క్రైమ్/లీగల్

లేఖలు చూశాకే బలపరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ముంబయి, నవంబర్ 24: మహారాష్టల్రో శుక్రవారం అర్ధరాత్రి నుంచి సాగిన ఉత్కంఠ, ఆసక్తికర సంచలన రాజకీయ పరిణామాలు ఆదివారం మరో మలుపు తిరిగాయి. ఈ మొత్తం వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం దృష్టి పెట్టింది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ఉమ్మడిగా దాఖలు చేసిన పిటిషన్‌ను అనూహ్య రీతిలో ఆదివారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ‘మహారాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మధ్య సాగిన లేఖల వివరాలను సోమవారం మా ముందు ఉంచండి’ అని కేంద్రాన్ని ఆదేశించింది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాలని రాష్ట్ర గవర్నర్ కోశ్యారీ బీజేపీ నాయకుడు ఫడ్నవీస్‌కు రాసిన లేఖ, తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని గవర్నర్‌కు ఫడ్నవీస్ రాసిన లేఖలను తమ పరిశీలనకు నివేదించాలని సుప్రీం కోరింది. మహారాష్ట్ర పరిణామాలు అసాధారణ రాజకీయ ప్రాధాన్యతను కలిగివున్నాయి కాబట్టి, వాటి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సెలవుదినం అయినప్పటికీ ఆదివారం సుప్రీం కోర్టు సమావేశమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన లేఖలను అందించాలని కేంద్రాన్ని ఆదేశించినప్పటికీ ఈ మూడు పార్టీల కూటమికి మాత్రం ఎలాంటి ఉపశమనం లభించలేదు. 24 గంటల్లోనే అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా ఫడ్నవీస్‌ను ఆదేశించాల్సిందిగా ఈ మూడు పార్టీలు తమ పిటిషన్‌లో సుప్రీంను కోరారు. అయితే, బలపరీక్షకు ఎలాంటి గడువు విధించని సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర గవర్నర్, ఫడ్నవీస్ లేఖలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఈ లేఖలను అందించడానికి రెండు రోజుల వ్యవధి కావాలంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. న్యాయమూర్తి ఎన్‌వీ రమణ సారథ్యంలోని జస్టిస్ అశోక్ భూషణ్, సంజీవ్ ఖన్నాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టింది. ఉద్ధవ్ థాకరే సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమి గవర్నర్‌కు రాసిన లేఖను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవడం లేదని ధర్మాసనం తెలిపింది. బీజేపీ నాయకుడు ఫడ్నవీస్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ శుక్రవారం గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను పురస్కరించుకుని కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు
నోటీసులు జారీ చేసింది. ఈ లేఖలను పరిశీలిస్తే తప్ప పిటిషనర్ల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేమని వెల్లడించిన సుప్రీం కోర్టు ఈ లేఖలను తమకు సోమవారం ఉదయం పదిన్నర గంటలకల్లా అందించాలని కేంద్ర ప్రభుత్వం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరూ కోర్టుకు హాజరుకాని నేపథ్యంలో తుషార్ మెహతానే ఈ లేఖలను తమకు అందించాలని స్పష్టం చేస్తున్నామని న్యాయమూర్తులు తెలిపారు. ఆ సంబంధిత పత్రాలను అవసరమైతే గవర్నర్ నివేదికను కూడా అందిస్తానని తుషార్ మెహతా ఈ సందర్భంగా తెలిపారు. శివసేన తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ మాట్లాడుతూ ‘తెల్లవారుజామున 5.17 నిమిషాలకు మహారాష్టల్రో రాష్టప్రతి పాలనను ఎత్తివేయడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది’ అని అన్నారు. కేంద్ర కేబినెట్ సమావేశమేదీ జరుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని, ఏ ప్రాతిపదికన గవర్నర్ కేంద్రానికి ఈ మేరకు సిఫార్సు చేశారని సిబాల్ ప్రశ్నించారు. శనివారం ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ చేత గవర్నర్ కోశ్యారీ ప్రమాణం చేయించడాన్ని కూడా సిబాల్ ప్రశ్నించారు. ఇదంతా మిస్టరీగా ఉందని, ఉన్నపళంగా ప్రభుత్వం అప్పటికప్పుడు ఎలా ఏర్పడిందన్న దానిపై ఎలాంటి సమాచారం లేదని అన్నారు. 288 స్థానాలు కలిగిన అసెంబ్లీలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి మెజారిటీ ఉందని, దీని దృష్ట్యా వెంటనే అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ను ఆదేశించాలని కోర్టును సిబాల్ కోరారు. కాంగ్రెస్, ఎన్సీపీ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వి మాట్లాడుతూ ఫడ్నవీస్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించడం ద్రోహపూరిత చర్య అని, ఇది ప్రజాస్వామ్యానికే పాతర వేయడమని అన్నారు. ఎన్సీపీ తరఫున ఎన్నికైన 54 మంది ఎమ్మెల్యేల్లో అజిత్ పవార్ పక్షాన నిలిచింది కేవలం 13 మందేనని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తీసుకున్న చర్య దిగ్భ్రాంతిని కలిగించడమే కాకుండా ఆయన ఎవరి ఆదేశాల మేరకు పనిచేస్తున్నారన్న విషయం స్పష్టమవుతోందని అన్నారు. అలాగే, రాష్టప్రతి పాలనను తొలగించాలని గవర్నర్ సిఫార్సు చేయడం కూడా పక్షపాత చర్యగా కనిపిస్తోందని, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, నిర్దేశించిన నియమ నిబంధనలకు కోశ్యారీ చర్య పూర్తి విరుద్ధంగా ఉందని న్యాయవాది సిబాల్ తెలిపారు. ఎన్సీపీకి చెందిన 41 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌కు లేఖ రాస్తూ అజిత్ పవార్ ఎంతమాత్రం పార్టీలో లేరన్న విషయాన్ని స్పష్టం చేశారని ఆ పార్టీ తరఫున వాదించిన న్యాయవాది సింఘ్వి కోర్టుకు నివేదించారు. దీని దృష్ట్యా ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు అజిత్ పవార్ ఇచ్చిన లేఖకు ఎలాంటి విలువ లేదని తెలిపారు. 54 మందిలో 41 మంది పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నపుడు ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ఎలా బాధ్యతలు చేపట్టగలుగుతారని సింఘ్వి ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా? అని ఆయన ప్రశ్నించారు. తన వాదనకు సమర్ధింపుగా గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను ఉటంకించిన సింఘ్వి వెంటనే అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహించాలని కోరారు. ఇదే ఈ సమస్యకు తక్షణ పరిష్కారమని ఆయన వివరించారు. ‘ఈ విషయాన్ని ఎవరూ విభేదించడం లేదు. అసెంబ్లీలో బలపరీక్షే అసలైన పరీక్ష అన్న విషయం ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ వాదనతో ఏకీభవించని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రాథమిక హక్కులు రాజకీయ పార్టీలకు ఉండవని, ఈ కారణంచేతే ఈ మూడు పార్టీల పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టుకు స్పష్టం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్‌తగి వాదించారు. పిటిషనర్లు సుప్రీం కోర్టు విలువైన సమయాన్ని వృథా చేయకుండా ముంబయి హైకోర్టునే ఆశ్రయించాల్సి ఉండాల్సిందని రోహ్‌తగి అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రాజకీయ కూటమిని ఆహ్వానించడం గవర్నర్‌కు రాజ్యాంగంలోని 361 అధికరణ కింద ఉన్న విశేష అధికారమని, ఈ నిర్ణయం న్యాయ సమీక్షలోకి రాదని తెలిపారు. దీనిపై స్పందించిన జస్టిస్ రమణ ‘ఎవరో ఒకరిని గవర్నర్ ఆహ్వానించలేరు కదా?’ అని అన్నారు. ఇప్పటికే మహారాష్టల్రో ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఈ విషయంలో అత్యవసరంగా ఎక్స్ పార్టీ ఆదేశాలను జారీ చేయాల్సిన అవసరం లేదని రోహ్‌తగి అన్నారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేయడానికి ఉద్దేశించిన పత్రాలను పిటిషనర్లు కోర్టుకు నివేదించాలని ఆయన అన్నారు. ఈ అంశాలన్నీ గవర్నర్ విశేషాధికారాల పరిధిలోకి వస్తాయని పేర్కొన్న ఆయన సభ న్యాయస్థానాన్ని గౌరవించాలని, అలాగే న్యాయస్థానం కూడా సభను గౌరవించాలని తెలిపారు. ఈ రెండు వ్యవస్థలు పరస్పరం గౌరవించుకుని మెసలాలని ఆయన సూచించారు. ఈ వ్యవహారంలో తాను కేవలం కేంద్ర తరఫున మాత్రమే వాదిస్తున్నానని, మహారాష్ట్ర నుంచి తనకు ఎలాంటి సూచనలు రాలేదని తుషార్ మెహతా ఈ సందర్భంగా తెలిపారు.

*చిత్రం... సుప్రీం విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు సుర్జేవాలా, పృథ్వీరాజ్ చవాన్