డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యథాప్రకారం రోమ్‌కు సరుకుల రవాణాలు సాగుతూనే వున్నది. రోమన్ సైన్యాలు అలెగ్జాండ్రియాలో రాజవంశ రక్షణ అనే మిషమీద పోషించబడుతూనే వున్నవి. అక్కడ రోమ్‌లో, ప్రభుత్వంలో చీలికలు ఏర్పడినవనే వార్తలు వస్తూన్నవి. ఐతే పాంపే అజేయుడిగా ఉండి ప్రభుత్వాన్ని జాగ్రత్తగా నడుపుతూనే ఉన్నాడు.
తన తండ్రిని తిరిగి ఈజిప్టుకు రాజుగా చేసింది పాంపేయే! పాంపే మీద క్లియోపాత్రకు అచంచల విశ్వాసమున్నది. ఏనాటికైనా పాంపేను ఆశ్రయించి, ఆయన దయ సంపాయిస్తే, తానొక్కతే ఈజిప్టును ఏలవచ్చనే గట్టి నమ్మకం ఆమెకున్నది. అలాటి సందర్భం- రోమన్‌ల దగ్గర పలుకుబడి సంపాయించుకునే అవకాశం- ఏనాడు వస్తుందనోనని ఆమె వేచి వున్నది.
టాలమీ పదేళ్ళ కుర్రాడుగా పాలకుడైనా, పేరుకు మాత్రమే పాలకుడతను. రాజ్యపాలనంతా పొథినస్ అనే కొజ్జాయే సాగిస్తున్నాడు. ఇతను తెలివితేటలకూ, రాజ్యాంగాన్ని కౌశలంతో నడిపేందుకూ ప్రసిద్ధికెక్కాడు. దంపతుల్లో చీలికలు అతని అధికారాన్ని దిగ్విజయంగా కొనసాగించినవి.
ఇలా ఉండగా రోమన్ ఆక్రమిత సిరియాలో రోమన్ యోధులు అవసరమయ్యారు. సిరియన్ రాయబారి ఒక చిన్న సేననూ, సేనాపతినీ ఇచ్చి ఈజిప్టులోని సేనల్లో అధికభాగాన్ని తరలించుకొని రమ్మని పంపాడు.
ఈజిప్టులో సంవత్సరాల తరబడి వేతనాలు తీసుకుంటూ, పనీపాటు లేకుండా మెక్కి ఈజిప్షియన్ స్ర్తిలను వివాహమాడి, హాయిగా బతుకుతూన్న రోమన్ సైనికులకు తిరిగి యుద్ధంలోకి వెళ్లటం ఇష్టంలేదు. ఇక్కడే- ఈ గడ్డమీదనే మరికొనే్నళ్ళు సుఖపడదామని వారి ఆశయం. అందుకు భిన్నంగా రోమన్ సేనాధిపతి ఒకడొచ్చి, వారిని తరలించుకొని వెళ్ళేందుకు ఆజ్ఞల్ని జారీ చేశాడు.
కాని, ఆ సైనికులు నిరాకరించారు. మాటా మాటా పెరిగి సిరియా నుంచి వచ్చిన సైనికాధికారిని హత్య చేశారు. పీడ వొదలింది కదానని చేతులు దులుపుకున్నారు.
ఈ సంఘటన ఈజిప్షియన్ ప్రభుత్వంలో ద్వంద్వాభిప్రాయాలను రేకెత్తించింది. టాలమీ పక్షంవారు ఇది తమకు సంబంధించింది కాదనీ, రోమన్‌లు వాళ్ళలో వాళ్ళు కీచులాడుకున్నారు కనుక, దీని విషయం రోమన్ ప్రభుత్వమే పరిశీలిస్తుందనీ ఊరుకున్నారు.
కాని క్లియోపాత్రా పక్షంవాళ్ళు వేరొక విధంగా అభిప్రాయపడ్డారు. ఈ దారుణం ఈజిప్టు గడ్డమీదనే జరిగింది కనుక, దీనికి ఈజిప్షియన్ ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందనీ, అందునా హత్యకాబడినవాడు సైనికాధికారి కావటంవల్ల, రోమన్‌లు రుూ సాకుతో ఈజిప్టును కైంకర్యం చేస్తారనీ, కనుక తమ బాధ్యతను నిరూపించుకునేందుకు ఏదైనా వెంటనే చేయాలనీ నిశ్చయించుకున్నారు.
క్లియోపాత్రా ఆజ్ఞానుసారం సైనికాధికారిని హత్యచేసిన రోమన్ సైనికుల చేతులకు సంకెళ్ళు తగిలించి, వారిని సిరియా పంపారు. కాని, వెళ్ళిన సైనికులు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో తిప్పి పంపబడ్డారు. రోమన్ రాయబారి ‘రోమన్ సైనికులను బంధించే హక్కు రోమన్‌కే కాని, ఈజిప్షియన్‌లకు లేదు’ అని హెచ్చరిక కూడా పంపాడు.
ఈ దెబ్బతో క్లియోపాత్రా సగం చచ్చింది! రోమన్‌ల అభిమానాన్ని సంపాయించబోయి తానే అవమానింపబడింది. రోమన్‌ల అహంభావం ఎలాంటిదో, వారు తమ గొప్పను ఏ విధంగా ప్రయోగిస్తారో క్లియోపాత్రకు జీవితంలో మొట్టమొదటిసారిగా తెలిసొచ్చింది.
తాను ఎంత సదుద్దేశంతో ప్రవర్తించినా తననూ, తన దేశీయుల్నీ వారు హీనంగా చూస్తారు. ఐనప్పటికీ రాజ్యాధికార కాంక్ష తనలో వున్నన్నాళ్ళు రోమన్‌లను ఆశ్రయించక తప్పదు. కనుకనే క్లియోపాత్రా రుూ అవమానాన్ని దిగమింగింది. ఈ అపజయాన్ని గూర్చి లోలోన కుమిలిపోయినా, పైకి మాత్రం ఆ గంభీరంగా ఉండిపోయింది.
రోమ్‌లో పరిస్థితులు కూడా బాగాలేవు. నిన్నమొన్నటిదాకా పాపం సర్వాధికారిగా ఉన్నాడు. ఇపుడు అంతర్యుద్ధాలు ఆరంభమైనవి.
పాంపేమీద తిరుగుబాటు చేసిన జూలియస్ సీజర్‌ను గూర్చి ఎవరికీ బాగా తెలియదు. తన తండ్రి రోమ్ నుంచి తిరిగి వచ్చిన కొత్తలో సీజర్ ఒక ప్రపంచ యోధుడని మాత్రమే చెప్పాడు. క్లియోపాత్రాకు అంతకుమించి ఏమీ తెలియదు. ఐతే ఆమె అభిప్రాయంలో పాంపేకన్నాగొప్ప యోధుడూ, పాలకుడూ లేడు.
ఇలా ఉండగా పాంపే, తన కొడుకు జీయస్ పాంపేను ఈజిప్టు పంపాడు. తాను యుద్ధాల్లో ఉన్నాననీ, తనకు కొంత సొమ్మూ, ఓడలూ, ఆహార పదార్థాలు, యోధులూ కావాలనీ ఆయన కబురుచేశాడు. ఇలాంటి అవకాశం కోసమే క్లియోపాత్రా వేచి ఉన్నది.
ఈ రాయబారిని టాలమీ పక్షంవారు లెక్క చేయలేదు. ప్రతి సంవత్సరమూ కప్పం కట్టినట్లుగా సగం దేశాన్ని దోచి, వారు రోమ్‌కు ఎగుమతి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా తామేమీ సహాయం చేసే స్థితిలో లేరు. అందునా రోమన్ సామ్రాజ్యంలో జరిగే యుద్ధాలతో రుూ ప్రభుత్వానికి సంబంధం లేదు. తెల్లారితే ఎవరు రాజో, ఎవరు రెడ్డో తెలియని స్థితిలో తొందరపడి చేయగలిగిన సహాయాన్ని చేయటం- ప్రతిపక్షంవారు, తన ప్రభుత్వంమీద కక్ష కట్టేటట్లు చేయటమే అవుతుంది!
అదీగాక ఔలటీస్ టాలమీ నాలుగేళ్ళ క్రితం పేరుకు స్వతంత్రుడుగా తిరిగొచ్చి ఈజిప్టు రాజుగా సింహాసనంమీద కూర్చున్నాడన్న మాటే కాని, ఆయన రోమ్‌లోని ప్రభుత్వానికి లెక్కలేనంత సొమ్ము బాకీ పడివచ్చాడు. ఈ ఋణం ఎలా సంభవించిందో ఎవ్వరికీ తెలియదు. ఋణబాధను ఆయనెప్పుడూ పొందనూ లేదు. తీర్చాలనే ఉద్దేశ్యమే బహుశా ఆయనకు ఉండి ఉండదు. కనుకనే తన జీవితకాలంలో తీర్చలేని ఋణాన్ని చేశాడు. ఈ సంగతి ఆయన చచ్చేదాకా ఎవ్వరికీ తెలియదు.
ఐతే ఆయన మరణానంతరం రాజ్యపాలనకు వచ్చినవాళ్ళను, తండ్రి రాజ్యంతోపాటే ఆయన అప్పులు కూడా చుట్టుకున్నవి. ఋణం ఔలటీస్ టాలమీకి సంబంధించిన వ్యక్తిగత ఋణం కాదు. ఈజిప్టు దేశానికి సంబంధించినదిగానే ఉండిపోయింది.
ఈ అప్పును ఎన్ని శతాబ్దాల్లో తీర్చడం సంభవమో ప్రభుత్వం ఊహించలేని స్థితిలో పడింది. రోమన్ ప్రభుత్వం ప్రస్తుతానికి వొత్తిడి చేయటంలేదు. అంతవరకూ ఈ ఋణబాధ ఎవ్వరికీ పట్టదు. పోతే ఇదొక సాకుగా ఏనాటికైనా ఈజిప్టు రోమన్ సామ్రాజ్యంలో కలిసిపోగలదని రాజకీయ దురంధరులు అభిప్రాయపడుతున్నారు.
ఔలటీస్ టాలమీ పరిపాలనలో ఒక్క సత్కార్యం కూడా జరగలేదు. ఈజిప్టును రోమన్‌లకు అమ్మటం జరిగింది. ఆ అమ్మినదాన్ని శతాబ్దాల పర్యంతం తీర్చలేని అప్పుతో కొనుక్కోవటం జరిగింది. తీరా ఆ చచ్చిపోయిన త్రాష్టుడి సమాధిమీద ఉమ్మివేయనివారు లేరంటే ఆశ్చర్యం లేదు. ఏనాడు రోమన్ ప్రభుత్వం ఈజిప్టుమీద ఈ ఋణాన్ని చెల్లించమని వొత్తిడి చేస్తుందోననే భయం మాత్రం పీడిస్తూ ఉంది.
ఐతే అదృష్టవశాత్తూ పాంపే పంపిన వార్తల్లో రుూ ఋణాన్ని గూర్చిన ప్రస్తావనే లేదు. కనుక టాలమీ పక్షంవారు తమకు పట్టనట్లు ఊరుకున్నారు. తమ నిస్సహాయ స్థితిని చాలా సున్నితంగా తెలియజెప్పారు.
క్లియోపాత్రా రోమన్‌ల సానుభూతి సంపాయించేందుకు ఇది మంచి సమయమనుకున్నది. తాను చేసే సహాయాన్ని పురస్కరించుకొని, రేపు రోమన్ ప్రభుత్వం తననే రాణిగా గుర్తించవచ్చు.

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు