డైలీ సీరియల్

దూతికా విజయం-58

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సింహం బక్క మృగాలపట్ల మృత్యుదేవతగా ఉంటే ముందు వెనుకలు చూడని వేటగాడు ఈ సింహం పట్ల యముడుగానే ఉంటున్నాడు. వేశ్యావాటికలోని రంగేళీ రాయుళ్ళ నుంచేగాక, వాళ్ళను వేటాడేందుకు నియమించబడిన రక్షక భటులనుంచి కూడా తనను తాను కాపాడుకోవాలి. వేటగాడికి అడవిలో జంతువులన్నీ లోకువే కదా!
మానవ నిర్మితమైన చట్టాలకూ, ప్రకృతి సహజమైన చట్టాలకూ మధ్య జరిగే దేవదానవ యుద్ధంలో రెండోదానికే నిశ్చయంగా జయమనే విషయాన్ని రుజూ చేసేదే ఈ వేశ్యావాటిక. పగటిపూట, లేదా కొన్నాళ్ళుగా మానవుని చట్టాలనూ, సామాజిక కట్టడులనూ అతిక్రమించకుండా ఎంతో ప్రశాంత జీవితాన్ని గడపటంవల్ల ఏర్పడిన అలసట, చిరాకు, చికాకు, నరాల తీపు కండరాల బిగువు మొదలైన వాటినుంచి విడుదల లభించక ఉన్మాదస్థితి ఏర్పడకుండా ఉండేందుకు మనసు ఊహించే వింత వింత వైవిధ్యాలతో, అభిరుచులతో గూడుకట్టిన కోర్కెలు తీరేందుకుగాను అనంగుడు ఏర్పరిచిన రంగస్థలమిది!
ప్రపంచాది నుంచీ అనేకమంది నీతివేత్తలూ, అధికారులూ వేశ్యవృత్తిని రూపుమాపాలని అనేక వ్యర్థ ప్రయత్నాలు చేశారు. అధికోద్రేకాలు సమాజంమీదికి విరుచుకొనిపడి, సామాజిక శాంతి భద్రతలను నాశనం చేయకుండా సురక్షితంగా విడుదలైపోయేందుకు ఏర్పడిన ఈ పురాతన వృత్తి ఏవగింపును కలుగజేసినా, ఉండి తీరవలసిన పాప కూపం రుజూ ఐ ఏదో ఒక రూపాన బహిరంగంగానో, రహస్యంగానో కొనసాగించబడుతూనే వున్నది. ప్రస్తుతం సమాజం అయిష్టంగానే అంగీకరించిన స్థితిలోనే ప్రతీ రాజ్యంలో ఇది చలామణిలో వున్నది.
ప్రపంచంలో సుఖదుఃఖాలు ఉండుగాక! రుూ వాటిక మాత్రం సకల సౌఖ్యాలనూ పొందేందుకు సకల సౌకర్యాలతోను విరాజిల్లుతుంటుంది. ఇదో నూతన ప్రపంచమేమరి! తమ తమ కష్టాలనూ, విచారాలనూ మద్యంలో ముంచివేసి, మదవతులైన మగువలనే నౌకలుగా చేసుకొని ఆనంద సుధాసాగరంలో విహార యాత్రలు చేసే విటపటాలానికి భూలోక స్వర్గతుల్యమైన ప్రదేశమిది! బైటి ప్రపంచంలో వర్షానికి ఒకమారే వసంతమైతే, ఇక్కడ మాత్రం నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా ఎల్లవేళలా వసంతమే! మానవ మేధస్సు నిర్మించిన భూలోక స్వర్గసీమ ఇది!
అంతేనా! కళలనేకం ఇక్కడ పుట్టి, పెంపొందుతూన్నవి. నాట్యం, సంగీతం, వాద్యగానం, కవిత్వం మొదలైన అనేక కళలను ఆరాధించే ఈ కామినులు 3కళావంతులు2 అని పిలవబడటం కళలకూ వీరికి ఉన్న అవినాభావ సంబంధాన్ని రుజూ చేయటమే! కళకళలాడే ఆ కళామతల్లిని ఆరాధించేందుకు ఎంతమంది రసజ్ఞులో ఇక్కడికి విచ్చేస్తుంటారు. ఎవరు ఓపికకొద్దీ వారు రసాస్వాదన చేసి తృప్తిపడుతూనే ఉన్నారు! కళామతల్లి సరస్వతికి, పొరుగు గిట్టని అత్తమ్మ లక్ష్మికీ ఈ రంగస్థలాన మాత్రమే అన్యోనత సాధించబడుతోందనిపిస్తుంది.
ఈ వీధిలోని ప్రతి ఇంటికీ రెండు దారులుంటవి. సమాజాన్ని లెక్కచేయనివారూ కొత్త వ్యక్తులూ ప్రవేశించేందుకు సింహద్వారాలు; పెద్దమనుషులుగా చలామణి అయేవారూ, ఎవరి దృష్టినీ ఆకర్షించకుండా తమ కోరికల్ని తీర్చుకొని తమ దారిన పోదలచినవారికి దొడ్డిగుమ్మాల నుంచి ప్రవేశం.
ఈ వీధిలోని దొడ్డిగుమ్మాలన్నీ వెనుక వీధిలోకి ఉండటమేగాక, అవతలి వీధి దొడ్డి గుమ్మాలు కూడా వీటికి ఎదురుగా ఉండటంవల్ల ఇక్కడ జన సంచారం బహు తక్కువ. తను రుూ వీధి వెనుక భాగం నుంచి ప్రవేశించటం తేలికేగాక, సురక్షితం కూడాను. అయితే ముందుగా సమావేశాన్ని ఏర్పాటుచేసుకుంటేనే తప్ప ఈ సానుకూలం లభ్యపడదు.
ఈ పురుషులు ఎంత స్వార్థపరులు! తమ కామ ప్రవృత్తులన్నిటికీ తృప్తికలిగే మార్గాలు అనేకం అనే్వషించి తమ సౌకర్యార్థం ఎన్నో అనుకూలాలను ఏర్పరచుకున్నారు. తమలాంటి కోర్కెలే స్ర్తిలకు కూడా వుంటవనీ, అవి తీరే సౌకర్యం కూడా ఉండాలనే ఊహనే జొరనీరు; ఎవరైనా ఈ వాదం లేపితే నీతిపరులూ, సంఘ సంస్కర్తలూ, పాలకులూ, అధికారులూ అందరూ పురుషులే కనుక, ఈ విడ్డూరాన్ని గూర్చి ఆలోచించరు సరికదా! కోపంతో కంపిస్తూ ఈ వితండవాదాన్ని మొదట్లోనే తుంచిపారేస్తారు.
ఈ భూలోకంలోని ఈ అనుభవాలు చాలక, యజ్ఞయాగాదులు చేసి స్వర్గంలో రంభా ఊర్వసుల పొందుకోసం కూడా ఈ పురుషులు ప్రయత్నిస్తారు. యజ్ఞాలు చేసి పుణ్యం మూటలు కట్టిన పురుషులకు దేవాంగనల పొందు స్వర్గంలో సిద్ధంగా ఉన్నదన్నారు; మరి స్ర్తి పుణ్యాత్మురాలై స్వర్గం జేరితే ఆమెకు ఇలాంటి సౌకర్యాలు అక్కడా లేవు. ఎందుకంటే స్వర్గాన్ని పరిపాలించేవారు కూడా పురుషులే కనుక, తమ జాతి సుఖ సౌఖ్యాలకు తగిన సౌకర్యాలను మాత్రమే ఏర్పరచుకున్నారు! అందుకనే పురుషుడంటే తన మనసంతా ద్వేషంతో నిండి ఉండేది!
మిగతా వీధుల్లోలాగు కాక, నిశీధిన జరిగే ఈ వ్యభిచార వ్యాపారం కావలసినవారే ఈ వేశ్యావాటికలో సంచరిస్తారు. వీరు బహుకొద్ది. అదీగాక మన్మథాలయంల్లోకి ప్రవేశించేందుకు మరులుగొన్న మగవారు తహతహలాడుతూ, తమ గొడవలోనే ఉంటారు కాని ఇతరులెవరున్నారా అని కూడా ఆలోచించరు, గమనించరు.
ఒకవేళ ఎరిగినవారు ఎదురుపడినా చూడనట్టే దూసుకొనిపోతారు. పుష్పబాణుని నిశిత శరాలు విలయతాండవమాడే ఈ రంగస్థలాన్ని- మనసిజుడు ప్రతిరాత్రీ ఈ కార్యాలయంలో ఈ తంత్రాన్ని నడుపుతూంటే ఎవరు మాత్రం భూమిన కాలూనుతారు? నిర్ణీతమైన సుఖంకోసం ఉవ్విళ్ళూరే రసికుల కళ్ళకు, తదితర దృశ్యాలన్నీ అల్పాలే కనుక, ఎంతో నిర్లక్ష్యంగా ఉంటారు. కనుక బహుశా తనను గమనించేవారు అసలు ఉండరనే భావించవచ్చు.
కాని చిత్రమేమిటంటే- చీకటిపడ్డాక వేశ్యావాటికలో స్ర్తిలెవ్వరు రాజవీధిలో కనిపించరు. వేశ్యలు కూడా తెరచి ఉన్న ద్వారాలకు కట్టబడిన తెరల వెనుక ఎదురుచూసే ప్రియులకోసం, లేదా ఎదురుచూడని నూతన విలాస పురుషుల కోసం కాచి ఉంటారే కాని వీధుల్లో తిరుగరు; వీధి మొహమే చూడరు.
తను మాత్రం మేలిముసుగుతో తచ్చాడటం కొత్తవింతే మరి! కొలనుబాసిన కమలంవలె తన మనసు వాడిపోయే పరిస్థితే ఏర్పడుతుంది!
సాహసికులూ, యవ్వనపు మదమాత్సర్యాలతో మదించినవారూ, తమకు కామతృప్తి కావాలని ఈ వాటికలో జొరబడి, కంటికి నచ్చిన కాంత కోసం తహతహలాడుతూ తిరిగేవారి కంట తాను పడితే! ఈ మేలిముసుగులోని మేలిమి ఏమిటో చూడాలనే కుతూహలంతో దహించుకొనిపోయే యువకుడెవరైనా ఎదుర్కొంటే! ఈ వీధిలోని వనితల వృత్తే పురుషుల కామదాహం తీర్చటం కనుక, తనను ఆ కోవకే లాగి లోకువ చేసి వెంటాడుతే!
ఈ తలపు రాగానే సరస్వతికి వికారంతో మైకం కమ్మినట్లయింది! తాను తప్పించుకునే అవకాశాలు బహు తక్కువనే విషయం ఆమెను కంపింపజేసింది.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు