డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మన దేశానికి పాలకుల్ని నిర్ణయించేందుకు రోమన్ అధికారాలేమిటి?’’ అందామె కోపంతో వణికిపోతూ.
‘‘ఉద్రేకాలవల్ల ఏవౌతుంది యువరాణీ! రోమన్ దాస్యం మనతో ఆరంభం కాలేదు’’
‘‘కాని మనతో ఎందుకు అంతమవరాదు?’’ అంది అధికార పూర్వకంగా క్లియోపాత్రా.
‘‘నీలాంటి రాణి పరిపాలనలో చూడాలి!’’
ఆచార్యులు ఎగతాళిగా రుూ మాట అన్నారో లేక నిజంగానే ఆయన నమ్ముతున్నారో క్లియోపాత్రకు అర్థం కాలేదు.
‘‘నేను ఎప్పటికైనారాణి నౌతానని మీకు నమ్మకం ఉన్నదా?’’
‘‘ఉన్నది తల్లీ! మీ వంశంలో ఆ అర్హత గలవారెవరైనా ఉంటే, నీవు మాత్రమే!’’
క్లియోపాత్రా వికటంగా నవ్వింది. ఇరాస్ చకితుడై, ఆ నవ్వు వెనుక దాగిన భావాలు అర్థంగాక గుడ్లప్పగించి చూస్తున్నాడు.
‘‘ఆచార్యా! నేను రాణి కాకపోతే మానె! ప్రాణాలతో బైట పడగలనంటారా?’’ అన్నదామె.
‘‘ఆ సందేహం ఎందుకు కలిగింది?’’
‘‘ఎందుకా? టాలమీ వంశవృక్షంలో రక్తం విరజిమ్మబడటం రుూనాడు కొత్తా? మీలాగే అక్క కూడా భావించినట్లయితే, నన్ను మీరీనాడు ప్రాణాలతో చూడగలిగేవారా?’’ అన్నది క్లియోపాత్రా.
‘‘పిచ్చి తల్లీ! నీవు రాణివౌతావనే నమ్మకం నాకే కాదు, మీ అక్కకే కాదు, ఈజిప్షియన్ ప్రజలందరికీ వున్నది!’’
క్షణంలో క్లియోపాత్ర మొహం నల్లని నీడతో ఆవరించబడినట్లయింది.
‘‘నిజమా! .. నిజమా!.. ఇదే నిజమైతే నా చావు చాలా దగ్గర్లోనే ఉన్నది! అక్క నన్ను బతకనివ్వదు.. ఆచార్యా! ప్రాణాలతో నన్ను ఎక్కడికైనా జేర్చండి.. బతికుంటే అదే పదివేలు.. జన్మంతా కృతజ్ఞురాలిగా ఉంటాను’’ అన్నదామె దుఃఖ తరంగాలు గంతులు వేసే కంఠస్వరంతో.
‘‘అలా భయపడకు యువరాణి! ఆ భయంతో కోట దాటేందుకు ప్రయత్నిస్తే ఆ వొంకతో నిన్ను రుూ నీచులు చంపినా చంపవచ్చు. ముఖ్యంగా భయపడుతున్నట్లు కనిపించవొద్దు. నీ మనసులోని భావాలు వేరెవ్వరికీ తెలియనీకు. అతిగా ఎవరితోనూ మాట్లాడకు. అలా మాట్లాడితే, నీ లోతులు ఇతరులకు తెలిసిపోతవి. వారినే మాట్లాడనివ్వు. వారి తెలివితేటలూ, విజ్ఞానం ఏమిటో నీకు తెలిసిపోతుంది. కాని నీవెంత లోతుమనిషివో వారికి తెలియదు. ఇదే రహస్యంతో నీవు జీవితాన్ని జయించగలుగుతావు! అన్నాడు ఇరాస్.
క్లియోపాత్రా ఆ మాటలన్నింటినీ ఆకళింపు చేసుకుంది.
‘‘కాని’’ అన్నదామె. ‘‘తాచుపామున్న మందిరంలోనే నివసిస్తూ దానికి భయపడకుండా ఉండటం ఎలా? ఏ క్షణాన అది కాటువేస్తుందో ఎవరికి తెలుసు?’’
ఇరాస్ పకపకా నవ్వాడు. క్లియోపాత్రా ఆయన ముఖం చూసి భావాల్ని గ్రహించేందుకు వ్యర్థ ప్రయత్నం చేసింది.
‘‘అలా జరగదు యువరాణి! అన్నాడాయన. ‘‘అలా జరిగేట్లయితే ఏనాడో జరిగి ఉండేది. బెరినైస్ నీవనుకునేటంత తెలివితక్కువది కాదు!’’
‘‘నన్ను చంపేందుకు తెలివితేటలెందుకు? అబలను. లోకజ్ఞానమన్నా లేనిదాన్ని, అనాథను. ఒక్కబొట్టు విషంతో నా పీడ విరగడవుతుంది కదా?’’ ఆ కంఠస్వరంలో ఆమె అసహాయత వుట్టిపడుతోంది.
‘‘కనుకనే ఆమె నిన్ను ముట్టదు’’ అన్నాడు ఇరాస్. ‘‘ముందు తాను మహారాణి అవునో , కాదో తేల్చుకోవాలి. అప్పుడు కాని ఆమెకు నిజమైన అధికారమంటూ వొచ్చినట్లవదు’’.
‘‘ఈ విషయం రోమ్‌లో నిర్ణయం కావాలన్నారు కదా! అక్క సింహాసనం ఎక్కటాన్ని ఈనాటివరకూ రోమ్ అభ్యంతరపెట్టలేదు. అంటే అంగీకరించిందన్నమాటే కదా!’’ అన్నది క్లియోపాత్రా.
‘‘అది కేవలం మన ఊహ మాత్రమే! ఈజిప్టుకు అసలు పాలకులెవరో నిర్ణయమయ్యేదాకా బెరినైస్‌ను రాణిగా వారు అనధికారంగా ఒప్పుకున్నట్లు నటిస్తున్నారని అనుకుంటాను. ఎందుకంటే నిర్ణయమనేది కాస్త ఆలస్యంగా జరిగినా, ఈజిప్షియన్ ఐశ్వర్యం రోమ్‌కు తరలిపొయ్యేందుకు ఎట్టి ఆటంకాలు ఉండరాదు. ఈ తరలింపులను బాధ్యతాపూర్వకంగా నిర్వర్తించేందుకు ప్రస్తుతానికి బెరినైస్‌ను ఇక్కడ ఉంచారు’’.
‘‘దోపిడీ చేసుకునేవారికి, ఎవర్ని దోపిడీ చేస్తున్నామనే ప్రశ్న లేదు. తనకు కావల్సింది దొరుకుతుందా లేదా అనేదే కదా! ఐనప్పుడు ఈజిప్టు సింహాసనం మీద ఎవరున్నప్పటికీ, రోమ్ ప్రభుత్వానికి అభ్యంతరం ఏమిటి? వారికి కావలసిన సరుకులు రవాణా అవుతున్నంతకాలం వేరొక పాలకుణ్ణి తీసుకొనివచ్చే అనవసరపు శ్రమా, రభసా దేనికి? రోమన్‌లకు మా నాయనమీద ప్రత్యేకాభిమానమంటూ ఉన్నదని మీరు నమ్ముతున్నారా? మా అక్క కూడా పూర్వం వలెనే రోమన్ దాస్యాన్ని సక్రమంగా నెరవేస్తూనే వున్నది కదా. అందుకని రోమన్‌లు శ్రమపడి తిరిగి నా తండ్రిని రాజుగా ఈజిప్టు జేరుస్తారని నమ్మలేకుండా ఉన్నాను’’ అన్నది క్లియోపాత్రా.
‘‘నీవు చెప్పినదంతా నిజమే యువరాణీ! కానీ రోమ్‌లో ఇంకా నిర్ణయం జరగలేదు. ఇక ఈజిప్టులో బెరినైస్ పరిపాలన సాగుతున్నా, ప్రజలు అసంతృప్తి చెందారు. ఏ క్షణాన్నయినా తిరుగుబాటు జరగవచ్చు. ఐతే రోమన్ సైన్యాలు మన గడ్డమీద ఉన్నంతకాలమూ, వారి నిర్ణయాలే అమలు జరుగుతవి. రోమన్ సైన్యాధికారులకు, వారి ప్రభుత్వంనుంచి సరైన ఉత్తర్వులింకా రాలేదు.. పోతే మీ నాయనగారు అక్కడే ఉన్నారు. ఆయనకు రోమన్ సర్వాధికారి పాంపే ముఖ్య మిత్రుడు. లోగడ అనేక తిరుగుబాట్లను అణిచేందుకు, మీ నాయన పాంపేకు సైన్య సహాయం చేశాడు. వాళ్ళకు ఆ కృతజ్ఞతన్నా ఉండకపోదు. తెలివిహీనుడైన మీ నాయనే్న ఈజిప్టు సింహాసనం మీద ఉంచితే, రోమన్ ప్రభుత్వం ఇష్టానుసారంగా ధనధాన్యాదుల్ని పిండుకోవచ్చు..’’
‘‘ఇలాంటి సహాయాలన్నీ మా అక్కగారి ద్వారా జరగవనా?’’ అన్నది క్లియోపాత్రా అడ్డుపడి.
‘‘జరుగతవి. కాని, మానవుల్లో ఉన్న కృతజ్ఞత ఏవౌతుంది? మీ తండ్రి సజీవంగా రోమ్‌లో ఉండగానే, ఇక్కడ ఈజిప్టులో బెరినైస్ పేరు మీద ప్రభుత్వ పరిపాలన సాగుతూండటాన్ని ఈజిప్షియన్‌లే సహించలేకుండా ఉన్నారు. తన పక్షం న్యాయం జరిగేందుకు మీ నాయనగారు అక్కడ నానా అవస్థలూ పడుతున్నారు!’’
‘‘ఐతే’’ అన్నది క్లియోపాత్రా.

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు