డైలీ సీరియల్

దూతికా విజయం-26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొరివి పెట్టి నెత్తి గోక్కున్నట్లు, వ్రతం చెడినా ఫలం దక్కకపోగా, ప్రాణభయమే ఫలితమైన విధంగా చేజేతులా ఈ లంపటంలో ఇరుక్కోవటం జరిగింది.
సరస్వతిక్కూడా చాలా అలసటగా వున్నది. కలవరపడి స్వాధీనం తప్పుతున్నట్లున్న మనస్సును ఎంతో ప్రయత్నమీద కూడగట్టుకున్నట్లు ధైరంగా ఉండమని సూచిస్తూ వీరభద్రుని చేతిని నొక్కింది ఆమె. అయితే అంతరంగికంగా అతనిలో తయారవవలసిన ధైర్యం బహిర్గతంగా సరఫరా అయి ప్రయోజనం లేదు. ఆ మాటకొస్తే బైటి పరిస్థితులూ, వాతావరణమూ అతనికి మరింత పిరికిమందును నూరిపోస్తూండి ఉండాలి.
ఈ పురుషపుంగవుడు- సంతాన గోపాలుని కరుణ ఎంత ఉన్నా రాణి శయనాగారంలో ప్రవేశిస్తే జరిగేదేమిటో సరస్వతి స్పష్టంగా చూడగలుగుతోంది. ఆ శయనాగారాలంకరణలు వీరభద్రునిలో మిగిలిన కొద్ది మతిని అపహరిస్తవి. రాణిని చూడటమంటే సాధారణ స్థితిలో సామాన్య మానవుడి కళ్లు జిగేలుమంటవి. వీరభద్రుని ఈ ప్రస్తుత స్థితిలో తీవ్రంగా ప్రకాశించే భానుని కిరణాల్లోకి సరాసరి సూటిగా చూసినట్లే!
దేవకాంత పొందుకు తాను అనర్హుణ్ణి అనే విషయం వెంటనే స్ఫురించటంతో వీరభద్రుడు కుప్పగా కూలిపోయినా ఆశ్చర్యపడవలసినంది లేదు. ప్రపంచంలోని షండత్వాన్నంతా పోగుచేసి, కరిగి మూసపోసిన విధంగా ప్రవర్తించటం మినహా వీరభద్రుడు మరేమీ చేయలేని అసమర్థుడే అవగలడు.
ఏమైనా తాను చేయగలిగింది లేదు.. త్వరగా తెమల్చకుంటే అవబోయేదీ మరింత దారుణ పరిణామాలకు దారితీస్తుంది కనుక, ఎంత త్వరగా ఇతన్ని కోట బైట విదిలించి, పుల్లిస్తరాకువలె వొదిలించుకు వచ్చేందుకు అవకాశమున్నదోనని సరస్వతి తీవ్రంగా ఆలోచించసాగింది.
అల్లకల్లోలంగా ఉన్న మహాసముద్రంలోంచి ఉవ్వెత్తుగా అలలు లేచే విధంగా, తెరలు తెరలుగా నిరుత్సాహపుటలలు వీరభద్రుని హృదయంత రాళంలోంచి లేచి ఒడ్డున పడి విరుగుతున్నవని అతని చేతి కొనల్లోనే సరస్వతికి తెలిసిపోతోంది. ఎక్కడో సముద్రం మధ్యలో హాలాహలం ఉంటుందంటారు. అంత దూరం వెళ్ళి అంత లోతులకు దిగి చూస్తే కాని తెలియదు కదా! ఇప్పుడీ వీరభద్రుని శరీరంలోని వేడి కూడా ఎంత దూరాన, ఎంత లోతున వున్నదో తెలుసుకునే అవకాశమే లేదు.
ఆ సమయంలో అసందర్భంగా ఎంత సాహసం చేసినా అది అపక్వమైన ఫలంగానే పరిణమిస్తుంది. ప్రణయ కలాపాల్లో రుూ సమయా సమయాలు మరింత ముఖ్యమైనవి. ప్రణయ దేవుడు మన్మథుడే సమయం సందర్భం ఆలోచించకుండా తన పుష్పబాణాలను ఈశ్వరుని మీద ప్రయోగించి బుగ్గి అవలేదా?
కొంత వ్యవధి ఇస్తే వీరభద్రుడు రుూ వాతావరణానికి కాస్త అలవడి, రుూ భయాన్ని మింగి, కొంతవరకన్నా శక్తివంతుడౌతాడేమో చూడాలి.
అందుకనే సరస్వతి వేచి ఉన్నది. పిరికి తరంగాల నిడివి కాస్త తగ్గిందే కాని, కల్లోలం సర్దుబాటయ్యే సూచనలు కనుచూపుమేరలో కనిపించడం లేదు. బహుశా తెల్లవారే వరకూ వ్యవధి ఇస్తే కొంత సాహసాన్ని వీరభద్రుడు కూడగట్టుకోగలడేమో? కాని అంత వ్యవధి ఇవ్వటం అసంభవం.
కాలం రెక్కల మీద ఎగిరిపోతోంది. వృథాచేసే ప్రతి క్షణమూ ఎంతో విలువైనది. ఇక్కడ తన పక్కనే పడుకోబెట్టుకొని ఎక్కువసేపు వేచి ఉండటం కూడా క్షేమం కాదు. గురికి బారెడో మూరెడో అవతలో, ఇవతలో పడినప్పటికీ- ప్రయోగించి తన విధిని నిర్వహించటమే ఉచితమని సరస్వతి నిర్ణయించుకున్నది.
వీపుతట్టి వీరభద్రుణ్ని హెచ్చరించింది సరస్వతి. కోడి పందాలలో ప్రత్యర్థి తాలూకు కోడి కాలికి కట్టిన పదునైన కత్తిపోటు తిని, నేల కూలిన తన కోడికి ఉత్సాహమిస్తే అది ఛస్తూ,
బతుకుతూ మిగిలిన త్రాణను కూడగట్టుకొని ప్రాణం వదిలేదాకా తనకీ పోరాటం తప్పదనే ధోరణిలో శరీరాన్ని విదిలించుకొని లేచేందుకు చేసే
ప్రయత్నానికీ, రుూ వీరభద్రునిలోని పరిణామాలకూ ఎంతో పోలిక ఉన్నదని సరస్వతికి అనిపించింది.
తాను సిద్ధంగా ఉన్నాననే సమయ సూచనను రాణికి అందించిందామె. ఒక్క క్షణంలో రాణి ప్రవేశపెట్టమనే ఆజ్ఞను సాంకేతిక శబ్దం ద్వారా తెలియపరచింది.
మెల్లిగా వీరభద్రుడు లేచి నిలబడేటట్లుచేసి, మరొకరి వీపు తట్టి రాణి శయనాగారపు తెరలోంచి కొంచెం బలవంతంగానే, అతన్ని లోనికి నెట్టింది సరస్వతి. భీతిల్లిన పులి, పిల్లిగా మారగా, దాన్ని కత్తెర బోనులోకి పంపేటప్పుడు అది ఎంత దీనావస్థలో, ప్రాణభయంతో తల్లడిల్లిపోతుందో వీరభద్రుని అవస్థ స్పష్టపరిచింది.
అల్లకల్లోలంగా ఉన్న సముద్ర మధ్యంలో ఇరుక్కుపోయిన ఓడను. తన చాకచక్యంతో ఎలాగో నానా అవస్థాపడి, ఒడ్డుజేర్చి లంగరువేసి తాను సాధించిన విజయానికి తృప్తిగా నిట్టూర్చే నావికునివలె తన బాధ్యత నిర్వహించినట్లనిపించిందామెకు.
సరస్వతి తన తావులో పడుకొని వేయి కన్నులతో, పాము చెవులతో కాపలా కాస్తూనే తీవ్రంగా ఆలోచించసాగింది.
ఒక రాత్రంతా తోమి తోమి మొక్కవోయిన వీరభద్రుని ధైర్య సాహసాలకు పదునుపెట్టి, మెరుగులు దిద్ది, బ్రహ్మప్రళయం మీద అతన్ని ఒప్పించి ఉదయమే రాణిని దర్శించగా, రాణి నవ్వి ‘‘నీ మొహం చూస్తేనే తెలుస్తోంది సరూ! పండా? కాయా? అని వేరుగా ప్రశ్నించనవసరం లేదు. నీవు సాధించిన విజయానికి కృతజ్ఞురాల్ని!’’ అన్న మాటలు ఆమెకు గుర్తువచ్చినవి.
తాను పడిన అవస్థంతా వివరించేందుకు సమయసందర్భాలు రాలేదు. ఐనా రాణికి అదంతా చెప్పటం, తన అభిప్రాయాన్ని వివరించటం శ్రేయస్కరంగా సరస్వతికి తోచలేదు. ఆమెకు మనసైన దాన్ని ఖండించడం లేదా ఆమె అభిప్రాయానికి విరుద్ధ్భాప్రాయాన్ని ప్రకటించటం రాణికి కంటకప్రాయంగా ఉండొచ్చు. తాను సాధించిన ఫలాన్ని ఆమెకు అర్పిస్తే దాన్ని ఆరగించి, తనంతట తానుగానే రాణి తన పొరపాటును గ్రహిస్తుంది. అల్లరి పిల్లవానికి వద్దని, అనుచితమని, ప్రమాదమని చెప్పి ఒప్పించటం కన్నా వాడికి కావలసిన దాన్నిచ్చి చేతులు కాలనిచ్చి అనుభవ పూర్వకంగా తెలుసుకునేట్లు చేయటమే తగిన పాఠాన్ని నషాళానికి అంటేటట్లుగా బోధించటవౌతుంది కదా!
ఈ రాణి మహావిజ్ఞాని. ఎంతో తెలివితేటలు గలది. అంతవరకూ సందేహం లేదు... కాని ప్రేమకలాపాల్లో కొమ్ములు తిరిగిన జ్ఞానులు కూడా కాలుజారుతారు. పరమ మూర్ఖులవలె ప్రవర్తిస్తారు. ఉన్మాదులవలె తమను తాము మరిచి తల్లకిందులుగా పిల్లిమొగ్గవేసి, కాళ్ళు విరగగొట్టుకునే వరకూ తమ తప్పును తెలుసుకోలేరు. లోక చరిత్ర నిండా ఇలాటి దృష్టాంతరాలు అనేకం ఉన్నవి. రుూ రాణి ఆ ఉదాహరణలకు మరొక సంఖ్యను జేరుస్తుంది.
వయో రూప లావణ్యాలను చూసి రాణి భ్రమపడింది. కండబలం చూసి కామించిందే కాని, గుండె బలం సంగతి ఆమెకు గుర్తుకు రాలేదు. బ్రహ్మచారి కనుక తనలాటి కుసుమ కోమలాంగి పొందుకోసం పడి ఛస్తాడనీ, కొవ్విన తన శరీరానికి దాసానుదాసుడౌతాడనీ, రాబందు విందువలె తన దేహాన్ని భక్షించి తనకు పుత్రభిక్ష పెడతాడనీ రాణి పొరపడింది.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు