డైలీ సీరియల్

దూతికా విజయం-48

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక్కడ ముక్కూ మొహం ఎరుగని వారి మధ్య జీవితాన్ని గడిపే దౌర్భాగ్యస్థితి ఇప్పుడులేదు. బాగా తెలిసిన, ఎరిగిన తన తోటి రమణులతోనే అనుభవించవలసిన శిక్షాకాలాన్ని గడపవచ్చు.
భయోత్పాతం క్రమంగా సర్దుకుంటోంది. ఇక్కడ హాయిగా కూడా వున్నది. బహుశా తాను చూసే మిగతావారిక్కూడా ఆనందంగానే ఉండి ఉండాలి. ఒకవేళ ఇది నరకం కాదేమో! స్వర్గమయేందుకు వీల్లేదు- ఎందుకంటే నేరాలు చేసినవారికి స్వర్గంలో ప్రవేశం ఉండదు కనుక! ఆ రెంటికీ మధ్య వుండే మరోలోకం- భూలోకం కానిది- ఇంతవరకూ ఎవరూ కనిపెట్టనిదై ఉండొచ్చు’’.
తీరా మరికాస్త పరికించి చూస్తే ఇది తానెరిగిన రాణివాసమే కాని, వేరు కాదనే నిశ్చితాభిప్రాయం సరస్వతికి ఏర్పడింది. రాజుకు మధ్యలో జాలిపుట్టి తననూ, రాణినీ జీవసమాధి నుంచి పెళ్లగించి ప్రాణదానాలు చేశాడేమో?
‘‘ఏమిటీ సరూ! ఎలా ఉన్నది?’’ అన్న రాణి మాటలు విన్నాక సరస్వతి తాను భూలోకంలోనే రాణివాసంలోనే ఉన్నానని నిశ్చయించుకోగలిగింది.
శక్తులన్నిటినీ కూడగట్టుకొని చప్పున లేచి కూర్చున్నదామె. స్వేద స్నానం, జలస్నానం చేసిన తన ముఖాన్ని పమిట చెరగుతో తుడుచుకున్నది. ఎవరో సిద్ధంగా వుంచిన మంచినీరు అందివ్వగా, గడగడా తాగింది.
ఇప్పుడంతా తేటతెల్లమైంది సరస్వతికి. తన ఈ అనుభూతి అంతా స్వప్నం! ఎంత దుష్ట స్వప్నం! ఆ పాడు పీడకల తలచుకుంటేనే రోమాలు నిక్కబొడుస్తూన్నవి; గగుర్పాటుతో శరీరం వికారవౌతోంది.
‘‘ఏమిటి సరూ! ఎందుకలా కేకలు వేశావు? ఏమైందీ?’’ అన్నది రాణి ఎంతో ఆతృతతో.
ఇంతమందిలో తన స్వప్నానుభూతి చెప్పటం సరస్వతికి ఇష్టం లేదు. అదీగాక ఆ బీభత్సాన్ని కలలో చూసే తానింత కలవరపడింది. చెబితే, చెప్పగలిగితే మూర్ఛపడక తప్పదు. తన సంగతి అలా వుంచి, రాణి మూర్ఛిల్లటం తథ్యం!
‘‘అబ్బ’’ అన్నది సరస్వతి ఒళ్ళు విరుచుకుంటూ, ‘‘పాడు పీడకల ఏదో వచ్చింది. మీ అందరి నిద్రకూ భంగం కలిగించి మీ అందర్నీ భయపెట్టి, శ్రమ పెట్టినందుకు క్షంతవ్యను రాణీ!’’
‘‘ఒక్కొక్కప్పుడు రుూ పీడకలలు చాలా భయపెడుతవి. దానికేముందిలే సరూ!’’ అన్నది రాణి తేల్చివేస్తూ.
‘‘అది నిజం కానందుకు నాకిప్పుడెంతో సంతోషంగా వున్నది!’’ అన్నది సరస్వతి ఆనందానుభూతిని పొంది, ప్రదర్శిస్తూ.
‘‘కలలు కల్లలే కాని నిజవౌతవా సరూ!’’ అన్నది రాణి.
ఈ కల నిజమైనట్లయితే ఎంత ఆవేదన, అవమానం, ప్రాణహాని, మానహాని- ఒకటేమిటి పండంటి జీవితాలే బుగ్గిపాలై ఉండేవని సరస్వతి ఎలా చెప్పగలదు? ఈ అనుభూతిని శాశ్వతంగా తనలోనే దాచుకోవడం అత్యుత్తమమార్గంగా ఆమెకు తోచింది.
‘‘స్వప్నం స్వప్నమే- సత్యం వేరుగా ఉంటుంది. కనుకనే ఈ అనుభూతుల వైవిధ్యం స్పష్టంగా ఉంటూన్నది... అందరికీ కృతజ్ఞరాలిని. మీరంతా వెళ్ళి నిద్రించండి’’ అన్నది సరస్వతి కేలుమోడ్చి.
‘‘ఒకసారి మొహం కడుక్కొని, దైవప్రార్థన చేసి సుఖనిద్ర పొందు సరస్వతీ!’’ అని రాణి తన శయనాగారంలోకి వెళ్లిపోయింది.
క్రమంగా మిగతా దాసదాసీలు కూడా నిష్క్రమించారు.
ఒంటరి ఐపోయిన సరస్వతి రాణి సలహా ప్రకారం ఒకసారి కాళ్ళు, చేతులు ముఖం కడుక్కొని, దైవప్రార్థన చేసి పవళించింది. కాని రాణి అన్నట్లు సుఖనిద్ర కాదు కదా అసలు నిద్రే పట్టలేదామెకు.
ఒక మానవ జన్మలో ఎంత భయాన్ని అనేక సందర్భాలలో తగిన కాలయాపనతో మానవుడు పొందుతాడో అదంతా తానీ రాత్రి స్వప్నానుభూతిలో అనుభవించింది. అదంతా నిజం కాదులెమ్మని సరిపెట్టుకోగలిగినప్పటికీ, దాన్ని గూర్చి ఎంతో లోతుగా, తీవ్రంగా జాగ్రత్తగా ఆలోచించవలసే వున్నది.
ఏనాటికైనా రాణికి ఇదంతా చెపితే ఆమెకూడా ఇలా జరిగేందుకు ఏ అడ్డంకీ ఉండేందుకు వీలులేదనే విషయాన్ని గ్రహించి, తన ఈ సాహసాన్ని విడనాడదా? ఆమె అలాంటి నిర్ణయానికి వస్తే తానూ తనతోపాటు మరి కొన్ని మానవ జీవాలు భద్రంగా, హాయిగా ఉండగలవు!
అయితే రాణి అసలు తన రుూ స్వప్నవికానుభవాన్ని నమ్ముతుందనే ఆశ తనకు లేదు. కేవలం తనను భయపెట్టేందుకు కాకపోయినా, నిరుత్సాహపరిచేందుకు తెలివైన తన ఇష్టసఖి ఈ పథకాన్ని వేసిండొచ్చని ఆమె తలపోయవచ్చు. ఆ మాట పైకి అనకపోయినా తనకు అనుకూలంగా వుండే అనేక అవకాశాలను ఎత్తిచూపవచ్చు.
తాను చిన్నతనం నుంచీ ఎరిగిన ఈ రాణి అతిగారాబంగా పెరిగింది; చాలా పెంకిపిల్ల. తన ముద్దు ముచ్చట్లు ఎంత అసందర్భంగా, అక్రమంగా వున్నా తల్లిదండ్రులు తీర్చారు. ఆమె మాట సాగంది- ఒక్క పెళ్లి విషయంలో మాత్రమే!
అదీ ఎంతమంది ప్రాధేయపడితే! ఇంతమంది తన జీవితానికి పడి ఏడుస్తారనీ, తండ్రి రాజ్యమే పోతే తాను కూడా సామాన్యురాలిగా జీవించవలసి వస్తుందనీ, అలాగాక రుూ ధర్మపాలుడు మహాబలాఢ్యుడలవటంవల్ల తన వంశాన్ని కూకటివేళ్ళతో పెళ్ళగించి పారవేయగలడనీ, తాను మొండికెత్తితే బలత్కారంగా తనను దాసిగా చేసుకోగల సమర్థుడని, లేదా ఆయన కోపాగ్నికి తాను బుగ్గికావటం జరిగినా ఆశ్చర్యపడవలసింది ఉండదనీ- కాదని చావటంకన్నా రాణిగా జీవించటం వివేకం అనీ- ఇన్ని కారణాలూ పరిస్థితుల ఒత్తిడీ కలిసి ఆమె తల వంచినవి కాని లేకుంటే తన మతమే తనదని మేకువలె బిగేసుకు కూర్చోగల రుూ రాణికి ఎదురుచెప్పి నచ్చచెప్పటం మాటలు కాదనే విషయం సరస్వతి అనుభవ సారాంశం!
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు