క్రైమ్/లీగల్

సీబీఐ కస్టడీకి చిదంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరాన్ని నాలుగు రోజుల పాటు సీబీఐ కస్టడీకి పంపుతూ ప్రత్యేక కోర్టు గురువారం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ అవినీతి కేసులో చిదంబరాన్ని సీబీఐ కస్టడీకి పంపడం ఎంతైనా సమర్ధనీయమని ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహర్ తెలిపారు. ఈ నెల 26 వరకూ ఆయనను సీబీఐ కస్టడీలో ఉంటారని, ఈ నాలుగు రోజుల పాటు నిబంధనల ప్రకారం వైద్యులు ఆయనను పరీక్షిస్తారని కోర్టు తెలిపింది. అలాగే ప్రతిరోజూ అరగంట పాటు లాయర్లు, కుటుంబ సభ్యులు చిదంబరాన్ని కలుసుకునేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ కేసుతో ముడిపడి ఉన్న వాస్తవాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తాను ఆయనను సీబీఐ కస్టడీకి
పంపడం సరైన నిర్ణయమేనని భావిస్తున్నట్టు జడ్జి తన ఉత్తర్వులో స్పష్టం చేశారు. తీర్పు వెలువడిన వెంటనే చిదంబరాన్ని సీబీఐ అధికారులు కోర్టు నుంచి తీసుకెళ్లిపోయారు. ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసును లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీని వెనక ఉన్న కుట్రను, దాన్ని మూలాన్ని ఛేదించాలంటే కాంగ్రెస్ నేతను తమ కస్టడీకి అప్పగించడం ఒకటే మార్గమని సీబీఐ, దాని న్యాయవాది గంటన్నరకు పైగా కోర్టులో తన వాదనను వినిపించారు. అయితే ఈ వాదనను చిదంబరం న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. చిదంబరం కుమారుడు అలాగే ఈ కేసులో ఇతర నిందితులు ఇప్పటికే బెయిల్‌పై ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. 2004 నుంచి 14 వరకూ యూపీఏ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన చిదంబరాన్ని సీబీఐ అధికారులు బుధవారం రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చిదంబరం హయాంలోనే ఐఎన్‌ఎక్ మీడియా కుంభకోణం జరిగిందని ఇందులో భాగంగా 305 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయని విదేశీ పెట్టుబడుల అభివృద్ధి బోర్డు ఆమోదంలో ఎన్నో అవకతవకలు చోటుచేసుకున్నాయని సీబీఐ 2017 మే 15 ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. 2018లో దీనికి సంబంధించి మనీ లాండరింగ్ కేసును ఈడీ నమోదు చేసింది. కాగా గురువారం కోర్టు విచారణకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య తీసుకొచ్చారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ గట్టిగా తన వాదనను వినిపించారు. ఈ కేసులో ముందుగా చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం సీఏగా పనిచేసిన భాస్కర్ రామన్‌ను అరెస్టు చేశారని సిబాల్ కోర్టుకు తెలిపారు. మరో కేసులో జైలులో ఉన్న పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీ కూడా డిఫాల్ట్ బెయిల్‌పై ఉన్నారని ఆయన చెప్పారు. విదేశీ పెట్టుబడుల అభివృద్ధి బోర్డు అనుమతులు ఇచ్చింది సీనియర్ అధికారులేనని వారిని ఇంతవరకూ అరెస్టు చేయలేదని ఆయన వెల్లడించారు. బెయిల్ ఇవ్వడం అన్నది ఓ నిబంధన అని వాదించిన సిబాల్ ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశం అని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకూ జరిగిన విచారణలో చిదంబరం సహకరించలేదని, దాటవేత సమాధానాలే ఇస్తూ వచ్చారు కాబట్టి ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించడం ఎంతైనా అవసరమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పష్టం చేశారు. అయితే చిదంబరం నుంచి బలవంతంగా నేరాంగీకార వాంగ్మూలాన్ని తీసుకునేందుకు సీబీఐ ప్రత్నించడం లేదని ఈ కేసు మూలాన్ని ఛేదించాలన్నదే దర్యాప్తు సంస్థ లక్ష్యమని మెహతా అన్నారు. ‘ఇది తెలివైన వ్యక్తులు చేసిన చాలా తీవ్రమైన నేరం. దీని మూలాలు ఛేదించకపోతే విధి నిర్వహణలో మనం విఫలమైనట్టే’అని సొలిసిటర్ జనరల్ అన్నారు. ఇప్పటికే కార్తీ చిదంబరాన్ని కూడా కస్టడీలోకి తీసుకుని విచారించారని ఆయన తెలిపారు. ఈ కేసులో చిదంబరం తరఫున కపిల్ సిబాల్‌తోపాటు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కూడా వాదించారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన ఇంద్రాణి ముఖర్జీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే సీబీఐ తన వాదనలు రూపొందించిందని సింఘ్వీ అన్నారు. సీబీఐ ఏ రకమైన సమాధానాలు కోరుకుంటుందో అలాగే చెప్పాల్సిన అవసరం చిదంబరానికి లేదని దాట వేత సమాధానాలు ఇస్తున్నంత మాత్రాన ఆయనను కస్టడీలోకి తీసుకోవాలనుకోవడం సరైన పద్ధతి కాదని ఆయన కోర్టు తెలిపారు. పైగా సాక్ష్యాధారాలు తారుమారు చేసినట్టు సీబీఐ ఎలాంటి ఆరోపణలు చేయలేదని, కేవలం ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పోలీసు కస్టడీకి అప్పగించడం జరుగుతుందని సింఘ్వీ గట్టిగా వాదించారు. ఈ కేసులో తాజాగా ఎలాంటి పరిణామం చోటుచేసుకోలేదని అలాంటప్పుడు చిదంబరాన్ని సీబీఐ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరమేలేదని సింఘ్వీ తెలిపారు. బుధవారం రాత్రి నుంచి పాత ప్రశ్నలనే సీబీఐ అడుగుతూ వచ్చిందని ఆయన అన్నారు. ఈ వాదనను తిప్పికొట్టిన సొలిసిటర్ జనరల్ చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు. తన కేసును తానే వాదించుకునేందుకు చిదంబరానికి అనుమతి ఇవ్వాలన్న వాదనను కూడా ఆయన వ్యతిరేకించారు.

చిత్రం... విచారణ అనంతరం సీబీఐ కోర్టు నుంచి చిదంబరాన్ని వెలుపలకు తీసుకువస్తున్న అధికారులు