డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వేచ్ఛ! తనకు స్వేచ్ఛ కావాలి! బైట సువిశాలమైన ప్రపంచం వున్నది. అక్కడ రుూ రాజభోగాలు లేకపోగాక! మనసులోని కోర్కెలన్నీ తీరకుండుగాక! కనుసన్నలకు వేచి ఉండే బానిసలు లేకపోగాక! కాని, స్వేచ్ఛ ఉంది! ప్రపంచంలోకి వచ్చిన ప్రతి జీవి ఆశించి, పోరాడి గెలుచుకోదగిన స్వేచ్ఛ! దాన్ని సాధించాలి తను! సాధించలేనట్లయితే తన జన్మ వృథా!
ఈ బానిసలందరూ, తాను స్వతంత్రురాలేనని అనుకుంటారు. కాని వీరు తనకు బానిసలైతే, తాను తన అక్కకూ, ఈ సామ్రాజ్యమంతా రోమనులకూ బానిసలు! చివరకు రుూ బానిసలకున్న పాటి స్వాతంత్య్రం కూడా తనకు లేదు.
తాను కేవలం మానవ మాత్రురాలు! ఐతే తన నింత గొప్పగా, అమానుష శక్తులున్నద
నివలె చూస్తారెందుకు? టాలమీ రాజవంశీకులందరూ దివ్యశక్తులున్న దేవతలేననే నమ్మకం ప్రజల్లో వుంది. నిన్నటిదాకా తాను కూడా దైవాంశ సంభూతురాలననే పిచ్చి నమ్మకంలో వుంది. కాని నిన్న సాయంత్రం ఆ నిషా దిగిపోయింది.
దేశ స్వాతంత్య్రాన్ని రోమన్‌లకు అమ్మిన పరమ కిరాతకుడు తన తండ్రి! ఐతే తన రుూ దుస్థితి నుంచి తనను విముక్తురాలిని చేయగలవాడు కూడా తన తండ్రే! అందుకని లోలోన తండ్రిని తాను ఎంత అసహ్యించుకున్నా, కనీసం తాను హత్యగావించబడకుండా ఉండేందుకైనా ఆయన రోమ్ నుంచి తిరిగి వస్తే బాగుండుననిపించింది!
గదికి చుట్టూ కిటికీలున్నవి. కిటికీలకు పట్టుతెరలు వేళ్లాడుతున్నవి. చల్లని గాలికి తెరలు రెపరెపమని కొట్టుకుంటున్నవి. ఆ శబ్దం కూడా ఆ అమ్మాయిని భయపెట్టింది.
చప్పున కిటికీ దగ్గరికి వెళ్లి తెర తొలగించి చూసింది. కింద దివిటీల వెలుగులో సాయుధులైన యోధులు రాజప్రాసాదానికి కాపలా కాస్తున్నారు. కోటకు బైట అశ్విక దళాలు తిరుగుతున్నవి. ఈ కోటకు బైటినుంచి అపాయం రాకపోవచ్చు. కాని, వంశీకుల ద్వారా లోలోన జరిగే అపాయలనుంచి తనను తాను కాపాడుకోవటం ఎలా?
తన గది నుంచి చూస్త్తే దాదాపు అలెగ్జాండ్రియా పట్టణమంతా కనిపిస్తుంది. అలెగ్జాండ్రియా ఎంత అందమైన పట్టణం! ఎంత తెలివిగా, కళాహృదయంతో కట్టబడింది! అలెగ్జాండర్ లాంటి విజేత తలుచుకుంటేనే కాని, ఇలాంటి పట్టణాలు తయారై ఉండేవి కావు.
గ్రీస్! ప్రపంచంలోని విజ్ఞానం, వేదాంతం, సాహిత్యమంతా గ్రీకుల సొత్తు. రోమన్‌లు పశువులల్లే, ప్రాణాలను లెక్క చేయక పోరాడేందుకు తప్ప మరెందుకూ పనికిరారు. ఇలాంటి రోమనులను శారీరక బలంతో తాను ఎన్నటికీ జయించలేదు. బుద్ధిబలానికి వారు లొంగుతారు!
మరొక కిటికీ దగ్గరికి వెళ్లి తెర తొలగించి చూసింది. పున్నమచంద్రుడు పుచ్చపువ్వులాంటి వెనె్నలను కనుచూపు ఆనినంతవరకూ వెదజల్లుతున్నాడు. దూరాన ఓడరేవులోంచి సరుకులతో నిండిన ఓడ బరువుగా సాగిపోతోంది. చాలామంది బానిసలు మరొక ఓడలోకి సరుకులు ఎక్కిస్తున్నారు.
రేవులోకి వచ్చిన రోమన్‌లు నౌకలు ఖాళీగా రావటం, సరుకుల్తో కదిలిపోవటం అనేక సంవత్సరాలుగా తాను గమనిస్తూనే వుంది. ఈజిప్టులో పండిన పంటలో సగానికి పైగా రోమ్ జేరుతూ ఉంటుంది. సుగంధద్రవ్యాలూ, బంగారం, రత్నవైఢూర్యాలూ, పట్టు, పత్తి ఒకటేమిటి- ఈజిప్టు ఐశ్వర్యమంతా రోమ్‌కు కైంకర్యమైపోతూనే వుంది. చిత్రం- ఈ సరుకులకు రోమనులు ఏమీ ఇవ్వరు సరికదా- ఖజానాలో నుంచి బంగారు కడ్డీలు కూడా రోమ్‌కు పంపబడుతూండేవి. రోమన్‌ల ఒత్తిడి దేశం మీద తగిలినపుడల్లా, నీళ్ళు తాగినవాడు నీళ్ళు కక్కినట్లు దేశంలోంచి విలువగల వస్తువులన్నీ వెళ్ళక్క్రబడుతూన్నవి.
ఒకపక్క రోమన్‌లను అసహ్యించుకుంటూన్నప్పటికీ, తాను రాణి అయ్యేందుకు రోమన్‌లు సహాయపడతారనే సంగతి తనకు తెలుసు. వారి సహాయాన్ని పొందేందుకు తనకేం అభ్యంతరం లేదు. ఐతే తనకు తన దేశంమీద కూడా భక్తి లేదు.
నిజానికి తాను ఈజిప్షియను కాదేమోననిపిస్తుంది. తన తెలివితేటల్ని చూసి గ్రీకుల విజ్ఞానమంతా తనలో వున్నదని అంటారు. ఆ విధంగా గ్రీక్ అయి ఉండొచ్చు. అంతకన్నా తన మనస్సంతా రోమ్ పరిసరాల్లోనూ, ఇటలీ ఐశ్వర్యంమీదా తారట్లాడుతూ ఉంటుంది. కనుక, తాను రోమన్‌నేమో? తన శరీచ్ఛాయను బట్టి పశ్చిమ దేశాలకు సంబంధించినదని చాలామంది అభిప్రాయం కావచ్చునేమో?
చిత్రం- తన దేశాన్ని గూర్చి తనకే సరిగ్గా తెలియదు. నైల్ నదీ తీరంలో ఏయే పట్టణాలున్నవో తనెప్పుడూ చూడలేదు. తన ప్రజలు ఎలా బతుకుతున్నారో, ఫలవంతమైన భాగం ఎటున్నదో తనకు తెలియదు. ఈజిప్టు మట్టిమీద తనకు మమత లేదు. తాను మరో దేశానికి సంబంధించిన వ్యక్తి. ఏ శాపకారణంగానో, తానీ దేశంలో బందీ ఐంది. ఆ విదేశంనుంచి తనకు విముక్తి ఎప్పుడో కదా!
ఆలోచనలతో ఆమె బుర్ర తెకతెకలాడిపోతుంది. బైటి వాతావరణాన్ని బట్టి రాత్రి చాలా భాగం గడిచి ఉంటుంది. ఇక నిద్రాదేవికీ, తనకూ విరోధం తప్పదు. ఈ కష్టసమయంలో తనను ఊరడించేవారూ, హృదయపూర్వకంగా సానుభూతి చూపేవారూ కావాలి. తాను స్ర్తి జన్మ ఎత్తింది. మీదుమిక్కిలి అనాథ. పేరుకు యువరాణి మాత్రమే!
ఆచార్యుణ్ణి ఇప్పటికిప్పుడే పిలిపించాలని నిర్ణయించుకుంది. ఐతే తన సేవకులందర్నీ నమ్మేందుకు లేదు. చిన్నతనంనుంచీ తనకు తల్లిలేని లోటుని తీర్చి, పెంచి పెద్దచేసిన ఆయాను మాత్రమే నమ్మాలి. ఆయాకు తన మీద యువరాణనే గౌరవంకన్నా, పెంచిన ప్రేమే ఎక్కువ!
ఈ ఊహ రాగానే, ఆమె గదిలో ఒక మూలగా నిద్రిస్తూన్న ఆయా దగ్గరికి వెళ్లి మెల్లిగా చేతితో తట్టిలేపింది. ఆ ముసలిది గాబరాగా లేచి ‘ఏమైంది తల్లీ?’ అన్నది.
తనలో కలిగిన ఉద్రేకాలన్నిటినీ తొక్కిపట్టుకుంటూ ‘‘ఏం లేదు- ఆయా! నీవు ఇప్పుడే వెళ్లి ఆచార్యుణ్ణి పిలచుకొని రావాలి’’ అన్నది.
‘ఇప్పుడా? ఈ అర్థరాత్రా?’’ అన్నది ఆయా ఆశ్చర్యపడుతూ. ‘‘అయినా ఇప్పుడు దేనికి?’’
‘‘పని ఉంది.. చాలా అవసరం.. మాట్లాడాలి!’’ అన్నది యువరాణి తడబడుతూ.
ఆయాకు నిద్రమత్తు వదలింది. యువరాణి తల నిమురుతూ ‘‘నాకు చెప్పమ్మా! ఏమైంది? ఇపుడు బైటికి వెళ్ళటం ఎంత ప్రమాదమో నీకు తెలియదు. ఆయుధాల్ని ధరించి గస్తీ తిరుగుతూన్న యోధులు చీమను కూడా అటూ ఇటూ కదలనివ్వరు.

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు