డైలీ సీరియల్

భజనతో భవబంధాలు దూరం( ప్రహ్లాదుడు -11)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముందు మీరు స్వస్థులు కండి. మీకొచ్చిన భయం ఏమీ లేదు. మీకు అండగా నేనున్నాను. మీరు నిశ్చింతులై నాకు వివరం చెప్పండి. మీరు ఎందుకు వేదన చెందుతున్నారు అని శాంత చిత్తంతో హిరణ్యకశిపుడు అడిగాడు.
వారంతా ఒక్కసారిగా జరిగిన విషయం చెప్ప బోయారు. అంతలో మరలా వారే సర్దుకుని ఒక కులపతి ఇలా చెప్పాడు. ‘‘దానవోత్తమా! మీ కడుపున ఇలాంటి వాడు పుట్టాడంటే మమ్ములను మేమే నమ్మలేకున్నాము. మా మాటలు పక్కన పడేసి మా విద్యార్థులందరినీ తన వైపుకు తిప్పేసుకుంటున్నాడు. వారినందరిని ఒకటిగా చేసి మాపై పుస్తకాలను విసిరేసి గుహల్లోకి తీసుకొని వెళ్తున్నాడు. ఇక్కడ గురువులు చెప్పేదంతా అబద్ధాలే. మనకు తిండి బట్టా కాదు ముఖ్యం శాశ్వతమైన పరంధామం కావాలి. మనమంతా ఒకనాటికి ఈశ్వరునిలోకి ఐక్యం చెందాల్సిన వారిమే. ప్రళయ కాలం ముంచుకురాకముందే మనం మేల్కొందాం. క్రిమి కీటకాదులుగా అనేక యోనులందు పుడుతూ చస్తూ ఉండక మనం హరిని నమ్ముకుంటే ఈ జననమరణ చక్రం నుంచి విడివడి స్వర్గ్ధామంలో నివసించవచ్చు అని ఏమేమో విషయాలు బాలలకు నూరిపోస్తున్నాడు. వారంతా మా మాటలు వినడం లేదు.కనీసం మావైపు కూడా చూడడంలేదు. పిల్లలంతా మాకు వ్యతిరేకులుగా మీ పుత్రుడు మార్చేశాడు.
నీ సమర్థతో నీ కొడుకును చక్కదిద్దుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇంతకాలమూ ఎవరో నేర్పిన బుద్ధులివి అనుకొన్నాం. కానీ అతనికి పుడకతోనే వచ్చినట్టుందీ బుద్ధి. ఇక పుడకతో కానీ పోదేమో. వాడు చెడిపోవడం కాక మా పిల్లలను కూడా చెడిపేస్తున్నాడు. అందరూ హరినామ సంకీర్తనలో ఓలలాడుతున్నారు. పిలిచినా అరిచినా కొట్టినా మావైపు కనె్నత్తి చూడడం లేదు అని ఎలుగెత్తి చెప్పారు.
ఆ మాటలు విని హిరణ్యకశిపుడు ఉల్కిపడ్డాడు. ఏమిటి అని గట్టిగా అడిగాడు. హృదయం అగ్నిగోళంలా మారింది. ఏమిటి ఏమి జరుగుతోంది. నా ఇంట్లోనే నాకు వ్యతిరేకులా.. ‘‘వాడిని ఇటు తీసుకొని రండి’’ అని గట్టిగా అరిచి చెప్పాడు.
భటులువెళ్లి ప్రహ్లాదుడు కొని తెచ్చారు. నమస్కారం చేస్తున్న కొడుకును చూసి ‘ఏమిరా అర్భకా! ఏదో వదరుబోతులాగా పెదురుతున్నావట. నా ఆజ్ఞ లేకుండా దినకరుడు కూడా ఒక్క అడుగు ముందుకు వేయడానికి సందేహిస్తాడు. వాయువు, వరుణుడు ఎవరైనా సరే నా ఆజ్ఞానుసారం మెలగవలసిందే. ఒక్కడంటే ఒక్కడు నాముందు నిల్చునే సాహసం చేయలేరు. వారి గురించి నీవేదో పిల్లలకు చెబుతున్నావట. నీకెవరు నేర్పారీ బుద్ధి. నీవెనుక ఉండి ఆడించేదెవరు ? వాళ్లకు దమ్ముంటే నా ముందుకు రమ్మను ’ అని గద్దించాడు.
చిరునవ్వు వీడని ప్రహ్లాదుడు మరింత గా నవ్వాడు.
ఆ నవ్వు హిరణ్యకశిపునికి ఆగ్రహంతో మండిపోయేట్టుచేసింది. ఏదీ నీ విష్ణువును జయించడం సాధ్యంకాదని చెప్తావా. అసలు నీ విష్ణువెక్కడ? నేను నీ దేవతలు హింసించినపుడు రాలేదేం? వారిని నానాయాతనలకు గురిచేస్తుంటే ఎక్కడ దాక్కున్నాడు? భక్తజన పరిపాలకుడని వీరి నీ పైత్యపు మాటలు ఎందుకు చెబుతున్నావు. అసలు ఇంతకు ముందు నిన్నుకూడా మేం హింసించాం కదా. మరి నిన్ను రక్షించ రాలేదేం ?
అటువంటి వాడి గురించి మన రాక్షస వంశసంప్రదాయాలను నాశనం చేస్తావా. నీలాంటి వాడు ఇక్కడ ఉండతగడు. రాజ్యపరిపాలనలో నాకు బంధుత్వం గుర్తుకురాదు. నా రాజ్యంలో అందరూ ననే్న అనుసరించాలి. నీవు అనుసరించకపోయావా?
నీ ప్రాణాలను నేను త్రుటిలో తీసిపారేస్తాను. అంటూ ఆగ్రహోజ్వాలలను హిరణ్యకశిపుడు వెళ్లగక్కాడు. రాజదర్బారులో ఉన్నవారంతా గజగజలాడిపోతున్నారు. ఎపుడు ఏం జరుగుతోందో అని వ్యాకులం చెందుతున్నారు.
ఈ పిచ్చి బాలకుడేమి ఇంతగా మాట్లాడుతుంటే నవ్వుతున్నాడు.

- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804