ఆనందించి ‘‘దేవా! దక్షిణకైలాస మందలి ఈశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడను పురాణ ప్రసిద్ధ నామాన్ని వహించిన కారణాన్ని సంపూర్ణంగా వివరించండి’’ అని అర్థించాడు. అడిగినంతనే కపటజంగమ వేషధారియైన చంద్రశేఖరుడు కరుణామూర్తియై వినుమని రాజుతో ఇలా వివరించాడు.తొలియుగమైన కృతయుగంలో శ్రీ అనే పేరుగల సాలెపురుగు మలియుగమైన త్రేతాయుగంలో కాళమనే సర్పం; ద్వాపరయుగంలో హస్తి అనే ఏనుగు ఆ దక్షిణకైలాసలింగాన్ని సేవించాయి. పార్వతీ రమణుడు వాని సేవను అంగీకరించి వానిని మోక్షసామ్రాజ్య లక్ష్మీవంతుల్ని చేసి తనలో ఐక్యం గావించుకొన్నాడు. ఆ కారణంగా ఆ స్వామి శ్రీకాళహస్తీ శ్వరుడనే పేరుతో ప్రసిద్ధి వహించాడు. నీకు ఆ కదను ఆద్యంతమూ వివరిస్తాను. శ్రద్ధతో విను.
చెలది పురుగు శివైక్యమును పొందుట
కృతయుగంలో శ్రీ అనే పేరుగల సాలిపురుగొకటి పూర్వజన్మ సంస్కారబలం చేత నీలకంధరుని కొలిచింది. అది ప్రతిదినం సువర్ణముఖరీ నదిలో స్నానం చేసి తన శిల్పకళానైపుణ్యంతో నోటి నుండి వచ్చే దారాలతో ఈశ్వరుడికి గృహనిర్మాణాన్ని చేపట్టింది.
దానికి అవసరమైన ప్రాకారాలు, (ప్రహారీ గోడలు) గోపురాలు; కొలువుకూటాలు; నాట్య మందిరాలు; ధనాగారాలు; పందిళ్లు; విహారప్రదేశాలు; గుడిలో ప్రదిణ కొఱకై తీర్చబడిన అప్రదక్షిణ మార్గం భోజనశాలలు; నట్టిండ్లు; బంగారు కల్యాణమంటపాలు; అంతర్ద్వారాలు; కిటికీలు; మేడల నిర్మించింది. వానినే కాక వినాయకుడు, కుమారస్వామి, చండీశుడు, విష్ణువు, దక్షిణామూర్తి, కాలభైరవుడు- విష్ణువు - సప్తమాతృకలు మొదలైన వారి దేవాలయాల్ని శ్రద్ధతో కట్టింది. ఆ విధంగా సాలిపురుగుచే కట్టబడిన దారాల ఇండ్లు ఉదయకాలంలో మంచుబిందువులు పడటంచేత అవి ముత్యాలతో నిండిన ఇండ్లుగా ప్రకాశిం చాయి. అంతేగాక ఆ మంచుబిందువుల్లో ప్రవేశించిన సూర్య కాంతి చేత బహురత్నగృహాల వలె అవి చిత్రంగా వెలిగిపోయాయి. ఈ రీతిగా ఇండ్లను అందంగా కట్టినా గాలి చేత ఆ దారాలు తెగిపోయి జారిపోయేవి. అవి అతికినా నిలిచేవి కావు. అందుకని ఆవిధంగా సాలిపురుగు ప్రతిదినమూ ఇండ్లను నిర్మించి శివుని సేవిస్తూ ఉండేది.
కొంతకాలానికి ఫాలలోచనుడు ఆ చెలదిపురుగు భక్తిని పరీక్షింప తలచాడు. ఒకనాడు దేవాలయంలో ఉన్న దీపపు కాంతిచేత సాలిపురుగు నిర్మించిన దారపుటిండ్లన్నీ కాలి బూడిదైపోయాయి. అప్పుడు ఆ కీటకం క్రోధావేశంతో ఇట్లు తలచింది. ‘ఈ ఇండ్లు కట్టడానికి నాకు చాలా సంవత్సరాల కాలం పట్టింది.
ఇంకా ఉంది