డైలీ సీరియల్

దూతికా విజయం-15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్నది ఒక్కటే ప్రాణం కనుక మీ సర్వస్వమూ వెలగా చెల్లిస్తున్నారనేది సబబైన మాట కావొచ్చేమో కాని అది చాలా స్వల్పమైన విలువని నేను అంటాను. నేనెందుకు ప్రథమ సమాగమానంతరం మీరే ఆ మాట అంటారని నా నమ్మకం! ఆమెతో ఒక్క రాత్రి ప్రణయడోలికల్లో ఊగిసలాడి మర్నాడు మరణదేవతకు బలిగా పోవలసి వుంటుందంటే స్ర్తిలు, బాలురూ, వృద్ధులూ, నిష్ప్రయోజకులూ, అరసికులూ, షండులూ మినహా మిగతా అందరూ సిద్ధపడి తమ వొంతు కోసం బారులు తీరి ఉవ్విళ్ళూరరా?’’
వీరభద్రుడు తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. తాను సరిగా చూడని రాణి సౌందర్యాన్ని ఊహించుకుంటుంటే మదనగోపాలుడు మళ్లీ చిందులు తొక్కుతున్నాడు.
వేడెక్కిన ఇనుప ముద్దమీదనే ఎక్కువ వ్యవధినివ్వకుండా బలంగా మోదితే ఆశించినంతగా అది సాగుతుందనే సిద్ధాంతాన్ని సరస్వతి ప్రయోగించింది.
‘‘పిచ్చి బ్రాహ్మలు మీరు. అదృష్టమనేది జీవితంలో ఎప్పుడో ఒక్కసారే వస్తుంది. అదృష్టదేవత ఎప్పుడు మీ ఇంటికొస్తుందో తెలియదు. ఆమె వచ్చి తలుపు తట్టినప్పుడు నీవు నిద్రిస్తూ ఉంటే ఆమె తిరిగి వెళ్లిపోతుంది. ఆ నష్టం నీదే కదా! అందుకని ఆమె రాకకోసం తలుపులు తెరిచి మేల్కొని వుండాలి. చేయి జారిపొయ్యాక చేసేదేమున్నది? సంవత్సరానికి ఒకసారి ప్రదర్శనలు ఇస్తే పొట్ట గడుస్తుందా? అసలు అంత దేహదారుఢ్యాన్ని కాపాడుకోవాలంటే సామాన్యమైన తిండి సరిపోతుందా? కొన్నాళ్ళకు ప్రజల కళ్ళు ఈ ప్రదర్శనకు అలవాటుపడితే తమ కాలాన్ని వృధా చేసుకొని ప్రేక్షకులుగా ఉండేందుక్కూడా నిరాకరిస్తారు. తమలాటివారిని రాజులూ, రాణులే పోషించగలరు..
మరొక్క విషయం- శరీరాన్ని ఇంత పుష్టిగా పెంచారే- ఏం చేస్తారు ఈ బలాన్నంతా? ఎవరికోసం? దీన్ని మీరొక్కరే భరించాలంటే మీకెంత కష్టం! అసలు అది తమకు ఏ విధంగా సుఖ సౌఖ్యాలను ఇస్తోంది? బరువెక్కిన మీ శరీరాన్ని మీరే మోసుకోవాలి కదా? రాణి దృష్టి మీ మీద పడటమే అదృష్టం! ఆమె తోడి అనుభవమే అమరం! నా మాట విని ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే మరి వంద జన్మాలక్కూడా ఇలాంటిది ఎదురవదు. ఆ తరువాత విచారించి ప్రయోజనం లేదు. ఆలోచించండి!’’
సరస్వతి మాటలు కర్ణోపేతాలుగా ఉన్నవని వీరభద్రుని వికసించే ముఖమే చెప్పి చాటుతూన్నది.
‘‘అదిగాక మేము

వేసే పథకం ప్రకారం మీకు ఎలాటి విపత్తూ కలగదని మా గాఢ విశ్వాసం. ఎంత మంది పురుషులు రాణివాసాల్లో తమ కామవాంఛలు తీర్చుకొని సురక్షితంగా తిరిగి రాలేదు కనుక? ఎన్ని చిత్రాతి చిత్రమైన కథలు మనం వినలేదు? మీ దరిద్ర దేవతను దూర తీరాలకు తరిమిపారేసే లక్ష్మీదేవి వస్తుంటే మోకాలడ్డకండి. రతీదేవి రసికతతో రంజింపజేసేందుకు సిద్ధపడితే ప్రవరునివలె షండుని రీతి ప్రవర్తించకండి. మీరు నిరాకరిస్తే ఈ జీవితానికి మీకు ముక్తి ఉండదు. రాణి కోర్కెను తీర్చటం, మీ జీవితంలోని కోర్కెలన్నిటినీ తీర్చుకోవటమనే మాట జ్ఞాపకం ఉంచుకోండి. అధమంగా అనేక బాధలు పడుతూ అరవై ఏళ్ళు బతకటం కన్న, అమర సుఖంతో ఐదు రోజులు బతికితే చాలదా!’’
సరస్వతి వాక్చాతుర్యానికి వీరభద్రుడు ఆశ్చర్యబోతున్నాడు. క్షణాల్లో తనలోని పిరికితనాన్ని పారద్రోలి, హృదయంలోని ఆశాజ్యోతిని అగ్నిగుండంవలె భగభగా మండేటట్లు చేయగలిగింది. ఇంత నైపుణ్యమున్న స్ర్తితోడుగా ఉంటే ఆపదలు కూడా ఆమడ దూరానికి పారిపోతవనేది నమ్మదగిన మాట.
చప్పున ఒక తలపు మెరిసింది వీరభద్రుని కళ్ళముందు.
‘‘సరే... నేను ఒప్పుకుంటాను. నీవు చెప్పిన తర్కమూ, వేదాంతమూ, సబబుగా ఉన్నవి... మరి నా పారితోషికం-?’’
‘‘పిచ్చివాడా! అది నీవు అడగాలా? రుూ దేశంలోని మహదైశ్వర్యవంతుల్లో ఒకడివౌతావు. ఈ మాట రాణిదగ్గర రానీకు. ఆమె నిన్ను ధనంతోనే తూచే పరిస్థితుల్లో నిన్నసలు కోరదు. ఆ భారం నాది!’’
వీరభద్రుడు తాను తొందరపడినందుకు కాస్త సిగ్గుపడ్డాడు. సరస్వతి బుద్ధిచాతుర్యానికి, సేవాధర్మ తత్పరత క్కూడా అతను మనసులోనే అభినందనలు అర్పించుకున్నాడు.
‘‘నాకో ఆలోచన వచ్చింది’’అన్నాడు వీరభద్రుడు ఎలాగైనా తనక్కూడా తెలివితేటలు లేకపోలేదని నిరూపించేందుకు.
‘‘చెప్పండి-’’
‘‘కవచమూ, శిరోభూషణమూ కూడా వేసుకొని వస్తే, ఒకవేళ కాపలావాడు ఎదురుతిరిగి బల్లెంతో పొడిచినా చావుదెబ్బ తట్టుకోవచ్చు కదా!’’
సరస్వతి పగలబడి నవ్విన నవ్వుకు వీరభద్రుని ముఖం ముడుచుకొనిపోయింది. అంతలోనే ఆమె తననుతాను సంభాళించుకొని అన్నది.
‘‘మీ ఆలోచనలు కట్టిపెట్టండి. ఎందుకంటే మీ ఊహలు లేనిపోని కొత్త కొత్త ప్రమాదాలను కూడా కొని తెస్తూన్నవి. మీరేమైనా కదనానికి కదులుతున్నారా? మదన కదనానికి వచ్చేటప్పుడు, ఆ రణానికి అవసరమైన ఆయుధాలే ఉండాలి కాని లేనిపోని గాడిద బరువు దేనికి? కాపలావాడు తిరగబడితే కాలాంతకుడు కూడా అడ్డురాలేడు. వాడి దగ్గర ఒక ఈల ఉంటుంది. సాంకేతిక భాషలో దాన్ని ఊదితే కోటలో ఒక పెద్ద గంట గందరగోళంగా అన్నివైపులకు స్పష్టంగా వినిపించేటట్లు గణాగణా మోగుతుంది. మరుక్షణంలోనే ఒక చేతిలో భగభగ వెలిగే దివిటీలతో, మరో చేతిలో తళతళా మెరిసే కత్తులతో ఒక యోధానుయోధుల గుంపు ఆ ప్రదేశానికి జేరుతుంది. ఈలోగా మీ బలపరాక్రమాలు చూపి అక్కడి కాపలావాణ్ణి కాలయముడికి మీరు అంకితం చేయగలిగినా అలనాడు అభిమన్యుడు పద్మవ్యూహంలో ఇరుక్కొని ఏ విధంగా చిత్రవధ చేయబడ్డాడో స్వయంగా తెలుసుకుంటారు. మీ కవచాలు, గివచాలు వొలవబడి మెత్తగా, హాయిగా శరీరంలోకి పదును కత్తులు చొచ్చుకొనిపోతవి. అలాంటి విషమ పరిస్థితుల్లో నేనుకూడా రాణివాసం వరకూ జేరతానో లేదో అనుమానం. అదీగాక మీరు పారిపోవలసి ఉంటే రుూ కవచమూ మొదలైన బరువుతో అడుగులు సాగవు.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు