డైలీ సీరియల్

దూతికా విజయం-103

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరభద్రుడన్న మూడు నిద్రలు, ముప్ఫై నిద్రలైనవి. ముప్పై, అరవై అయినవి. అరవై తొంభై అయినవి.
‘‘ఇంకో పది నిద్రలతో శోభన శతదినోత్సవం పూర్తవుతుంది!’’ అన్నాడు వీరభద్రుడు.
‘‘నా బతుకు దినదిన గండంగా ఉన్నది. రాణికి నచ్చచెప్పటం నావల్ల అయ్యేట్లు లేదు.. మీరొకసారి వచ్చి..’’
‘‘నేను రాను.. చిక్కినంతవరకే దక్కుదల అనుకోగలను!’’
‘‘మీ స్వార్థమే చూసుకుంటున్నారు. రాణి సహనాన్ని కోల్పోయింది. ఇక ఏం చెప్పినా నమ్మేట్లు లేదు!’’
‘‘ఆమెకా నమ్మకం చెడనందుకు గుర్తేమిటంటే- నీవు ఇక్కడికి రాకుండటమే!’’
‘‘అదీ రేపో, ఎల్లుండో జరిగి తీరుతుందనే భయం నాకున్నది. ప్రతి రాత్రీ మన్మథ క్రీడల మీదనే ధ్యాస ఉంచామే కాని, ఈ క్లిష్ట పరిస్థితిని నుంచి బైటపడే మార్గాన్ని కనుక్కోలేకపోయాం కదా!’’
‘‘నేనూ ప్రతిరోజూ తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాను ప్రియా! ఏదైనా ఆ సమయమొస్తేనే కానీ తట్టదు!’’
‘‘ఆ సమయం విరుచుకొని మీద పడింది. ఇంకా ఎక్కడో దూరాన వున్నదని మీరు భ్రమపడుతున్నారు. ప్రతి ఉదయమూ రాణికి నచ్చచెప్పేప్పటికి నా తల ప్రాణం తోకకు వస్తోంది!’’
‘‘నీ పని బాగానే ఉన్నది. ప్రతి రాత్రి, ఇక్కడేమో తోకలోని ప్రాణం తలకు ఎక్కటం, అక్కడ తలలో ప్రాణం తోకకు రావటమూను!’’
‘‘మీకెప్పుడూ వేళాకోళాలే! రాజరికంతో పని నిప్పుతో చెలగాటం! మీకేం నా అవస్థ నేను పడి ఈ గదిలోకి వస్తే హాయిగా అనుభవిస్తారు!’’ అని సరస్వతి మూతి మడుచుకున్నది.
‘‘సరూ! ప్రతి రాత్రి నీవు ఇక్కడికి ఎందుకు వస్తున్నావో తెలుసా?’’
‘‘రాణి ఆజ్ఞను పాటించి వస్తున్నాను!’’
వీరభద్రుడు పెద్దగా నవ్వి అన్నాడు: ‘‘ఇంకా నయం! నన్ను సుఖపెట్టేందుకు వస్తున్నాననలేదు. నిజమేమిటంటే నీవిక్కడ పొందే సౌఖ్యం కోసమే వస్తున్నావు. నీవు తలచిన, లేదా కోరిన సుఖం లభ్యవౌతున్నంతకాలం, నీవిక్కడికి రావటాన్ని ఎవ్వరూ ఆపలేరు. కనీసం ఇంతకన్న గొప్ప సౌఖ్యం లభ్యమయ్యేవరకన్నా ఇక్కడికి రావటాన్ని నీవు మానలేవు. ఏనాడు నీకిక్కడ అసంతృప్తి కలుగుతుందో ఆనాడు రాణి ఆజ్ఞాపించినప్పటికీ, ఏదో కుంటి, గుడ్డి సాకు చెప్పి తప్పించుకుంటావు. నీ సుఖమే నిన్నిక్కడికి లాక్కొచ్చే అద్భుతమైన శక్తి..’’
‘‘మీరు ఆ ఉద్దేశ్యంతోనే నన్ను ఆహ్వానిస్తున్నారా?’’
‘‘ఔను. నీవు నా నుంచి ఎంత సౌఖ్యాన్ని పొందగలుగుతున్నావో నాకు తెలియదు; తెలుసుకోవాలనీ లేదు. నేనెంత సుఖపడుతున్నాననేదే నా గొడవ. నీవు బాధపడుతూ నాకీ సౌఖ్యాన్ని అందించినా నేను గమనించను!’’
‘‘మీరెంత దారుణంగా మాట్లాడుతున్నారు!’’
‘‘నేను మాట్లాడేది కాచి వడగట్టిన సత్యం. నిజమెప్పుడు ఎంతో చేదుగా ఉంటుంది సరూ! ఒకర్నొకరు ఉద్ధరించటం మాట దేవుడెరుగు. ఎవరి ఉద్ధరణకు వారు నానాపాట్లూ పడుతూనే ఉన్నారు!’’
‘‘నేను మీ కలయికకోసం తపించిపోతున్నానని మీకెలా తెలుసు?’’
‘‘నీ శరీరంలోని ప్రతి రక్తకణమూ నీ రహస్యాలను నాతో గుసగుసలుగా చెపుతూనే వున్నది. మానవుడు ఎన్నో కోర్కెలను హృదయపు లోతుల్లో దాచుకుంటాడు. కొన్నిటి తీవ్రతకు తట్టుకోలేడు. సమయమూ, భయమూ, సిగ్గూ మొదలైన కట్టడులన్నిటినీ అధిగమించి ఒక్కో సమయంలో అతి శక్తివంతంగా ఆ కోర్కె వెలికి ఉరుకుతూనే వుంటుంది. అనేక కోర్కెలను మానవుడు జయించిన విధంగానే, కొన్ని కోర్కెలు మానవుణ్ని జయిస్తాయి. అలా జయించినవి ప్రచ్ఛన్నంగా ఉండలేవు. వాటి నిజ స్వరూపాలు ప్రదర్శిస్తూంటే ఎదుటివారు గ్రహించలేరా?’’ అన్నాడు వీరభద్రుడు.
ఈ వీరభద్రుడు ఎంత తీవ్రంగా సరిగ్గా ఆలోచించాడో ననిపించిందామెకు. నిజమే! తనలోని అగాధాల్లో గాఢనిద్రలో మునిగి వున్న కోర్కెలను మేల్కొల్పాడితను. అవి పడగ విప్పిన నాగులై బసులు కొడుతూ, తననే మింగాలని చూసిన క్షణంలో వాటిని కనికట్టు కట్టి, నాగస్వరానికి బద్ధమయ్యేట్లు చేసి స్వాధీనంలో ఉంచుకొని వాటిని శాంతింపజేసిన సర్వసమర్థుడైన నాయకుడితను.
ఇప్పుడీ క్లిష్ట సమస్యను కూడా పరిష్కరించివలసిన బాధ్యత అతనిమీదనే వుంచటం ఉచితమనిపించిందామెకు.
‘‘ప్రతిరోజూ రాణి పంపే కానుకలతో తగినంత ఐశ్వర్యం కూడా సిద్ధించింది. ఇక ఇద్దరమూ రెక్కలు విప్పుకొని పలాయనం చిత్తగిద్దాం’’ అని సలహా ఇవ్వజూచాడు వీరభద్రుడు.
‘‘ఇదివరకే చెప్పాను. అది కుదరదని!’’
‘‘మరేం చేద్దాం?’’ అన్నాడు వీరభద్రుడు బుర్రగోక్కుంటూ.
‘‘మీకేం! మీ దగ్గర డబ్బు జేరిందిగా! మీరు వెంటనే మీ దేశం వెళ్లి, ఒక అందగత్తెను వివాహమాడి హాయిగా ఉండండి. ఇక్కడ రాణి చెప్పుకింది తేలువలె పడి ఉంటాను నేను!’’ సరస్వతి మెరిసిపోయే కళ్ళు నీళ్ళతో నిండినవి!
‘‘నా ఉద్దేశ్యం అది కాదు సరూ!’’
‘‘మీ ఉద్దేశ్యం ఏదైనా నాకెందుకులెండి. ఇదివరకే చెప్పారుగా! ఎవరి స్వార్థానికి వారు ప్రయత్నించటమే ఆదర్శమని! కానీండి.. నా గొడవ నేను పడతాను. ఏం లాభం? మీరేదో పరిష్కరిస్తారన్న నా ఆశలు అడియాసలు చేశారు’’ అన్నదామె గాద్గిదికంగా.
‘‘్ఛ!.. ఏమిటిది సరూ!.. నీవు లేకుండా నేను బతకలేను.. విచారించు..’’ అని వీరభద్రుడు ఆమె కన్నీరద్ది, ఓదార్చుతూ, ఆమె తలను తన హృదయంలో దాచుకున్నాడు.
‘‘రాణి ఎంత దారుణంగా దూషిస్తోందో మీకు తెలియదు. చూసి రమ్మంటే చేసి వచ్చాననీ, పిలుచుకొని రమ్మంటే పీల్చి పిప్పి చేసి వచ్చాననీ.. మోసకత్తెననీ.. టక్కులాడిననీ.. నానా మాటలు అంటోంది! నేనేమో మీ మీద మత్తు మందు చల్లానట! మిమ్ము తీసుకొని రాలేని అసమర్థురాలినవుతానని తాను ఎన్నడూ ఊహించలేదట! ఆ బహుమతులన్నీ నేనే స్వయంగా మీకు సమర్పించినవిధంగా మీరు భావిస్తున్నారనీ, అందుకనే తనను గమనించటంలేదనీ ఆమె నమ్మకమట! ఒక వారంలో ఇది తేలకపోతే ఏం చేయాలో అదే చేస్తానని.. హెచ్చరించింది! ఆమె బెదిరింపులు ఏ రూపాన అమలుజరుగుతవో ఊహించలేను!’’ అన్నది సరస్వతి వెక్కి వెక్కి ఏడుస్తూ.
చాలా ప్రమాదకరమైన పరిస్థితిలోకే వ్యవహారం దొర్లిందని వీరభద్రుడు గ్రహించాడు. అయితే బైటపడే విధానం అతనికీ పాలుపోవడంలేదు.
‘‘నిన్ను నడి సముద్రంలో వదిలేసేటంత నీచుణ్ణికాదు సరూ! ఇద్దరమూ ఒకే పడవలో పయనిస్తున్నాం. పడవకు చిల్లుపడి నీళ్ళు నిండి మునిగిపోకుండా ఉభయులమూ నిర్విరామంగా, కలిసికట్టుగా పనిచేయాలి. ఎవరి ప్రాణాలు వారికి తీపే మరి! తన ప్రాణం కాపాడుకుంటూనే పక్కనున్నవారి ప్రాణం కూడా రక్షించమనేది దానంతటదే జరుగుతుంది సరూ! ఒకళ్ళు సురక్షితంగా ఉండటం, మరొకరు మునగటం అనేది లేదులే!’’
‘‘మనం ఎంత బలహీనులమయ్యాం!’’ అన్నది సరస్వతి.
‘‘ఈ బలహీనతల్ని దూషించుకుంటాం కాని నీ పట్ల నాకు ఏర్పడిన బలహీనతా, నాపట్ల నీకు ఏర్పడిన బలహీనతా కలిసిన తావున, మనిద్దరి సంబంధం ఎంత పటిష్టంగా రూపొందిందో, బలపడి నిర్భేద్యమైనదో గ్రహించావా సరూ! అందుకనే మన ఈ బాంధవ్యం ఎన్ని అవాంతరాలైనా ఎదుర్కోగలదని నా విశ్వాసం!’’
‘‘రాణి నన్ను నమ్మే స్థితి దాటిపోయింది.

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు