డైలీ సీరియల్

ఈర్ష్యను వదలడమే ఈశ్వరుని పూజ( శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘శౌనకాదులారా! ఒకప్పుడు వామ దేవుడనే మహా శివభక్తుడు సుమేరు పర్వతానున్న కుమార శిఖరాన అప్పుడక్కడ వసిస్తున్న కుమారస్వామిని దర్శించాడు. ఆయనతో సంభాషిస్తూ, శివ తనయుడైన కార్తికేయుడాయనకు ప్రణవ మంత్రం పరబ్రహ్మ స్వరూపమేననీ, ఆ మంత్ర జపంతో సాక్షాత్తూ మోక్షాన్ని పొందవచ్చనీ తెలిపాడు.
ప్రణవ మంత్రపు గొప్పతనం వామదేవుడికి తెలియనిది కాదు. అయినా మళ్ళీ వినాలనిపించి ఆ మంత్రపు మహిమను వినిపించమని కార్తికేయుడిని అర్థించాడు. కార్తికేయుడు అది సదాశివుడైన పరమేశ్వరుడని చేర్చే సాధనమని తెలిపి దాన్ని సద్గురువు ద్వారా ఉపదేశింప జేసుకుని ఏకాగ్రతతో నిరంతరం జపిస్తే కైవల్యం ప్రాప్తిస్తుందని పలికాడు.
తరువాత సన్యాసి ధర్మాలను వామదేవుడికి తెలుపుతూ,
‘‘వామదేవా!
గురువు వద్ద ఉపదేశం పొందిన సన్న్యాస శిష్యుడు శిరోముండనం గావింప జేసుకుని, చేతులనీ, జపానికుయోగించే సాధనాలనీ శుభ్ర పరచుకుని మీసమూ, గడ్డమూ కూడా తీయించుకుని పనె్నండుమార్లు నదిలో మునిగి లేవాలి. ఆ తరువాత అతను గురు ధ్యానమూ, శివధ్యానమూ చేయటం మొదలు పెట్టాలి.’’ అని సన్యాసులు సమాధి యోగ సాధన చేయటం చాలా అవసరమని కార్తికేయుడు వామదేవుడికి తెలిపాడు. మరణానికి ముందే సమాధి లోనికి వెళ్ళేందుకు ఆ సాధన ఎంతో ఉపయోగపడుతుందనీ, ప్రాణాయామాది అష్టాంగ యోగాలలో చివరిది సమాధి అనీ కార్తికేయుడు తెలిపాడు. సమాధిలోనికి వెళ్ళిన సన్యాసికి పది రోజులు శిష్యులు శాస్త్రోక్తంగా శ్రాద్ధ విధులు జరిపిన తరువాత పదకొండవ రోజున అతను శివ సాన్నిధ్యం చేరతాడు. అతడి శిష్యులచే బ్రాహ్మణులకి అతని పేరున అన్నదానం జరుగుతుంది’’ అని కార్తికేయుడు వామదేవుడికి తెలిపాడు.’’ అని వివరించారు సూత మహర్షి.
శివపురాణం అంతకు క్రితం వాయుదేవుడి చేత కూడా ఒకసారి అప్పటి నైమిశారణ్యంలోని ఋషులకి తెలుపబడిందనిచెప్పి, వాయుదేవుడు తెలిపిన పశుపత వ్రత వివరాలను శౌనకాదులకి, సూత మహర్షి వివరించసాగారు.
పశుపత వ్రతం (వాయవీయ సంహిత)
‘‘మునులారా!
ఈ పశుపత వ్రతాన్ని చేసిన వారు మోక్షాన్ని పొందటం తథ్యం. శ్రుతి స్మృతి విధానంలో తెలుపబడిన విధంగా ఈ వ్రత నియమాలు రూపొందించబడ్డాయి.
ఈ వ్రత వివరాలు ‘‘అధర్వ శీర్షోపనిషత్తు’’లో కూడా తెలుపబడ్డాయి. ఈ వ్రతాన్ని గురూపదేశమూ ఆదేశమూ పొందిన పురుషుడు మాత్రమే చేయాలి. చైత్ర పౌర్ణమి నాడు చేసే ఈ వ్రతాన్ని రెండు రోజుల ముందు అనగా శుద్ధ త్రయోదశి
(శుక్ల పక్ష త్రయోదశి) నాడు కుశము, అనగా దర్భలు చేత ధరించి దర్భాసనం పై కూర్చుని మోక్షార్థియై ప్రారంభించాలి. అంతకు మునుపు గురువు ఆదేశము పొందాలి. తెల్లటి వస్త్రాలూ, తెల్ల దారంతో చేసిన ఉపవీతమూ, తెల్లటి పూమాలలు మెడలోనూ ధరించి, శరీరానికి గంధపు విలేపనం పులుముకుని, హవన కుండం ముందు హోమ సామాగ్రి సిద్ధం చేసుకుని వ్రతానికి కూర్చోవాలి. వేళ్ళకు దర్భలు ధరించి నేరుూ, చందనం ఇత్యాది హోమ పదార్థాలు హోమకుండంలోని అగ్నిలో మంత్ర సహితంగా వ్రేల్చాలి.
రోజంతా ఉపవాసముండి రాత్రి ప్రసాదాన్ని ఆహారంగా గ్రహించాలి. ఆ మరునాడు అనగా శుక్ల పక్ష చతుర్దశి నాడు కూడా హోమం చేసి, పూర్తి దినం అనగా రాత్రి కూడా నిహారారియై ఉండి మరుసటి దినం అయిన చైత్ర మాసపు పౌర్ణమి నాడు కూడా అన్ని పూజా సంస్కారాలూ పూర్తి చేసి హోమగుండంలోని భస్మాన్ని శరీరానికి పూసుకోవాలి. ఆ తరువాత స్నానం చేసి జింక చర్మానితో గాని ఆకులతో గానీ శరీరాన్ని అవసరమైన భాగాల్లో కప్పుకోవాలి. చేతిలో కర్రా, ముంజేతికి తోరణమూ కట్టుకుని ఆచమనం చేసి మళ్ళీ వొంటికి భస్మం రాసుకుని యోగసాధన (ఆ దినం) మూడుసార్లు గురువుగారి సహకారంతో చేయాలి. ఈ విధంగా చేస్తే మనిషిలోని పశు ప్రవృత్తి నశించి కాలక్రమేణా శివ సాయుజ్యానికి దగ్గరవుతాడు. ఈ వ్రతాన్ని పనె్నండు సంవత్సరాలుగానీ, ఆరు, మూడు లేక ఒక సంవత్సరం కానీ, అంత చేయలేని వారు ఆరు నెలలు, నెల లేదా పనె్నండు రోజులు, మూడు రోజులు లేదంటే కనీస పక్షం ఒక్కరోజు చేసినా ఎంతో పుణ్యమూ, మోక్షమార్గమూ లభిస్తాయి. భక్తులు తమ శక్త్యానుసారం కొంత కాలాన్ని సంకల్పించుకుని వ్రతాన్ని చైత్ర పౌర్ణమి నాడు ప్రారంభించి చేసుకోవచ్చు.’’ అని నైమిశారణ్యంలోని మునులకు ఒకప్పుడు వాయుదేవుడు బోధించాడని సూత మహర్షి తెలిపారు. ‘‘శౌనకాదులారా!
వాయుదేవుడికి కృతజ్ఞతలు తెలిపి నైమిశారణ్యంలోని మునులంతా మరుసటి దినం సరస్వతీ నదిలో స్నాన మాచరించి, సంధ్యాదికాలు ముగించుకుని కాశీకి చేరుకున్నారు. కాశీ గంగలో స్నానం చేసి విశ్వనాథుడిని దర్శించుకుని బయటకు వస్తున్న మునులకు ఒక దివ్య కాంతి పుంజం గగనంలో కనిపించింది. అందులో లీనవౌతూ వేలాది మంది మహర్షులు కనిపించారు. నిమేష మాత్రాన ఆ దివ్య ప్రకాశం ఆ మహాత్ములతోపాటూ అదృశ్యమైపోయింది. మహర్షులందరూ ఆశ్చర్యపడుతూ ఆ దివ్య తేజస్సుని గూర్చి తెలుసుకునేందుకు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి, ఆయనకు ప్రణామాలు చేసి ఆ కాంతి పుంజాన్ని గూర్చి అడిగారు.
- ఇంకావుంది...

శ్రీమతి గౌరీ గార్లదిన్నె