క్రైమ్/లీగల్

శబరిమల కేసు విస్తృత ధర్మాసనానికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: సుప్రీంకోర్టు కేరళలోని శబరిమల ఆలయంలోకి రుతుస్రావ వయసులో ఉన్న మహిళలు, బాలికల ప్రవేశానికి అవకాశం కల్పిస్తూ 2018లో ఇచ్చిన తన చరిత్రాత్మక తీర్పును సమీక్షించాలని దాఖలయిన పిటిషన్లను గురువారం ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదలాయించింది. శబరిమల తీర్పును సమీక్షించాలని దాఖలయిన పిటిషన్లను విచారించిన అయిదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం 3:2 మెజారిటీ తీర్పును ఇచ్చింది. దీంతో ఈ కేసులో నవంబర్ 17వ తేదీన తిరిగి విచారణ ప్రారంభం కావడానికి రంగం సిద్ధమయింది. అయితే, ఈ కేసుతో పాటు ముస్లిం, పార్శీ మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందన్న అంశాలను కూడా సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం విచారిస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగోయ్ రివ్యూ పిటిషన్లను
ఏడుగురు సభ్యుల ధర్మాసనం విచారణ కోసం పెండింగ్‌లో పెడుతూ మెజారిటీ తీర్పును వెలువరించారు. అయితే, సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్ 28వ తేదీన తాను ఇచ్చిన మెజారిటీ తీర్పును మాత్రం నిలిపివేయలేదు. అందువల్ల రుతుస్రావ వయసులో ఉన్న బాలికలు, మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించే సౌకర్యం కొనసాగుతుంది. సీజేఐ తన తరపున, న్యాయమూర్తులు ఏఎం ఖన్‌విల్కర్, ఇందు మల్హోత్రా తరపున మెజారిటీ తీర్పు రాశారు. ప్రార్థనాలయాలలోకి మహిళలు, బాలికల ప్రవేశంపై నిషిద్ధం వంటి మతపరమయిన సంప్రదాయాలకు ఉన్న రాజ్యాంగబద్ధతపై చర్చ ఒక్క శబరిమల ఆలయానికే పరిమితం కాలేదని సీజేఐ పేర్కొన్నారు. మసీదులు, దర్గాల్లోకి ముస్లిం మహిళల ప్రవేశంపై, పార్శీయేతరుడిని వివాహమాడిన పార్శీ మహిళలు ఆగ్యరీలోని పవిత్రమయిన అగ్ని ఆలయంలోకి ప్రవేశించకుండా ఇలాంటి నిషేధాలు అమలులో ఉన్నాయని ముగ్గురు న్యాయమూర్తులు తెలిపారు. అత్యున్నత న్యాయస్థానం ‘దృఢమయిన, సంపూర్ణ న్యాయమయిన’ న్యాయ విధానాన్ని రూపొందించడానికి ఇదే తగిన సమయమని వారు పేర్కొన్నారు.
సీజేఐ వెలువరించిన తొమ్మిది పేజీల మెజారిటీ తీర్పుతో న్యాయమూర్తులు ఆర్‌ఎఫ్ నారిమన్, డీవై చంద్రచూడ్ ఏకీభవించలేదు. వీరిద్దరు న్యాయమూర్తుల తరపున జస్టిస్ నారిమన్ మైనారిటీ తీర్పును రాశారు. సీజేఐ దృక్పథంతో ఏకీభవించలేకపోతున్నందుకు ఆయన విచారం వ్యక్తం చేశారు. శబరిమల ఆలయంలోకి రుతుస్రావ వయసులో ఉన్న మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై దాఖలయిన రివ్యూ పిటిషన్లకు ఉన్న పరిధి చాలా స్వల్పమని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గట్టిగా అమలయ్యేలా చూడాలని కూడా కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఏ మతానికి చెందిన వారమనే విషయాన్ని ప్రకటించడానికి, ఆ మతాన్ని ఆచరించడానికి ఉన్న ప్రాథమిక హక్కు గురించి పునరావృత అంశాలకు విస్తృత ధర్మాసనం తీసుకునే నిర్ణయం ముగింపు పలుకుతుందని కూడా మెజారిటీ తీర్పు పేర్కొంది.
*చిత్రం... శబరిమల కేసులో గురువారం సుప్రీం తీర్పు నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘ఓం‘ ఆకారంలో
దీపాలు వెలిగించిన అయ్యప్ప భక్తులు