డైలీ సీరియల్

దూతికా విజయం-91

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీరు కుట్టిందాన్ని మీరే చింపేసేట్లున్నారు- వదలండి’’ అని ఆమె గుంజుకోబోయి, ఆ పని చేస్తే మరికొన్ని కుట్లను తాను తెంపుకున్నట్లవుతుందని, మృదువుగా, అనునయిస్తూ వీరభద్రుని బాహువుల్లోంచి మెల్లిగా బైటపడింది.
‘‘ఇక నాకు సెలవిప్పించండి.. అన్నట్లు నా మేలి ముసుగూ, పాదరక్ష సావిట్లోనే ఉండిపోయినవి’’ అన్నదామె.
‘‘తెచ్చిస్తాను ఉండు’’ అని వీరభద్రుడు బయలుదేరబోయాడు.
‘‘పాదరక్షలు ఎలా తెస్తారు? మీ ఏనుగు పాదాలు వాటిలో పెడితే ఎన్ని కుట్లు వేసినా మళ్లీ అతకవు.. నేనూ వస్తాను ఉండండి’’ అన్నది సరస్వతి.
‘‘మరేం భయంలేదు.. ఎలా తెస్తానో చూడు!’’ అని వీరభద్రుడు కరదీపికతో సహా కనుమరుగైనాడు.
కొద్ది క్షణాల్లో ఒక చేతిలో కరదీపికా, మరో చేతిలో సరస్వతి పాదరరక్షలూ పట్టుకొని, మేలి ముసుగును భుజాన వేసుకొని వీరభద్రుడు ప్రత్యక్షమైతే సరస్వతి కడుపుబ్బ నవ్వింది.
‘‘పాదుకా పట్ట్భాషేకం కూడానా?’’ అన్నదామె.
‘‘నా ప్రేయసి పాదరక్షలు కూడా నాకు పవిత్రమైనవేలే! నిజంగా తన భార్యను ప్రేమించిన ఏ భర్తయినా, ఈ మాత్రం సేవన్నా భార్యకు చేయక తప్పుతుందని నేను అనుకోను!’’ అన్నాడు వీరభద్రుడు పాదరక్షల్ని కింద పడేస్తూ.
‘‘కొంతమంది భర్తలు, తమ భార్యలకు అడుగులకు మడుగులొత్తుతూ, కాళ్లకు చెప్పులు కూడా తొడుగుతారట!’’ అన్నది సరస్వతి వీరభద్రుని సంచలనాన్ని గమనిస్తూ.
‘‘కావచ్చు! మన ప్రణయం మరికొంత సాగాక చూద్దాంలే! ఆ కొత్త సేవ. సరేనా?’’
ఆమె కాళ్లకు పాదరక్షలు తొడుక్కుని, మేలి ముసుగు సవరించుకుంటుండగా ‘‘రేపు వస్తానని ప్రమాణం చేశావనే మాట మరిచిపోకు’’ అని హెచ్చరించాడు వీరభద్రుడు.
‘‘నా చేత బలాత్కారంగా ప్రమాణం చేయించారు. నేను రాకపోతే?’’ అని ఆమె ప్రశ్నార్థకంగా కళ్ళు ఎగరేసింది.
‘‘ఐతే నీకు ప్రమాణాలమీద కూడా నమ్మకం లేదా? అబద్ధాలాడితే ఆడపిల్లలు పుడతారు తెలుసా?’’
‘‘చాల్లెండి ఎవరన్నా వింటే నవ్విపోతారు!’’
ఈ ప్రణయం ఎటు తిరిగినా తన మీదనే దెబ్బతీస్తూన్నది. మంచి పథకాలు ఆలోచించి, రేపు ఈ ప్రియుని పని పట్టాలనుకున్నదామె.
‘‘ఎవరన్నా వినేప్పుడు మాట్లాడుకునే మాటలు కాదులే ఇవ్వి!’’
‘‘సరే సెలవు.. వెళ్ళొస్తానండీ!’’ అన్నదామె.
‘‘చూశావా? వెళ్తున్నాను అనకుండా- వెళ్లివస్తాను అన్నావు! నీవు ఎంత కృత్రిమంగా నటించేందుకు ప్రయత్నించినా, నీకు తెలియకుండానే నీ హృదయంలో దాగిన నిజం దానంతటదే బైటపడుతూంటుందని ఇప్పటికైనా తెలుసుకో.. సరే పద.. దొడ్డీ, దొడ్డివాకిలీ, అవతలి వరాహ విహార భూమీ మొదలైనవి చూపుతాను’’ అని వీరభద్రుడు ఆమెను ముందుకు నడిపించాడు.
ఆమె వీధిలోకి అడుగుపెడుతూండగా ‘‘రాత్రికి రావటం మరిచిపోకు సరూ! మనం రాణి విషయం వివరంగా మాట్లాడుకోవాలి!’’ అన్నాడు వీరభద్రుడు.
సరస్వతి ఒక్కక్షణం స్తబ్ద అయింది. ఇందాకట్నుంచి ఎంత మొత్తుకున్నా రాణి విషయమే చెవిజొరనీని ఈ వీరభద్రుడు సందర్భం లేకున్నా ఇప్పుడెందుకు తెరిచాడో ఆమెకు బోధపడలేదు. ఏమైతేనేం ఇతన్ని రాణితో సంధించేందుకు సదవకాశాలు ఎదురుగా ఉండనే ఉన్నవనే ఆశ ఆమెలో అంకురించింది. అభిప్రాయమనేది ఏర్పడలే కాని, దాన్ని పెంపొందించి తనకు కావలసిన ఆకారానికి సృష్టించుకునే చాకచక్యం తనకు లేకపోతేగా!
ఐతే ఈ ఆశపెట్టన్నా సరస్వతిని తిరిగి పిలిపించుకునేందుకు వీరభద్రుడు ఈ ఎత్తు ఎత్తాడని ఆమె ఊహించలేదు.
‘‘సరే!’’నన్నట్లు తల ఊపి నడక సాగించింది.
తెలతెలవారుతూన్నది. వీధుల్లో అక్కడక్కడ పాలవాళ్ళు పశువుల్ని తోలుకువెళ్తున్నారు; అంతకు తప్ప జనసంచారం లేదు. ఉన్నా తను వీరభద్రుని ఇంటిలోంచి బైటికి రావడం వరకూ, ఎవరికంటా పడకుంటే ఇక సురక్షితమేనని సరస్వతికి తెలుసు.
దొడ్డిదోవన వస్తే, పందులు మినహా తననీ తెల్లవారు జాము సమయాన మరెవరూ పరామర్శించే అవకాశం లేదనీ ఆమెకు తెలుసు. వీరభద్రుని ఇంటికి రాకపోకల సౌకర్యం అద్భుతంగానూ, సుళువుగానూ, సురక్షితంగానూ కుదిరిపోయింది లెమ్మనుకున్నది సరస్వతి.
దారిపొడుగునా ఆమె తలలో అనేక ఊహలు చిందరవందరగా కలగాపులగంగా భూతాల భరతనాట్యంవలె కదను తొక్కినవి. వాటిల్లోంచి తాను మరికొద్దిసేపట్లోనే ఎదుర్కోవలసిన ముఖ్య సమస్యను ఆమె వెలికి లాగింది.
ఈ జరిగిన దాంట్లోరాణికి చెప్పదగిందేమిటి? దాయవలసిందేమిటీ? వీరభద్రుడు తననే కామించాడంటే, రాణి ఏమనుకుంటుంది? చూసి రమ్మంటే కాల్చి వచ్చినందుకు కించపడుతుందా? లేక తప్పనిసరైనదని తాను నచ్చజెపితే సమాధానపడుతుందా? రాజభోజనాన్ని ఎంగిలి చేసినందుకు కోపోద్దీపితురాలవుతుందా? లేక రుచి ఎలా వున్నదో తెలుసుకొని ఊహించి ఆనందిస్తుందా? ఏమని చెప్పాలి? ఎట్లా చెప్పాలి? ఇలాటి అనేక ప్రశ్నలు ఇసుక పాతరల్లే తయారై సరస్వతిని తికమకపెట్టినవి.
ఈ గొడవంతా లేకుండా వీరభద్రుణ్ణి కలుసుకునేందుకు సందర్భపడలేనీ, మళ్లీ ఇవాళ రాత్రి ప్రయత్నిస్తానని చెపుతే, ప్రస్తుతానికి తాను బైటపడటమేగాక, తిరిగి తన ప్రియుణ్ని కలుసుకునే మరో సుముహూర్తానికి అవకాశం ఏర్పడుతుంది. ఈవిధంగా కొద్ది రోజులు గడపవచ్చు.
కాని రంకు, బొంకూ దాగవనే సామెతను అనుససరించి, ఎప్పటికైనా నిజం చెప్పక తప్పదు. తను చెప్పేందుకు ఇష్టపడకపోయినా, ఏవో కుంటి, గుడ్డిసమాధానాలు చెప్పి తప్పించుకోవాలని చూసినా- ఆవలిస్తే పేగులు లెక్కపెట్టగల రాణి దగ్గర తన ఆటలు దీర్ఘకాలం సాగవు. అంత్య నిష్టూరంకన్నా ఆది నిష్టూరమే మేలనే సామెతను అనుసరించి, జరిగినదంతా పూసగుచ్చినట్లు చెపితే, తనేం చేయాలో రాణి నిర్ణయిస్తుంది.
అప్పుడు మరో పెద్ద ఇబ్బంది వచ్చి పడొచ్చు. తనకు దక్కని వీరభద్రుడు, ‘వొద్దు మొర్రో!’మనే తన సఖికి చిక్కటాన్ని రాణి ఓర్చలేకపోవచ్చు. అందుకని ఎటూ తనకు ప్రయోజనం లేదు కనుక, తన సఖి కూడా అటు వెళ్ళకుండా కట్టడి చేయగల సమర్థురాలు రాణి! లేక, ఈ దారినే తనను నడిపించి, గాలానికి తగిలిన చేపను, తెలివిగా జాగ్రత్తగా సప్తదర్పణ శయన మందిరానికి లాగేందుకు ప్రయత్నించవచ్చు.
మనిషి తత్వం ఆయా పరిస్థితుల మీదా, మానసిక స్థితిమీదా ఆధారపడి ఉంటుంది. ఎంత విషపు తాచయినా, తోక తొక్కినా ఒక్కోసారి పోనీ లెమ్మని ఊరుకోవచ్చు; అదే తాచు మరో సమయంలో వృథాగా కూడా కాటు వేయనూవచ్చు. ఈ రాజరికానికి సంబంధించిన వారి మనోవికారాలు బహు చిత్రమైనవి; అవి ఏ క్షణంలో ఏ విధంగా పరిణమించేదీ తెలుసుకోవటం కష్టం; అందునా ప్రణయ తాపంతో కొట్టుమిట్టడుతూ, మదపిచ్చకు దరిదాపుల్లో వున్న ఈ రాణి ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవటం దుస్సాధ్యమే కాగలదు.
గతించిన రాత్రి తాను పొందిన స్వర్గ సౌఖ్యం తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చేసినట్లున్నది. ఎంతో తేలికమైన మనుస్సతో, తానే సరిగ్గా చెప్పుకోలేని ఆనందంతో మత్తుగా, మధురంగా, గమ్మత్తుగా ఉన్నది.

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు