తెలంగాణ

మరో కార్మికుడి బలవన్మరణంతో సమ్మె ఉద్రిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్: ఆర్టీసీ సమ్మె మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రోజుకు ఒక తీరుగా మారుతున్న పరిణామాలతో గుండె చెదిరి మరో డ్రైవర్ బుధవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి తనువు చాలించాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఆవుల నరేష్ (50) తన చావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కారణం అని ఒక సూసైడ్ నోట్ రాసి బుధవారం తెల్లవారుజామున తన ఇంటిలో పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు కొన ఊపిరితో ఉన్న నరేష్‌ను హుటాహుటిన మానుకోట జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉన్న నరేష్ ఆసుపత్రిలో కన్నుమూశాడు. మహబూబాబాద్ డిపోలో గత 7 సంవత్సరాలుగా డ్రైవర్‌గా పనిచేస్తున్న నరేష్ ఆత్మహత్య చేసుకొని మరణించాడనే వార్త ఒక్కసారిగా మానుకోటలో వ్యాపించడంతో కార్మికులు, అఖిలపక్ష నాయకులు పెద్ద ఎత్తున మానుకోట ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. రాష్టవ్య్రాప్తంగా ఈ వార్త తెలియడంతో ఒక్కసారిగా ఆర్టీసీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. సమ్మె ప్రారంభం నుండి తమతో కలిసి ఉద్యమించిన నరేష్ మరణించడం ఆర్టీసీ కార్మికులను, జేఏసీ నాయకులను తీవ్రంగా కలచివేసింది. నరేష్ ఆత్మహత్య సంఘటనతో జిల్లా పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా అలర్ట్ అయింది. పక్క జిల్లాల నుండి సైతం పోలీస్ బలగాలను మానుకోటకు రప్పించి ఏరియా ఆసుపత్రిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వందల సంఖ్యలో కార్మికులు, ప్రజలు చేరడం ఆసుపత్రిలోకి చొచ్చుకురావడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మృతదేహాన్ని ఆసుపత్రిలోనే ఉంచాలని పోలీసులు ప్రయత్నించినా కార్మికులు, అఖిలపక్ష నాయకులు అమాంతం భుజాలపై మృతదేహాన్ని ఎత్తుకొని బయటకు పరుగులు పెడుతూ తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఒక స్ట్రెచ్చర్‌పై మృతదేహాన్ని ఉంచి పోలీసులు అడ్డుకుంటున్నా ఆగకుండా మహబూబాబాద్ ఆర్టీసీ డిపో వరకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసు బలగాలు డిపోలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజల ఆగ్రహం ముందు వారు నిలువలేకపోయారు. బారికేడ్‌లు తోసుకుంటూ ముళ్లకంచెలు దాటుకుంటూ మృతదేహంతో సహా జేఏసీ నాయకులు, ఆర్టీసీ కార్మికులు, సానుభూతిపరులు డిపో వద్దకు చేరుకున్నారు. డిపో ప్రధాన ద్వారం వద్ద నరేష్ మృతదేహాన్ని ఉంచి నిరసనకు దిగారు. ఉదయం ప్రారంభమైన నిరసన మధ్యాహ్నం 2గంటల వరకు కొనసాగింది.
రంగంలోకి దిగిన జిల్లా అధికార యంత్రాంగం
ఆర్టీసీ డ్రైవర్ ఆవుల నరేష్ ఆత్మహత్యతో పరిస్థితి అదుపుతప్పే సూచన ఉండడంతో జిల్లా అధికార పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి స్వయంగా ఆర్టీసీ బస్‌డిపో వద్దకు చేరుకొని మృతదేహం వద్ద పరిస్థితిని పరిశీలించారు. ఆందోళనకు దిగిన ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నాయకులతో పలుమార్లు మాట్లాడారు. కలెక్టర్ వచ్చేంత వరకు మృతదేహాన్ని తీసేది లేదంటూ ఆందోళన జరుగుతుండటంతో ప్రభుత్వ యంత్రాంగంతోనూ ఎస్పీ చర్చలు జరిపారు. జాయింట్ కలెక్టర్ డేవిడ్ రంగంలోకి దిగి ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నాయకులతో సంయుక్తంగా చర్చించారు. గతంలో ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన రాయితీలన్నింటినీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆందోళన విరమించి మృతదేహాన్ని తరలించాలంటూ ఎట్టకేలకు జేఏసీ నాయకులను ఒప్పించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ డేవిడ్ ప్రభుత్వం తరఫున మాట్లాడుతూ.. మృతుడు నరేష్ కుటుంబానికి రూ.12 లక్షల ఎక్స్‌గ్రెషియా, డబుల్‌బెడ్‌రూం ఇల్ల్లు, మూడు ఎకరాల వ్యవసాయ భూమి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం నిబంధనలకు లోబడి అందజేస్తామని ప్రకటించారు. దీంతో నిరసన విరమించిన ఆందోళనకారులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం నరేష్ మృతదేహాన్ని అతని సొంత గ్రామం అయిన చిన్నగూడూరు మండలం ఎల్లంపేటకు అంత్యక్రియల కోసం తీసుకెళ్లారు.
ఉదయం నుండి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను సృష్టించిన ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య సంఘటన సాయంత్రం వరకు ఉద్రిక్తతను సృష్టించినప్పటికీ మృతదేహాన్ని మానుకోట నుండి తరలించడం, అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకపోవడంతో ప్రభుత్వ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
*చిత్రాలు.. ఆర్టీసీ బస్‌డిపో ఎదుట మృతదేహంతో కార్మికుల నిరసన
*అంతర చిత్రాల్లో సూసైడ్ నోట్, ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ ఆవుల నరేష్ మృతదేహం