క్రైమ్/లీగల్

ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: దిశపై అత్యాచారం చేసి క్రూరంగా హత్య చేసిన నలుగురు కిరాతకుల పోలీస్ ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు గురువారం న్యాయ విచారణకు ఆదేశించింది. న్యాయ విచారణ ఆరు నెలల్లో పూర్తి అయ్యేంత వరకు మరే ఇతర విచారణ జరిపేందుకు వీలు లేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే, న్యాయమూర్తులు అబ్దుల్ నజీర్, సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఇద్దరు న్యాయవాదులు మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్, ఎంఎల్ శర్మ దాఖలు చేసిన రెండు ప్రజాప్రయోజన వాజ్యాలపై సుప్రీం కోర్టు న్యాయ విచారణకు ఆదేశించటం గమనార్హం. ‘తెలంగాణ ప్రభుత్వం పోలీసు ఎన్‌కౌంటర్‌పై సిట్ దర్యాప్తు జరిపిస్తోంది. హైకోర్టు విచారిస్తోంది. జాతీయ మానవ హక్కుల కమీషన్ దర్యాప్తు కూడా కొనసాగుతోంది’అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రొహత్గీ చేసిన వాదనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. నలుగురు నిందితుల పోలీస్ ఎన్‌కౌంటర్‌పై నిష్పక్షపాత విచారణ జరగవలసిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే అభిప్రాయపడ్డారు. న్యాయ విచారణ పూర్తి అయ్యేంత వరకు ఇతర విచారణలన్నింటిని నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పూకర్ అధ్యక్షతన త్రిసభ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో ముంబయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేఖా బల్దోటా, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ సభ్యులుగా ఉంటారు. కమిటీ దర్యాప్తును ఆరు నెలల్లో పూర్తి చేసి నివేదికను సుప్రీం కోర్టుకు అందజేయవలసి ఉంటుంది. సిర్పూకర్ బృందం హైదరాబాద్ కేంద్రంగా తమ దర్యాప్తును చేయవలసి ఉంటుంది. సిర్పూకర్ బృందం న్యాయ విచారణ పూర్తి అయ్యేంత వరకూ మరే ఇతర అథారిటీ, కోర్టు ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు జరిపేందుకు వీలు లేదని ప్రధాన న్యాయమూర్తి బాబ్డే స్పష్టం చేశారు. సిర్పూకర్ న్యాయ విచారణ సంఘానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయటంతోపాటు భద్రత కల్పించాలని తెగంగాణ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశంతో నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ హైకోర్టులో కొనసాగుతున్న విచారణ, జాతీయ మానవ హక్కుల కమీషన్ తనంతకు తాను చేపట్టిన విచారణతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సిట్ దర్యాప్తు కూడా నిలిచిపోతాయి. ఎన్‌కౌంటర్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ఆంశాలను లోతుగా పరిశీలించవలసిన అవసరం ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ప్రజలకు నిజాలు తెలుసుకునే హక్కు ఉందని, అందుకే నిష్పక్షపాత విచారణ జరగవలసిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ బాబ్డే అన్నారు. మొదట బాబ్డే మాట్లాడుతూ ఎన్‌కౌంటర్‌తో మీకున్న సంబంధం
ఏమిటని న్యాయవాది మణిని అడిగారు. దీనికి మణి సమాధానం ఇస్తూ ఎన్‌కౌంటర్ చాలా అనుమానాస్పదంగా ఉందని, ఇది మానవ హక్కులతో కూడిన అంశం అందుకే తాము పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన ముకుల్ రొహత్గీ మాట్లాడుతూ ‘పోలీసులు నలుగురు నిందితులను సంఘటన స్థలానికి తీసుకుపోగానే వారు తిరగబడ్డారు. పోలీసుల సర్వీస్ రివాల్వర్ లాగేసుకుని కాల్పులు ప్రారంభించారు’అని కోర్టుకు తెలిపారు. నిందితులు జరిపిన కాల్పుల్లో ఒక్క బుల్లెట్ కూడా పోలీసులకు తగలలేదని రొహత్గీ చెప్పగా ‘ నలుగురు నిందితులు పోలీసులపై దాడి చేయటం ప్రారంభించారా?’అని రొహత్గీని ప్రధాన న్యాయమూర్తి బాబ్డే ప్రశ్నించారు. నిందితులు పోలీసుల నుంచి లాక్కున్న పిస్టల్స్‌తోనే వారిపై కాల్పులు జరిపారా? అని బాబ్డే మరోసారి ప్రశ్నించగా రొహత్గీ ‘అవును’అని సమాధానం ఇస్తూ నిందితులు జరిపిన కాల్పుల్లో పోలీసులెవరు కూడా గాయపడలేదని తెలిపారు. నలుగురు నిందితులను టోల్ ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీల ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారని సీనియర్ న్యాయవాది కోర్టుకు చెప్పారు. నిందితుల గుర్తింపువిషయంలో ఎవ్వరికి ఎలాంటి అనుమానం లేదని రొహత్గీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. నిందితులు కాల్పులను ఎదుర్కొనేందుకే పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని, పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు నిందితులు మరణించారని ఆయన అన్నారు. నిందితులు పోలీసుల ఆయుధాలు లాక్కుని కాల్పులు జరిపారు, వారు పోలీసుల పైకి రాళ్లు కూడా విసిరారని ఆయన చెప్పారు. ‘పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితులు మరణించారు. ఇందుకు సంబంధించిన అన్ని రికార్డులు భద్రంగా ఉన్నాయి’అని రొహత్గీ కోర్టుకు తెలిపారు. ఈ దశలో బాబ్డే జోక్యం చేసుకుని ‘ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు జరిపించాలనుకుంటున్నాం. ఈ దర్యాప్తు నిష్పక్షపాతంగా ఉండాలన్నది మా అభిప్రాయం’అని స్పష్టం చేశారు. దీనికి ముకుల్ రొహత్గీ బదులిస్తూ తెలంగాణ ప్రభుత్వం పోలీసు ఎన్‌కౌంటర్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసిందని, అలాగే సీనియర్ పోలీసు అధికారులు కూడా విచారణ జరుపుతున్నారని కోర్టుకు తెలిపారు. సుప్రీం కోర్టు దర్యాప్తుకు ఆదేశిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన కోర్టుకు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే న్యాయ విచారణకు సంబంధించిన వార్తలు రాయకుండా మీడియాపై నిషేధం విధించాలన్న ఎంఎల్ శర్మ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. మీడియా బాధ్యతతో వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని పీటీఐ, ప్రెస్ కౌన్సిల్‌ను ఆదేశించింది.
*చిత్రాలు..ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం (ఫైల్ ఫొటో)
*సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే (ఇన్‌సెట్‌లో)