క్రైమ్/లీగల్

ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్/ఇందూర్, నవంబర్ 17: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠానాకలాన్ సబ్‌స్టేషన్ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మృతులంతా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామానికి చెందినవారు. గ్రామ సర్పంచ్ కుమార్తె కేశఖండనం వేడుకలో పాల్గొని ఆటోరిక్షాలో వారంతా తిరిగి వస్తుండగా, ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ సర్పంచ్ సాయిలు తన కుమార్తె కేశఖండనం వేడుకను కుర్నాపల్లిలోని అబ్బయ్య దర్గా వద్ద ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకకు గ్రామానికి చెందిన తన సన్నిహితులను ఆహ్వానించారు. దీంతో జానకంపేటకు
చెందిన ఆకుల బాలామణి (56), జక్కం గంగామణి (60), కల్యాపురం సాయిలు (70), చిక్కెల సాయిలు (65) కలిసి తమ గ్రామానికే చెందిన ఆటోరిక్షా డ్రైవర్ నరుూం (30)ను సంప్రదించారు. అతని ఆటోరిక్షాలో కుర్నాపల్లి దర్గాకు చేరుకుని సర్పంచ్ కుమార్తె కేశఖండనం వేడుకలో పాల్గొన్నారు. అనంతరం అదే ఆటోరిక్షాలో జానకంపేటకు తిరిగి వస్తుండగా, ఠానాకలాన్ సబ్‌స్టేషన్ సమీపంలో ఎదురుగా అతివేగంగా వస్తున్న ఎర్టిగా కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోరిక్షా గాలిలో ఎగిరి పల్టీలు కొడుతూ రోడ్డుపక్కన చిన్నపాటి లోయ వంటి ప్రదేశంలో బండరాళ్లపై పడింది. అదుపుతప్పిన కారు కూడా పల్టీలు కొడుతూ ఆటోరిక్షా పైనే వచ్చి పడడంతో ఆటో నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న బాలామణి, గంగామణి, కే సాయిలు, సీహెచ్ సాయిలు, డ్రైవర్ నరుూం తల, ఇతర శరీర భాగాలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వారిని హుటాహుటిన జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరిలో బాలామణి, గంగామణి సొంత అక్కాచెల్లెళ్లు కావడం విశేషం. ఆటోరిక్షా డ్రైవర్ నరుూం కాలు తెగి, తీవ్రంగా గాయపడడంతో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచాడు. కాగా, ప్రమాదానికి కారణమైన కారులో కూడా ఐదుగురు యువకులు ఉండగా, వారంతా చిన్నచిన్న గాయాలతో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. సదరు యువకులు మద్యం మత్తులో ఉండి, అతివేగంగా కారును నడపడం వల్లనే ఈ విషాదకర ఘటన చోటుచేసుకుందని స్థానికులు పోలీసుల దృష్టికి తెచ్చారు. కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు యువకులు పారిపోగా, మరో ఇద్దరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సంఘటనా స్థలాన్ని బోధన్ రూరల్ సీఐ షాకీర్ అలీ, ఎస్‌ఐ ఎల్లాగౌడ్ సందర్శించి స్థానికుల తోడ్పాటుతో సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ ఎల్లాగౌడ్ తెలిపారు. కాగా, ఈ సంఘటనతో జానకంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎంతో సంతోషంగా చిన్నారి వేడుకలో పాల్గొనేందుకు వెళ్లి, తిరిగి వస్తున్న సందర్భంగా అనుకోని రీతిలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లతో పాటు మరో ఇద్దరు గ్రామస్థులు చనిపోవడం స్థానికులను కలిచివేసింది. జిల్లా ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబీకులు, బంధువులు చేరుకుని గుండెలవిసేలా రోదించారు. మద్యం సేవించిన మత్తులో అతివేగంగా, నిర్లక్ష్యంగా కారును నడిపి ఐదుగురి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబాలతో పాటు జానకంపేట గ్రామస్థులు పోలీసులను డిమాండ్ చేశారు.

*చిత్రం... ఎడపల్లి మండలం ఠానాకలాన్ సబ్‌స్టేషన్ వద్ద కారు, ఆటో రిక్షా ఢీకొన్న దృశ్యం