క్రైమ్ కథ

మోసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా ఫొటోని, నేను ఇచ్చిన ఐడి కార్డుని మార్చిమార్చి పోల్చి చూశాక డ్రెక్సలర్ వాటిని నాకు తిరిగి ఇచ్చి చెప్పాడు.
‘ఇది గౌరవప్రదం. ఇంతదాకా నా ఆఫీస్‌లోకి ఎఫ్‌బిఐ ఏజెంట్లు ఎన్నడూ రాలేదు’
అతని ఇన్‌కంటాక్స్ రిటర్న్స్‌ని ఓ ఐదేళ్లవి పరిశీలిస్తే తప్పకుండా ఐదారు లక్షల డాలర్ల ఆదాయాన్ని మరుగుపరిచి ఉంటాడని తేలిగ్గా గ్రహించవచ్చు. కాని నేను డ్రెక్సలర్ దగ్గరికి వచ్చిన పని అది కాదు.
‘హెన్రీ లాంటి వాళ్లు కూడా మీ ఆఫీస్‌లోకి వచ్చి ఉండరు’ చెప్పాను.
‘హెన్రీ?’
‘ఈ రోజుల్లోని మోసగాళ్లల్లో హెన్రీ ఒకడు. కాని అలా కనపడడు. మిషిగన్ రాష్ట్రంలో టామ్ పేరుతో మోసం చేసి రెండు లక్షల డాలర్లని సంపాదించాడు. తర్వాత సిన్సినాటీలో ఓ వడ్డీ వ్యాపారి దగ్గర లక్షన్నర కొట్టేశాడు. ఓ బేంక్ స్కామ్‌లో తొంభై ఐదు వేలు కొట్టేసాక కొంతకాలం మరుగున ఉన్నాడు. ఆర్నెల్ల క్రితం అతను మళ్లీ ఇవాన్స్ విల్‌లో నకిలీ షేర్ సర్ట్ఫికెట్లు అమ్మాడు. ఎంత సంపాదించాడో ఇంకా లెక్క తెలీలేదు. నేను చాలా కాలంగా అతని కోసం వెతుకుతున్నాను.’
‘మీరు హెచ్చరించినందుకు థాంక్స్. హెన్రీ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను.’
‘నేను మిమ్మల్ని అలా ఉండద్దని కోరడానికి వచ్చాను. అతను మిమ్మల్ని మోసం చెయ్యనివ్వండి. ఆధారాలతో వెంటనే అరెస్ట్ చేస్తాను. గత కేసుల్లో మాకు అతనికి వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా దొరకలేదు. కోర్ట్ నమ్మదగ్గర ఆధారాల గురించి నేను చెప్పేది.’
‘అతన్ని ట్రేస్ చేయాలని అనుకుంటున్నారా?’ డ్రెక్సలర్ ప్రశ్నించాడు.
‘అవును. అందుకు మీ సహకారాన్ని కోరుతున్నాను.’
‘సాధారణంగా నేను నా వ్యాపార లావాదేవీల గురించి మూడో వ్యక్తితో మాట్లాడను. కాని ఈ ఒక్కసారికీ ఈ నియమాన్ని పక్కన పెడతాను. హెన్రీ కొంత పొలాన్ని కొనాలని అనుకుని నా దగ్గరికి వచ్చాడు. అతను అందుకు మా బేంక్ నించి అప్పు తీసుకోవాలని అనుకున్నాడు. తనఖా పెట్టే సెక్యూరిటీకన్నా చాలా తక్కువ శాతానికి మేం అప్పు ఇస్తాం. ఏ కారణంగానైనా అతను వరసగా మూడు ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లించకపోతే ఆ ఆస్థిని వేలం వేసి అప్పుని వసూలు చేస్తాం. మా లీగల్ శాఖ ఆ ఆస్థి తనఖా పెట్టే వారిదా? కాదా? అని శ్రద్ధగా పరిశీలిస్తుంది. ఇంకో శాఖ వారు దాని మార్కెట్ ధర ఎంతో కూడా సరిగ్గా అంచనా వేస్తారు. కాబట్టి అతను నన్ను ఎలా మోసం చేయగలడో నాకు అర్థం కావడంలేదు.’
‘అంటే మీరు సహాయం చేయరా?’ అడిగాను.
‘నేను అలా అనలేదు. రేపు అతనితో లంచ్ మీటింగ్ ఉంది. నాకేమైనా అనుమానం వస్తే వెంటనే మీకు ఫోన్ చేస్తాను.
* * *
ఆ ఊళ్లోని వ్యాపారస్థులు లంచ్ చేస్తూ మాట్లాడుకోదగ్గ రెస్ట్‌రెంట్ ఒక్కటే ఉంది. అది ఎల్క్స్ క్లబ్. మర్నాడు నేను లంచ్ టైంలో ఆ రెస్ట్‌రెంట్‌కి వెళ్లిన కొద్దిసేపటికి వాళ్లిద్దరూ వచ్చారు. వాళ్లు కూర్చున్నాక ఒకతను వచ్చి హెన్రీని అడగడం నాకు స్పష్టంగా వినిపించింది.
‘ఎక్స్‌క్యూజ్‌మీ. నేను ఇందాక ఇక్కడ కూర్చుని ఇప్పుడే లేచి వెళ్లాను. ఇక్కడ సీట్లో నా బేక్ పాకెట్లోంచి నా పర్స్ పడిపోయింది అనుకుంటాను. దయచేసి మీరు లేస్తే చూస్తాను’
‘నాకు అది కనిపించింది. వెళ్లేప్పుడు మేనేజర్‌కి ఇచ్చి వెళ్లే ఇబ్బంది తప్పింది. అది మీదేనని రుజువు చేసుకోండి.’ హెన్రీ సన్నగా నవ్వి చెప్పాడు.
‘అది మొసలి చర్మంతో చేసిన పర్స్. అందులో నా క్రెడిట్ కార్డులు, ఏభై ఒక్క డాలర్లు ఉన్నాయి. లెస్టర్ జి ఆర్నాల్డ్ పేర క్రెడిట్ కార్డులు ఉన్నాయి’
హెన్రీ పర్స్ తెరిచి క్రెడిట్ కార్డులు, డబ్బుని పరిశీలించాక తల ఊపి దాన్ని అతనికి ఇస్తూ చెప్పాడు.
‘మీరు చెప్పింది నిజం. ఇది మీదే.’
‘్థంక్స్. నేను మీకు రుణపడ్డాను. దాన్ని తీర్చుకుంటాను’ లెస్టర్ చెప్పాడు.
‘ఆ అవసరం లేదు. థాంక్స్ చాలు’ హెన్రీ నవ్వి చెప్పాడు.
‘నేనీ ఊరుకి రేసులు మొదలయ్యాయనే వచ్చాను. ఈ మధ్యాహ్నం నేను కాసే పందెంలో డబ్బు వస్తే కొంత మీకు ఇస్తాను. సరేనా?’
‘అందువల్ల మీకేం లాభం?’ డ్రెక్సలర్ ప్రశ్నించాడు.
‘అందువల్ల నాకు మంచిగా అనిపిస్తుంది.’
‘మీకు మంచిగా అనిపిస్తే సరే మిస్టర్ లెస్టర్. మీరు వెళ్తే మేం భోజనం ఆర్డర్ చేస్తాం’ హెన్రీ చెప్పాడు.
* * *
ఆ సాయంత్రం డ్రెక్సలర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు.
‘మీరు చెప్పింది నిజం అనిపిస్తోంది. రెస్ట్‌రెంట్లో మీరు చూసిన నాటకం తర్వాత జరిగింది మీకు చెప్పాలి. లెస్టర్ ఫోన్ చేసి తను వంద డాలర్లు గెలుచుకున్నానని చెప్పాడు. తనకి రేసుకి ముందే ఏ గుర్రం గెలుస్తుందో సమాచారం తెలుస్తుందని, అందుకని తప్పక గెలుస్తానని, ఎవరి భాగాలు వాళ్లకి ఇచ్చాక మిగిలిందే తన వృత్తిలో సంపాదించేదనీ చెప్పాడు. హెన్రీ రేపు రేస్ కోర్స్‌లకి వెళ్దామని నన్నూ ఆహ్వానించాడు. ఏం చెయ్యను? నేను ఎన్నడూ రేస్ కోర్స్‌లకి వెళ్లలేదు.’
‘వెళ్లండి. ఈసారి అతని మోసం ఏమిటో అర్థమవుతుంది. గతంలో అతను రేస్ కోర్స్‌లో మోసం చేసిన తర్వాత, ఈ రోజు జరిగింది టైప్ చేసి తెస్తాను. దయచేసి దాని మీద సంతకం చేయండి. రేపు కోర్ట్‌లో కేస్ ప్రజెంట్ చేయడానికి అది ఉపయోగిస్తుంది. ఇంకో సహాయం కూడా చేయండి...’ అదేమిటో కోరాను.
‘అలాగే’ డ్రెక్సలర్ అంగీకరించాడు.
* * *
డ్రెక్సలర్ నేను కోరిన సహాయం చేశాడు. మర్నాడు మధ్యాహ్నం హెన్రీకి నన్ను తన మేనల్లుడిగా పరిచయం చేశాడు.
‘ఇతను కూడా మనతో వస్తే మీకు అభ్యంతరం లేదనుకుంటాను?’ డ్రెక్సలర్ అడిగాడు.
‘ఎంత మాత్రం లేదు. కాని నాకు రేసుల గురించి బొత్తిగా తెలీదు’ హెన్రీ చెప్పాడు.
‘్ఫర్వాలేదు. ప్రతీ వారు ఏదో రోజు దీన్ని ఆరంభించాలి’ లెస్టర్ నవ్వుతూ చెప్పాడు.
కార్లో పావుగంట ప్రయాణించాక ఓ భవంతిలో రెండో అంతస్థులోని ఆఫీస్ నేమ్ బోర్డ్ లేని తలుపు తెరచుకుని వెళ్లే లెస్టర్ని ముగ్గురం అనుసరించాం. అందులో ఓ పెద్ద నల్ల బోర్డ్ మీద రేసుల నంబర్లు, పరిగెత్తే గుర్రాల వివరాలు రాసి ఉన్నాయి. అనేక ఫోన్లు తరచూ మోగుతున్నాయి.
‘ఇది బెట్టింగ్ ఆఫీస్. చట్టవిరుద్ధంగా నడిచే ఇలాంటివి నగరంలో అతి తక్కువ ఉన్నాయి. ఇక్కడ పందెం స్వీకరిస్తారు. ఇందుకోసం రేస్ కోర్స్‌కి వెళ్లక్కర్లేదు. టీవీలో ఫలితాలు ప్రకటించగానే మనం గెలిస్తే ఆ డబ్బు మనకి ముడుతుంది. ఓడిపోతే అది వాళ్ల లాభం. గెల్చిన సొమ్ము మీద ఐదు శాతం కమిషన్ తీసుకుంటారు. అది వాళ్ల ఆదాయం’ లెస్టర్ వివరించాడు.
దాని మీద త్వరలో నేను రెయిడ్ చేయిస్తానని డ్రెక్సలర్ నా వంక చూసిన చూపునిబట్టి గ్రహించి చిన్నగా నవ్వాను. అతనూ నవ్వాడు. మేము కుర్చీలో కూర్చున్నాం. అనేక మంది వచ్చి లోగొంతుకతో మాట్లాడి పందెం డబ్బిచ్చి రసీదు తీసుకెళ్తున్నారు. కొందరు తమతో తెచ్చిన బీర్లని తాగుతూ రేస్ మొదలవడానికి వేచి ఉన్నారు.
రేస్ మొదలవగానే టీవీలో అది ప్రసారం కాసాగింది.
‘రేస్ కోర్స్‌లో రేస్‌ని ఇంత స్పష్టంగా చూడలేం. కాని అక్కడి ఎక్సైట్‌మెంట్ వేరు’ లెస్టర్ మాతో చెప్పాడు.
అతను నాలుగో నంబర్ గుర్రం మీద నూట ఏభై డాలర్లు పందెం కట్టాడు. రేస్ పూర్తయ్యాక హెన్రీ ఆనందంగా చెప్పాడు.
‘వారేవా! మనం నిజంగా గెలిచాం’
లెస్టర్ గర్వంగా నవ్వుతూ లేచి వెళ్లి నూట యాభై డాలర్ల రసీదు ఇచ్చి అతనితో మాట్లాడి వచ్చాడు. హెన్రీ అక్కడున్న రేసింగ్ వివరాలు బ్రోషర్ని చదువుతూంటే లెస్టర్ చెప్పాడు.
‘తర్వాతి రేసులోని ఆరో నంబర్ గుర్రం కింగ్ గెలుస్తుంది.’
‘మీరు పందెం కాయలేదే?’ రేస్ మొదలయ్యాక నేను లెస్టర్ని అడిగాను.
‘కాసాను. గెలిచిన ఆరొందల డాలర్లు దీని మీద కాసాను’
అతను చెప్పినట్లే కింగ్ గెలిచింది. ఆ తర్వాత వరుసగా మూడో గుర్రం రెయిన్‌ట్రీ, తర్వాతి రేసులు అన్నిటిలో లెస్టర్ పందెం కాసిన అన్ని గుర్రాలు గెలిచాయి. ఇంక ఆఖరి రేస్ మిగిలింది.
‘ఆ మొత్తం కాసేస్తున్నారా?’ నేను లెస్టర్ని ఆందోళనగా అడిగాను.
‘అవును. ఓడిపోతాననే భయం వద్దు. నాకు అందరితో సంబంధాలు ఉన్నాయి. దీంట్లో నాకు వచ్చేది మూడు వేల డాలర్లు మాత్రమే.’
డ్రెక్సలర్ భయపడుతూనే రెండు వందల డాలర్లు పందెం కాశాడు.
హెన్రీ పర్స్ తెరచి రెండు వేల డాలర్లు ఇచ్చి లెస్టర్‌తో చెప్పాడు.
‘మీరు కాసిన గుర్రం మీదే దీన్నీ కాయండి’
‘అలాగే’
ఆఖరి రేసు ఫలితాలు వచ్చాక రసీదులని పరిశీలించి చూసి దాన్ని నడిపే వ్యక్తి పక్క గదిలోకి వెళ్లి ముగ్గురికీ కలిపి సుమారు ఇరవై ఆరు వేల డాలర్లు తెచ్చిచ్చి చెప్పాడు.
‘మీరు నిన్న, ఇవాళ చాలా డబ్బు గెలిచారు మిస్టర్7
‘అదిక్కడ నిషిద్ధమా?’ తనని ఎగాదిగా చూసే అతన్ని లెస్టర్ నవ్వుతూ అడిగాడు.
‘నేనలా అనలేదు’
‘అదృష్టదేవత ఎవరి పక్షాన ఉంటుందో గెలిచే వాళ్లకే తెలీదు’ హెన్రీ కల్పించుకుని చెప్పాడు.
హెన్రీ డబ్బు లెక్క పెట్టుకుని అడిగాడు.
‘మూడు వందల డాలర్లు తగ్గింది.’
‘సర్వీస్ ఛార్జ్’ అతను చెప్పాడు.
‘గెలిస్తేనే సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు. ఓడిపోతే అది ఉండదు’ లెస్టర్ వివరించాడు.
‘రేపు కూడా వస్తున్నారా?’ అతను అడిగాడు.
‘ఏం?’
‘మీరు ఎంత ఆడతారో తెలిస్తే ముందుగా డబ్బు తెచ్చి ఉంచుతాను. ఎవరైనా వందా నూట యాభై మించి పందెం కాయరు.’
‘వస్తాం. నేను అనేక రేసుల్లో పది వేల డాలర్ల దాకా పందెం కాస్తాను’ హెన్రీ చెప్పాడు.
అంతా బయటకి వచ్చాక వెళ్లబోయే ముందు లెస్టర్ చెప్పాడు.
‘రేపు ఓ రేస్‌లో ప్లెజెంట్ ఫేన్సీ అనే గుర్రం మీద ఎవరూ పెద్దగా పందెం కాయరు. దాని మీద పదిహేను వేలు కాస్తే మనకి రెండు లక్షలు రావడం ఖాయం. ఎల్లుండి నేను వెళ్లిపోతున్నాను. కాబట్టి రేపు ఒక్క రోజే’
‘రేపు ఇదే సమయానికి ఇక్కడే కలుద్దాం’ మేం కార్లో వెళ్లేప్పుడు హెన్రీకి చెప్పాను.
‘1950ల తర్వాత ఇలాంటి పార్లర్లకి అనుమతి లేదు. కాబట్టి ఇది చట్ట విరుద్ధం. టీవీలో నేను ఒకటి గమనించాను. రేసు ఎప్పుడు, ఎక్కడ ఆరంభమవుతోందన్న ప్రకటన లేదు. అవి గతంలో గెలిచిన రేసుల తాలూకు టేప్స్ తప్ప లైవ్ ప్రసారాలు కావు. హెన్రీ కనిపెట్టిన కొత్త మోసం ఇది’ డ్రెక్సలర్‌తో చెప్పాను.
‘అంటే హెన్రీ, లెస్టర్ భాగస్వాములా?’
‘నిస్సందేహంగా. పర్స్ ద్వారా వారి పరిచయం కూడా ఈ నాటకంలో ఓ భాగమే. మనుషుల్లోని అత్యాశని హెన్రీ కేష్ చేసుకుంటున్నాడు’
‘కాని నేను గెలిచిన రెండు వేల రెండు వందల డాలర్లు నాకు ఇచ్చారు. రేపు నేను మళ్లీ వెళ్లకపోతే వాళ్లది నష్టపోయినట్లే కదా?’ డ్రెక్సలర్ ప్రశ్నించాడు.
‘అవి నకిలీ నోట్లని నా నమ్మకం’ చేతిని చాపుతూ చెప్పాను.
వాటిని అతను నాకు ఇస్తే తనిఖీ చేసి ఆశ్చర్యపోయాను. తిరిగి ఇచ్చి చెప్పాను.
‘అసలువి!... ఎఫ్‌బిఐ తరఫున రేపు నేను ఐదు వందల డాలర్లు పందెం కాస్తాను. కాని దానికి తక్కువ శిక్ష పడుతుంది. కనీసం పది వేల డాలర్లు పందెం కాస్తే హెన్రీకి ఇరవై ఏళ్ల జైలుశిక్ష పడుతుంది. నా దగ్గర అంత డబ్బు లేదు. నా పై అధికారిని ఆ డబ్బుతో రమ్మని చెప్తాను. కాని కొత్త వాళ్లని రానివ్వరు’ ఆలోచనగా చెప్పాడు.
డ్రెక్సలర్ తన ఆఫీస్ సేఫ్‌ని తెరచి కొంత డబ్బిచ్చి చెప్పాడు.
‘లెక్క పెట్టండి’
అతని మొహంలోని అత్యాశని పసికట్టాను.
‘పదిహేను వేల రెండు వందలు’
‘దీనికి మీరు ఎఫ్‌బిఐ తరఫున రసీదు ఇవ్వండి. రేపేదైనా జరిగి ఓడిపోతే ఎఫ్‌బిఐ నా డబ్బు నాకు తిరిగి ఇవ్వాలి’ డ్రెక్సలర్ చెప్పాడు.
‘సరే. రేపు ఇస్తాను. ఈ డబ్బుని రేపు తీసుకురండి’
* * *
మర్నాడు ఉదయం నేను, డ్రెక్సలర్ అతని ఆఫీసు లోంచి బయటకి వచ్చేప్పుడు చెప్పాను.
‘ఇవాళ సాయంత్రం నాలుగుకి ఆఖరి రేస్ ముందు రెయిడ్ జరుగుతుంది. రుజువుగా మీరు పందెం కాసిన డబ్బుల మీద గుర్తులు పెట్టాలి. నేను పోలీసుస్టేషన్‌కి వెళ్లి రెయిడ్ ఏర్పాట్లు, ఆ డబ్బు మీద గుర్తు పెట్టే పని చేసుకుని అక్కడికి వస్తాను. దయచేసి నన్ను పోలీసుస్టేషన్ బయట దింపి వెళ్లండి’
అతను ఇచ్చిన కవర్ని నేను జేబులో ఉంచుకుని రసీదు ఇచ్చాక అడిగాడు.
‘లెక్కపెట్టరా?’
‘ఎఫ్‌బిఐ ఆఫీసర్లతో పెట్టుకుంటే మీరు జైల్లో కూర్చుంటారు. లేదా రేపు రెవిన్యూ అధికారులు వచ్చి మీ టేక్స్ రిటర్న్స్‌ని చెక్ చేస్తారు’ నేను కఠినంగా చెప్పాను.
నన్ను పోలీసుస్టేషన్ బయట దింపి వెళ్లిపోయాడు. పోలీసుస్టేషన్‌లో నా కోసం హెన్రీ, లెస్టర్లు వేచి ఉన్నారు. నన్ను చూడగానే ఇద్దరూ లేచారు. ముగ్గురం బయటకి వచ్చి హెన్రీ కారెక్కాం. వాళ్లు లెస్టర్ పర్స్ పోయిందని రిపోర్ట్ ఇవ్వడానికి పోలీసుస్టేషన్‌కి వెళ్లి, అక్కడ ముందు ఏర్పాటు ప్రకారం నా కోసం వేచి ఉన్నారు.
కార్లో డ్రెక్సటర్ ఇచ్చిన కవర్ని తెరిచి అందులోని పదిహేను వేల డాలర్లని ముగ్గురం సమానంగా పంచుకున్నాం.
‘మీరు కూడా ఈ ఊరు వదిలి వెళ్లిపోండి. నేను ఎఫ్‌బిఐ ఏజెంట్‌ని కాదని అనేక చోట్ల అనేక మందిని మోసం చేసిన టామ్ జేమ్స్ నేనేనని డ్రెక్సలర్‌కి ఆలస్యంగా తెలుస్తుంది’ నవ్వుతూ చెప్పాను.

(రాబర్ట్ ఎడ్వర్డ్ ఎకెల్స్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి