డైలీ సీరియల్

దూతికా విజయం-65

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన మరణం అతని ఆనందాన్నిస్తుందని తాను తలచలేదు. కాని అనాలోచితంగా, అనుకోకుండానే గురిచూడని ఆయువుపట్టున ఆ దెబ్బ తగలవచ్చు.
సరస్వతి చురచురలాడుతూన్నట్లు నటిస్తూ వీరభద్రుని సమీపించింది. మెల్లిగా, మృదువైన, తన పాదాన్ని అతని కాలిమీద ఆనించి సుతారంగా రాస్తూ ‘నన్ను రక్షించు నీ మేలు మరిచిపోను, కృతజ్ఞతగా ఏ వెల అయినా సరే చెల్లిస్తాను. ముందు ఈ గండం నుంచి కడతేర్చు! అన్న భావాన్ని స్పర్శ ద్వారా అందించేందుకు ప్రయత్నించింది. ఆ భాష అర్థమైనదో లేదో అనే అనుమానం ఒక పక్క పీడిస్తూన్నది. ఆ మాత్రం తెలుసుకోలేని అరసికుడీ వీరభద్రుడు కాదనీ, తనకన్న తెలివిగా ప్రవర్తించగల సమర్థుడేనని ఇంతకుముందు రుజూ చేసిన వ్యక్తి ఈ క్షణంలో పరమ మూర్ఖునివలె ప్రవర్తించడనీ, ముఖ్యంగా తన స్వార్థాన్ని దృష్టిలో ఉంచుకొనయినా తననిప్పుడు రక్షించి, ఆ తరువాత భక్షించే పాటి జ్ఞానం ఉండగలదనీ ఆమె నమ్మింది.
దెబ్బతిన్న ఆడపులి వలె వీరభద్రుని మొహంలోకి చూస్తూ ‘‘చెప్తారా? అంతా చెప్తారా? ఇంటి గుట్టు అంతా వీధిపాలు చేస్తారా? మాటా మాటా పట్టింపు వస్తే తీర్పు చెప్పేందుకు దారినపొయ్యేవారిని పిలిచి చెప్పుకుంటారా? ఇలాటి భర్తతో ఎవతన్నా కాపరం చేయగలదా?’’ అన్నదామె.
ఇదేదో చిన్న గృహ కల్లోలమనే నమ్మకం రక్షక భటులకు ఏర్పడిపోయింది. భార్యాభర్తలమధ్య ఉండటం ప్రమాదకరమని భావించి వాళ్ళు రెండుడుగులు వెనక్కు వేశారు.
‘‘అయ్యా! మీరు నవరాత్రీ ఉత్సవాలలో బల ప్రదర్శనలో ప్రథమ బహుమతి పొందలేదా?’’ అన్నాడొక రక్షక భటుడు.
వీరభద్రుడు సగర్వంగా తల ఆడించాడు.
అతనికి కోపం వస్తే తమ ఇద్దరి తలకాయలూ ఒకదానితో మరొకటి ఢీకొని పగిలినా ఆశ్చర్యం ఉండదనే భయం వాళ్ళను ఆవరించింది.
‘‘ఏం లాభం?’’ అన్నాడు వీరభద్రుడు. ‘‘ఊరందరికీ నేనంటే గడగడ! నాకేమో ఈ గయ్యాళి గచ్చపొద ఐన భార్య అంటే గుండెలు పిచ పిచ!’’ అన్నాడు వీరభద్రుడు తన అసమర్థతను తానే సానుభూతి చూపే ధోరణిలో చప్పరిస్తూ
తనను వీరి యెదుట భార్యగా అంగీకరించి ప్రమాదం నుంచి కాపాడినందుకు సరస్వతికి వీరభద్రుని పట్ల గౌరవం పెంపొందింది.
రక్షక భటులు ముసి ముసి నవ్వులు ఆరంభించారు.
‘‘అబ్బో! ఎందుకు చెపుతారు- నేనంటే తమకెంతో భయం! పాపం.. అందుకనేగా ఈ అర్థరాత్రి, వానలో నన్ను ఇంటినుంచి బైటికి గెంటేందుక్కూడా ముందు వెనుకలు ఆలోచించకుండా అవమానించింది!’’ అన్నది సరస్వతి, మూతి మూడు వంకరులు తిప్పుతూ.
‘‘పాపం! నువ్వేమీ ఎరుగని అమాయకురాలివి కదూ! పుట్టింటికి ఇప్పుడే వెళ్తానని నన్ను బెదిరిస్తే నేను ఊరుకుంటానా? వెళ్తే వెళ్ళమన్నాను-’’
‘‘అయ్యో! ఆడకూతుర్ని ఒంటరిగా ఇప్పుడు పంపుతారటండీ? మొండికెత్తి అనాలోచితంగా, కోపంతో ఆమె ఇప్పుడేవెళ్తానని పట్టుబట్టినా బతిమాలో, భంగపడో అడ్డుపడొద్దటండీ!.. ఏమమ్మా! మీరిప్పుడు ఈ పురవీధులగుండా నడుస్తుంటే, ఏ దుర్మార్గుడన్నా ప్రాణహానీ, మానహానీ కూడా తలపెడితే ఇంకేమన్నా ఉన్నదా? మిమ్ము మీరు రక్షించుకోవటం ఎంత కష్టమో ఊహించారా? మీ మాట ఎలా వున్నా రాత్రి గస్తీ తిరిగిన రక్షక భట వర్గానికి మాట దక్కుతుందా? వీధిలో అర్ధరాత్రి ఒంటరిగా కనిపించే ఆడదాన్ని సరాసరి ఠాణాకు తీసుకుని వెళ్ళి కారాగారంలో సురక్షితంగా ఉంచి, మర్నాటి ఉదయం, విచారించి వదిలేయమని నాయకుని ఆజ్ఞ! ఇంకా నయం మీరు వీధిలో ఎదురైతే మీలాటి మహా ఇల్లాలిని కారాగార ప్రవేశం చేయించవలసిన క్రూర కార్య నిర్వహణ ఈ దురదృష్టవంతుల వొంతయేది!’’ అన్నాడొక రక్షక భటుడు. దంపతులిద్దర్ని తగిన విధంగా మందలించానని అతను అనుకున్నాడు.
‘‘మహా ఇల్లాలు’’ అన్నాడు వీరభద్రుడు దెప్పి పొడస్తూ. ‘‘అంతా తెలిసినట్లే చెపుతున్నావే- చూడు ఎలా పీకి, రక్కిందో!’’
వీరభద్రుడు మెడ ముందు జాచాడు. కరదీపికా కాంతిలో లోతుగా నాటిన సరస్వతి గోటి పదును ప్రతిఫలిస్తూన్నది.
‘‘అయ్యయ్యో!’’ అన్నాడొక రక్షక భటుడు. ‘‘నెత్తురు కూడా చిమ్మిందే!’’ ఎంత మోటు సరసం! భర్తపట్ల ఎంత అపచారం! ఐనదేమో అయింది- లోపలికి తీసుకొనివెళ్లి ఉపచారాలు చెయ్యవమ్మా!’’
‘‘మహాచెప్పొచ్చావ్ పెద్దమనిషీ! ఇంత తల తిక్క మనిషితో నేను కనుక కాపరం చేస్తున్నాను’’ అని దుఃఖాన్ని నటిస్తూ సాగించింది సరస్వతి. ‘‘వాతలు తేలేట్లుగా నా వీపు పగలకొడితే ఊరుకుంటానా?’’
ఈ అభియోగం వినగానే, రక్షక భటులు వీరభద్రుని వైపు అనుమానంతో చూశారు.
వీరభద్రుడు ఈ నేరాన్ని ఒప్పుకొని గుట్టుచప్పుడు కాకుండా తనను ఇంట్లోకి తీసుకొనివెళ్లక తప్పదనీ, రక్షక భటుల పీడ ఇంతటితో విరగడవుతుందని, విజయం తనదే అవుతుందనీ సరస్వతి పొరబడింది.
వీరభద్రుడు ఆమెను ఒడిసి పట్టుకున్నాడు. ఇంతకుముందు ఆమెను ఇంట్లో నుంచి గెంటినపుడు మెడమీద పడిన ఇనుపహస్తం ఇపుడు పటకారల్లే పట్టుకున్నది. అతని ఉద్దేశ్యమేమిటో ఆమె గ్రహించేందుకు ప్రయత్నం చేస్తూండగానే, వీరభద్రుడు ఆమెను గిర్రున తప్పి, వీపు తనపై ఉండేట్లు చేసి కదలకుండా బిగించి పట్టుకున్నాడు.
చూపుడువేలును వీపుమీదికి మెల్లిగా సందుజేసుకొని రవికలోకి తోశాడు. అంతే ఆ వేలు పైనుంచి కిందిదాకా అమితవేగంతో పయనించింది. కత్తెరవలె రవిక వెనుకభాగం ఫర్రున చిరిగింది. రొమ్ములమీద వున్న బిగి వదులైంది. ఐతే చేతుల ఆధారంగా రవిక వేళ్ళాడుతోంది కనుక ముందున్న ఆచ్ఛాదనకు భంగం వాటిల్లలేదు. ఇదంతా క్షణంలో జరిగిపోవటంతో అసలు ఏం జరిగిందో చప్పున తెలుసుకోలేని అయోమయమూ, ఆశ్చర్యమూ సరస్వతిని ముంచెత్తినవి. రక్షక భటులు కూడా ఇదేదో మరోరకం మోటుసరసమనుకుంటున్నారు. తమ ఎదుటనే భార్యను అవమానించగలిగిన వీరభద్రుని సాహసాన్ని నోళ్లు సగానికి తెరచి ఆశ్చర్యంతో తిలకిస్తున్నారు.
‘‘తేవయ్యా ఆ కరదీపిక!.. వీపు వాయగొట్టానని చెప్పింది రుూ ఇల్లాలు! వాతలు తేలినయ్యన్నదిగా! దగ్గరికి రండి మరేం భయంలేదు.. చూడండి కళ్ళు బాగా తెరచి చూడండి. పనసతొనలు వరసగా పరిచినట్లుగా, పాలరాయల్లే చూసేవాళ్ళ పాపలు కనిపించేట్లుగా ఎలా ఉన్నదో! వాతలట- ఎక్కడంట?’’ అని వీరభద్రుడు హుంకరించాడు.
రక్షకభటులు కరదీపికలతో సమీపించటాన్ని గమనించిందామె.
‘‘ఆడకూతుర్ని పట్టుకొని నడివీధిలో ఇంత అన్యాయంగా అవమానిస్తూంటే, గుడ్లు మిటకరించి చూస్తున్న మీరు రక్షకభటులమని చెప్పుకునేందుకు సిగ్గుపడటంలా? దగ్గరికి వస్తున్నారా? మొహాన ఉమ్మేస్తా!’’ తన బండారం బైటపడిందనే ఉడుకుమోతుతనంతో వణికిపోయిందామె.
వీరభద్రుని మెడమీద గాయాలను కళ్ళారా చూసి ఉండటంవల్ల ధైర్యంగా ముందుకు సాగరాదనే జ్ఞానమున్న స్వీయ రక్షకభటులు వాళ్లు!
ముందున్న ముడి విప్పలేక ఓటమిని ఒప్పుకొన్న వీరభద్రుడు సమయం, సందర్భం చూసి రవికెను వెనుకవైపు చింపటం ద్వారా తన కసి తీర్చుకున్నాడు. పక్కనున్న హంగు చూసుకొని ఒంటికాలిమీద లేచాడు పరపురుషుల ఎదుట రవిక చింపి మానభంగానికి పాల్పడ్డాడనే కోపం, అవమానభారం అత్యధికం చేస్తూంటే-
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు