డైలీ సీరియల్

భరతఖండంలో లింగరూపుడు( శివపురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరమ శివుడు తెలిపిన శివమహాపురాణం పనె్నండు సంహితలు కలిగి ఉన్నదని, ఐదు సంహితలు ఇప్పుడు లభ్యం కావటం లేదనీ తెలియవస్తున్నది. అవి వినాయక, మాతృ, ఏకాదశ రుద్ర, సహస్ర కోటి రుద్ర, ధర్మ సంహితలు.
బ్రహ్మ విష్ణువుల వివాదాన్ని లింగ రూపాన ఉద్భవించి తీర్చిన శంకరుడు వారి కోరికపై భరత ఖండంలోని తన స్థానాలను గురించి స్వయంగా తెలిపిన వివరాలు అతి మధురమైనవి. ‘‘హరి బ్రహ్మలారా! భూప్రపంచంలోని సప్త ద్వీపాలలో జంబూ ద్వీపం నాకెంతో ప్రియమైనది. ఇది ద్వీపాలన్నింటి మధ్య భాగంలో విరాజిల్లుతూ సువర్ణ మయమైన మేరు పర్వతాన్ని అందులో కలిగి ఉన్నది. పాతాళం నుండీ స్వర్గం వరకూ విస్తరించిన ఈ పర్వతానికి తూర్పు భాగాన మందర పర్వతమూ, దక్షిణ దిశలో గంధమాదన పర్వతమూ, పశ్చిమ దిశలో విపులము అనే పర్వతమూ, ఉత్తరంలో సుపార్శ్వం అనే శిఖరమూ ఉన్నాయి.
ఈ మేరు శిఖరాగ్రమే మహాకైలాసము. అక్కడ నేను పరమేశ్వర తత్వాన పరాశక్తి సమేతంగా ప్రమదగణ సేవితుడనై ఉంటాను. మేరు పర్వతం లోనే క్రింది భాగాన దేవేంద్రుని అమరావతి, అగ్ని దేవుడి నగరమైన తేజోవతి, గంధవతి అనే వాయుడేవుడి పురమూ, సిద్ధ సాధ్య గంధర్వాదుల పట్టణమైన శుద్ధవతీ నగరమూ, సంయమీ నగరమనే యముని పట్టణమూ ఉన్నాయి. ఇంకా ఇతర పురాల్లో ఈ పర్వతము పైననే ఏకాదశ రుద్రులూ, ఇతర పరివార గణాలూ నివసిస్తున్నారు.. అన్ని పట్టణాలలోనూ, చుట్టూ ఉన్న అరణ్య ప్రదేశాలలోనూ ఎన్నో శివలింగాలు వెలసాయి. వాటన్నిటిలోనూ నేను లింగరూపుడనై వసిస్తాను. భూలోకంలోని హిమవత్పర్వతములోని సుమేరు పర్వత చరియలోనిదైన కైలాస గిరిలోనూ నేను పార్వతీ సమేతుడనై ఉంటాను’’ అని బ్రహ్మ విష్ణువులకు తెలిపాడు మహేశ్వరుడు.
శౌనకాదులకు ఈ విషయాలు తెలిపేటప్పుడు భక్తిపరవశుడయిన సూత మహర్షి,
‘‘ముని శ్రేష్ఠులారా! ఆ పరమేశ్వర వైభవము తెలపటం ఎవరికీ సాధ్యం కాని పని. మేరు పర్వతాన ఎక్కడ చూసినా, సదాశివ నామ స్మరణలో పరవశిస్తూ, పంచాక్షరీ మంత్ర జపము చేస్తూ, ధ్యాన సమాధ్యష్టాంగ యోగ నిరతులయిన యోగి పుంగవులు దర్శనమిస్తారు. బ్రహ్మ వేత్తలక్కడ పరశివ తత్వ విచారణ జరుపుతూ ఉంటారు. అక్కడ సుగంధ శైల శిఖరముపైన కర్దముడూ, ఆగ్నేయ దిక్కులో సనత్కుమార ఆశ్రమంలో ఎందరో మోక్షకాములైన ఋషి పుంగవులూ నిరంతరం యోగ నిరతులై ఉంటారు. ఆ ప్రదేశంలో రుద్ర మూర్తులుకూడా శాంత చిత్తులై ఉంటారు. దేవ స్థాపితాలైన లింగాలూ, మహర్షి జన స్థాపితాలైన లింగాలూ అక్కడ కోకొల్లలు. అసంఖ్యాకమైన దివ్య క్షేత్రాలతో విలసిల్లే ఆ మేరు పర్వతము పైన దక్షిణామూర్తి, సదాశివ, పరమేశ్వర స్వరూపాలలో పరమేశ్వరుడు విలసిల్లుతూ ఉంటాడు. అక్కడే కాక ఈ సమస్త విశ్వంలోనూ అణువణువునా భాసిల్లే ఆయనను పూజించినా, లేక మా గురువుగారు తెలిపిన ఈ శివ పురాణ విశేషాలను శ్రవణం చేసినా జనులు కైవల్యాన్ని పొందుతారు.
కలియుగంలోని ప్రజలకు పంచాక్షరీ మంత్ర జపం కల్ప వృక్షం వంటిది. సత్యమూ, ధర్మమూ పాటిస్తూ మనకు వీలైన సంఖ్యలో జపం చేసి, జప సంఖ్య పూర్తి అయాక ఉద్యాపన చేసి బ్రాహ్మణులను తృప్తి పరిస్తే ఇహ పర మోక్షాలు లభ్యమవుతాయి. జప సంఖ్యలో ప్రతి పదోవంతు తరువాత హవనమూ, ప్రతి వందో వంతు తరువాత తర్పణమూ చేయాలి’’ అన్నారు సూత మహర్షి.
సూత మహర్షి తెలిపిన యోగ సాధనాలు మూడు. ‘‘జ్ఞాన యోగం’’ వలన బుద్ధి ఆత్మలో లయమవుతుంది. సర్వస్య శరణాగతీ, భక్తీ, ఆరాధనలతో కూడిన ‘‘్భక్తి యోగమూ’’ ఆ పరమేశ్వరానుగ్రహాన్ని ప్రాప్తింప జేస్తుంది. ఫలాపేక్షలేని కర్మయోగాన్ని ఈశ్వరార్పణం చేస్తూ ఆచరించే ‘క్రియాయోగం’ కూడా శివసాయుజ్యాన్ని లభింపజేస్తుంది. శివానుగ్రహాన్ని కోరుతూ ఏ యోగం చేసినా ఉత్తమమే. అన్నింటికన్నా మిన్నా, ముఖ్యంగా వలసినదీ పరమేశ్వరానుగ్రహం.
దర్శన స్పర్శన మాత్రాల చేత పాపాలను హరించగల ఒక్క బిల్వ పత్రాన్ని ‘త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం’ అంటూ సమర్పించినా, లేక హర హర మహాదేవ శంభో శంకర’ అంటూ ఒక్క చెంబెడు నీళ్ళు పోసినా, చివరకు ‘ఓం నమశ్శివాయ’ అంటూ మనస్ఫూర్తిగా ఒక్క క్షణం ధ్యానం చేసినా చాలు, కరగిపోయి ధన కనక వస్తు వాహన ఆయురారోగ్య ఐశ్వర్య మోక్షాలను సైతం అనుగ్రహించే ఆ పరమేశ్వరునికి శతకోటి ప్రణామాలు అర్పించుకుని, ఆయన చరితమైన శివ పురాణాన్ని మనకి అద్భుతంగా అందించిన వేద వ్యాస మునీంద్రునికీ, ఆయన ప్రియ శిష్యుడైన సూత పౌరాణికుడికీ వందన చందనాలు సమర్పించుకుని, నిరంతరం నిరంతరాయంగా ఆ శివ స్మరణలో రమించగల మానసిక స్థితిని ప్రసాదించమని ఆ సర్వాంతర్యామిని ప్రార్థిద్దాం..
‘‘శంకరస్య చరితామృత శ్రవణం, చంద్రశేఖర
గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం,
సంభవంతు మమ జన్మని, జన్మని
‘‘సర్వం పరమేశ్వరార్పణమస్తు’’

శ్రీమతి గౌరీ గార్లదిన్నె 9676926171