తప్పని దిద్దుబాటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వాల్మీకి’ని తప్పుగా చూపించలేదు కనుక, ఇబ్బంది ఉండకపోవచ్చన్న ధైర్యంతోనే ఉన్నామన్నది దర్శకుడి మాట. నిజమే కావొచ్చు. అతనిది సదుద్దేశమే కావొచ్చు. మనోభావాల్ని దెబ్బతీస్తున్నారంటూ బోయ, వాల్మీకి వర్గాలు ఆందోళన వ్యక్తం చేసినపుడే -సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టి సదుద్దేశాన్ని వివరించివుంటే వాల్మీకి మరోలా ఉండేవాడేమో.

అనుకున్నదొకటి.. అయ్యిందొకటి అన్నట్టైంది -వాల్మీకి కథ. వరుణ్‌తేజ్, హరీశ్‌శంకర్ కాంబినేషన్‌లో ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా -విడుదలకు కొన్ని గంటలముందు టైటిల్‌ను మార్చాల్సి వచ్చింది. నిర్మాణం నుంచి ప్రమోషన్స్ పూర్తయ్యేంత వరకూ వాల్మీకి టైటిల్‌తోవున్న సినిమాపై -బోయ సంఘం, వాల్మీకివర్గం తమకున్న అభ్యంతరాలతో కోర్టు గడప తొక్కటంతో -తప్పనిసరి పరిస్థితుల్లో టైటిల్ దిద్దుబాటు తప్పలేదు. వాల్మీకిని మార్చి కొత్త టైటిల్ గద్దలకొండ గణేశ్‌గా పెడుతున్నట్టు చిత్ర నిర్మాతలు, దర్శకుడు కోర్టుకు నివేదించారు. అనంతరం టైటిల్ మార్పును మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు హరీశ్‌శంకర్ మాట్లాడుతూ -టైటిల్ ప్రకటించినపుడే కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చిందని, కాకపోతే ఓ వ్యక్తి పరివర్తన కథ కనుక వాల్మీకి టైటిల్ సూటవుతుందనే భావించామన్నాడు. ‘వాల్మీకి’ని ఎక్కడా తప్పుగా చూపించలేదు కనుక, ఇబ్బంది ఉండకపోవచ్చన్న ధైర్యంతోనే ఉన్నామంటూ చెప్పుకొచ్చాడు. ఇక్కడ దర్శకుడు చెప్పింది నిజమే కావొచ్చు. చిత్రబృందానిదీ సదుద్దేశమే కావొచ్చు. బోయ, వాల్మీకి వర్గాలు తమ మనోభావాల్ని దెబ్బతీస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసినపుడే -సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టి సదుద్దేశాన్ని వివరించివుంటే మరోలా ఉండేదేమో. సినిమా చూశాక.. సెంటిమెంట్ వ్యక్తం చేసిన వర్గాలనుంచే ప్రశంసలు వస్తాయన్న నమ్మకంతోనూ ఉన్నామంటూ చెప్పుకోవడం -ఏమాత్రం ఉపయుక్తంకాని మాటే. అభ్యంతరాలేమైనా వుంటే సెన్సార్ పరిధిలోకి వస్తుందనే భావించామంటూ చిత్రబృందం చెప్పడం కూడా -సమస్యకు పరిష్కార మార్గం అనిపించదు. అనంతపురం, కర్నూలు కలెక్టరేట్ల నుంచి సినిమా నిలుపుదల ఉత్తర్వులు వచ్చాక పరిష్కార మార్గం వెతికినా -పేరు మార్చటం తప్ప ఫలితం లేకపోయింది. రూ.40 కోట్లు ఖర్చు పెట్టి 200 మంది టెక్నీషియన్లు సినిమాపై పని చేసేది -వ్యక్తినో, వర్గాన్నో, కులాన్నో, సంఘాన్నో విమర్శించటానికైతే కాదంటూ చిత్రబృందం చెప్పుకున్నా -బోయ సంఘం, వాల్మీకి వర్గాల్లోని లక్షలాది జనం మనోభావాలకు ఇబ్బంది కలిగించే అంశంగా కొంతైనా ఆలోచించివుంటే -చివరి క్షణంలో టైటిల్ మార్చుకోవాల్సి వచ్చే పరిస్థితే ఉండకపోయేదేమో. ‘సినిమాలో ఏంచెప్పామో కూడా చూడకుండా, పరిస్థితిని ఇంతవరకూ తేవడమన్నది బాధాకరం. మనోభావాలు దెబ్బతిన్నాయని అంటున్నవారికి సవినయంగా విన్నవించేదొక్కటే. సినిమా చూడండి. అభ్యంతరాలు వ్యక్తం చేసేంత విషయం ఇందులో ఏమీలేదని అంతరాత్మకు అనిపిస్తే -అదే పదివేలు’ అంటూ దర్శకుడు హరీశ్ శంకర్ వ్యాఖ్యానించారు. ఇక్కడ దర్శకుడి అంతరాలోచన ఏదైనా -ఒక గ్యాంగ్‌స్టర్ పరివర్తన చెంది మంచివాడిగా మారాడన్న కథను ‘వాల్మీకి’ కోణంలో చెప్పటం సబబు కాదన్న విషయం కోర్టు కోణంలో కరెక్ట్ కానట్టేగా.
ఓపెనింగ్స్‌మీదే సినిమా వ్యాపారం ఆధారపడివున్న తరుణంలో, చివరి క్షణంలో ‘టైటిల్’ మార్చాల్సి రావడం బాధాకరమని నిర్మాత గోపీ ఆవేదన వ్యక్తం చేయటం సబబే. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్న ఉద్దేశాలు ఏకోశానా లేవని చెప్పుకున్నా -టైటిల్ మార్చాల్సి రావడం శ్రమ వృధా అయిన చందమే కనిపిస్తోంది. పరిశ్రమనో, సినిమా భవిష్యత్‌నో దృష్టిలో పెట్టుకుని టైటిల్ మార్చామని చెప్పుకున్నా -జరగాల్సిన నష్టం జరిగినట్టేనన్న వాదన వినిపిస్తోంది. ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యాన్ని కొంత పక్కనపెట్టి -చేతులు కాలకముందే టైటిల్‌పై దృష్టి పెట్టివుంటే ‘వాల్మీకి’ వేరుగా ఉండేవాడేమో. ఏదేమైనా -కోట్లు పెట్టుబడి పెట్టే ప్రాజెక్టుతో చెలగాటమాడాలన్న ఆలోచన ఏ దర్శక, నిర్మాతకూ ఉండదు. ఇది నమ్మాల్సిన నిజం. కాకపోతే -వ్యాపార కోణాన్ని ఆలోచించే సమయంలో ‘మనోభిప్రాయాలకూ’ ప్రాధాన్యత నివ్వాలన్న పాఠం మాత్రం నేర్చుకోక తప్పదు.