డైలీ సీరియల్

మంగళప్రదం శివనామం ( శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరమశివుడు, పరమేశ్వరుడు, ఆదిదేవుడు, పార్వతీ ప్రియుడు, చంద్రశేఖరుడు అనంత నామధేయుడైన ఆ పరాత్పరునికి దర్శన స్పర్శన మాత్రాల చేత పాపాలను హరించగల ఒక్క బిల్వ పత్రాన్ని ‘త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం’ అంటూ సమర్పించినా, లేక హర హర మహాదేవ శంభో శంకర’ అంటూ ఒక్క చెంబెడు నీళ్ళు పోసినా, చివరకు ‘ఓం నమశ్శివాయ’ అంటూ మనస్ఫూర్తిగా ఒక్క క్షణం ధ్యానం చేసినా చాలు, కరగిపోయి ధన కనక వస్తు వాహన ఆయురారోగ్య ఐశ్వర్య మోక్షాలను సైతం అనుగ్రహించే ఆ పరమేశ్వరునికి శతకోటి ప్రణామాలు శివపురాణం చదివిన తర్వాత లేదా విన్నా తరువాత అర్పించండి అని ఎవరూ చెప్పకుండానే శ్రోతలందరూ చేతులెత్తి అర్థనారీశ్వరునికి నమస్కరిస్తారు.
పరమశివుని పూజించడానికి ప్రతి సమయం మహిమాన్వితమైనదే అయనా కార్తీక మాసం పరమశివునికి అత్యంత ప్రీతి పాత్రమైన మాసం. ఈ కార్తీకంలో శివపురాణంలో నుడివినట్లు పరమశివుని పంచముఖాలలో నకారం ప్రకాశించే ముఖం తూర్పు దిశను చూస్తూ సిద్ధసురాసుర గణాలచే నుతించబడుతున్నదనీ, మకారమున విలసిల్లే ముఖం దక్షిణ దిక్కును చూస్తూ అఖండ తేజోవంతంగా ఉంటుందనీ, శికార ముఖం గోక్షీరం నురుగువలే శే్వతవర్ణంలో అరుణ నేత్ర సంయుతంగా ఉంటుందనీ, పడమటి దిక్కును చూస్తూ బ్రహ్మాది దేవతలచే స్తుతింపబడుతున్నదనీ, వకార ముఖం ఉత్తర దిక్కును చూస్తూ గోరవర్ణంతో మందహాసాన్ని వెదజల్లుతుంటుందనీ, యకారముఖం ఊర్థ్వముఖమై ముప్పది ఆరు తత్వాల సంయుతమై వుంటుంది కదా. అటువంటి పరమశివుని ఉపాసనలో పంచాక్షరి మంత్రం మహాపవిత్రమైంది. శక్తియుక్తమైనది. ‘‘ప్రాహొనశ్శివాయేతి మంత్ర మాధ్యం హరస్స్వయం’’- సకల జీవుల మేలు కోరి పరమశివుడే స్వయంగా ఈ పంచాక్షరీ మంత్రాన్ని లోకానికి అందజేసేడు. పరమ శివుడు సంకల్పించిన అనేక మంత్రాలలో ‘శివపంచాక్షరి’ మంత్రమే అత్యంత శక్తివంతమైనది. ప్రణవం నుంచే పంచాక్షరి ప్రభవించింది. పంచాక్షరి నుండి గాయత్రీ మంత్రము, దాని నుండి సర్వవేద సారస్వతం ఉద్భవించెనని శివభారతంలో వివరించిఉన్నారు.
సదాశివుడు ఈశాన నామంతో ఈశాన్యదిశలో పంచముఖాలతో విరాజిల్లుతున్నాడు. శివుని పంచముఖాలు 1. సద్యోజాత 2. వామదేవ 3. అఘోర 4. తత్పురుష 5. ఈశాన- ఈ పంచ ముఖాల నుండి క్రమక్రమంగా ఉద్భవించిన నకార, మకార, శికార వకార, యకారముల సమ్మిళితమే నమఃశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రము.
పంచాక్షరీలో ‘న’ అక్షరం బ్రహ్మను భూమిని, ‘మ’ అక్షరం విష్ణువును జలాన్ని, ‘శి’ అక్షరం రుద్రుణ్ణి, అగ్నిని, ‘వా’ అను అక్షరం మహేశ్వరుణ్ణి వాయువుని, ‘య’ అక్షరం సదాశివుణ్ణీ, ఆకాశాన్ని సూచిస్తాయి. పరమశివుడు పంచకృత్య పారాయణుడు అని వాయు పురాణంలో చెప్పబడింది. పంచ కృత్యాలంటే సృష్టి, స్థితి, లయం, తిరోధానం, అనుగ్రహం అనేవి. పరమశివుని అనుగహం పొంది తరించాలంటే అతీంద్రియ ద్రష్టులు, త్రికాలజ్ఞులు అయిన ఋషులు కనిపెట్టి ఉపదేశించిన పంచాక్షరీని శివాయనమః జపించటము, హోమం చేయటం అభిషేకం చేయటం ప్రధానమైనవి.
శివనామాల్లో ముఖ్యమైనవి ‘రుద్ర, శివ’ నామాలు. ‘రుద్ర’ అంటే రోదనం పోగొట్టేవాడు. ‘శివ’ అంటే మంగళకరమైనవాడు. జీవులకు రోదనము పోగొట్టి మోక్షము కలిగించేవాడు శివుడు భోళాశంకరుడు. భక్తవత్సలుడు. ‘మహదేవ’ అని ముమ్మారు భగవన్నామాన్ని భక్తిశ్రద్ధలతో ఉచ్ఛరిస్తే వారికి ఒక్క నామస్మరణకి ముక్తిని ప్రసాదించి, మిగిలిన రెండు నామాలకీ ఋణపడి ఉంటాడు. అంతేకాదు ‘మాని యే మహేశస్య ధ్రువమ ప్రజ్ఞానతోపి వా తేషాం కరతలే ముక్తిః’’- ఎవరైతే పరమేశ్వరుని యొక్క నామాలు జ్ఞానం చేత కాని, అజ్ఞానం చేతకాని స్తుతిస్తూ వున్నారో వారికి ముక్తి చేతిలోనే వుంది అని వేదంలో పేర్కొనబడింది. వేదాలలో యుజుర్వేదం గొప్పది. దానిలో నాలుగవ కాండలో ఉన్న రుద్రం ఇంకా గొప్పది. రుద్రం మధ్యంలోని ‘పంచాక్షరి’ అంతకంటే ఇంకా గొప్పది. పంచాక్షరిలోని ‘శివ’ అనే రెండు అక్షరాలు మరీ గొప్పవి. ‘శివ’ నామోచ్చారణ మహాత్మ్యమునకు సంబంధించిన ఇతివృత్తం పద్మపురాణంలో పాతాళ ఖండంలో వుంది.
అటువంటి మహాశివుడిని కార్తీకమాసంలో పున్నమి తిథినాడు కులమతభేదాలు వయస్సు తారతమ్యాలు లేకుండా శివభక్తులంతా పూజిస్తారు. కార్తీకంలో ఏరోజు శివపూజ చేయకపోయనాకార్తీక పున్నమి నాడు మూడువందల అరవై వత్తుల గుత్తిని స్వామి ఎదురుగా కానీ తులసి సన్నిథిలోకానీ, మారేడు, రావి చెట్ల దగ్గర కానీ వెలిగిస్తే ఆ సంవత్సరం దీపం వెలిగించని పాపమేదైనా ఉంటే అది దూరం అవుతుంది. కార్తీక పున్నమినాడు దేవాలయాల్లో శివుని ప్రత్యేక పూజలు నిర్వర్తిస్తారు.
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం
జగన్నాథ నాథం సదానందభాజాం
భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం
శివం శంకరం శంభు మీశానమీడే
అని కార్త్తీకంలో ఈశ్వరుణ్ణి ప్రతివారు కొలుస్తుంటారు. ఉసిరి మూలమున శ్రీహరి, స్కందమున శివుడు, ఊర్థ్వమున బ్రహ్మ, సూర్యుడు, శాఖలయందు, సమస్త దేవతలు కూడి కార్త్తిక మాసంలో ఉసిరి చెట్టును ఆశ్రయించి ఉంటారు. కనుక కార్తికమాసంలో ధాత్రీపూజవలన అశ్వమేధ ఫలం లభించి, ఉసిరి ఫలదానమువల్ల ముక్తి కలుగుతుంది. ఉసిరిక దీపదానం కూడా ఈ మాసం లో విశేషంగా చేస్తారు. ఓం నమః శివాయ నమః అంటూ ఉసిరిక కాయమీదనో, పిండి ప్రమిదతోనో, మట్టి ప్రమిదతోనో దీపం వెలిగిస్తే అనంత కోటి పుణ్యరాశి లభిస్తుందంటారు. శివుని పేరిట ఉపవాసం చేసినా, ఏకభుక్తం చేసినా, నక్తంచేసినా, ఆయాచిత వ్రతం చేసినా, ఆఖరికి శివనామంతో సూర్యోదయానికి పూర్వం స్నానం చేసినా సరే అనంతకోటి పుణ్యఫలాలను పరమశివుడు అనుగ్రహిస్తాడు అని సూతమహర్షి శౌనకాది మహర్షులకు తెలిపారు. వారంతా ఎంతో సంతోషిస్తూ శివనామాన్ని పలికారు.
‘‘శంకరస్య చరితామృత శ్రవణం, చంద్రశేఖర
గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం,
సంభవంతు మమ జన్మని, జన్మని
‘‘సర్వం పరమేశ్వరార్పణమస్తు’’
సంపూర్ణం

శ్రీమతి గౌరీ గార్లదిన్నె 9676926171