డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనవాళ్ళు వొదిలినా, ఆ రోమన్ పశువులు, ముందు వెనుకలు ఆలోచించకుండానే అక్కడే నరికి పోగులు పెడతారు’’ అన్నది ఆయా.
ఆ మాటలు వినేప్పటికి యువరాణి కంపించింది. తాను మనసారా ప్రేమించిన ఆయా తన కళ్ళ ఎదుటనే హత్య గావింపబడుతున్నట్లు ఆమె భావించింది.
‘‘ఐతే వెళ్ళొద్దులే ఆయా!’’ అన్నది.
‘‘అమ్మా! అసలేం జరిగిందో నాకు చెప్పవూ?’’
‘‘ఏం లేదు ఆయా! ఏవో పీడకలలు వచ్చి భయపడ్డాను. అంతే!’’ అని యువరాణి బొంకింది.ఆయా నవ్వి ‘‘కలలకు భయం దేనికి తల్లీ! కలలు కల్లలేనని వినలేదా? భయం లేదు- నేనూ నీ మంచం దగ్గిరే పడుకుంటాను!’’ అన్నది.
యువరాణి లోలోన నవ్వుకుంది. ఇదంతా కలైనా బాగుండేది. కొంతసేపటికన్నా మెలకువ వచ్చి, కలే కదా అని సరిపెట్టుకునే అవకాశం ఉండేది. కాని, తన బతుకు స్వాప్నవిక అనుభవాలకన్నా హీనమైపోయింది. తన హృదయాన్ని విప్పి, తనకొచ్చిన రుూ ప్రమాదాలను గూర్చి చెప్పుకోలేని స్థితిలో పడింది. ఆయాకు తానంటే ఎంతో అనురాగం. కాని ఆమె రుూ రాజరికాల్ని అర్థం చేసుకోలేదు. ఇకపోతే తనకు తగిన సలహాలిచ్చి రక్షించగలవాడు ఆచార్యుడు మాత్రమే! తెల్లవారాక కాని ఆయన్ని తాను చూడలేదు.
‘‘ఇంకా ఏం ఆలోచిస్తున్నావమ్మా! నిద్ర రాకపోతే నీ ఆరోగ్యం చెడుతుంది. తెల్లవారి నీ కళ్లు ఎర్రబడడం నేను చూడలేను. రా.. చిచ్చికొట్టి నిన్ను నిద్రపుచ్చుతాను!’’ అన్నది ఆయా అనురాగపూరితంగా.
ఆయాతో చర్చించేందుకు ఏమీ లేదు. అందుకని ఆ అమ్మాయి మెదలకుండా వెళ్లి పడుకున్నది. ఆయాను బాధపెట్టకుండా ఉండేందుకుగాను త్వరగానే నిద్రను నటించింది.
‘‘పిచ్చి పిల్ల!’’ అని తనలో తాను గొణుక్కుంటూ తన మంచం పక్కనే ఆయా మేను వాల్చడాన్ని యువరాణి గ్రహించలేకపోలేదు.
మిగతా రాత్రంత్రా ఆ అమ్మాయి ఆలోచిస్తూనే వుంది.
2
ఆ అమ్మాయే జగత్ప్రసిద్ధి చెందిన యువరాణి క్లియోపాత్రా!
క్రీ.పూ. 55వ సంవత్సరంలో ఆమె వయస్సు 14 సంవత్సరాలు మాత్రమే. ఐతే వయస్సుతో నిమిత్తం లేకుండా ఆమె మెదడు లోకానుభవాన్ని సంపాయించగలిగింది.
టాలమీ వంశంలోని వారికి తెలివితేటలు ఉండేవి కావు. కాని క్లియోపాత్రా ఎంతో తీవ్రంగా, లోతులకు వెళ్లి ఆలోచించగలదు. కోట దాటకపోయినా, బైటి ప్రపంచాన్ని గూర్చిన అనేక విషయాలను ఆమె ఇరాస్ అనే ఆచార్యుని నుంచి తెలుసుకుంది. ఆమె తెలివితేటలకు గురువుగారు ఆశ్చర్యపడుతూ ఉంటారు.
అంతేకాదు- ఆమె అందచందాలకు కోటలోని వారంతా విస్తుపోతూంటారు. ముఖ్యంగా ఆయా క్లియోపాత్రను ‘జగదేకసుందరి’ అంటుంది. ఆయా పెంచిన ప్రేమతో రుూ మాటలు అనలేదని క్లియోపాత్రను చూసినవాళ్ళు తెలుసుకోగలుగుతారు; ఎందుకంటే క్లియోపాత్రాను జగదేకసుందరి అని ఒప్పుకోక తప్పదు.
రాజవంశీకులు దైవాంశ సంభూతులనే నమ్మకం ఉండేది. ఈ నమ్మకాన్ని బహిరంగంగా ఖండించకపోయినా, లోలోన ఖండించేవారు ఉన్నప్పటికీ, క్లియోపాత్రాను చూస్తే నిజంగానే ఆమెను దేవతవలె భావించక తప్పదు. దేవలోకంలో కాకుంటే, మానవుల్లో ఇంత అందం ఉండగలదని ఎవరనుకోగలరు? ముఖ్యంగా ఏనుగు దంతాన్ని పోలిన ఆమె శరీరచ్ఛాయ, ముఖంలో తాండవించే కళాకాంతులు చూస్తే, ఆమె మానవమాత్రురాలేనని సరిపెట్టుకోవటం కుదరదు. వయస్సుకు మించిన పెరుగుదల ఆమెలో గోచరిస్తుంది. 14 సంవత్సరాల వయస్సులోనే ఆమె పరిపూర్ణ స్ర్తిత్వాన్ని పొందిన దానివలె కనిపిస్తుంది. నిండు యవ్వనంలో, శరీరాంగాలన్నీ చెయ్యి తిరిగిన కళాకారుడు తీర్చిదిద్దినట్లు కన్పట్టుతవి. అందచందాలకూ, యవ్వన శోభకూ క్లియోపాత్రా మరొక పేరుగా ప్రసిద్ధికెక్కింది.
ఆమె బుల్లి బుర్ర భూగోళాన్ని ప్రదక్షిణం చేస్తూనే వుంది. ఆ ఆలోచనలకు అంతులేదు. ఒకనాడు రుూ ప్రపంచాన్నంతటినీ తన ముందు మోకరిల్ల చేయాలని ఆమె నిశ్చయించుకుంది. ఐతే తనకా అవకాశాలు ఎక్కడ, ఎప్పుడు ఏ విధంగా ఎదురవగలవో ఆమె ఊహలకందటంలేదు. ప్రపంచం సంగతి ఎలా వున్నా, ముందు రుూ ఈజిప్టుకు రాణి అవగలిగితే, ఆ తరువాతి కార్యక్రమం లీలగా ఆమె మనసులో మెదలగలదు. అందుకని సమయం కోసం ఓపిగ్గా వేచి ఉండటం తప్ప గత్యంతరంలేదు.
సూర్యకిరణాలు పట్టుతెరలను చీల్చుకుని వొస్తూన్నప్పటికీ క్లియోపాత్రా మంచం దిగలేదు. ఆమె ఊహా ప్రపంచంలో విశ్వ విహారం చేస్తోంది. రాత్రి చాలాసేపటివరకూ మేల్కొని ఉండటంవల్ల ఇంకా నిద్రపోతుందని ఆయా భావించింది. యువరాణికి నిద్రాభంగం కాకుండా వేచి ఉన్నది.
కాని, బారెడు పొద్దెక్కినా క్లియోపాత్రా కన్నులు తెరవలేదు. కళ్ళు తెరిస్తే రుూ పాడు ప్రపంచాన్ని ఎదుర్కోవాల్సి వుంటుంది. తన తియ్యని తలపులు మరి ఉండవు. కనుకనే ఆమె ఇంకా నిద్ర నటిస్తోంది.ఆయాకు ఆతృత హెచ్చింది. రాత్రి పీడకలలతో భయపడిన రుూ పిల్ల ఇంకా భయపడుతూనే వున్నదేమోననే అనుమానం కలిగింది. లేక జ్వరమేమన్నా వచ్చిందేమో? రాత్రి ఆచార్యుని పిలిపించమన్నది. మరి ఇప్పుడా ఆతృతంతా ఏమైంది? తాను గుర్తుంచుకుని ఉదయమే గురువుగారి కోసం కబురు చేసింది. రుూపాటికి ఆయన వొస్తుండి ఉంటారు కూడాను. అసలు రుూ రోజంతా వినోదాలతో గడిపి, క్లియోపాత్రా మనస్సును ఆనందపరిచి, పీడకల తాలూకు భయాన్ని మరిపింపజేసేందుకు ఆయా ఏర్పాట్లు చేయించింది.
ఇక ఆగలేక మెల్లిగా చేతితో తట్టి యువరాణిని లేపింది.
‘‘అమ్మా! తెల్లవారి చాలాసేపైంది. గురువుగారు కూడా వచ్చే వేళైంది. నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని, కాస్త ఫలాహారం తీసుకుంటే ఆ బడలిక తగ్గుతుంది. లే తల్లీ!’’ అన్నది ఆయా. ఆచార్యులు వస్తున్నారని వినగానే క్లియోపాత్రాకు ఎంతో ధైర్యం వచ్చింది. ఆయన సహాయంతో తాను జీవిత సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోగలననే నమ్మకం ఉన్నదామెకు. ఆయన వచ్చేటప్పటికి తానింకా నిద్రపోతుండటం సిగ్గుపడవలసిన విషయం! ఈ ఆయా ఎంత మంచిది! రాత్రి చెప్పిన మాటను జ్ఞాపకం ఉంచుకొని తెల్లవారగనే గురువుగార్ని పిలవనంపింది.

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు