డైలీ సీరియల్

దూతికా విజయం-104

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను కావాలనే ఆమెతో మీ సమాగమాన్ని ఆటంకపరచి, ద్రోహచింతో ప్రవర్తిస్తున్నానని ఆమె తలపోస్తోంది’’’
‘‘ఏమిటీ, ద్రోహమా!’’ అన్నాడు వీరభద్రుడు. ‘‘సరూ! మనం ఎవరికీ ద్రోహం చేయటంలేదు. మనకు మనమూ ద్రోహం చేసుకోవటం లేదు. రాణికి నీవు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చకపోవటం నీ తప్పు, అసమర్థతా కదా. పరిస్థితులు కలసిరాలేదు, అంతే! అవి నీ చెప్పుచేతల్లో లేవు కదా! రాణి కోర్కె నెరవేరకపోవటంవల్ల కలిగిన మేళ్ళు ఆలోచించు. నీవు తనకు ద్రోహం చేశావని రాణి అనుకున్నప్పటికీ, రాజద్రోహ నేరం చేయలేదని ఆమెకు తెలుసు. నీ అంతరాత్మ పరిశుద్ధంగా ఉంటుంది. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం పత్నిగా, పతివ్రతగా ఉండవలసిన రాణి పతనానికి నీవు కారకురాలివి కావటం లేదు. అవినీతి విస్తరింపజేసేందుకు నీవు ఇంధనానివి అవలేదు. సమాజం అంగీకరించిన నీతిని మనిద్దరమూ అతిక్రమించనూ లేదు. మనం దంపతులం. నీకు మనస్ఫూర్తిగా ఇష్టం లేని పని కూడా నన్ను చేయమన్నావు. నేను రాణి కోర్కె తీరిస్తే నీవు లోలోపలే కుళ్ళిపోతావు! దాన్ని భరించేందుకూ సిద్ధపడ్డావు. ఇక నేను - పరదారా సంగమం- అందునా రాజద్రోహమనే మహా కూపంలో పడకుండానూ, ధర్మపత్ని పట్ల అవిశ్వాసనీయంగా ప్రవర్తించి పతనమైపోకుండానూ నన్ను నేను కాపాడుకుంటున్నాను.. అన్నిటినీ మించి రుూ సుడిగుండంలో పడకుండా ప్రాణరక్షణ చేసుకుంటున్నాను. ఇన్ని దారుణాలు సంభవించకుండా చేయగల రుూ నిరాకరణ అనుసరణీయం కాదా? సరూ! నిర్దొషులనూ, అమాయకులనూ ఆ విధే కాపాడుతుందంటారు. మనం ఎట్టి నేరాలు చేయని వ్యక్తులం. ఆ దైవంమీద భారం వేసి చూద్దాం!’’
సరస్వతి అంతా ఆకళింపు చేసుకుంటూ వౌనం వహించింది.
వీరభద్రుడు చెప్పింది ధర్మ సమ్మతమే మరి! ఈ వ్యవహారం సక్రమంగా సాగితే రాణి ఒక్కతే ఈ గండాన్ని గడుపుకుంటుంది. దానికి మరి ముగ్గురు ప్రాణాలను సైతం బలిచేయటాన్ని గూర్చి ఆమె విచారించదు. ఇది సాగకుంటే బాధపడేది ఒక్క రాణి మాత్రమే!
స్వాప్నవికానుభూతి ఈ మధురానుభూతి కారణంగా చాలావరకు మరుగున పడిపోయినా, అది జరగని అసంభవం కాదని ఎలా నమ్మటం? కలలో విధంగానే ద్వారపాలుడు కూడా తనను కోరితే ఏమి దారి? తన బతుకు రోలొచ్చి, మద్దెలతో మొరపెట్టుకున్న సామెతగా తయారౌతుంది!
అదీగాక తనకిప్పుడు భర్త ఉండగా మరోవాక్కాయ కర్మలా పాతివ్రత్య వ్రతాన్ని అనుసరిస్తూండగా, వేరొక పురుషుడ్ని గూర్చి మనసులో తలచటం కూడా అపచారమే! ఎంత దారుణ ప్రమాదం ఎదురైనా ప్రాణాలన్నా వదులుతుంది కాని, మానాపహరణాన్ని అంగీకరిస్తుందా?
రాణికి వీరభద్రుని తోడి సంయోగం సంభవం కాకుండటం, అతను తనవాడే అయ దంపతులుగా సుఖపడం కుదిరితే, ఈ జన్మకు తన కోరికలన్నీ తీరినట్లే! విధి కరుణించి ఈ ఒక్క అద్భుతాన్నీ తనకు వరంగా ప్రసాదించరాదా?
‘‘సరూ! ఈ వారంలోగా దైవానుగ్రహం వల్ల మనం బైటపడగలమని నాకు నమ్మకం!’’
‘‘ఎట్లా!’’ అన్నదామె కొండంత ఆశ కళ్ళముందు ఆడి.
‘‘రేపు చెపుతాను!’’
మూడో రోజు ఉదయం స్నానాల గదిలో సరస్వతి జాలిగా, దీనంగా చేతులు కట్టుకొని వినయంగా రాణి ఎదుట నిలబడింది.
‘‘ఏమంటాడు? ఇంకా మొండితనం వదలడా?’’ అన్నది రాణి నిప్పులు చెరిగే చూపులతో.
‘‘రాణీ! ఆయన మాట అటుంచండి.. ముందు నేను గొప్ప ప్రమాదంలో పడ్డాను!’’
‘‘ఇందులో నీ అపజయాన్ని ఒప్పుకోదలచావన్నమాట! అందులోనూ మూడు మాసాల వ్యవధి ఇస్తే, తగుదునని ప్రతీరాత్రి ప్రియునితో కులుకుతూ, నాతో మాయలాడిగా ప్రవర్తించి ఇప్పుడు చేతకాలేదని చేతులు దులుపుకునేందుకే సిద్ధపడ్డావా?’’
‘‘జయమో అపయజమో మీరే నిర్ణయించొచ్చు. నేను చెప్పేది ప్రశాంతంగా వినమని వేడుకోలు!’’
‘‘చెప్పు’’ అన్నది రాణి తీవ్రంగా.
‘‘రాణీ! ఈ వ్యవహారాన్ని మొదటినుంచీ నేను ప్రతిఘటిస్తూనే వచ్చాను. మీరే మొండిగా నన్ను ప్రోత్సహించి ప్రయోగించారు. మీ మాట కాదనలేక నేను ఈ గోతిలోకి దిగాను’’
‘‘దిగినందుకు నా వ్యయంతో హాయిగా మూడు నెలలు అమరానుభూతుల్ని అనుభవించావు కదా! నీకొచ్చిన నష్టమేమున్నదిలే!’’
‘‘నాకు వొద్దో మొర్రో అంటే నా నెత్తిన పడినదానికి నేనేం బాధ్యురాలిని రాణీ! ప్రతీది తమ ఆజ్ఞ ప్రకారమే జరిపాను. కాని దైవం అనుకూలించలేదు!’’
‘‘ఇప్పుడు ఈ నిందంతా దైవంమీదికి తోసేందుక్కూడా సిద్ధపడ్డావన్నమాట.. ఎంత టక్కులాడివి!’’
‘‘రాణీ! దైవికంగా జరింగిందేదో తెలియక, మీరు నన్ను దూషిస్తున్నారు..!’’ అన్నది సరస్వతి వినయ విధేయతలతో.
‘‘ఏముందీ.. నీ ప్రియుడు కోటలోకి వచ్చేందుకు నిరాకరించాడు. అంతేనా?’’
‘‘నా ప్రియుడు అనకండి.. అతని విషయం అలా ఉంచండి.. రాణీ! ఈ మా మాయాదైవం ఎవరి కోర్కెల్ని తీర్చాడు? ఎవరికైతే ఏది అక్కర్లేదో దానే్న ప్రసాదిస్తాడు; ఏం కావాలని కాళ్ళా వేళ్ళా పడతామో దానే్న నిరాకరిస్తాడు’’
‘‘నాకు కావలసిన వీరభద్రుడు నాకు చిక్కనందుకూ, అక్కర్లేని నీకు చిక్కినందుకూ దైవానుగ్రహ విధానాన్ని విశదపరచి నన్ను ఊరడించాలని చూస్తున్నావా?’’ అన్నది రాణి కస్సుబుస్సుమంటూ.
‘‘రాణీ! మీ ఓర్పు నశించటంవల్ల అలా అంటున్నారు. నా ఉద్దేశ్యం అది కాదు.. నేను కూడా సంతాన గోపాలుడ్ని సేవించానా?.. మీకు ప్రసాదించవలసిన గర్భాన్ని ఆదైవం నాకు ప్రసాదించాడు!’’ అని సరస్వతి తలవొంచుకున్నది.
రాణి నిర్విణ్ణురాలైంది. కొద్ది క్షణాలపాటు ఆమెనోట మాట రాలేదు; గొంతు తడి ఆరినట్లనిపించింది.
‘‘నిజమా సరూ!’’ అని అనగలిగింది రాణి ఎలాగో.
ఆమె కంఠస్వరంలోని కోపాగ్ని చాలావరకు అణిగిపోయింది.
సరస్వతి వొంచిన తలనే ఔనన్నట్లు ఆడించింది.
‘‘ఎవరికన్నా చూపావా?’’ అన్నది రాణి.
‘‘ఎలా చూపేది? ఏమని చెప్పేది? దొంగకు తేలుకుట్టినట్లయి మిన్నకున్నాను!’’
‘‘ఎన్నాళ్లయింది నెల తప్పి? ఎలా గ్రహించావు?’’
‘‘ఒక నెల కాదు రాణీ! రెండు నెలలు తప్పినవి. మొదట్లో అదేం కాదులెమ్మని ఊరుకున్నాను. అందుకనే తమకూ విన్నవించుకోలేదు. నీరసంగా ఉండటం, కక్కు వస్తున్నట్లుండటం, వేవిళ్ళు, వికారం, నలతగా ఉండటం, మన్ను తినాలనే పిచ్చి కోర్కె కలగటం.. ఇవన్నీ నిర్థారణగా తేలిన లక్షణాలు రాణీ! ఏం చేయాలో పాలుపోవటంలేదు! రాజవైద్యునికి చూపితే అతను నిర్థారణ చేస్తే నా రహస్యం బట్టబయలవదా? తమ అనుమతి లేకుండా నేనెలా పరీక్ష చేయించుకుంటాను? మొత్తం రాణివాసానికి చెడు పేరు వచ్చి, ఎవరెవరికి ఎంతెంత శిక్షలు పడతవో తెలియని తికమకలో పడ్డాను. నా వ్యక్తిగత సమస్యలో రాణివాసమంతా ఇరుక్కోవటం నాకు ఇష్టంలేక మనసులోనే కుమిలిపోతూ, ఇక భరించలేక తమకు విన్నవిస్తున్నాను!’’ అన్నది సరస్వతి.
‘‘ఇప్పుడేం చేయాలీ?’’ అని గొణిగింది రాణి; ఆమె స్వరంలోని కాఠిన్యమూ, తీవ్రతా పూర్తిగా తగ్గిపోయినవి. ప్రమాదంలో పడినప్పుడు ధ్వనించే దైన్యతతో నిండి ఉన్నదామె గొంతు.
ఈ మార్పును సరస్వతి గ్రహించింది.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు