డైలీ సీరియల్

శైవశాస్త్ర విజ్ఞానగని శ్రీకాళహస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాని వెంట తూర్పున ఉన్న మేరుపర్వతం దక్షిణ దిక్కుకే వచ్చింది. దాని వెంట ఉత్తరదిశయు మరియు ఉదయించుచున్న సూర్యచంద్రులు సహితం దక్షిణదిశకే వచ్చారు. ఈ చిత్రాన్ని చూచి లోకమంతా కాలమిట్లేల మారెనో అని నివ్వెరపోయింది. ఆ పార్వతీ పరమేశ్వరులకు తూర్పు దిక్కున విహారభూమియైన ఆ కైలాసపర్వతం దేవతలు సంతోషంతో సేవించు స్థలమై దక్షిణకైలాసంగా ప్రఖ్యాతి వహించింది. దానికి ఉత్తరంగా మేరుపర్వతం భైరవ- దుర్గ-నాగాది దేవతా పరిరక్షితమై విరాజిల్లుతూ ఉంది. అంతేకాదు తపమాచరించడానికి వచ్చిన అనేక యోగిజనుల సంచారసమ్మర్దం చేత తపోభూమియై వర్ధిల్లుతూ ఉంది.
శివపార్వతుల గజారణ్య విహారం
అణిమ- మహిమ- గరిమ- లఘిమ- ప్రాప్తి- ప్రాకామ్యం- ఈశ్వత్వం-వశిత్వమనే అష్టసిద్ధుల్ని అనుగ్రహిస్తూ మోక్షదాయకభూమిగా పురాణ ప్రసిద్ధమైన ఆ కైలాసగిరి అంటే పార్వతీరమణుడికి వల్లమాలిన ప్రేమ. అందుకే ఆయన హిమగిరితనయ తన చెవులలో ధరించే నల్లకలువలచేత విసరగా తన చెక్కిళ్ళపై గల స్వేదాన్ని (చెమటను) పోగొట్టు కొంటున్నవాడై ఆ గిరిపై నిత్యం సంచరిస్తూ ఉంటాడు పరమశివుడు.
అట్టి గజారణ్యంలో నీలకంఠుడు గిరజాసమేతుడై ఆమ్ర(మామిడి) వనాలనీడలలో విహరిస్తూ కొండగుహల నుండి ప్రవహించే సెలయేళ్ల జలాలలో వేసవి తాపంనుండి సేదతీరుతాడు. ఒక్కొక్కసారి విశేషమైన శబర వేషంలో వేటాడాలని మహా కుతూహలంతో సంచరిస్తూ ఉంటాడు. మరికొన్ని మార్లు రతిక్రీడచే అలసి పోవుట చేత కల్గిన శ్రమను నివారించుకోవడానికి గజవనంలో విరబూసిన వెనె్నలలో విహరించేందుకు ఉత్సాహాన్ని చూపుతూ ఉంటాడు. ఈ విధంగా తనకు ఆనందదాయకమైన మంధరా చల - హిమాచల - కైలాసాచల - మయూరాచల (నెమలి)వనాల విహార మహావైభవాన్ని మరచిపోయి హరుడు సకలదేవతలతో ఆ దక్షిణకైలాసపర్వతంపైన ఆనందవిహారం చేస్తూ ఉంటాడు.
ఆ సమయంలో పార్వతీ దేవి చరణపద్మాలు కఠిన శిలలరాపిడికి ఎక్కడ కందిపోతాయో అని శివుడు ఆమె పాదాలు కసుకందకుండా చిగురుటాకుల్ని దేవతాస్ర్తిలచే నేలపై పరపింప చేస్తూ ఉంటాడు. అది ఆయనకెంత సరదాయో.
లతాంగియైన పార్వతీదేవి పూమేనితో పూలతీగలు, స్తనాలతో పూలగుత్తులు, చూపులతో లేడి చూపులు, కరతలాలతో పల్లవాలు, సన్ననినడుంతో సింహపు నడుములు, కేశపాశంతో తుమ్మెదలు, అధరంతో (క్రిందిపెదవి) దొండపండ్లు, దంతాలతో దానిమ్మగింజలు, సౌందర్య విలాసంలో తుల తూగగలవా? లేదా? అనే శంకతో పరిశీలిస్తున్నాడా అన్నట్టుగా ఆ నటరాజు కైలాస పర్వత శిఖరాలపై గల పుష్పలతా దులను పరిశీలిస్తూ నిత్య సంచారం చేస్తూ ఉంటాడు.
ఆ రీతిగా పరమశివుడు మంచుకొండల రాయని కుమార్తెతో కూడి దక్షిణ కైలాసాచలం పైన తనను కనుగొన్నవారికి అన్ని దిశల తానై యుంటూ అచట గల పుణ్యాశ్రమాలలో ఒక గృహస్థ మునిగా మెలగుతూ ఉన్నాడు. అరణ్యమధ్యంలో ఉండే బోయపల్లెల్లో అందరితో బాటు బోయ గృహస్థుని వలె ఉండేవాడు. మానసిక ధ్యాన తత్పరులైన సిద్ధయోగీంద్రులుండే చోట్ల సిద్ధయోగీంద్రుని వలె సంచరించే వాడు. కొన్ని సార్లు కర్ణాలకు - కంఠానికి - హస్తాలకు - పాదాలకు అలంకరించుకొంటూ మహా భోగభాగ్యాల మీద ఆసక్తి గల గృహస్థుడి వలె విలాసంగా ఉండేవాడు. శివగణాలకు నివాసభూమియైన ఆ దక్షిణకైలాసానికి నాలుగు దిక్కుల ఆమడదూరం వరకు ఉండే భూమి చాల పవిత్రమైనది. మహిమాన్వితమైనది. ఎందుకంటే అక్కడ యముడి కాహారమై నశించే శరీరంగల ప్రాణులన్నీ మరణసమయంలో చేసే దీర్ఘనిశ్వాసం కేవలం హంస మంత్రజపమే. (యోగులు తమ ఉచ్ఛ్వాస-నిశ్వాసాలుగా ప్రతి దినం 21600 సార్లు జపించే మంత్రం. దీనినే అజపా మంత్రమని కూడ అంటారు). ఆ సమయంలో కన్నులు మూయడం యోగనిద్రాతుల్యమే. మరణ సమయంలో కలిగే మూర్ఛ (స్పృహకోల్పోవడం) భగవద్దర్శన పరవశత్వమే. అట్లే మరణించడం సాక్షాత్తు మోక్షం పొందడమే అవుతుంది.
ఆ దక్షిణ కైలాసంలో నివసించే వారెవ్వరూ శివుని వలె జడలు ధరించరు. శరీరం మీద విభూతి పూయరు. భిక్షాటన చేయరు. లేడి చర్మాన్ని కట్టరు. అడవులలో సంచరించరు. అయినా ఆ దక్షిణకైలాస మహిమ యేమోగాని ఆవిధంగా ఉంటూ కూడ అచట నివసించే జీవులందరూ కూడ శివైక్యాన్ని పొందుతూ ఉంటారు. (శివసాయుజ్యాన్ని పొందేవారు ముందుగా శివసారూప్యాన్ని అంటే శివునితో సమానమైన స్వరూపాన్ని పొందుతారు. ఆ విధంగా శివసారూప్యాన్ని పొందకనే అచటి వారు శివసాయుజ్యాన్ని పొందుతూ ఉన్నారని భావం. అందుకే అచట మహిమ ఎట్టిదో అని కవి ఆశ్చర్యాన్ని ప్రకటించాడు).అంతేకాదు అచట గల సెలయేళ్ళకు రెండు వైపులా ఉండే గట్లపై విస్తరించియున్న పాటలి మరియు అశోకవనాలలోని నవమల్లిక - విరజాజి - పొగడ - పున్నాగ - మామిడి - నాగకేసర- లొద్దుగ - కడిమి మొదలైన పుష్పసువాసనా భరితమైన వాయువులు ఆ దక్షిణకైలాసంలో నివసించే వారికి సంసారమనే కార్చిచ్చు వలన కలిగే తాపాన్ని హరిస్తూ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి.
విశేషమేమంటే అఖండానందాయకమైన శైవశాస్త్రాల విజ్ఞానమంతా అచట నివసించే దేవతలకు - మనుష్యులకు - రాక్షసులకు - సర్పరాజులకు తనంతతానుగా ప్రకాశితమైనది.

- ఇంకావుంది...

చరవాణి: 9490620512