డైలీ సీరియల్

దూతికా విజయం-86

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఈ బాహువుల్లో వాళ్ళిద్దర్నీ ఇరికించి, ఎముకలు పిండి పిండి అయేట్లు చేసేవాణ్ణి. సరూ! నీ కోసం ఏ పని చేసేందుకైనా సిద్ధపడే ఉన్నాను నిజం! ప్రమాణం చేయనా?’’
తన మానచోరుడే వీరభద్రుడనుకున్న తనకు, ఇప్పుడు తన మానసచోరుడు ఇతననిపిస్తూన్నది.
ఎన్ని జన్మల బాంధవ్యమో రుూ వీరభద్రునికీ తనకూ అనిపించింది సరస్వతికి. ఐతే ఆ అనురాగమేమీ వెల్లడి కాకుండా ఆమె అన్నది: ‘‘ఎందుకొచ్చిన కబుర్లులెండి- నేనెవరో? మీరెవరో? నేను భార్యనైన విధంగా ప్రవర్తించవలసిన అవసరం మీకేమున్నదిలెండి!’’
‘‘సరూ! అలనాడు శకుంతలా దుష్యంతులు గాంధర్వ విధిలో వివాహమాడిన విధంగానే నేను నిన్నిప్పుడు పెళ్ళాడాను. ఆ మాటకొస్తే ఇందాక నేను సావిట్లోకి వెళ్ళినప్పుడు పంచాంగం కూడా చూశాను!’’
‘‘పాడు పనులు చేసేందుక్కూడా లగ్నాలు చూడాలి కాబోలు!’’ అన్నది సరస్వతి చిరునవ్వు చిలకరిస్తూ.
నాయకి ప్రణయ కోపం పటాపంచలైనందుకు వీరభద్రునికి ఎంతో సంతోషమైంది.
‘‘పాడు పనా! సృష్టికర్తా, ప్రకృతీ శాసించిన ఇది పాడు పనా! ఐతే ఇదేవిధంగా మన పూర్వీకులు కూడా నమ్మి రుూ పాడు పని జోలికి పోకుండా ఉన్నట్లయితే మనిద్దరం రుూ నాడు రుూ భూమిమీద ఉండేవాళ్ళమా? నిజంగా రుూ అనుభూతిని పొందినందుకు నీవు విచారపడుతున్నావా సరూ?’’
ఆమె వౌనం వహించింది.
‘‘చెప్పవా?’’ అన్నాడు వీరభద్రుడు ఆమెను బతిమాలే ధోరణిలో, ఆమె గడ్డం పట్టుకొని.
‘లేదు’ అని చెప్పేందుకు మొహమాటపడి, మెల్లిగా తల ఆడించిందామె.
‘‘అమ్మదొంగా!.. సరే.. సరే.. విను.. మన రుూ కలయిక జరిగిన ముహూర్తం ఎంతోబలమైనది!’’
అలనాడు పరాశరుడు కూడా సత్యవతికి పడవలో ఇదేవిధంగా ఊది ఉంటాడని సరస్వతి అనుకున్నది.
‘‘మనను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా విడదీయలేరు. అందుకనే నిన్ను వివాహం చేసుకున్నాను. బాజాభజంత్రీలు లేకుంటేనేం రుూ పంచభూతాలు సాక్షి! చూశావా బైట వాన ఎలా బాదుతున్నదో! దేవతలే మెచ్చి పుష్పవృష్టి కురిపిస్తున్నారు సరూ! ఎవరెవరి సాక్ష్యాలో మనకెందుకు- మనిద్దరి మనస్సాక్షులు లేవా?’’ అన్నాడు వీరభద్రుడు.
రుూ పిచ్చి బ్రాహ్మడు గాఢంగా విశ్వసించాడని కాదు కాని, నిజంగానే రుూ ముహూర్తానికి ఆ శక్తే ఉండి, విధి కరుణించి తమ రుూ బాంధవ్యాన్ని కలకాలం మననిస్తే తాను ఇంతకుముందు తలచిన మహాద్భుతం మరొకసారి సంభవించినట్లే భావించాలి. ఎటువైపు ఎంత విశాలంగా, నిశితంగా చూడగలిగినా ఇది సంభవమని ఆమెకు తోచటంలేదు.
‘‘మనదేం అగ్ని సాక్షిగా ఐన వివాహమా?’’ అన్నదామె గొణుగుతూన్న విధంగా.
వీరభద్రుడు చప్పున లేచి వెళ్లి కరదీపికను పట్టుకొచ్చి ఆమె మొహం దగ్గర ఉంచాడు. దాని వేడి గప్పున ఆమె మొహంమీదికి విస్తరించగా, ఆమె మొహాన్ని అవతలికి లాక్కున్నది.
‘‘ఇది అగ్ని కాదా? చాలదా? చెప్పు.. ఈ కొంపకు నిప్పు అంటించి, మహాగ్నిహోత్రాన్ని చేయమని దేవేరి ఆజ్ఞా!’’ అన్నాడు వీరభద్రుడు ఉద్రిక్తంగా.
తను ‘ఊఁ’ అంటే వీరభద్రుడు అన్నంత పని చేసేట్లే ఉన్నాడని తోచిందామెకు.
‘‘వొద్దులెండి ఈ కొంప కూడా లేకుంటే మనం ఎక్కడుంటాము? ఐనా ఇంతవానలో ఇది మండదు కూడాను!’’ అన్నదామె ముసిముసిగా నవ్వుతూ.
‘‘మరి ఇంకోరకం సందేహాలు ఉండవలసిన పనేమున్నది? రేపు నీ మెడలో మూడు ముళ్ళూ వేస్తానుగా!’’ అన్నాడు వీరభద్రుడు.
‘‘గొప్ప పనిచేస్తారు! రేపసలు నేను ఇక్కడికి రాగలనో లేదో నాకే తెలియదు. ఇలా జరిగిందని చెపితే రాణి ఏమనుకంటుందో! తనకు ద్రోహం తలపెట్టానని, స్వయం దూతికనయ్యానని ఆమెకు కోపమొస్తుందేమో? రేపు కూడా నన్నిక్కడికి పంపితే నా స్వార్థానికే ప్రయత్నిస్తానని తలపోస్తుందేమో?.. చూడండి. ఎన్ని చిక్కులు తెచ్చిపెట్టారో!’’ అన్నది సరస్వతి, దీర్ఘాలోచనలో పడి.
‘‘నిన్ను ఏ పనికైతే నియోగించిందో అది సఫలమయ్యే వరకూ రాణి నిన్ను వదలదు. మరొకర్ని నమ్మనూ లేదు; వినియోగించనూ లేదు. నీ స్వార్థం ఇందులో ఇమిడి వున్న విషయం రాణి గ్రహించినప్పటికీ, తన స్వార్థాన్ని తృప్తిపరచుకునేందుకైనా నినే్న ప్రయోగించి తీరుతుంది చూస్తావుగా- నేను చెప్పింది అక్షరాలా జరుగుతుందో లేదో!’’
***
ఉద్రేకాలు ఉపశాంతి పొందగా, జలపాతాన్ని దాటిన నదీ ప్రవాహం బయలుమీద నిండుచూలాలు వలె, ఒడ్డుల్ని ఒరుసుకుంటూ లోతు తెలియకుండానూ, ప్రవాహవేగం బైటపడకుండానూ ప్రవహిస్తున్న విధంగా వీరభద్రుడు, సరరస్వతి మంచంమీద పక్కపక్కనే కూర్చున్నారు.
ఆకాశపుటంచుల నుంచి జారి భూమిమీదికి దిగినట్లున్నదీ అనుభూతి అంతం. ఇంతవరకూ దరి జేరకుండా దూర తీరాలకు తరిమివేయబడిన తలపులన్నీ గుమికూడి బలమైన తాపులలో, మత్తులోంచి మేల్కొల్పుతున్నవి. యథార్థాన్ని ఎదుర్కొని తీరవలసిన అవసరం తొందర పెడుతూ ఆత్రుతను రేపుతూన్నది. కదలించిన తేనెతుట్టె దగ్గరి వ్యక్తిని చుట్టుముట్టే తేనెటీగలగుంపువలె వివిధ సమస్యలామెను ఒక్కొక్కటిగా వేధించసాగినవి.
ఆమె వీరభద్రుని వంక ఒక్క క్షణం చూసింది. అగ్నిజ్వాలల్ని వర్షిస్తూ, ఆకాశపుటెత్తుకు సెగలు, భుగలు కక్కుతూ, పొగవిడిచి చిమ్మవలసిన ద్రవపదార్థాలన్నిటినీ చిమ్మిన అగ్ని పర్వతం తాను విడుదల చేసిన సరుకంతా భూపతనమయ్యాక, ఏమీ ఎరుగనిదానివలె నిశ్చలంగా, నిర్మలంగా, ప్రశాంతంగా వున్న విధన తోచాడతను. ఇంతకుముందు క్రూరత్వాన్నీ, రాక్షసత్వాన్నీ, కసినీ, బలాన్నీ ప్రయోగించింది ఈ వీరభద్రుడేనా అనిపిస్తోంది; ఇప్పుడు సాధువైన మానవుడుగా కనిపిస్తున్నాడు. కామాగ్ని చల్లారాక అందరూ అంతేనేమో?
‘‘ఏమిటో దీర్ఘాలోచనలో వున్నావు?’’ అన్నాడు వీరభద్రుడు.
‘‘ఈ వాన తగ్గేనా?.. నేను రాణివాసానికి వెళ్ళటం ఎలా?’’ అన్నది సరస్వతి
‘‘రాణికి తాళపత్ర ఛత్రం పట్టి, ఛత్రపత్నిని చేసి, అవసరమైతే భుజాలమీదికెక్కించుకొని మోసుకొని, తడవకుండా నిన్ను రాణివాసానికి జేర్చేందుకు ఈ ప్రియుడు సిద్ధంగానే ఉన్నాడు దిగులెందుకూ?’’
‘రాణి’ అన్నపదం వినగానే సరస్వతి తత్తరపడింది. అది తన పట్లనే ప్రయోగించబడిందని తెలుసుకునేందుకు ఆమెకు ఒక్క క్షణం పట్టింది.
‘‘రాణి ఇక్కడెక్కడ ఉన్నది?’’ అన్నదామె.
‘‘నీకు ఎంతసేపటికీ ఆ రాణే దృష్టిలో ఉంటుంది. నీవే నాకు రాణివి. నా హృదయరాణివి!’’ అన్నాడు వీరభద్రుడు.
‘‘ఊ! నాకు ఛత్రం పడతారా? అందరి దృష్టీ నామీద పడితే, అందునా మీరు నా పక్కన ఉన్నట్లు రాజుకు తెలిస్తే ముందు నాకు ఉరిశిక్ష పడుతుంది. మీ సంగతి ఏమైనదో కూడా నాకు తెలుసుకునే అవకాశం ఉండదు!’’
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు