డైలీ సీరియల్
యాజ్ఞసేని 37
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వివాహ తతంగమంతా యథావిధిగా ముగిసింది. ద్రుపదుడు, పాండవులు, ద్రౌపది సంతోషించారు.
ద్రుపదుడు మహారథులైన పాండవులకు కానుకలను ఇచ్చాడు.
వివిధ వస్తు సామగ్రిని, సువర్ణమాలలుగల నూరు రథాలను ఇచ్చాడు.
పద్మమూ, శంఖమూ గల వంద ఉత్తమ గజాలను ఇచ్చాడు.
బంగారు తొడిగిన వంద ఏనుగులను ఇచ్చాడు.
వనవతలైన వందమంది దాసీజనాన్ని, విలువైన వస్త్రాలను, ఆభరణాలను కానుకగా ఇచ్చాడు.
చంద్రవంశాన్ని ఉద్ధరించే ద్రుపదుడు పాండవులకు వేరు వేరుగా అగ్నిసాక్షిగా ధనాన్ని, వస్త్రాలను, అధికార సూచనలైన ఆభరణాలను అర్పించాడు.
వివాహానంతరం ద్రౌపది అత్తగారైన కుంతీదేవికి వినయంతో ‘‘రాజమాతకు ద్రుపద రాజపుత్రి అయిన ఈ ద్రౌపది నమస్కరించుచున్నది’’ అని అన్నది. అందం, శుభలక్షణాలుగల కోడలు ద్రౌపదిని కుంతీదేవి ఆశీర్వదించింది.
‘‘ద్రుపద రాజపుత్రీ! సౌభాగ్యవతివై సుపుత్రులతో, పౌత్రులతో వర్థిల్లుదువుగాక!’’ అని మరలా-
‘‘ద్రౌపదీ! శచీదేవి ఇంద్రుని, స్వాహాదేవి అగ్నిని, రోహిణి చంద్రుని, దమయంతి నలుని, భద్ర కుబేరుని, అరుంధతి వశిష్ఠుని, లక్ష్మీదేవి నారాయణుని సేవించినట్టుగా నీవు నీ భర్తలను ప్రేమతో సేవింపుము. మంగళకరమైన నీవు సౌఖ్యాలతో కూడి చిరంజీవులు, వీరులు అయిన పుత్రులను పొందుము.
‘‘నల్లకలువల వంటి కన్నులుగల ద్రౌపదీ! నేను నిన్ను పొంది సంతోషించినట్లే నీకు కూడా సంతోషించదగిన, మాన్యులైన కొడుకులు, మనుమలు నీకు కలుగుగాక! సౌభాగ్య భోగాలను పొంది యజ్ఞపత్నివి, పతివ్రతవు అగుము’’.
ఇంటికి వచ్చిన అతిథులను, అభ్యాగతులను, వృద్ధులను, పెద్దలను తగినట్లు సేవిస్తూ అనేక సంవత్సరములు గడిపెదవుగాక!
ధర్మవత్సలవైన నీవు కురుజాంగలం మొదలైన దేశాలకు, నగరాలకు భర్తతో కలిసి అభిషిక్తురాలవై పట్టపురాణివి కాగలవు.
అశ్వమేథ యాగంలో భూమినంతటినీ బ్రాహ్మణులకు దానమిమ్ము.
కళ్యాణీ! నీకు ఎల్లప్పుడూ శుభమగుగాక!’’ అని పలికి కౌగిలించుకొని ఆశీర్వదించింది.
పాండవులు అయిదుగురు ద్రౌపదిని వివాహమాడినారని విని ద్వారకలోనున్న శ్రీకృష్ణుడు సంతోషించాడు. పాండవులైదుగురకు వజ్రాలు, వైఢూర్యాలు, మరకతములు, ముత్యాలు పొదిగిన ఆభరణాలు, వివిధ దేశాలకు చెందిన విచిత్ర వస్త్రాలను ఎన్నో ఏనుగులనూ, గుఱ్ఱాలనూ, రథాలనూ, పల్లకీలనూ, స్ర్తి, దాసీజన సమూహాలనూ కానుకలుగా పంపించాడు.
స్వయంవరం పూర్తికాగానే రాజులందరూ ద్రౌపది పాండవులను వరించిందని తెలిసి వచ్చినట్లే వెనుదిగిపోయారు.
ఒక సంవత్సరం పాటు పాండవులు ద్రుపదుని నగరంలో రాజవైభోగాలు అనుభవిస్తూ గడిపారు.
***
21
విశ్వసనీయ దూతల ద్వారా రాజులు, దుర్యోధనాదులు శుభలక్షణమైన ద్రౌపదికి పాండవులతో వివాహమైందని తెలిసికొన్నారు.
ధనున్సుతో లక్ష్యభేదం చేసినవాడే సవ్యసాచి అయిన ‘అర్జునుడు’ అనీ, మద్రరాజైన శల్యుడిని ఎత్తిపడవేసినవాడూ, కోపించి శత్రువులను చెట్టుతో బెదిరించినవాడూ, శత్రు సేనలను పడగొట్టినవాడూ భీమసేనుడనీ, బ్రాహ్మణ వేషధారులై ప్రశాంతంగా కూర్చున్నవారు ధర్మజ, నకుల సహదేవులనీ తెలిసికొని ఆశ్చర్యచకితులైనారు.
ద్రౌపది అర్జునుని వరించినదని తెలిసికొన్న దుర్యోధనుని మనసు వికలమైంది. వెలవెలబోయి మిక్కిలి దుఃఖించాడు.
వికలుడై దుఃఖిస్తున్న దుర్యోధనుని చూచిన దుశ్శాసనుడు- ‘‘సోదరా! అర్జునుడు బ్రాహ్మణవేషం ధరించినందుకు ద్రౌపదిని పొందగలిగినాడు. అతను ధనంజయుడు అని ఎవ్వరూ గుర్తించలేదు. నేను అదృష్టమే గొప్పదని భావిస్తున్నాను. ఇంతకూ పాండవులు బ్రతికినందుకు మన పౌరుషాన్ని నిందించాలి’’ అని అన్నాడు.
‘‘పురోచనుడు ఒక్కడే లక్క యింటిలో మాడిపోయాడు కాబోలు. దైవం అనుకూలించకుంటే మానవ ప్రయత్నం ఎంత వున్నా ప్రయోజనముండదు’’ అని చింతించిన దుర్యోధనుడు పాండవులను మట్టుబెట్ట ప్రయత్నాలు సాగించాడు.
కర్ణుని సావాసదోషంతో పాండవులతో యుద్ధం జేసి ఎలాగైనా వారిని నాశనం చేయాలనే తలంపుకు వచ్చాడు దుర్యోధనుడు. తండ్రి దృతరాష్ట్రునికి తన ఆవేదనను వివరించాడు.
- ఇంకావుంది