డైలీ సీరియల్

దూతికా విజయం-50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ న్యాయాన్యాయాల విచారణా, న్యాయాన్ని ప్రయోగించగలగటం మొదలైనవి తన బాధ్యతలూ కావు. తనకా అవకాశాలూ, అధికారాలూ లేనే లేవు. కేవలం తాను నిర్వర్తించదలచుకొన్న ‘విధి’ తాలూకు ఫలితాలను సమీక్షించటం ద్వారా తేలిందిది. అంతకన్నా తను చేయబోయే పనులను సమర్థించుకొనేందుకూ, అంతరాత్మను సమాధానపరచుకునేందుకూ ఉపయోగపడే తర్కమిది.
ఇక్కడ కూడా తన స్వార్థం తెరమరుగునే ఉన్నది. దాన్ని బైటికి లాగితేనే కాని తనలోని కేంద్ర శక్తులు సుశిక్షితులైన సైనికులవలె, జీవిత రణరంగంలోనికి ప్రవేశించి తనకు చేదోడు వాదోడుగా ఉండదు కదా!
రాణి తన స్థానాన్ని కోల్పోవటమనేది- ఆమె పుత్రవతి కాకుండటంవల్లనే తటస్థిస్తుంది. అప్పుడు తనూ రాణితోపాటే మరో కొన్ని మెట్లు దిగక తప్పదు. మూలవిరాట్టు మూల కూర్చూని మూలుగుతూంటే, ఉత్సవ విగ్రహానికి తెప్ప తిరణాల ఎలా కుదురుతుంది? అందుకని రాణి ‘పతనం’ కాకుండా తాను ప్రయత్నించటమంటే, తన పతనాన్ని ప్రతిఘటించటమే అవుతుంది.
రాబోయే దుర్భర జీవితాన్ని తలుచుకొని, ప్రస్తుత పెద్దరాణి వున్న స్థితి బాగా తెలిసిందే కనుక ఆ దౌర్భాగ్యం తమకూ పడుతుందేమోననే భయం బెదిరించి, తనను ముందుకు నడిపించేందుకు సిద్ధంగా వున్నది. పరోక్షంగా తన కీడును మేలుగా మార్చుకోవటమే ఈ పథకాన్ని దిగ్విజయం చేయటవౌతుంది.తనకు మినహా బ్రహ్మదేవుడిక్కూడా అర్థంకాని మరో కిటుకు ఇందులో వున్నది. దూరదృష్టిని సారించి మరో మూడు పంచవర్ష ప్రణాళికల ఫలితాన్ని తాను ఇప్పుడే సరిగ్గా ఊహించగలదు. అది భావిలో జరగవలసింది.రాణికి వీరభద్రుని ద్వారా జన్మించే పుత్రుడు రాజఠీవితో, బలపరాక్రమ సంపన్నుడే అవుతాడు. తను ఇంత కష్టపడి, అన్ని హంగులూ సమకూరిస్తే ఆ దుర్విధి రాణికి పుత్రుణ్నించ్చేందుకు మారుగా పుత్రికనిస్తే!
ఆ అనుమానం రాగానే సరస్వతి మనస్సు చివుక్కుమన్నది. ఎంత స్వల్ప విషయం బ్రహ్మాండమైన యెత్తుగడను గోటితో గిల్లిపారేయగలదు!
వెంటనే ఆమె ‘పాపం శమించునుగాక’ అనుకున్నది. ఒకవేళ పుత్రికే జన్మిస్తే ఎవరి అదుపాజ్ఞల్లోనూ లేని దైవ నిర్ణయం కనుక గాలి మేడ నేల కూలిందనుకోవాలి- అంతే!
సరే.. రాణికి కుమారుడు జన్మించినట్లయితే ఆమె హోదా పెరుగుతుంది. దాంతో తన అంతస్థు కూడా పైమెట్టుకు ఎగబాకుతుంది. ఈ రాణి కుమారుణ్ని పెంచే దాది తానే! అంటే వాడికి ఇద్దరు తల్లులు.. రాణి కన్నతల్లి అయితే, తాను పెంచిన తల్లిగా రూపొందుతుంది. మూడో పంచవర్ష ప్రణాళిక అంతమై నాలుగోది ఆరంభమయే సమయానికి.. రాజుకు రోజులు నిండక తప్పదు. అప్పుడు తాను పెంచిన ఈ రాణి కొడుకే రాజు!తనంటే రాణికి ఉండేస్నేహ సౌహార్ర్దాలకు తోడు ఈ పుత్రోదయ కార్యక్రమమంతా తన చేతులమీదుగనా నడిచిన కారణాన, జన్మంతా రాణి తనకు కృతజ్ఞురాలుగానే ఉంది. కన్నతల్లి, తనపట్ల చూపే గౌరవ మర్యాదలకు తోడు, తాను పెంచినతల్లి కనుక తన పట్ల రాకుమారునికి ఏర్పడే అనురాగం కూడ ఆకలిస్తే తాను దాదాపు రాణి వున్న స్థానాన్ని అందుకుంటుంది!ఆ మాటకొస్తే.. రాణి పుట్టు పూర్వోత్తరాలూ, రాకుమారుని జన్మవృత్తాంతం లాటి రహస్యాలు తనకు తెలిసి ఉండటంవల్ల తాను రాణి కన్న పై మెట్టులో ఉండగలదు. రాకుమారునికి వయసు పరిపాలనకు చాలినంత ఉండదు కనుక, తన తల్లి సలహానే తీసుకుంటాడు. తన తల్లే తన సలహాలను తీసుకుంటుంది కనుక, దాని అంతరార్థం ఎలా పరిణమిస్తుందంటే తన సలహాలకే గొప్ప చలామణి ఏర్పడి తీరుతుంది. అంటే పరోక్షంగా పరిపాలనంతా తానే సాగించగలదు!
ఆ సుదినం పదిహేను సంవత్సరాల దూరాన వున్నప్పటికీ, సరస్వతి కంటికి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తూనే వున్నది. జీవితం నేర్పిన ఓర్పు, నేర్పుల సహాయంతో జీవితాన్ని మార్పులతో, చేర్పులతో సింగరించుకోవచ్చు. తన ఈ ఆశయం మహద్భాగ్యాన్ని కైవసం చేసుకోవటం- సఫలీకృతమై తీరుతుంది.
స్వప్నం ద్వారా ఆమె పొందిన నిరుత్సాహాన్ని ఆవేదననూ ఈ ఊహ అంతం చేయుటయేగాక కొత్త ఆశనూ, ఉత్సాహాన్నీ ఆమెలో మొలకెత్తించి పెపొందించసాగింది. నిజానికి ప్రమాదం ఎంత అధికంగా ఉంటే సురక్షితంగా నెగ్గుకొస్తే కలిగే ఫలితం కూడా అంత అద్భుతంగా ఉంటుంది.
అసమర్థులూ, నిరాశావాదులూ, అజ్ఞానులూ, అవివేకులూ, బలహీనులూ, దూరదృష్టి లేనివారూ, సోమరులూ, మెదడును ఉపయోగించలేనివాళ్లూ ప్రమాదమనగానే భయపడి ముడుచుకొనిపోతారు. సాహసించేవారికి ఎప్పుడూ తగిన ప్రతిఫలం ఎలాగూ రాసి పెట్టే వున్నది. వారి సామర్థ్య నిరూపణకు ఇదొక గొప్ప అవకాశం కూడాను!
ఒకవేళ తారుమారైతే తనతోపాటు మరణశిక్షను పొందే మరి ముగ్గురు తోడుంటారు. మిగతావాళ్ళ మాట ఎలా వున్నా అంత గొప్ప రాణికే కీడు మూడగా లేంది, తనకో లెక్కా?
ఒకో కీడులో కొంత మేలు కూడా మిళితమయ్యే ఉంటుందనిపిస్తుంది. ఎందుకంటే తాను కన్న ఆ పీడకల తన మూడో కంటిని తెరిచి మనోవికారంతోపాటు, వికాసాన్ని కూడా సమకూర్చింది. తను రంగంలోకి దూకేందుకు ముందుగానే తగినన్ని హెచ్చరికల్ని, ఆ తొందరలో తాను గమనించనివీ, లేదా పొరపాటుపడేవీ ముందుగానే కళ్ళకు కట్టినట్లున్నవి. అంటే ఒకే పనిని రెండుసార్లు చేసే సదవకాశం తనకు ఏర్పడింది. మొదటిసారి అపజయమే ఎదురైనప్పటికీ, అది జయాన్ని సాధించేందుకు గాను ఉపయోగపడే ఒక సోపానంగా వుండి, ఈ ద్వితీయ ప్రయత్నంలో మొదటిసారి సరిగ్గా ఎక్కడ కాలు జారిందో తెలిసే ఉంటుంది. కనుక ఆ అనుభవ సారంతో నిలదొక్కుకోవచ్చు.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు