మెయన్ ఫీచర్

నేపాల్ మరో టిబెట్ కాకూడదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో భారత్-నేపాల్ మాదిరి ఉమ్మడి సంస్కృతి కలిగిన దేశాలు ఉండవంటే అతిశయోక్తి లేదు. చరిత్ర, భౌగోళికత, మతం, సంస్కృతి, వివాహాలు, స్వజాతీయత వంటి అంశాల్లో ఈ రెండు దేశాల మమేకత మరే రెండు దేశాల మధ్య కనిపించదు. నేరు గూర్ఖా దళాలతో కలిసి దాదాపు యాభై సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ దేశంలో పర్వతారోహ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మన మాజీ సైనికులకోసం అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాను. అంతేకాదు 1990 నాటి సంక్లిష్ట సమయంలో నేపాల్‌కు భారత రాయబారిగా కూడా పనిచేశా. మానసికంగా నేపాల్‌తో నాకు ఎంతో అనుబంధం ఉన్నది. ఒకరకంగా చెప్పాలంటే నాకు నేపాల్ రెండో స్వస్థలం.
1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్, బిహార్‌లోని కొన్ని ప్రాంతాలను నేపాల్‌కు ఇచ్చింది. అందుకు బదులుగా సైనిక సహాయాన్ని అందుకుంది. ఆవిధంగా బ్రిటిష్‌వారు ధారాదత్తం చేసిన ప్రాంతమే మాధేశ్. అక్కడ నివసించేవారిని మాధేశీలు అంటారు. నేపాల్ కాంగ్రెస్‌కు చెందిన బి.పి. కోయిరాలా నేతృత్వంలో పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య ఉద్యమం చోటు చేసుకుంది. నాటి పాలకుడు రాణాను తొలగించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదే ఈ ఉద్యమ ముఖ్య లక్ష్యం. అయితే ఇదే సమయంలో నేపాల్ రాజును రాజ్యాంగ అధినేతగా కొనసాగించాలని కూడా కోయిరాలా భావించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో కోయిరాలాతో పాటు ఇతర నేపాల్ కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు. కోయిరాలాను నాటి బ్రిటిష్ పాలకులు అరెస్ట్ చేసి, జయప్రకాశ్ నారాయణ్‌తో కలిపి హజారీబాగ్ సెంట్రల్ జైల్లో ఉం చారు. అదే ఉద్యమ కాలంలో అనేక మంది నేపాల్ కాంగ్రెస్ నాయకులు కూడా అరెస్టయి జైలుశిక్షలు అనుభవించారు. నేపాల్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు భారత్ ఎంతో సహకరించింది.
భారత్-నేపాల్ సంబంధాలు ఎంత సుహృద్భావంతో కూడినవంటే, వీసాలు లేకుండానే ఇరుదేశాల ప్రజలు స్వేచ్ఛగా సంచరించవచ్చు. సరిహద్దులు ఎప్పుడూ తెరిచే ఉంటా యి. లక్షలమంది నేపాలీలు భారత్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిని భారత పౌరులతో సమానంగా పరిగణింపబడుతున్నారు. ఇదే సూత్రం భారత సైన్యంలోని గూర్ఖా సైనికులకు కూడా వర్తిస్తుంది. మన సైన్యంలో కొంద రు గూర్ఖాలు లెఫ్ట్‌నెంట్ జనరల్ స్థాయికి చేరుకున్నారు కూడా. భారత ఆర్మీ చీఫ్ కావడానికి గూర్ఖాలకు ఏవిధమైన అడ్డంకులు లేవు. 1960లో రాజు మహేంద్ర షా ప్రజాస్వామ్యాన్ని రద్దు చేశాడు. పార్టీ రహిత ఎన్నికలను నిర్వహించి పంచాయతీ పాలనను ప్రవేశపెట్టాడు. ఈ విధానంలో ప్రధాని ఆయన మంత్రివర్గ సహచరులను రాజే నామినేట్ చేస్తాడు. అంతేకాదు ఈ సందర్భంగా రాజు దేశంలో ప్రాజెక్టుల నిర్మాణానికి చైనా సహకారాన్ని కోరాడు. 1962 భారత్-చైనా యుద్ధంలో నేపాల్ తటస్థంగా ఉండిపోయింది. రాజు బీరేంద్ర షా పంచాయతీ రాజ్ వ్యవస్థను అమలు పరుస్తూ చైనాకు అనుకూలంగా వ్యవహరించడాన్ని కొనసాగించాడు. రాజీవ్‌గాంధీ, నేపాల్ రాజుల మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాల కారణంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం 1989తో రద్దయ పోయింది. నేపాల్‌ను తన పాదాల వద్దకు తెచ్చుకోవాలని భారత్ భావించగా, ఇతర దేశాల సహకారంతో భారత్‌ను ధిక్కరించాలని నేపాల్ భావించింది. అయితే నేపాల్ నుంచి భారత్‌ను వైదొలగించడం చైనాకు సాధ్యమయ్యేపని కాదు. ఎందుకంటే ఆ రెండు దేశాల మధ్య ఉపరితల కమ్యూనికేషన్ వ్యవస్థ దయనీయ స్థితిలో ఉండటమే అందుకు కారణం.
నాటి చైనా ప్రధాని లీ హువాన్ ఖాట్మండు పర్యటన సందర్భంగా మాట్లాడుతూ, నేపాల్ తమ భౌగోళికతతో సంబంధాలను పెంచుకోవాలని కోరాడు. పెట్రోలు, డీజిల్, కిరోసిన్, ఉప్పు, మందుల వంటి అనేక నిత్యావసరాల విషయంలో నేపాల్ నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. తీవ్ర ఆర్థిక లోటు తీవ్రం కావడంతో భారత్‌కు వ్యతిరేకంగా ప్రదర్శనలు కూడా చోటు చేసుకున్నాయి. అంతేకాదు నేపాల్ కాంగ్రెస్, నేపాల్ కమ్యూనిస్టు పార్టీలు ఉమ్మడిగా ప్రజాస్వామ్యంకోసం ఆందోళనను చేపట్టాయి. ఈ పార్టీల నేతలను జైల్లో నిర్బంధించడంతో, దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.
సరీగ్గా అదే సమయంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం పడిపోయి విపి సింగ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పదవిని చేపట్టిన వెంటనే విపి సింగ్ నేపాల్‌కు రాయబారిని నియమించారు. అప్పటివరకు నిలిచిపోయిన నిత్యావసర సరకుల సరఫరా తిరిగి పునరుద్ధరించబడింది. నేపాల్‌కు పెద్ద ఎత్తున భారత్ ఆర్థిక సహాయాన్ని అందించింది. దేశంలో నిర్బంధంలో ఉన్న రాజకీయ పార్టీల నేతలంతా విడుదలయ్యారు. మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది. నేపాలీ కాంగ్రెస్, నేపాలీ కమ్యూనిస్టు పార్టీలు ఇందులో భాగస్వాములు కాగా, కాంగ్రెస్ పార్టీ నేత దేశ ప్రధాని అయ్యారు. 1946లో భారత్‌లో ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వం లాంటిది ఇది. ఇదే సమయంలో మధ్యంతర రాజ్యాంగం కూడా ఆమోదం పొందింది. నేపాల్ హిందూ రాజ్యంగా ఉండటమే కాకుండా, రాచరికం కూడా కొనసాగింది. భారత్‌కు చెందిన ప్రము ఖ రాజ్యాంగ న్యాయవాది ఎల్.ఎం.సింఘ్వి నేపాల్ రాజ్యాంగ రచనలో సహకరించారు. ఇది భారత సెక్యులర్ విధానానికి, ఆ దేశంలోని రెండు రాజకీయ పార్టీల విధానానికి పూర్తి భిన్నం. అయినప్పటికీ దీన్ని నేపాల్ స్వాగతించింది.
తర్వాత అత్యంత దురదృష్టకరమైన సంఘటన చోటుచేసుకుంది. రాజు బీరేంద్ర షా, ఆయన కుటుంబం సభ్యులంతా హత్య కు గురయ్యారు. వెంటనే బీరేంద్ర షా సోదరుడు జ్ఞానేంద్ర విక్రమ్ షా అధికారంలోకి వచ్చారు. ఆయన కుమారుడు యువరాజు అయిన పరాస్‌కు దేశంలో మంచిపేరు లేదు. ఫలితంగా రాజరికం అంటే ఉన్న గౌరవం ప్రజల్లో తగ్గిపోయింది. ఇక కమ్యూనిస్టులు అంతర్యుద్ధం మొదలుపెట్టడంతో వేలాది మంది మరణించారు. 2004లో ఐక్య ప్రగతిశీల ప్రభుత్వం (యుపిఎ) అధికారంలోకి వచ్చింది. కమ్యూనిస్టుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన యుపిఎ ప్రభుత్వం, వామపక్షాలకు అనుకూలంగా తన విధానాన్ని మార్చుకుంది. ఫలితంగా నేపాల్‌లో శాంతి నెలకొంది. ప్రచండ దేశ ప్రధాని అయ్యారు. ఇక ప్రచండ తన చైనా అనుకూల వైఖరితో, భారత వ్యతిరేక విధానాలను అమలుపరచడం మొదలుపెట్టాడు. రాచరికాన్ని పూర్తిగా రద్దు చేశారు. నేపాల్ సెక్యులర్ రాజ్యంగా మారింది.
నరేంద్రమోదీ ‘పొరుగువారికి ప్రాథాన్యత’ అన్న విధానంతో 2014లో నేపాల్‌లో జరిపిన పర్యటన బ్రహ్మాండంగా విజయవంతమైంది. ఆయన నేపాల్‌లో ఒక తుపానునే సృష్టించారు. అక్కడి పార్లమెంట్‌ను ఉద్దేశించి అత్యంత తెలివితేటలతో, నైపుణ్యంతో చేసిన ప్రసంగం సంచలనమే సృష్టించింది. ఏడు సంవత్సరాల చర్చల అనంతరం, మాధేశీల పట్ల పూర్తి వివక్షతతో కూడిన సరికొత్త రాజ్యాంగాన్ని అమోదించి, అమల్లోకి తెస్తున్నట్టు 2015, సెప్టెంబర్ 20న ప్రకటించారు. ఇందులో పార్లమెంటరీ నియోజకవర్గాలను జనాభా ఆధారంగా కాకుండా, వైశాల్యం ఆధారంగా విభజించారు. ఆవిధంగా 14 జిల్లాలు, పర్వత ప్రాంత జిల్లాలతో కలిపేశారు. దురుద్దేశంతో కావాలని చేసిన పనివల్ల దేశంలోని మొత్తం 165 స్థానాల్లో మాధేశీలవి కేవలం 65కే పరిమితమయ్యాయి. మరి నేపాల్‌లో మాధేశీల జనాభా 51 శాతం. ఎంత అన్యా యం!!
ఈ సరికొత్త రాజ్యాంగాన్ని చైనా స్వాగతించింది. అయితే మాధేశీల పట్ల చూపిన వివక్ష నేపథ్యంలో భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీన్ని తమ అంతర్గత వ్యవహారాల్లో కలుగజేసుకోవడంగా నేపాల్ పరిగణిస్తోంది. గత ఆరువారాలుగా మాధేశీల ఆందోళన కొనసాగుతోంది. పోలీసుల కాల్పుల్లో 50 మంది మాధేశీలు మరణించారు. నేపాల్‌కు నిత్యావసరాల సరకులతో సరిహద్దువద్ద భారత్‌కు చెందిన వెయ్యి ట్రక్కులు నిలిచిపోయాయి. ఇవి నేపాల్‌లోకి ప్రవేశించడం సాధ్యం కావడం లేదు. ఎందుకంటే నేపాల్ సరిహద్దును ఆందోళనకారులు మూసివేశారు. నేపాల్ దళాలు ఈ అడ్డంకులను తొలగించలేక చేతులెత్తేశాయి. ఇక ఈ ట్రక్కులకు మాత్రం ఏం భద్రతనివ్వగలవు? భారత్ అత్యవసర మందులు ఇతర అత్యవసర సరకులను 100 ట్రక్కుల నిండా నేపాల్‌కు పంపింది. వీటన్నింటినీ తగులబెట్టారు. వీటిల్లో ఒక అంబూలెన్స్ కూడా ఉంది. అయితే భారత్ వీటిని ఆకాశమార్గం ద్వారా పంపింది. ఇది అనుకున్న విధంగా ఎంతో ప్రభావం చూపి భారత్‌కు మంచిపేరు తెచ్చిపెట్టింది.
ఇక భారత్‌కు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ప్రచారం విపరీత స్థాయిలో నేపాల్‌లో కొనసాగుతోంది. పాఠశాల విద్యార్థుల మెదళ్లను కూడా వారు భారత వ్యతిరేకతతో నింపేస్తున్నారు. ఖాట్మండులో మోదీ దిష్టి బొమ్మలను, భారత జాతీయ పతాకాలను తగులబెడుతున్నారు. ఇక మాధేశీ ప్రాంతాల్లో చైనా జాతీయ పతాకాలను తగులబెడుతున్నారు. రెండు దేశాల చరిత్రలో మొట్టమొదటి సారి భారత-నేపాల్ సరిహద్దులో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భారత సరిహద్దులో మన జాతీయుడిపై నేపాల్ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ సంఘటన ప్రధాని వరకు వెళ్లింది. కొంతమంది స్మగ్లర్లపై కాల్పులు జరిపారన్న ఆరోపణపై ముగ్గురు సశస్త్ర సీమాబల్‌కు చెందిన సిబ్బందిని నేపాల్ ప్రభుత్వం కస్టడీలోకి తీసుకుంది. నేపాల్‌ను భారత్ దిగ్బంధించిందంటూ ఆ దేశ ప్రతినిధులు ఐరాస భద్రతా మండలిలో ఫిర్యాదు చేశారు. ఇటీవల సంభవించిన భూకంపం కంటె, భారత్ చేసిన దిగ్బంధం వల్ల నేపాల్ తీవ్రంగా నష్టపోయిందని ప్రస్తుత నేపాల్ ప్రధాని ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి ఆరోపించారు. నేపాల్‌లో మాధేశీ ప్రాంతంలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని భారత్ ఫిర్యాదు చేసింది.
భారత్ పెద్దమనిషి తనంతో వ్యవహరించడం, భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారానికి పాల్పడకుండా నేపాల్ సంయమనం పాటిస్తే పరిస్థితి మరింత దిగజారిపోదు. ఎంతగా తన సామర్ధ్యాన్ని పెంచుకున్నా చైనా ఎట్టిపరిస్థితుల్లో భారత్‌ను నేపాల్‌నుంచి తప్పించలేదు. భౌగోళికంగా మాత్రమే కాదు, భారత్‌లో ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మందిపై నేపాల్ ఆర్థిక వ్యవస్థ ఆధారపడివుంది. దీన్ని పూరించడం చైనాకు సాధ్యం కాదు. ఈ విషాద పరిస్థితుల్లో భారత్-నేపాల్‌లు వివేచనతో వ్యవహరించాల్సి ఉంటుంది. 1950లో టిబెట్‌ను కబళించిన విధంగానే, చైనా నేపాల్‌ను కూడా కబళించే అవకాశాన్ని భారత్ ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వరాదు. భారత్ సహకారం లేకుండా నేపాల్ ఆర్థికంగా మనుగడ సాగించనూ లేదు. ఈ వాస్తవాలు మన రెండు దేశాలను ఒక్కదగ్గరికి చేర్చాలని ప్రార్ధిద్దాం. (చిత్రం) ఖాట్మండుకు 90 కిలోమీటర్ల దూరంలోని నేపాల్-్భరత్ సరిహద్దు ప్రాంతం బిర్‌గంజ్ చెక్ పాయంట్ వద్ద వందలాది మంది నిరసనకారులు, ట్రక్కులను నిలిపేసిన దృశ్యం. మరోవైపు మోహరించిన నేపాల్ పోలీసులు (ఫైల్‌ఫోటో).

- ఎస్.కె. సిన్హా