ఎందుకంటే ఏడవ పేజీ లేదు కనుక..( గోరాశాస్ర్తీయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పత్రికకు స్వేచ్ఛ అంటే ఏమిటో నిర్వచనంగా ఆంధ్రభూమి సంపాదకవర్గం పనితీరును ప్రశంసిస్తే అందులో అతిశయోక్తి లేదు. గోరాశాస్ర్తీగారు తమ సంపాదకీయాలలో ప్రభుత్వ యంత్రాంగాన్ని చీల్చి చెండాడేవారు. ‘సంపాదకీయాల కోసమే మేము పత్రిక కొంటున్నాం’ అని చాలామంది పాఠకులు చెప్పేవారు. రిపోర్టరు సత్యనిష్ఠతో వార్తలు ఇచ్చేవాళ్ళు. ప్రభుత్వానికో, మరొకరితో ఆగ్రహం వస్తుందని సత్యాన్ని దాచడం లాంటి పనులు ఎప్పుడూ జరిగేవి గావు. వార్తలను ఎలా ప్రచురించాలో, ఏ వార్తకు ఏ విధమైన ప్రాధాన్యం ఇవ్వాలో ఎడిటోరియల్ సిబ్బంది స్వేచ్ఛగా నిర్ణయం తీసుకొనేవారు. గోరాశాస్ర్తీగారి నుంచి, అట్టడుగు వ్యక్తివరకు అందరిదీ ఒకే మాటగా ఉండేది.
గోరాశాస్ర్తీగారు అభిప్రాయాలను వ్యక్తం చేయడంలోనే కాదు, భాష విషయంలోనూ స్వేచ్ఛగా వ్యవహరించేవారు. కొన్నాళ్ళు ‘గ్రాంథికం’ ఎందుకు రాయకూడదని ఆ విధంగా రాసేవారు. గోరాశాస్ర్తీగారు ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ మంచి శైలిలో రాయగల సమర్థులు. ఆయన దక్కన్ క్రానికల్ పత్రికకు కొంతకాలం సంపాదకీయాలు రాశారు. అలా రాసినపుడు తెలుగులో సంపాదకీయాలను ‘డిక్టేట్’ చేసేవారు. వరదాచార్యులవారుగాని, నేనుగాని మేము ఇద్దరం లేకపోతే మరెవరైనాగాని ‘డిక్టేషన్’ తీసుకొనేవాళ్లం. సంపాదకీయాలు అలా రాస్తున్నపుడు ఎన్నో విధాలైన చర్చలు జరిగేవి. జర్నలిజంలో అదొక మంచి అనుభవం.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటున్న 1969-70 కాలంలో ‘ఆంధ్రభూమి’లో ‘నేడు తెలంగాణ బంద్’ అని వార్త పడితే తెలంగాణ మొత్తం ఎవరూ ప్రయత్నం చేయవలసిన అవసరం లేకుండానే ‘బంద్’ జరిగేది. ఆంధ్రభూమి పట్ల పాఠకుల విశ్వాసం అలా ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకిస్తూ గోరాశాస్ర్తీగారు సంపాదకీయాలు రాసేవారు. కానీ వార్తలు చదివితే, ఈ పత్రిక ప్రత్యేక రాష్ట్రోద్యమాన్ని సమర్థిస్తున్నదనే భావన (ఎవరికైనా) కలిగేది. కానీ నిజం ఏమిటంటే వాస్తవాలను చెప్పడమే ఆ రోజుల్లో మేము చేసింది. కాకపోతే, ఉద్యమ నాయకుల ప్రకటనలకు మేము ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని కొందరు అనుకొని ఉండవచ్చు. ఏమైనప్పటికీ ఇక్కడ మెచ్చుకొనవలసింది పత్రికలో పనిచేసిన సంపాదకవర్గం స్వేచ్ఛ.
ప్రత్యేక రాష్ట్రోద్యమాన్ని బలపరుస్తున్నామనే భావన చాలామందిలో కలిగినప్పటికీ ఆందోళనకారులు పత్రికపై ఆగ్రహించిన సందర్భాలు ఉన్నాయి. ఒకరోజు కొందరు ఆవేశంగా గోరాశాస్ర్తీగారి గదిలోకి చొరబడి తీవ్ర పదజాలంతో మాట్లాడారు. అప్పుడక్కడ డాక్టర్ వరదాచార్యులు కూడా ఉన్నారు. ‘‘మా వార్తను మొదటి పేజీలో కాక ఆరవ పేజీలో ఎందుకు వేసారు?’’ అని వారు కోపంగా అడిగిన ప్రశ్న. గోరాశాస్ర్తీగారు శాంతంగా చెప్పిన సమాధానం పత్రికల చరిత్రలో నిక్షిప్తం కావలసినంత విలువైనది. ‘ఏడవ పేజీ లేదు గనుక..!’ అని గోరాశాస్ర్తీగారి సమాధానం.

(ఆ రోజుల్లో చాలా తెలుగు పత్రికలలో ఆరు పేజీలు మాత్రమే ఉండేవి. ఆదివారంనాడు మరి రెండో నాలుగో పేజీలు అదనం)
గోరాశాస్ర్తీగారి ధైర్యం ఆందోళనకారులను చకితుల్ని చేసింది. ఆ వచ్చినవాళ్ళు ఎంతగా చల్లబడిపోయారంటే వారు ఏ జీపులో వచ్చారో ఆ జీపులో గోరాశాస్ర్తీగారిని ఇంటివద్ద దింపి వెళ్లారు!

1975 ఫిబ్రవరిలో నేను ‘ఈనాడు’ దినపత్రికకు ‘ఎడిటర్’ ఉద్యోగం రావడంవల్ల ఆంధ్రభూమిని వదలి వెళ్లవలసి వచ్చింది. ఐనా, శాస్ర్తీగారితోనూ, వరదాచార్యులవారితోనూ, అక్కడ పనిచేసిన మిగతా మిత్రులతోనూ నా సత్సంబంధాలు కొనసాగాయి. సాటి ఉద్యోగులమని గాక, ఒక కుటుంబంలోని వారమనే భావన మా అందరిలోనూ ఉండేది.
బాలారిష్టాల మొదటి నాలుగైదు సంవత్సరాలను మినహాయిస్తే గోరాశాస్ర్తీగారితో ఆంధ్రభూమి దినపత్రిక ఉత్తమ సంపాదకత్వ ప్రమాణాలతో ఘనమైన చరిత్ర నిర్మించుకొన్నది. అలాంటి ఉన్నత ప్రమాణాలు నెలకొనడానికి దోహదం చేసిన పత్రిక యాజమాన్యం కూడా ప్రశంసార్హమైనది.

- పొత్తూరి వెంకటేశ్వరరావు