క్రైమ్/లీగల్

తీర్పే తరువాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నాయకత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం అయోధ్య, రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమి టైటిల్ వివాదంపై గత నలభై రోజుల నుండి కొనసాగుతున్న విచారణకు తెర దించి తీర్పును రిజర్వు చేసింది. వౌల్డింగ్ ఆఫ్ రిలీఫ్ కోసం మూడు రోజుల లోగా తమ వాదనలను రాతపూర్వకంగా అందజేయాలని వాద, ప్రతివాదులను గొగోయ్ ఆదేశించారు. వివాదాస్పద భూమిపైనే హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించాడని చూపించే కొన్ని పత్రాలను సున్ని వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ కోర్టులో చింపివేయటంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నవంబర్ 17న పదవీ విరమణ చేస్తున్నందున ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు నవంబర్ 13, 14, 15 తేదీల్లో వెలువడవచ్చు. గొగోయ్ పదవీకాలం నవంబర్ 17న అంటే ఆదివారం ముగుస్తుంది. అంతకుముందు రోజు శనివారం కావడంతో తీర్పును 13, 14 లేదా 15న ప్రకటించే అవకాశం ఉంది. రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేసేలోగా తీర్పు రాని పక్షంలో సుప్రీం కోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి ఈ కేసుపై విచారణ జరిపేందుకు కొత్తగా రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. గొగోయ్ నాయకత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులు ఎస్‌ఏ బోబ్డే, డీవై చంద్రచూడ్,
ఆశోక్ భూషన్, ఎస్‌ఏ నజీర్‌తో కూడిన ధర్మాసనం అయోధ్య-బాబ్రీ మసీదు భూమి టైటిల్ వివాదంపై దాఖలైన పిటిషన్లపై గత ఆగస్టు ఆరోతేదీ నుంచి అంటే నలభై రోజుల నుంచి వరుసగా విచారణ కొనసాగించింది. బుధవారం ఆఖరు రోజు సుప్రీం కోర్టులోని ఒకటో నంబర్ కోర్టులో విచారణ సందర్భంగా అనూహ్యమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. బాబ్రీ మసీదు ఉన్నచోటనే హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించాడని చూపించే పత్రాలను అఖిల భారత హిందూ మహాసభ తరఫు న్యాయవాది కోర్టులో ప్రతిపాదించేందుకు ప్రయత్నించారు. ఈ పత్రాల్లో శ్రీరాముడు జన్మించినట్లు చూపించే ఒక చిత్రపటం కూడా ఉన్నది. అయితే సున్ని వక్ఫ్ బోర్డు తరఫున వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది రాజీవ్ ధావన్ ఆగ్రహంతో ధర్మాసనం ముందే ఈ పత్రాలను, చిత్రపటాన్ని చింపివేసి సంచలనం సృష్టించారు. ఆఖరు రోజు మీరిలాంటి పత్రాలను సాక్ష్యంగా తీసుకోకూడదు.. ఇది మంచి విధానం కాదు అందుకే ఈ పత్రాలను చింపివేస్తున్నా.. దీనికి మీరు అనుమతించాలంటూ రాజీవ్ ధావన్ ఆగ్రహంతో అఖిల భారత హిందూ మహాసభ న్యాయమూర్తి దాఖలు చేసిన పత్రాలను పరపరా చింపివేయటంతో కోర్టులో ఉన్న వారంతా ఒక్కసారిగా అవాక్కయిపోయారు. ఈ పరిణామంపై రంజన్ గొగోయ్ స్పందిస్తూ మీరిలా వ్యవహరిస్తే తాము కోర్టు నుంచి వాకౌట్ చేయవలసి వస్తుందని హెచ్చరించారు. కోర్టులో పత్రాలను చింపివేసేందుకు మేము అనుమతించామా, మీ ఇష్టం వచ్చినట్లు చేయడం కుదరదు అని వ్యాఖ్యానించారు.
ముందుకుగా ప్రకటించిన ప్రకారం బుధవారం సాయంత్రం ఐదు గంటలకు విచారణకు తెర దించవలసి ఉంది. అయితే సుప్రీం కోర్టులో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా గొగోయ్ గంట ముందే విచారణను ముగించి తీర్పును రిజర్వు చేశారు. పదవీ విరమణ చేసేందుకు ఒక రోజు ముందే అయోధ్య-బాబ్రీ మసీదు వివాదంపై గత 134 సంవత్సరాల నుండి కొనసాగుతున్న వివాదానికి తెర దించాలన్నది రంజన్ గొగోయ్ ఆలోచన. వారం రోజుల దసరా సెలవుల అనంతరం బుధవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఒకటో నంబర్ కోర్టులో అయోధ్య-బాబ్రీ మసీదు-రామజన్మ భూమి టైటిల్ కేసు విచారణను ప్రారంభిస్తూ ‘వాదోపవాదలను ఈ రోజు ముగించవలసిందే’నని ఇరుపక్షాలకు స్పష్టం చేశారు. ‘విచారణ చేయాల్సినదంతా చేశాం.. ఇకమీదట విచారణ జరగదు.. నేటితో ముగుస్తుంది’ అని ప్రకటించారు. వివాదాస్పద భూమిలో బాబ్రీ మసీదును పునర్నిర్మించేందుకు కోర్టు అనుమతించాలని రాజీవ్ ధావన్ పలుమార్లు కోర్టును కోరారు. అయోధ్య-బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు దేశ రాజకీయాలతోపాటు సమాజాన్ని ఒకపెద్ద మలుపు తిప్పుతుంది. సంఘ్ పరివార్ సంస్థలు 1992లో బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన అనంతరం దేశంలో పెద్దఎత్తున శాంతిభద్రతల సమస్య నెలకొనడం తెలిసిందే. ముంబాయితోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఇస్లామిక్ ఉగ్రవాదులు బాంబులు పేల్చి వందలాది మందిని పొట్టనబెట్టుకున్నారు. ఇప్పుడు నవంబర్ మూడో వారంలో సుప్రీం కోర్టు ఈ వివాదంపై తీర్పు ఇచ్చిన తరువాత కూడా దేశంలోని పలు పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం ఉన్నదని అంటున్నారు.
ఇదిలాఉంటే తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని సున్ని వక్ఫ్ బోర్డు, ఆఖిల భారత హిందు మహాసభ ఇతర కచ్చిదారులు ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. సుప్రీం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రాకున్నా అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరుతుందని హిందూ సంస్థల అధినాయకులు స్పష్టం చేశారు. అయితే బాబ్రీ మసీదును అక్కడే పునర్నిర్మించాలనే వాదనపై సున్ని వక్ఫ్ బోర్డులో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. కొందరు ముస్లిం మేధావులు, పెద్దలు వివాదాస్పద భూమిని హిందువులకు ఇచ్చి వేసి ముస్లింలు అధికంగా ఉన్న లక్నో లేదా మరోచోట బ్రహ్మాండమైన మసీదును నిర్మించుకోవటం మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కేశవానంద భారతి కేసు తరువాత ఎక్కువ రోజులు విచారణ జరిగిన కేసు అయోధ్య-బాబ్రీ మసీదు భూమి వివాదమే. కేశవానంద భారతి కేసుపై దాదాపు 47 రోజుల పాటు సుప్రీం కోర్టు విచారణ జరిపింది.

*చిత్రం...సుప్రీం కోర్టులో బుధవారం అయెధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై వాదనలు ముగిసిన అనంతరం కోర్టు వెలుపల సంఘీభావం ప్రకటిస్తున్న నిర్వాణీ అకారాకు చెందిన మహంత్ ధరమ్ దాస్, జమాత్ ఉలామా-ఈ-హింద్ అధ్యక్షుడు వౌలానా సుహైబ్ ఖాస్మి