కథ

అదనపు సంపాదన ( కథల పోటీలో ఎంపికైన రచన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దసరా మామూలు ఇవ్వను’ అని చెప్పడానికి నోరు రాకపోయినా ఇవ్వడానికి చేతులు మాత్రం ముందుకు రాలేదు. పేపర్ వేసే అబ్బాయి ఏజెంట్ పంపించాడని చెప్పి వచ్చాడు. పధ్నాలుగేళ్లు ఉండొచ్చేమో వాడికి. సన్నగా పొడుగ్గా నల్లగా నుదుటన విభూతి బొట్టు, చేతిలో మామూళ్లు రాసుకొనే పుస్తకంతో చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు ఉపాధ్యాయుడి ముందు విద్యార్థిలా.
వాడినింతకు ముందు ఎప్పుడూ చూడలేదు. అదే విషయం అడిగాను వాడిని. చేరి నెలే అయిందని చెప్పాడు. వాడు మాట్లాడే తీరు, అమాయకమైన మొహం చూస్తే జాలి అనిపించింది. వృత్తిలోకి కొత్తగా దిగాడని కూడా అనిపిచింది. ఎందుకంటే, మామూలుగా మామూళ్లు, చందాలు వసూలు చేసేవారు డబాయింపుగా మాట్లాడ్తారు చాలా మటుకు. ఇది కూడా ఇవ్వకపోతే, ఇంకెందుకు మీరు దండగ.. అన్నట్లు.. వీడలా లేడు. డబ్బులు అడిగేటప్పుడు నావైపు చూసి కాక నేలను చూస్తూ అడిగాడు. వాడిలో అంతర్లీనంగా తొణికిసలాడిన భావమేమిటో మరి. అంతరాత్మో లేక అమ్మే ఎప్పుడైనా చెప్పిందేమో - కష్టపడని సొమ్ముని ఆశించవద్దని.
కాని వాడు మాత్రం ఏం చేస్తాడు? ఒకరి కింద పనిచేసే పిల్లాడు. అయితే ఉద్యోగాన్ని వదులుకోవాలి లేదా నియమాన్ని వదులుకోవాలి. అయితే నేను వాడికి ‘డబ్బులు ఇవ్వను’ అని చెప్పగానే, వాడు ఉసూరుమని వెళ్లడమో లేక మళ్లీ మళ్లీ అడగడమో చేస్తాడనుకుంటే, చిత్రంగా కళ్లల్లో చిన్న మెరుపుతో, పెదాలపై చిరునవ్వుతో ‘అలాగే మేడం’ అని చెప్పి టకటకా మెట్లు దిగి వెళ్లిపోయాడు.
* * *
‘మేడంగారూ డబ్బులు...’ అని నసుగుతూ నిల్చున్నాడు టెలిఫోన్ బాగు చేయడానికి వచ్చిన లైన్‌మన్. ‘ఎందుకు డబ్బులు? మీ కంపెనీ వారు ఇది ఫ్రీ సర్వీస్ అని చెప్పారు’ అని అన్నాను.
‘అయ్యో! మేడం! ఇది కంపెనీకి కాదండి. మీరెప్పుడు పిల్చినా వెంటనే వస్తాం కదండి. సార్ దగ్గర నా నంబర్ కూడా ఉందండి...’ అంటూ మళ్లీ నసగడం ప్రారంభించాడు. ఇవ్వాలని లేకపోయినా, ఇవ్వక తప్పని పరిస్థితి నాది. ప్రొద్దున్న ఆఫీసుకెళ్తూ మరీమరీ చెప్పారాయన. ‘్ఫలానా వాడు వస్తాడు టెలిఫోన్ బాగు చేయడానికి. వాడు అడిగినా అడక్కపోయినా డబ్బులు ఇవ్వు’ అని. ఏదో ఒక ప్రయత్నంగా ఫ్రీ సర్వీస్ విషయం ఎత్తాను కాని, చివరికి డబ్బులివ్వక తప్పదని నాకూ తెలుసు.
ఎంత ఆలోచించినా నాకర్థంకాని విషయమేమిటంటే నాకు తప్పుగా తోచిన విషయాలు ఆయనకు అతి సాధారణ విషయాలుగా ఎందుకు అనిపిస్తాయా అని. పైపెచ్చు నేను అతిగా స్పందిస్తానని, ప్రపంచానికి భిన్నంగా ఆలోచిస్తానని, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తానని.. ఇలా ఎన్నో. ‘కావాలంటే చుట్టుపక్కల వారిని, తెలిసిన వారిని, బంధువులని, స్నేహితులని.. ఎవరినైనా అడుగు. అందరూ ఎక్స్‌ట్రా మనీ ఇస్తారు. నువ్వొక్కదానివే కాదు.. ఎక్స్‌ట్రా మనీ లేకపోతే ఇవాళా రేపు సర్వీసులు అందడం కష్టం. ఈ ఎక్స్‌ట్రా మనీని ఒక్కోరు ఒక్కో రకంగా సంపాయిస్తారు. దానికెందుకు ‘ఓవర్ రియాక్ట్’ అవుతావ్’ అంటూ ఎదురు నాకే ఉపన్యాసం ఇస్తారు.
మొన్నటికి మొన్న గ్యాస్ సిలిండర్ విషయంలోనూ అంతే. నేను ‘ఎక్స్‌ట్రా’ డబ్బులు ఇవ్వలేదని చెప్తే, గయ్‌మని నా మీద ఇంతెత్తున లేచారు. పైగా వాడు ఈసారి ‘డెలివరీ’ చెయ్యకుండా ‘డోర్ లాక్’ అని రాసుకొని వెళితే ఏజెన్సీ చుట్టూ నువ్వే తిరగాలి అని బెదిరించారు కూడా.
అసలందులో నా తప్పేమిటో నాకిప్పటికీ అర్థంకాదు. డెలివరీ బాయ్ రిసీట్‌లో ఉన్న మొత్తానికన్నా 20 రూపాయలు ఎక్కువ చెప్పాడు. ‘అదేంటి? ఇరవై రూపాయలు ఎందుకు ఎక్స్‌ట్రా?’ అనడిగితే ‘డెలివరీ చేసినందుకు’ అని చెప్తున్నాడు.
‘డెలివరీ ఛార్జెస్ కలుపుకునే కదా!’ అంటే ‘ఇరవై రూపాయలే కదా మేడం! దానికి ‘రూల్స్’ చెప్తారేంటి’ అని దురుసుగా మాట్లాడాడు. వీడు కొత్తవాడు. ఇంతకు ముందొచ్చిన అబ్బాయి ఇలాగే ‘ఎక్స్‌ట్రా’ అంటే అతనికీ ఇదే విషయం చెప్పి వాళ్ల సార్‌కి కంప్లైంట్ ఇస్తానన్నాను. ఆ తరువాత నుంచి అతడు ‘ఎక్స్‌ట్రా’ అడగడం మానేశాడు. అది నా మాటల ప్రతిభ అని నేనంటే, దానికి ఆయన...
‘నీ మొహం వాడు భయపడింది నీ బెదిరింపుకి కాదు. వాడొచ్చినప్పుడు ఇంట్లో యూనిఫారంలో ఉన్న మీ ‘డిఎస్పీ’ అన్నయ్యను చూసి’ అంటూ తేలిగ్గా కొట్టిపారేశారు.
ఇతడితో అలానే ‘మీ సార్‌కి కంప్లైంట్ ఇస్తానంటే, బెదరడం మాట ప్రక్కనుంచితే ‘నా సర్వీసులో మీలాంటి వాళ్లను ఎక్కడా చూళ్లేదు. పెద్దపెద్ద ఫ్లాట్స్‌లో ఉంటారు. ఇరవై రూపాయలు ఇవ్వడానికి ‘కంప్లైంట్’ దాకా పోతున్నారు. ‘డోర్‌లాక్’ అని రాసుకెళ్లే వాళ్లని ఏం చేస్తారు మేడమ్’ అంటూ నా సమాధానం కోసం కూడా చూడకుండా వచ్చిన లిఫ్ట్‌లోనే వెళ్లిపోయాడు.
వాడి నిర్లక్ష్య ధోరణికి విపరీతమైన కోపం వచ్చింది. మాటల్లో, ప్రవర్తనలో ఎక్కడా మర్యాదనేదే లేదు. ఎదురింటావిడకు కూడా అతనప్పుడే ‘సిలిండర్ డెలివరీ’ చేశాడు. ఆవిడ ఇరవై రూపాయలు ఎక్కువే ఇచ్చి, లోపలికి వెళ్లకుండా ఎదురుగా ఏదో రియాల్టీ షోని చూస్తున్నట్లు చూసి, అతడి ధోరణికి నిర్ఘాంతపోయి నిల్చున్న నన్ను చూసి, ఓ నవ్వు నవ్వి తలుపేసుకుంది. ఏదో సామెత చెప్పినట్లు -‘మొగుడు కొట్టినందుకే కాదు తోటికోడలు నవ్వినందుక్కూడా’ అన్నట్లుగా నా బాధ, కోపం రెట్టింపయ్యాయి.
అది తగ్గించుకొని కొంత ఉపశమనం పొందుదామని ఈయనకి చెప్తే గోరుచుట్టు మీద రోకటి పోటులా ఈయన కూడా ననే్న కోప్పడ్డారు. మనసుకి సాంత్వన సంగతి ప్రక్కనపెడితే అలజడి మాత్రం ఆరింతలైంది.
* * *
‘బాబూ! ఇదిగో’ అంటూ చేతిలో ఓ యాభై రూపాయల నోటు పెట్టారీయన. ‘్థంక్యూ సార్’ అని చెప్పి వెళ్లిపోయారు ఆ ఇద్దరు కుర్రాళ్లూను.
తలుపేసి వెనక్కి తిరిగి నన్ను చూసి ‘నాకు తెలుసు. నువ్వేం అడగదల్చుకున్నావో. ‘డిష్ రిపేర్’కి మనం ఇదివరకే ‘సర్వీస్ ప్రొవైడర్’కి కట్టిన ప్యాక్‌లోంచి డబ్బులు కట్ చేసుకుంటారనేగా! అవును. చేసుకుంటారు. ఈ డబ్బులు కంపెనీకి కాదు. ఈ వచ్చిన కుర్రాళ్లకి. ఇలా మనలాంటి వాళ్లం ఇస్తేనే వాళ్లకేమైనా రాబడి ఉండేది. లేకపోతే వచ్చే జీతాలతో వాళ్ల జీవితాలు ఎలా వెళ్తాయి. పై సంపాదన ఉంటేనే మంచిది’ అంటూ ఫోన్ పట్టుకుని బాల్కనీలోకి వెళ్లారు.
* * *
ఆదివారం అవడంతో ఆయన ఇంట్లోనే ఉన్నారు. టీవీలో వార్తలు చూస్తున్నారు. ఒక్క ఛానెల్ కుదురుగా చూడరు. నిమిషానికి ముప్పైసార్లు మారుస్తారు. ఏం వింటారో, ఏం చూస్తారో నాకర్థంకాదు. అందుకే ఆయన పక్కనే కూర్చున్నా, తనతోపాటు టీవీ చూడకుండా పక్కనే టీపాయ్ మీద ఉన్న వార్తాపత్రిక తీసి చదవడం మొదలెట్టాను.
హఠాత్తుగా ‘్ఛఛీ! వీళ్లు బాగుపడరు..’ అంటూ రిమోట్‌ని కూర్చున్న సోఫామీద గట్టిగా కొట్టారు. అంతలా ఈయన్ని కదిలించిన వార్త ఏమిటా అని చూస్తే నాల్రోజుల బట్టి ఊదరగొడుతున్న అదే కుంభకోణం వార్త. దాని గురించి రెండ్రోజులకు పూర్వమే పేపర్‌లో చదివి నిరసన వ్యక్తం చేశారే. మళ్లీ ఎందుకు వాపోతున్నారో అర్థంకాక ‘ఏమైందండీ! ఆ రాజకీయ నాయకుడి గురించా..’ అడిగాను.
దానికాయన ‘కాదోయ్! ఛానెళ్ల గురించి. ‘టీవీ రెండున్నర’ కుంభకోణం గురించి ఊదరగొడ్తోందా? ‘టీవీ మూడున్నర’ అంతకన్నా ఎక్కువ హడావిడి చేస్తోంది.
‘టిఆర్‌పి రేటింగ్ కోసం మామూలే కదండి. ఎవరెంత హడావిడి చేస్తే ‘వ్యూయర్‌షిప్’ అంత ఎక్కువగా పెరుగుతుందని. అదో భ్రమ. మరో కొత్త వార్త దొరికేవరకే.. తరువాత ఈ లక్ష కోట్ల కుంభకోణం గురించి గాని, సదరు రాజకీయ నాయకుడి గురించి కాని వీళ్లకక్కర్లేదు. ప్రజలు కూడా - వార్తలు అందించే వాళ్లకే అక్కర్లేకపోయినప్పుడు చూసే మనకు మాత్రం ఎందుకూ అన్నట్లుగా వీళ్లూ వదిలేస్తున్నారు’ అంటూ నా అభిప్రాయాన్ని వెలిబుచ్చబోయాను.
కాని, ఆయన ‘అదికాదోయ్! వీడేమో లక్ష కోట్ల గురించి చెప్తున్నాడా! వాడేమో, ఎవరో ప్రభుత్వోద్యోగిట ఐదు వేలు లంచం తీసుకొంటూ దొరికిపోయాట్ట. అది చెప్తున్నాడు. చెప్తే చెప్పాడు. ఈ ఛానెల్‌లాగానే ఆ ఛానల్‌వాడూ ‘ఎక్స్‌క్లూజివ్’ ‘బ్రేకింగ్ న్యూస్’లంటూ అదరగొట్టడం దేనికి? అదో పెద్ద న్యూసా? పోటీకి కాకపోతే - అంత చిన్న విషయానికి వీళ్ల రాద్ధాంతం ఇంత అవసరమా? అందుకే అన్నా వీళ్లు బాగుపడరని. దేనికెంత ప్రాముఖ్యత నివ్వాలో తెలియకపోతే ఎట్లా!’ అంటూ ఆ రెండూ కాక మరో ‘ఆరున్నర ఛానెల్’ పెట్టారు.
* * *
‘బాగున్నారా మేడమ్?’ అన్న పిలుపుతో వెనక్కి తిరిగి చూశా. వాడే! ఆ పిల్లాడే! గుర్తు పట్టలేదనుకున్నాడో ఏమో! ‘నేను మేడమ్! పేపర్ బాయ్’ని. మీ ఇంటికొకసారి దసరా మామూలు కోసం వచ్చాను’ అని గుర్తుచేసే ప్రయత్నం చేశాడు. కాని ‘మీరివ్వలేదు’ అని మాత్రం అనలేదు. అనడు కూడా. అందుకే ఆనాటి అతడి కళ్లల్లో మెరుపుని నేను ఈనాటికీ మర్చిపోలేదు. ఓ చిరునవ్వు నవ్వి ‘బాగున్నావా? ఇప్పడిక్కడ పని చేస్తున్నావా?’ అనడిగాను వాడి వొంటి మీద ఉన్న సూపర్‌మార్కెట్ యూనిఫాం చూసి.
‘అవును మేడమ్!’ అంటూ నా చేతిలో ఉన్న బుట్టను లాక్కొని ‘ఏం కావాలో చెప్పండి మేడం’ అన్నాడు.
‘్ఫర్వాలేదులే. నేను తీసుకుంటాను. నువ్వెళ్లి నీ పని చూసుకో’ అనంటే ‘్ఫర్లేదు మేడమ్! మధ్యాహ్నం పూట కస్టమర్లు పెద్దగా రారు. అయినా ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను. మీరు ‘లిస్ట్’ చెప్పండి. నేను తీస్తాను’ అంటూ నాకు మరో మాటకి అవకాశం ఇవ్వకుండా పని ప్రారంభించాడు. నేనూ వాడిననుసరించాను. దూరంగా కౌంటర్ దగ్గరే ఆగిపోయి ఫోన్ మాట్లాడుతున్న మా వారు ఎవరన్నట్లుగా సైగ చేస్తే నేను నవ్వి ఊరుకున్నాను. కాని వాడు ఎవరు అని తెలుసుకోవాలన్న కుతూహలం నాక్కూడా కలిగింది.
నాంది వాక్యంగా ‘చదువుకుంటున్నావా?’ అడిగాను. నా ప్రశ్న కోసమే చూస్తున్నవాడిలా ‘అవును మేడం. ప్రైవేట్‌గా టెన్త్‌కి కట్టాను. పేపర్ బాయ్‌గా చేస్తే వచ్చే డబ్బులు సరిపోవట్లేదు మేడం... అందుకే ఇక్కడ చేరాను. నాలుగు వేలు ఇస్తున్నారు.
‘ఏడో క్లాసు వరకు స్కూలు కెళ్లే చదువుకున్నాను మేడం. మా నాన్న పోయిన తర్వాత స్కూలు మానేసా!’
నా మొహంలో ‘ఎందుకు?’ అని పలికిన భావం గ్రహించినట్లున్నాడు. ‘అమ్మ పనికెళ్తది. కాని మేడం, నేను అమ్మ, చెల్లి ముగ్గురికీ సరిపోదు కదా మేడం. అందుకే నేను పని చేయటం మొదలుపెట్టాను. ఇప్పుడు నాకు పదిహేను పడ్డాయి. అందుకే పనిలో పెట్టుకున్నారు. 15 రాక ముందు పనిలో పెట్టుకోవద్దని రూలు ఉందట కద మేడం. అందుకని ఇలా నెలవారి ఎవరూ సరిగ్గా పెట్టుకోలేదు. ఇప్పటికీ మా సార్ ఎవరైనా అడిగితే పదహారేళ్లని చెప్పమంటారు. నేనూ అలాగే చెప్తాననుకోండి. ఏంటో ప్రభుత్వం రూలు పెడ్తది కాని తిండి మాత్రం పెట్టదు’ అంటూ నవ్వుతూ బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి నా సరుకులు చేర్చాడు. మా వారు బిల్లు కట్టాక ఆ సంచులు మోసుకొచ్చి కార్లో పెట్టేసి ‘ఉంటాను మేడమ్! ఉంటాను సార్!’ అని వెళ్లిపోబోతూండగా మా వారు వెనక్కి పిలిచి అలవాటు ప్రకారం జేబులోంచి ఓ ఇరవై రూపాయల నోటు తీసి ఇవ్వబోతూండగా వాడు ‘వద్దు సార్. ఈ సర్వీస్ ఫ్రీ. మా సూపర్‌మార్కెట్ కస్టమర్లకిస్తుంది. ‘ఫ్రీ హోం డెలివరీ’ కూడా ఉంది సార్’ అని చెప్పాడు.
దానికి ఈయన ‘్ఫర్లేదమ్మా! నీ సర్వీస్‌కి నేను సంతృప్తి చెంది ఇస్తున్నాను. మేడంని కనీసం ‘ట్రాలీ’ అయినా తోయనివ్వలేదు కదా! పై సంపాదన దేనికో దానకి ఉపయోగపడుతుంది లేరా!’ అంటూ నా వైపు చూసి నవ్వి, చనువుగా వాడి జేబులో డబ్బులు పెడ్తుండగా.. ‘వద్దు సార్! ఏమీ అనుకోకండి. ఖాళీగా ఉన్నా కాబట్టి చేయగలిగా లేకపోతే నేను కూడా చేయలేను కదా సార్! ఇప్పుడు సరుకులు పెట్టడం మా డ్యూటీయే! నా పనికే కదా వాళ్లు జీతమిచ్చేది. నాకు నాలుగు వేలు ఇస్తున్నారు సార్!’ అని ‘ఎక్కువసేపు బయట వుంటే మా సారు కోప్పడతారు. ఉంటా మేడమ్! ఉంటా సార్!’ అని వెళ్లిపోబోయే వాడల్లా వెనక్కి తిరిగి ‘సారీ సార్’ అని మళ్లీ చెప్పి ‘మళ్లీ మా సూపర్ మార్కెట్‌కే రండి మేడమ్’ అని చెప్తూ మెట్లెక్కి ‘స్టోర్’లోకి వెళ్లిపోయాడు.
* * *
కారు ఇంటివేపు దారి తీసింది. ఆయనకేదో అవగతమైందని నాకు అవగతమైంది. అదనపు సంపాదన తప్పు కాదు. కాని, అది ఏ మార్గంలో వస్తోందన్నది ఎప్పుడూ ముఖ్యమే! అది పది రూపాయలైనా.. పదివేల కోట్లయినా...

(వరిగొండ) కాసర్ల సత్యసురేఖ
35-5-220, ‘ఆదిత్య’, జీవనమిత్రా నగర్, విద్యారణ్యపురి
హనుమకొండ- 506 009.. 9849248495

-వరిగొండ సత్యసురేఖ