మెయిన్ ఫీచర్

కంపెనీ బోర్డుల్లో కాంతలు అంతంతమాత్రమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మహిళా బిల్లు’ అటకెక్కినందున చట్టసభల్లో మగువలకు రిజర్వేషన్లు ఇవ్వలేకపోయామంటూ రాజకీయ పార్టీల నేతలు తరచూ సానుభూతి ఒలకబోస్తుంటారు. అయితే, సవరించిన కంపెనీల చట్టం ప్రకారం కార్పొరేట్ సంస్థల్లో విధిగా కొంతమంది మహిళా డైరెక్టర్లను నియమించాలన్న నిబంధనలు మాత్రం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. నిబంధనల్ని ఉల్లంఘించే కంపెనీల యాజమాన్యాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మన నేతలెవరూ డిమాండ్ చేయరు. విద్య, ఉపాధి రంగాల్లో స్ర్తిల ప్రాతినిధ్యం పెరుగుతోందని, మహిళా సాధికారత దిశగా అద్భుతాలు సాధిస్తున్నట్లు పాలకులు ఘనంగా ప్రకటిస్తున్నప్పటికీ కార్పొరేట్ రంగంలో అతివలకు ఆశించిన ప్రాతినిధ్యం దక్కడం లేదు. తప్పనిసరిగా మహిళా డైరెక్టర్లను నియమించాలన్న నిబంధనలను కొన్ని కార్పొరేట్ సంస్థలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. కంపెనీల యాజమానులు తమ కుటుంబ సభ్యుల్లోని మహిళలను డైరెక్టర్లుగా నియమించుకుంటున్నారు. పేరుకు డైరెక్టర్లే అయినా యాజమాన్యాల కుటుంబ సభ్యుల్లోని మహిళలు ప్రత్యేకించి చేసేదీమీ ఉండదు. నిజానికి ఈ పదవులు విద్యావంతులైన మహిళలకు దక్కాల్సి ఉంది.
భారత్‌కు సంబంధించి కంపెనీల బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఉన్నతస్థాయి పదవులను అధిరోహించేలా మహిళలను కార్పొరేట్ రంగంలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తాజా పరిస్థితులు అద్దం పడుతున్నాయి. కంపెనీల బోర్డుల్లో ఏడు శాతం మహిళా ప్రాతినిధ్యంతో- ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ 26వ స్థానంలో నిలిచింది. చిన్నదేశమైన నార్వేలో కంపెనీల బోర్డుల్లో 40.12 శాతం మంది మహిళలు ఉన్నారు. అధ్యయనం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా 38,183 నమోదిత కంపెనీల్లో, భారత్‌కు చెందిన 1,459 కంపెనీల్లో మహిళా ప్రాతినిధ్యంపై క్షుణ్ణంగా విశే్లషించారు. ‘ఉమెన్ ఆన్ బోర్డ్-2016’ పేరిట జరిగిన ఈ అధ్యయనంలో కంపెనీ బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించి నార్వే మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. మహిళా డైరెక్టర్ల శాతం స్వీడన్‌లో 29.31, ఫిన్‌ల్యాండ్‌లో 25.89, దక్షిణాఫ్రికాలో 18.31, అమెరికాలో 17.37 శాతంగా నమోదైంది. భారత్‌లో గత ఏడాది 6.65 శాతంగా ఉన్న మహిళా ప్రాతినిధ్యం ఇటీవల కొద్దిగా పెరిగి 6.91 శాతానికి చేరినట్లు తేలింది. డైరెక్టర్ పదవీకాలం విషయంలోనూ పురుషులు, మహిళల మధ్య వివక్ష కొనసాగుతోంది. చాలాదేశాల్లో మహిళా డైరెక్టర్ల పదవీకాలం రెండేళ్లు కాగా, భారత్‌లో మాత్రం ఏడాదిగానే ఉంది.
వారు ఉంటే సక్సెస్..
మహిళలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కంపెనీలు విజయ పథంలో పయనిస్తూ లాభాలను చవిచూస్తున్నట్లు సర్వేలో తేలింది. ఆర్థికంగా నిలదొక్కుకున్న కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లలో మహిళలు 7.1 శాతం ఉండగా, నష్టాలను ఎదుర్కొంటున్న సంస్థల్లో మహిళా ఎగ్జిక్యూటివ్‌ల శాతం 3.1 అని వెల్లడైంది. డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంటు వంటి కీలక బాధ్యతల్లో మహిళలు ఉన్న సంస్థలు వృద్ధిబాటలో దూసుకుపోతున్నాయి. మన దేశంలో పెట్టుబడిదారుల్లో మహిళల వాటా 10 శాతానికి మించలేదు. భారత్‌లోని కార్పొరేట్ సంస్థల్లో సీనియర్ మేనేజర్ స్థాయిలో 30 శాతం మంది మహిళలున్నారు. అంతర్జాతీయంగా చూస్తే సీనియర్ మేనేజ్‌మెంటు స్థాయిలో మహిళల భాగస్వామ్యం 24 శాతంగా ఉంది. మన దేశంతో పాటు చాలా దేశాల్లో కార్పొరేట్ ఉద్యోగుల్లో మహిళల శాతం ఇంకా తక్కువగానే ఉన్నట్లు తేలింది. ఈ విషయంలో 135 దేశాల్లో పరిస్థితులను విశే్లషిస్తే భారత్ 113వ స్థానంలో ఉంది.
వేతనాలపై పెదవి విరుపు..
కార్పొరేట్ సంస్థల్లో కీలక పదవులకు సంబంధించి మహిళా ప్రాతినిధ్యం నిరాశాజనకంగా ఉండగా, మరోవైపు ఉద్యోగినులు తమకు లభిస్తున్న జీతభత్యాలపై చాలా అసంతృప్తితో ఉన్నారు. మన దేశంలోని ఉద్యోగినుల్లో 26 శాతం మంది తమకు దక్కుతున్న వేతనాలు, ఇతర అలవెన్స్‌ల విషయంలో నిరాశ చెందుతున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 23 శాతం మంది ఉద్యోగినులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఉద్యోగాల అనే్వషణ విషయంలోనూ భారతీయ మహిళల్లో ఆశావాదం తక్కువగానే ఉన్నట్లు తేలింది. మూడు నెలల్లో మంచి ఉద్యోగాన్ని పొందగలమన్న ఆత్మవిశ్వాసాన్ని 68 శాతం మంది మహిళలు వ్యక్తం చేయగా, ఉద్యోగ భద్రతపై 17 శాతం మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న మహిళల్లో దాదాపు నాలుగోవంతు మంది పలు కారణాల రీత్యా ఉద్యోగాలను వదులుకునేందుకు సిద్ధపడుతున్నారు. పనివేళలు అనువుగా లేకపోవడం, పనిచేసే చోట అభద్రత, లింగవివక్ష, రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవడం, పిల్లల సంరక్షణ వంటి కారణాలతో ఉద్యోగాలకు రాజీనామా చేసే మహిళల సంఖ్య ప్రైవేటురంగంలో పెరుగుతోంది. 500 మంది ఉద్యోగినులను ఇటీవల ‘అసోచామ్’ సర్వే చేయగా- పిల్లల సంరక్షణ కోసం ఉద్యోగాలకు దూరం అవుతున్నట్లు 40 శాతం మంది మహిళలు తెలిపారు. పనిచేసే చోట అభద్రత, వేధింపుల వల్ల ఉద్యోగాలు మానేస్తున్నట్లు 30 శాతం మంది తెలిపారు.
*