క్రైమ్/లీగల్

ప్రియుడే హంతకుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), మే 20: కట్టుకున్న భర్తతో విభేదించి వచ్చిన వివాహితను చేరదీసి, ఆమెతో కొంతకాలంగా సహజీవనం చేసి, రెండో పెళ్లికి అడ్డువస్తోందని భావించి, ఆమెను అడ్డు తొలగించుకున్నాడు. సుమారు 15 రోజుల కిందట విశాఖ నగర శివారు నరవ గ్రామంలో ఓ మహిళను పెట్రోలు పోసి దగ్ధం చేసిన ఘటన సంచలనం సృష్టించింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు. మృతురాలి వివరాలు తెలుసుకునేందుకు కూడా పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది. కొద్ది రోజుల కిందట మృతురాలి వివరాలు తెలియడంతో, ఆ దిశగా దర్యాప్తు ప్రారంభిస్తే, విశాఖ నగరంలోని గోపాలపట్నంలోనే హంతకుడు యథేచ్ఛగా తిరుగుతున్నాడని గుర్తించి, అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే, మొత్తం వ్యవహారం బయటపడింది.
ఈ కేసుకు సంబంధించి జెసీపీ రవికుమార్ మూర్తి అందించిన వివరాలివి. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన సుజాత నెల్లూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని 2004లో వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. వివాహం జరిగిన కొంత కాలానికి భర్తతో ఆమెకు మనస్ఫర్థలు ఏర్పడడంతో 2011లో అతనికి విడాకులు ఇచ్చి, విశాఖకు చేరుకుంది. ఎన్‌ఏడి జంక్షన్‌లోని హెర్బల్ సెంటర్‌లో సతీష్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి, వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ తరువాత సతీష్ గోపాలపట్నంలో ఓ ఫొటో స్టూడియో ప్రారంభించాడు. తరచూ సుజాత, సతీష్ ఆ ఫొటో స్టూడియోలో, ప్రహ్లాదపురంలో ఉన్న అతని గదిలో కలుస్తుండేవారు. 2016లో సుజాత బాజీ జంక్షన్ వద్ద ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఉండేది. కొద్ది కాలం కిందట సతీష్ గాజువాకలో కూడా ఓ ఫొటో స్టూడియో ప్రారంభించాడు. ఆదాయం పెరగడంతో సతీష్ వేరే అమ్మాయిని వివాహం చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. అందుకు సుజాత అంగీకరించలేదు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ విషయమై సతీష్‌తో గొడవపడిన సుజాత అతని స్వగ్రామమైన తిమిరాం వెళ్లి గ్రామ పెద్దలకు చెప్పి, న్యాయం చేయమని కోరింది.
తనకు సతీష్‌కు సింహాచలంలో వివాహం జరిగినట్టు కూడా చెప్పింది. అప్పటికీ న్యాయం జరగకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీన సతీష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇవన్నీ మనసులో పెట్టుకున్న సతీష్ తన వివాహానికి అడ్డువస్తున్న సుజాతను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమెను హతమార్చేందుకు తగిన స్థలాన్ని, పథకాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఈనెల మూడో తేదీన సతీష్, సుజాతకు ఫోన్ చేసి, సినిమాకు వెళతామని పిలిచాడు. అదే రోజు రాత్రి ఏడు గంటలకు సుజాతను తన వాహనంపై తీసుకుని సెకెండ్ షో సినిమాకు వెళ్లారు. అక్కడి నుంచి ఆమెను గోపాలపట్నంలో ఉన్న తన స్టూడియోకు తీసుకువచ్చి, ఆమెతో శారీరకంగా కలిశాడు. ఆ తరువాత బయటకు వెళదామని చెప్పి నరకు సమీపంలోని ఎంఈఎస్ దగ్గర రైల్వే లేఅవుట్‌కు తీసుకువెళ్లాడు. అప్పటికే తనతో తెచ్చుకున్న ప్లాస్టిక్ తాడుతో ఆమె మెడకు ఉరి బిగించి హతమార్చాడు. అక్కడికి సమీపంలోనే ఖాళీ స్థలంలో ఆ మృతదేహాన్ని పడేసి, తన వాహనంలోని పెట్రోలు తీసి, దానిపై పోసి, తగులబెట్టి, ఆనవాలు లేకుండా చేయాలని చూశాడు. తెల్లవారు జాము ఆరు గంటలకు కూడా ఆ మృతదేహం ఇంకా తగులబడుతూ ఉంది. అదే సమయంలో అక్కడికి మార్నింగ్ వాక్‌కు వచ్చిన వారు తగులబడుతున్న మృతదేహంపై మట్టి వేసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి హంతకుల కోసం వేట ప్రారంభించారు. తొలుత ఈ ఘటనకు పాల్పడింది ఒకరికన్నా ఎక్కువేనని పోలీసులు అనుమానించి, ఆ దిశగా దర్యాప్తు జరిపారు. చివరకు హంతకుడు ఒక్కడేనని తేల్చి అతనిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.
నిందితుడిని పట్టించిన దుస్తులు!
ఈ కేసులో మృతురాలి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఘటన జరిగిన నాటికి నగరంలో ఉన్న మహిళ మిస్సింగ్ కేసులన్నింటినీ బయటకు తీసి, దర్యాప్తు చేసినా ఫలితం లేకుండాపోయింది. మృతురాలి శరీరంపై సగం కాలిన బట్టలను పోలీసులు సేకరించి, వాటిని సోషల్ మీడియాలో ఉంచారు. కొద్ది రోజుల తరువాత ఆమె బంధువులు ఈ బట్టలను గుర్తించి, పోలీసులకు సమాచారం అందించి, ఆమె వివరాలు తెలియచేయడంతో దర్యాప్తు వేగవంతం చేసి, నిందితుడిని పట్టుకోగలిగారు.