రాష్ట్రీయం

రాజధాని నిర్మాణానికి చైనా సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి పర్యటనలో మంత్రి ఛెన్ పెంగ్జియాంగ్ భరోసా

గుంటూరు, నవంబర్ 23: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి చైనా ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని ఆ దేశ మంత్రి ఛెన్ పెంగ్జియాంగ్ చెప్పారు. రాజధాని అమరావతిలో సోమవారం చైనా మంత్రి బృందం పర్యటించింది. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలను సాకారం చేసేందుకు తమ దేశపు కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. అద్భుతమైన రాజధాని నిర్మించాలనే సంకల్పంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో కలిసి పనిచేయటం తమకు గౌరవప్రదమన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల నుంచి మాస్టర్ ప్రణాళికలు తెప్పిస్తూ అద్భుతమైన రాజధాని నిర్మాణానికి కావాల్సిన స్వరూప, స్వభావాలపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలకు అనుగుణంగా చైనా దేశం పనిచేసేందుకు సిద్ధంగా వుందని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ ఆసక్తిగా కొనసాగిందని చెప్పారు. తమ ప్రభుత్వం అన్నివిధాలా సహకరించేందుకు కంపెనీలు కూడా సిద్ధంగా ఉన్నాయని ఛెన్ పెంగ్జియాంగ్ వివరించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ చైనా దేశం నుంచి మంత్రి ఛెన్‌తో పాటు 9మంది సభ్యుల బృందం రాజధానిలో పర్యటించిందన్నారు. అమరావతిలో క్రీస్తుపూర్వం మూడో శతాబ్దపు బౌద్ధుని ఆనవాళ్లపై చైనీయులు చాలా మక్కువ చూపారన్నారు. మహాచైత్యంకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు ఆసక్తి చూపారని తెలిపారు. బుద్ధుని జీవిత చరిత్ర, అశోకునికి సంబంధించిన చారిత్రక విశేషాలు వారికి తెలియజేశామన్నారు. విజయవాడ నుంచి నేరుగా ఉద్దండరాయునిపాలెం వచ్చిన చైనా బృందం రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రదేశాన్ని తొలుత పరిశీలించారు. అక్కడి నుంచి రాయపూడి గ్రామానికి చేరుకుని పేదల జీవన స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు కొంత సమయాన్ని వెచ్చించారు. ఈసందర్భంగా గ్రామంలోని మిక్కిలి ప్రసాద్ కుటుంబానికి వంద అమెరికన్ డాలర్లను మంత్రి ఛెన్ అందజేశారు. అనంతరం అమరావతి చేరుకుని జ్ఞానబుద్ధ విగ్రహాన్ని, మ్యూజియాన్ని పరిశీలించారు.