రాష్ట్రీయం

భద్రతతోనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయస్థాయి పోలీసింగ్‌కు కృషి
వచ్చే బడ్జెట్‌లో 400 కోట్లు కేటాయింపు
టెక్ సెక్యూరిటీపై దృష్టిపెట్టాలి: కెసిఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు శంకుస్థాపన

హైదరాబాద్, నవంబర్ 22: రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. శాంతిభద్రతలు లేకుంటే అభివృద్ధి అసాధ్యం. తెలంగాణ అభివృద్ధిలో శాంతిభద్రతలే కీలకమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. అత్యాధునిక టెక్నాలజీ వస్తుంది. అందిపుచ్చుకునే ధోరణితో అభివృద్ధి దిశగా ముందుకు సాగాలన్నారు. ఆదివారం బంజారాహిల్స్‌లో పోలీసు కమాండ్ కంట్రోల్ ట్విన్ టవర్‌కు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థను అంతర్జాతీయస్థాయిలో పటిష్టపర్చనున్నట్టు చెప్పారు. నేరాల అదుపునకు అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించతలపెట్టిన ట్విన్ టవర్‌కు రూ.302 కోట్లు మంజూరు చేశామని, అయితే ఈ నిధులు సరిపోవని కనీసం రూ.700కోట్లు అవసరమన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే మిగతా నాలుగు వందల కోట్లు కేటాయిస్తామన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసులు ప్రతిష్ఠ కలిగివున్నారని, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏర్పాటుకానున్న పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ సింగపూర్, న్యూయార్క్ తరువాత ఇదేనన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించతలపెట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో హైదరాబాద్ ల్యాండ్ మార్కుగా నిలువనుందన్నారు. ట్విన్ టవర్‌లో లక్ష సిసి కెమెరాలతో ప్రతి పోలీసు స్టేషన్, ట్రాఫిక్ విభాగాలకు అనుసంధానం చేయనున్నారని, మరో పదివేల సిసి కెమెరాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. పోలీసు వ్యవస్థను ప్రపంచంలోనే నెంబర్‌వన్ వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నదే తన అభిమతమన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పోలీసులు నేరాల అదుపే కాదు, ఇతర అంశాలపైనా మానిటరింగ్ చేయవచ్చన్నారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని, పోలీసులు, ప్రజలు పరస్పర సహకారాలతోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ విజయవంతం అవుతుందన్నారు. తాను ఏ దేశం వెళ్లినా శాంతిభద్రతల పరిస్థితులు ఎల్లా ఉన్నాయని అడుగుతారని, తెలంగాణ పోలీసు వ్యవస్థ జాతీయ, అంతర్జాతీయస్థాయిలో కీర్తి అందుకుంటుందన్నారు. పోలీసు వ్యవస్థ పటిష్టతకు ఎంపి ల్యాడ్స్ నిధులు కేటాయించాలని, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు సిసి కెమెరాలను కంట్రిబ్యూట్ చేయాలని ముఖ్యమంత్రి అప్పీల్ చేశారు. పోలీసు కానిస్టేబుళ్లకు ఏటా పది శాతం డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తున్నామని, ఆ పైఅధికారులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులకు కాలుష్య భత్యాన్ని ఇస్తున్నామని, పోలీసు వ్యవస్థ అవినీతిరహిత శాఖగా గుర్తించబడేందుకు ప్రతి పోలీసు స్టేషన్‌కు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్టు సిఎం కెసిఆర్ తెలిపారు. అత్యాధునిక హంగులతో ఏర్పాటుకానున్న ట్విన్ టవర్‌లో 17 అంతస్తులు, 24 అంతస్తుల భవనాల్లో పోలీసు శాఖకు సంబంధించి అన్ని విభాగాలు ఒకేచోట పని చేస్తాయన్నారు. వీటి టెక్నాలజీ ఆధునికీకరణకు రిలయన్స్ సంస్థ ఐదేళ్లపాటు కావాల్సిన కేబుల్‌ను ఉచితంగా సరఫరా చేసేందుకు సుముఖత వ్యక్తం చేసిందన్నారు. మహానగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పోలీసు వ్యవస్థ పటిష్టతోపాటు రాష్ట్భ్రావృద్ధికి సిఎం కెసిఆర్ ఎంతో శ్రమిస్తున్నారన్నారు. రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు మాట్లాడుతూ పోలీసులు ప్రజలపట్ల మర్యాదగా వ్యవహరించేలా చూడాలని, పోలీసులంటే ప్రజల్లో భయాన్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి సిఎం కెసిఆర్ చూపిస్తున్న చొరవ, కేంద్రం అందిస్తున్న సహకారం రాష్ట్భ్రావృద్ధికి ఎంతో దోహదపడుతుందన్నారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ప్రభుత్వ పాలనకు శాంతిభద్రతలే ముఖ్యమన్నారు. ఆ దిశగానే సిఎం కెసిఆర్ ముందుకెళ్తున్నారని కితాబునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, మంత్రులు పద్మారావుగౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపి కేశవరావు, రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డిలతోపాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. (చిత్రం) పోలీస్ కమాండ్ కంట్రోల్ ట్విన్ టవర్‌కు భూమి పూజ చేస్తున్న సిఎం కెసిఆర్