డైలీ సీరియల్

దూతికా విజయం-39

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయపాలుడు తనను మోసం చేయాలనీ, తనను అనుభవించి తీరాలనీ తిరగబడ్డాడు. ఈ విధంగా దుష్టచతుష్టయంలో ప్రతి ఒక్కరు మరొకర్ని మోసగించాలనే తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
అయితే విధి పన్నిన బ్రహ్మాండమైన, అతి గోప్యమైన, కంటికి కానరాని వల మొత్తం నలుగుర్నీ మోసం చేయనే చేసింది కదా!
ఎక్కువ కాలం గడవకుండానే నాలుగు దివిటీలు ఆమెను వెతుక్కుంటూ వచ్చినవి. నలుగుర దాసీలు, నలుగురు యోధులు ఆ స్థలానికి వచ్చారు. దాసీలు సరస్వతిని పట్టుకొని నడిపించుకొని వెళ్ళారు- లేక మోసుకొని వెళ్ళారేమో? మతిపోయిన సరస్వతికి ఏమీ తెలియటం లేదు. స్వప్నంలో ఏవో దుష్టశక్తులు తనను బంధించి తనకు ఇష్టం లేకపోయినా బరబరా ఈడ్చుకుని పోతున్నట్లు తోచిందామెకు.
***
ఎదుర్కొని తీరవలసిన ఘోర దృశ్యాన్ని సమీపిస్తుండగా సరస్వతి తనను తాను హెచ్చరించుకుంటూ, సర్వశక్తుల్నీ సమీకరించుకుంటూ వ్యక్తావస్థలోకి వచ్చేందుకు ప్రయత్నించి అతి కష్టం మీద నెగ్గింది.
నివసించే గృహం ఏ అర్థరాత్రి సమయానో అందరూ గాఢంగా నిద్రిస్తుండగా, పరశురామ ప్రీతి అవుతూ, ఆ వేడికి మెలకువ వచ్చి పొగల సెగలతో అల్లకల్లోలంగా ఉన్న సమయంలో, ప్రమాదంలో నుంచి బైటపడి ప్రాణాలు రక్షించుకోవటమే సాధ్యమా, కాదా అన్న అనుమానంలో కూడా, చేతికందిన విలువైనదేదైనా కాపాడాలనే తీవ్రమైన వాంఛలాటిది పట్టి పీడిస్తుంది. అదే విధంగా ఇప్పుడు పోయింది పోగా, దేన్నయినా రక్షించే అవకాశం ఉన్నదేమో చూడవలసిన బాధ్యత సరస్వతిని వేధిస్తుంది.
నవరస భరితమైన ఈ నాటకం అంత్య స్థితిలో పడి, దశమ రసమైన నీరసంతో నిండినట్లయింది. అయినప్పటికీ చావుదెబ్బ తిని కూడా కొద్ది క్షణాలపాటు స్పృహ వొచ్చినట్లయితే- ఇక జీవించి ఉండే వ్యవధి బహు స్వల్పమనే జ్ఞానంతో ఉన్నా, తెలివితేటలన్నీ గుమిగూడి విధి నిర్వాహణకు తోడ్పడాలనే దివ్యజ్ఞానం లభ్యమైన రీతిగా తాను సంసిద్ధతతో అవతరించినట్లనిపించింది సరస్వతికి.
ఆ దృశ్యం తనలో తను సృష్టించుకున్న దానికన్న ఎన్నో రెట్లు ఘోరంగా తోచింది సరస్వతికి. సరిగ్గా సప్తదర్పణ శయన మందిర ద్వారంలో ఆడవేషంలో ఉన్న వీరభద్రుడు బోర్లాపడి ఉన్నాడు. అతని వీపులోంచి జయపాలుడు పదునుపెట్టానన్న బల్లెం దూసుకొనిపోయింది; అది బహుశా వీరభద్రుని గుండెల్లోనుంచి అటుగా పొడుచుకొని వచ్చి ఉండాలి. కిందంతా రక్తపు మడుగు ఏర్పడింది.
ఎవరికీ ఏమీ అర్థంగాక చీమ చిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్దంలో శిలా ప్రతిమలవలె అందరూ నిలబడి ఉన్నారు. ప్రతి ఒక్కరి ముఖంలోనూ భయమూ, ఆశ్చర్యమూ, సంభ్రమమూ, అయోమయమూ స్ఫుటంగా ప్రతిఫలిస్తున్నవి. ఆ దృశ్యాన్ని చూసి రాణి మూర్చిల్లినట్లున్నది. ఆమెను కదల్చకుండా ఆ కటిక నేలమీదనే తలకింద మెత్తని తలగడా ఉంచి, పరిచారికలు మెల్లిగా విసురుతున్నారు. ఇతర ఉపచారాలు చేస్తున్నారు. ఎవరైనా సాహసించి ఒక్క క్షణం వీరభద్రుణ్ని చూసినా మరుక్షణంలోనే ఆ ఘోర దృశ్యాన్ని భరించలేక మొహాన్ని అవతలకి తిప్పేసుకుంటున్నారు.
సరస్వతికి కడుపులో చేయి పెట్టి తిప్పినట్లయింది. విరహంతో వొళ్ళు తూలిపోతుంది. బేలఐ గాలిలో తేలుతూ, ఎటో కొట్టుకొనిపోతున్నట్లు అనిపించింది. కింద భూమి బద్ధలై, తాను ఊహించలేని లోతులకు అతి వేగంగా దిగిపోతున్నట్లు అనిపించింది.
జయపాలుడు ఘనకార్యం చేసిన మహావీరుని వలె రొమ్మువిరిచి నిలబడి ఉన్నాడు. మిగతా ద్వారపాలురూ, రక్షకులూ కొద్ది దూరంలో నిలబడి ఉన్నారు. రాణివాసపు స్ర్తిలు మరింత దూరంలో తెల్లమొహాలు వేసుకొని నిలబడి ఉన్నారు.
సరస్వతి అతి కష్టంమీద తనను తాను సంబాళించుకొని నిలదొక్కుకోగలిగింది. పరిస్థితులన్నిటినీ అవగాహన చేసుకున్నది. జరిగిపోయినదాన్ని, జరుగుతున్నదాన్ని సమన్వయించి, జరుగబోయేదాన్ని రూపొందించుకుంటూన్నది.
గతించినదాన్ని గూర్చే ఆలోచిస్తూ వృథా ప్రయాసపడే లోతు తక్కువ వ్యక్తి కాదామె. జరుగబోయేదాన్ని గూర్చిలేనిపోని ఆశలు పెంచుకొని మసును మరిపించే మగువకాదామె. జరుగుతూన్న దానిమీదనే సర్వశక్తుల్నీ కేంద్రీకరించి, ప్రయోగించి, చేజిక్కిన అవకాశాన్ని దుర్వినియోగం చేయని విజ్ఞతగల వనిత ఆమె!
కంటికి కనిపించని ఆ దేవుడు, తాను ముక్కుమొహం ఎరుగని భగవానుని మీద ఆధారపడటం ఎంత ప్రమాదమో సరస్వతికి తెలుసు. ఇప్పటికైనా తన తెలివితేటల ద్వారా ఎటునుంచన్నా దూసుకొనే అవకాశం ఉన్నదేమోననే విషయాన్ని గూర్చే ఆమె తీవ్రంగా ఆలోచిస్తోంది. తనకు తాను సహాయపడలేని వాడికి దేవుడు సహాయపడడనే సత్యం తెలిసిన సరస్వతి భగవానుని జోలే అనవసరమని నిశ్చయం చేసుకున్నది.
బహుశా మహారాజుకు కబురు వెళ్ళి ఉంటుంది. ఆయనకోసం ఉన్నతాసన మొకటి సిద్ధంగా ఉన్నది.
గుమిగూడిన జనం పక్కకు తప్పుకుంటున్నారు. మరుక్షణంలోనే మహారాజు ప్రవేశించాడు. అందరొ సర్దుకుని ఎంతో జాగరూకులై ఉన్నారు.
మహారాజు ఒక్కసారి అంతటా కలయజూశారు.
‘‘ఎవరీ బల్లాన్ని ఉపయోగించింది?’’
జయపాలుడు వందనం చేసి వొంగి ‘‘నేనే మహారాజా! ఆగమన్నా ఆగకుండా పరిగెత్తుతుంటే ఇతని మీద బల్లాన్ని విసరటం తప్ప వేరే మార్గం లేకపోయింది!’’ అన్నాడు దృఢమైన కంఠస్వరంతో.
జయపాలుడు అల్లిన కథ స్వరూపమేమిటో సరస్వతి తేలిగ్గా గ్రహించగలిగింది.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు