క్రైమ్/లీగల్

రాహుల్‌కు ధిక్కార నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘చౌకీదార్ చోర్ హై’ అని వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు మంగళవారం కోర్టు ధిక్కార నోటీసు జారీ చేసింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానం తీర్పును తప్పుగా ఆపాదించినట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే, అత్యున్నత న్యాయస్థానం రాహుల్ గాంధీకి ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి పెట్టిన ఈ కోర్టు ధిక్కార కేసు ఈ నెల 30న విచారణకు రానుంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై 2018 డిసెంబర్ 14న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలయిన రివ్యూ పిటిషన్లతో కలిపి ఈ కోర్టు ధిక్కార పిటిషన్‌ను విచారించనున్నట్టు ధర్మాసనం తెలిపింది. లేఖి దాఖలు చేసిన క్రిమినల్ కాంటెప్ట్ పిటిషన్‌ను మూసివేయాలని రాహుల్ గాంధీ చేసిన అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి నేతృత్వంలోని ధర్మాసనం సుమారు పది నిమిషాల సేపు పిటిషనర్ లేఖి తరపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి, రాహుల్ గాంధీ తరపున సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ వాదప్రతివాదనలను విన్న తరువాత ఈ ఆదేశాలు జారీ చేసింది. ‘కోర్టు ధిక్కార అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి (రాహుల్ గాంధీ) తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ ప్రకటనల ఆధారంగా ఈ విషయంలో నోటీసు జారీ చేయాలని మేము నిశ్చయించాం’ అని న్యాయమూర్తులు దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నా సభ్యులుగా గల ధర్మాసనం పేర్కొంది. ‘కోర్టు ధిక్కార అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి (రాహుల్ గాంధీ)కి ప్రస్తుతం విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది’ అని ధర్మాసనం తెలిపింది. ‘ఈ నెల 30న విచారించనున్న రివ్యూ పిటిషన్లు, ఇతర దరఖాస్తులకు ఈ కోర్టు ధిక్కార పిటిషన్‌ను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించడం సరయిందని మేము భావించాం’ అని ధర్మాసనం పేర్కొంది.
అంతకుముందు ధర్మాసనం రాహుల్ గాంధీ సమర్పించిన అఫిడవిట్‌లో ఉన్న అంశాలను తెలపాలని రోహత్గికి సూచించింది. రాహుల్ తాను చేసిన వ్యాఖ్యలపై అఫిడవిట్‌లో విచారం వ్యక్తం చేశారు. ‘మేము అఫిడవిట్‌ను చదవలేదు. రాహుల్ గాంధీ ఏమి పేర్కొన్నారో చెప్పండి’ అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. అత్యున్నత న్యాయస్థానం ఏప్రిల్ 10వ తేదీన ఇచ్చిన తీర్పుకు సంబంధించి తాను తప్పుడు ప్రకటన చేశానని కాంగ్రెస్ అధ్యక్షుడు అంగీకరించారని రోహత్గి ధర్మాసనానికి తెలిపారు. ‘రాహుల్ గాంధీ ప్రచార జోరులో ఆ వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు’ అని రోహత్గి వివరించారు. రాహుల్ గాంధీ కోర్టు ఆదేశాలను చదవకుండా, చూడకుండా ఆ వ్యాఖ్యలు చేశారని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ సోమవారం సమర్పించిన అఫిడవిట్‌ను ప్రస్తావిస్తూ, ‘క్షమాపణ అనే పదం బ్రాకెట్‌లో ఉంది’ అని రోహత్గి పేర్కొన్నారు. ‘నాకయితే, అది క్షమాపణ అనిపించదు. కేవలం పెదవిపై నుంచి వచ్చిన క్షమాపణ’ అని రోహత్గి ధర్మాసనానికి చెప్పారు.