క్రైమ్/లీగల్

చిదంబరానికి ఈడీ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం అరెస్టు చేసింది. సీబీఐ దాఖలు చేసిన కేసులో తీహార్ జైలులో జుడీషియల్ కస్డడీలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతను ఈడీ అదుపులోకి తీసుకుంది. చిదంబరంపై మనీలాండరింగ్ కేసు నమోదైంది. మాజీ ఆర్థిక మంత్రిని విచారించేందుకు ఢిల్లీ కోర్టు మంగళవారం ఈడీకి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం 8.15 గంటల సమయంలో ముగ్గురు సభ్యులుగల ఈడీ బృందం తీహార్ జైలుకు వచ్చింది.
సుమారు రెండు గంటల సేపుజైలు ప్రాంగణంలోనే ఉన్న తరువాత 74 ఏళ్ల చిదంబరాన్ని అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్(పీఎంఎల్‌ఏ) కింద చిదంబరాన్ని అరెస్టు చేసినట్టు ఈడీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేతను తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసుకు సంబంధించి 2017లో చిదంబరంపై ఈడీ కేసు నమోదు చేసింది. ఐఎన్‌ఎక్స్ మీడియా సంస్థ విదేశీ నిధులు సేకరించేందుకు చిదంబరం సహకరించారని ఆరోపణ. 2007-08లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం ఈమేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కేసు నమోదు చేసింది. ఐఎన్‌ఎక్స్ మీడియా ప్రమోటర్లు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీ ద్వారా ఆయన కుమారుడు కార్తీ చిదంబరానికి సొమ్ములు అందినట్టు విచారణలో తేలింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన మాజీ మంత్రి చిదంబరం ఇప్పటికే 55 రోజులుగా జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆగస్టు 21న సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రావాలంటే చిదంబరాన్ని తమ కస్టడీకి ఇవ్వాలని మంగళవారం కోర్టులో ఈడీ పేర్కొంది.
ఇలా ఉండగా బుధవారం ఉదయం చిదంబరం సతీమణి నళినీ, కుమారుడు కార్తీ తీహార్ జైలుకు వచ్చారు. కార్తీ చిదంబరం కూడా మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇంతకు ముందే ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. అలాగే కార్తీకి చెందిన 54 కోట్ల రూపాలయ విలువైన ఆస్తులు అటాచ్ చేశారు. భారత్, స్పెయిన్, యూకేలో ఆస్తులను అటాచ్ చేశారు. జైలు వెలుపల కార్తీ మీడియాతో మాట్లాడుతూ తమ కుటుంబాన్ని లక్ష్యం చేసుకుని రాజకీయ కక్షసాధింపుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘కొందరు వ్యక్తుల ప్రలోభం, వత్తిళ్ల మేరకే ఇవన్నీ జరుగుతున్నాయి’అని ఆయన విమర్శించారు. వీక్లీ విజిట్‌లో భాగంగా ఉదయం తన తండ్రిని చూసేందుకు తీహార్ జైలుకు వచ్చామని ఆయన పేర్కొన్నారు. ఇదంతా ఓ బోగస్ విచారణ అంటూ కార్తీ తీవ్రమైన విమర్శలు చేశారు.
అయితే.. ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతిలో కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరానికి సంబం ధం ఉన్నట్టు ప్రాధమిక ఆధారాలున్నాయని జాతీయ దర్యాప్తు సంస్థ సీబీఐ సుప్రీం కోర్టులో వాదించింది. ఆయనకు ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కోరింది. బెయిల్ కోసం చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ బుధవారం సుప్రీంలో విచారణకు వచ్చింది. న్యాయమూర్తి ఆర్ బానుమతి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.సీబీఐ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ వాదిస్తూ చిదంబరానికి సంబంధాలున్నట్టు తిరుగులేని ఆధారాలున్నాయని కోర్టు కు తెలిపారు. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని నటరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. కీలక సాక్షులను చిదంబరం ప్రభావితం చేశారని గతంలోనే సోలిసిటర్ జనరల్ కోర్టు దృష్టికి తెచ్చారని ఆయన అన్నారు. జైలులో సీబీఐ తన పట్ల అవమానకరంగా వ్యవహరిస్తోందని చిదంబరం ఆరోపిస్తూ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. 74 ఏళ్ల చిదంబరం ఆగస్టు 21న అరెస్టయ్యారు. సీబీఐ అరెస్టు చేసి జుడీషియల్ కస్టడీ నిమిత్తం తీహార్ జైలుకు తరలించింది. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్టు క్లియరెన్స్ విషయంలో చిదంబరం అవకతవకలకు పాల్పడ్డారని సీబీఐ అభియోగం. ఆయనపై 2017 మే 15న కేసు నమోదైంది. తరువాత అదే ఏడాది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా కాంగ్రెస్ నేతపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.

*చిత్రం...కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం