మెయిన్ ఫీచర్

కామెడీ హీరోలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కత్రినాకైఫ్ కంటే అందంగానో, పొందికగానో ఉన్నంత మాత్రాన -సన్నిలియోన్‌ను స్టార్ హీరోయిన్‌గా ఆడియన్స్ అంగీకరించగలరా? చిత్రమైన ఈ ప్రశ్నకు ఒక్కొక్కరూ ఒక్కోలా సమాధానమివ్వొచ్చు. -నిజానికి స్క్రీన్ మీద స్టార్ ఆర్టిస్ట్‌గా అంగీకరించినట్టు స్టార్ హీరోయిన్‌గా ఆమెను అంగీకరించలేరన్నది నిజం. ఎందుకూ? అంటే -ఆడియన్స్ సైకాలజీ.
స్టార్ హీరోలు కామెడీ చేస్తే అంగీకరించే తెలుగు సినీ జనం -స్టార్ కమెడియన్లు హీరోయిజాన్ని ప్రదర్శిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరన్నది ఎవరు కాదన్నా నిజం.
ఎప్పటికైనా ఈ పరిస్థితి మారుతుందా?
==============
కమెడియన్స్‌కు సిక్స్ ప్యాక్ ఎందుకు -అనే అపవాదులు ఎదుర్కొన్నాడు సునీల్! నిజమే నవ్వించే కమెడియన్‌కు యాక్షన్ ప్యాక్ అవసరమా? ఇదో వాదన. కమెడియన్ అంటే కేవలం కామెడీ పాత్రలకే పరిమితం కావాలా? -అన్నది మరో వాదన. ఇక ఓ సినిమాలో రవితేజ అన్నట్టు కమెడియన్స్ కామెడీ మాత్రమే చెయ్యాలా.. హీరోగా పనికిరారా? ఇది సినిమా డైలాగే అయినా సీరియస్ ప్రశే్న.
భారతీయ సినిమా పరిశ్రమలో చూసుకుంటే ఒక్క తెలుగు పరిశ్రమలోనే ఎక్కువమంది కమెడియన్లు ఉన్నారు. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే సీరియస్ విషయాలకంటే -రెండున్నర గంటలపాటు కడుపుబ్బ నవ్వుకుని బయటకు వచ్చేలా ఉండాలనే ఆశిస్తాడు. అందుకే తెలుగులో రియలిస్టిక్ సినిమాలు ఆడిన, ఆడుతున్న దాఖలాలు బహుతక్కువ.
విషయంలోకొస్తే -సినిమాలో హీరో చేసే హంగామాకంటే, ఓ కమెడియన్ ఆడియన్స్‌ని నవ్వించడమే కష్టమైన విషయం. ఇది ఏ కమెడియన్‌ను అడిగినా చెబుతాడు! అలాంటి కష్టానే్న ఇష్టంగా దాటేసిన సక్సెస్‌ఫుల్ కమెడియన్ -హీరోగా మాత్రం ఎందుకు సక్సెస్ చేయలేకపోతున్నాడన్నదే చర్చనీయాంశ ప్రశ్న. అంటే -అవకాశం కలిసొచ్చి కమెడియన్ హీరో వేషంవేస్తే ఆ కమెడియన్ ప్రతి కదలికా సిల్లీగా, కామెడీగానే ఉంటుందా? అంటే -అవుననే అంటున్నారు ఆడియన్స్. అనడమే కాదు, అలాగే చూస్తాం అంటున్నారు కూడా. అందుకే కమెడియన్‌గా పరిశ్రమలోకి ఎంటరై హీరోగా నిలదొక్కుకున్న ఒక్క కమెడియన్ కూడా లేడు. నిజానికి తెలుగు పరిశ్రమకు కామెడీ వేషాలతో వచ్చి హీరోలుగా మారిన వాళ్ల సంఖ్య తక్కువేం కాదు. కానీ -ఒక్కరూ హీరోగా నిలబడిన దాఖలాలు అస్సలు లేవు. నాలుగు ఫైట్లు చేయడంకంటే నలుగురిని నవ్వించడమే బహుకష్టం అని కమెడియనే్ల కాదు, హీరోలూ అంగీకరించినా -కామెడీ కష్టాన్ని సులువుగా దాటేస్తూ నవ్విస్తున్న కమెడియన్లు హీరోలుగా అంతకంటే తక్కువ కష్టంలోనూ ఇమడలేకపోతున్నారు. దారుణంగా ఫెయిలవుతున్నారు.
ముందుతరం నుంచే..
తెలుగు సినిమా ప్రారంభంనుండే హీరో, హీరోయిన్, విలన్ ఉన్నట్టే.. ఒకే కమెడియన్ కచ్చితంగా సినిమా లిస్టులో ప్రధాన పాత్రగా ఉంటాడు. ఇది ఫార్మాట్. కమెడియన్ పాత్ర ప్రత్యేకంగా ఉండొచ్చు. లేదా హీరో ఫ్రెండ్‌గానో, పక్కింటి అంకుల్‌గానో ఉండొచ్చు. లేదా హీరో ఫాదర్‌గానో, హీరోయిన్ మామగానో.. మొత్తానికి ప్రతి సినిమాలో కమెడియన్‌కు నిర్దిష్టమైన స్థానం మాత్రం క్రియేట్ చేశారు. అలా కామెడీ పాత్రలతో ఆకట్టుకుంటూ మొదటిసారిగా హీరోగా మారిన కమెడియన్ మాత్రం -కస్తూరి శివరావు. కమెడియన్‌గానే కాకుండా నటుడు, నిర్మాత, దర్శకుడిగానూ ప్రతిభ చాటుకున్నాడు. 1939లో వరవిక్రయం సినిమాతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కస్తూరి, తరువాత చాలా చిత్రాల్లో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత హీరోగా ఎంట్రీ ఇస్తూ గుణసుందరి కథ (1949)లో నటించాడు. ఆ సినిమాలో కస్తూరి శివరావు మానరిజానికి, డైలాగ్స్‌కు మంచి క్రేజ్ రావడంతో ఈ సినిమా సూపర్‌హిట్ అయ్యింది. తరువాత ఒకటిరెండు సినిమాలు చేసినా లాభంలేకపోయింది. మరోవైపు నిర్మాతగా సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు. ఆ తరువాత కమెడియన్‌గా గట్టి పోటీ రావడంతో -తరువాత ఆయన కెరీర్ అక్కడే ఆగిపోయింది. ఇక హీరోగా మారిన మరో కమెడియన్ రేలంగి. శ్రీకృష్ణతులాభారం (1935) సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రేలంగి కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. చాలా సినిమాల్లో టాప్ కమెడియన్‌గా మారిన రేలంగి పక్కింటి అమ్మాయి (1953) సినిమాతో హీరోగా మారాడు. రేలంగి హీరోగా నటించిన సినిమాలో అంజలిదేవి హీరోయిన్‌గా నటించింది. అయితే రేలంగి హీరోగా కంటే కూడా కమెడియన్‌గా క్రేజ్ ఉండడంతో ఆయన ఆ తరహా పాత్రలపై దృష్టిపెట్టడం. అదే సమయంలో ఆయనకు హీరోగానూ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కమెడియన్‌గానే సెటిలైపోయాడు. ఇక ఆయన తరువాత పద్మనాభం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన పద్మనాభం కూడా హీరోగా ఒకటి రెండు సినిమాలుచేసి కమెడియన్‌గా సెటిలైపోయాడు. ఆ తరువాత దర్శకుడిగా, నిర్మాతగా సినిమాలు తీశాడు.
నేటితరం..
ఇక ఈతరంలో కమెడియన్ల హవా బాగా పెరిగింది. అప్పట్లో ఒక సినిమాలో ఒకరో ఇద్దరో కమెడియన్లు ఉండేవారు. కాని 70వ దశకం, 80వ దశకంలో కమెడియన్స్ బాగా పెరిగిపోయారు. ఒక్క సినిమాలో ఏకంగా ముగ్గురు నలుగురు ఉండే అవకాశాలు వచ్చిపడ్డాయి. ఇక ఈతరంలో కమెడియన్లలోనూ హీరోగా మారినవారూ, మారాలనుకుంటున్న వాళ్ల సంఖ్య తక్కువేం లేదు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్రహ్మానందం గురించి. కమెడియన్‌గా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న బ్రహ్మానందం హీరోగా టర్న్ ఇస్తూ ‘బాబాయ్ హోటల్’ చిత్రంలో నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం కావడంతో మళ్లీ బ్రహ్మానందం హీరోగా సాహసం చేయలేకపోయాడు. అప్పటినుండి ఇప్పటివరకు కమెడియన్‌గా తన హవా కొనసాగిస్తున్నాడు. ఇక ఈయన తరువాత హీరోగా మారిన మరో కమెడియన్ బాబుమోహన్. తనమీద తనే జోకులు వేసుకుని నవ్వించే బాబుమోహన్ హీరోగా నిలబడాలని గట్టిగానే ట్రైచేసినా లాభం లేకపోయింది. ‘ఈ ప్రశ్నకు బదులేది’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బాబుమోహన్, తరువాత పలు చిత్రాల్లో కమెడియన్‌గా నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆయన్నీ హీరో పురుగు కుట్టింది. దాంతో, ఏదోక ప్రత్యేకత కోసం అన్నట్టు కసితో కష్టంగా హీరోయిన్లతో డ్యాన్స్‌లు చేసి ఆకట్టుకున్నాడుగానీ, హీరోగా నిలబడటం కష్టమన్నది అర్థమై తప్పుకున్నాడు. చాలాకాలం పాటు కమెడియన్‌గా కంటిన్యూ అయిపోయి, తరువాత రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు. ఇక ఆయన తరువాత హీరోగా మారింది కమెడియన్ వేణుమాధవ్. కమెడియన్‌గా పీక్ స్టేజిలో ఉన్నప్పుడే ప్రేమాభిషేకం, భూకైలాస్ సినిమాల్లో హీరోగా నటించాడు. ప్రేమాభిషేకం సినిమాతో నిర్మాతగా చేతులూ కాల్చుకున్నాడు. ఆ తరువాత ఇది మనకు సెట్‌కాదని కమెడియన్‌గానే సెటిలైపోయాడు. బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అలీ, పలు కామెడీ పాత్రలతో ఆకట్టుకున్నాడు. ఆయన్నీ హీరోగాపెట్టి దర్శకుడు ఎస్‌వి కృష్ణారెడ్డి తీసిన యమలీల చిత్రం సంచలన విజయం సాధించడంతో ఇక ఆలీ హీరోగా నిలబడతాడని అంతా అనుకున్నారు. ఆ తరువాత అరడజను సినిమాల్లో హీరోగా చేసిన ఆలీకి ఒక్క యమలీల తప్ప మరే సినిమా సక్సెస్ ఇవ్వలేకపోయింది. ఇక లాభం లేదనుకున్న ఆలీ కమెడియన్‌గా కంటిన్యూ అవుతున్నాడు. తరువాత ఎవిఎస్, శ్రీనివాస్‌రెడ్డి కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన కమెడియనే్ల.
ఇంక ఈ కమెడియన్ల లిస్టులో ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సునీల్‌ని. కమెడియన్‌గా కెరీర్ స్టార్ట్‌చేసిన సునీల్ అందాలరాముడు సినిమాతో హీరోగామారి మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నాడు. ఆ సినిమా తరువాత ప్రముఖ దర్శకుడు రాజవౌళి రూపొందించిన మర్యాదరామన్న సినిమా సంచలన విజయం సాధించడంతో ఇక హీరోగానే కంటిన్యూ అవ్వాలని ఫిక్సయ్యాడు సునీల్. రోటీన్ కమెడియన్ల ప్రయత్నాలకు భిన్నంగా -తన ఆకృతినీ పూర్తిగా మార్చుకుని ప్రయత్నాలు మొదలెట్టాడు. పెద్ద హీరోలకు ఏమాత్రం తగ్గనంతగా సిక్స్ ఫ్యాక్ సైతం సాధించిన సునీల్ -స్క్రీన్ మీద చొక్కా విప్పేసి ఆడియన్స్‌ని అదరగొట్టాడు. సిక్స్ ప్యాక్‌తో చేసిన పూలరంగడు సినిమా హిట్ అందుకుంది. ఆ సినిమాతోపాటు ఇప్పుడు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు సునీల్. మొత్తానికి హీరోగా సెటిలవ్వాలనే లక్ష్యంతో ఉన్నాడు. మొదట్లో చెప్పుకున్నట్టు కమెడియన్ హీరోగా పనికిరారా? అనే ప్రశ్నకు సమాధానంగా సునీల్ చేసే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. అయితే నేను హీరోనే అన్న నమ్మకం ఇంకా సునీల్‌లో కలగలేనట్టుంది. కమెడియన్ నుంచి ప్రమోషన్ మీదొచ్చిన హీరోనేనన్న ఎక్స్‌ప్రెషన్స్ అతని నటనలో కనిపిస్తోందన్న వాదన ఆడియన్స్ నుంచి బలంగా వినిపిస్తోంది. ఇది కనుక మార్చుకుంటే -కాస్త గట్టిగా ప్రయత్నిస్తే ఫలితం ఉండకపోదనీ ఆడియనే్స అంటున్నారు. సునీల్‌కు ఆడియన్స్ ఇస్తున్నంత భరోసా -అతనిపై అతనికి లేనట్టుందన్న వ్యాఖ్యలు లేకపోలేదు. దీనికి కారణం -హీరోగా సునీల్ తనకు తనే అన్వయించుకుంటున్న తీరే కారణమంటున్నారు కూడా. యాక్షన్ ఇమేజ్ ఉంటేనే హీరోఅని, నాలుగైదు ఫైట్లు, వొళ్లు గగుర్పొడిచేలాంటి గ్రాఫిక్ నృత్యాలు చేసినంత మాత్రానే హీరో అయిపోయినట్టన్న భ్రమలకు ఫుల్‌స్టాప్ పెట్టాలి. సేఫ్‌జోన్‌లో అందరినీ ఆకట్టుకునేలా జాగ్రత్తగా కెరీర్‌ని ప్లాన్ చేసుకుంటే -కమెడియన్ హీరోగా స్థిరపడటం విచిత్రమైన విషయమేమీ కాదు. వాస్తవాన్ని మర్చిపోయి డ్యాన్సులు, యాక్షన్ అంటూ హంగామా చేయాలని ప్రయత్నిస్తే మాత్రం కెరీర్‌కు ప్రమాదమే. కమెడియన్ బలమైన హీరోగా నిలబడ్డాడన్న రికార్డు దక్కించుకోవాలంటే -సునీల్ ప్రయత్నాలు మరోలా ఉండాలి. ఉంటాయేమో చూద్దాం.

-శ్రీ