కమెడియన్‌కు సిక్స్‌ప్యాక్ ఎందుకన్నారు! -సునీల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు పరిశ్రమలో కమెడియన్‌గా పాపులరై హీరోగా మారి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న నటులు వున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులోకి సునీల్ కూడా చేరిపోయాడు. కమెడియన్‌గా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న సునీల్, ‘అందాల రాముడు’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా తరువాత వచ్చిన ‘మర్యాద రామన్న’ చిత్రం అతనికి మంచి కమర్షియల్ హిట్‌ని అందించింది. ఆ తరువాత చేసిన చిత్రాలు నిరాశపరచడంతో కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ‘కృష్ణాష్టమి’. వాసువర్మ దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా సునీల్‌తో ముఖాముఖి...

చాలా గ్యాప్ తీసుకున్నట్టున్నారు?
అవును. ‘్భమవరం బుల్లోడు’ సినిమా తరువాత మూడు నాలుగు స్క్రిప్టులు విన్నాను. ఆ తరువాత రెండు ప్రాజెక్టులు కూడా ఫైనల్ అయ్యాయి. కానీ ఎందుకనో అవి సెట్స్‌పైకి రాలేదు. దానివల్ల గ్యాప్ వచ్చింది.
గ్యాప్ రావడంవల్ల కెరీర్ పరంగా నష్టం కాదా?
అలా ఏం కాదు. నేను 1995లో హైదరాబాద్ వచ్చాను. ఆ తరువాత చాలా కాలం కష్టాలు పడి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాను. ‘అందాలరాముడు’ సినిమా తరువాత దాదాపు ఐదేళ్లు హీరోగా చేయలేదు. అలాగని నాకు హీరోగా అవకాశాలు రావడం ఆగిపోలేదు కదా.
సక్సెస్.. ఫెయిల్యూర్‌లపై మీ అభిప్రాయం?
ఎవరికైనా సక్సెస్ అయితే ఆనందమే కదా! నాక్కూడా సక్సెస్ వస్తే ఆనందమే. ఫెయిల్యూర్ వచ్చిందంటే దాన్ని గురించి ఆలోచిస్తా.
హీరోగానే కంటిన్యూ అవుతారా?
నాకూ చేయాలనే వుంది. ఏది చేసినా సినిమాల సక్సెస్‌ను బట్టే వుంటుంది. హీరోగా చేసిన తరువాత కూడా కొన్ని సినిమాల్లో కమెడియన్ పాత్రలు చేశాను. ఆమధ్య ‘తడాఖా’ సినిమాలో కూడా నటించాను కదా.
ఈ ప్రాజెక్టు గురించి?
ఒక రోజు దిల్‌రాజు ఫోన్ చేసి ఓ కథ వుంది, వినమని చెప్పారు. నిజానికి ఆ కథ ఓ పెద్ద హీరో కోసం అనుకున్నారని తెలిసింది. ఈ కథకు నేను సూట్ అవుతానా అని అడిగాను.
ఖచ్చితంగా నీకు సూట్ అవుతుందని చెప్పాడు. ఆయన చెప్పాక తిరుగుండదు కదా! అంతేకాకుండా కథ కూడా బాగా నచ్చింది.
ఇంతకీ కృష్ణాష్టమి అంటే ఏమిటి?
ఈ సినిమాలో నేను ఎన్‌ఆర్‌ఐగా కనిపిస్తాను. హీరోకు, కృష్ణాష్టమికి సంబంధం వుంటుంది. అదేంటన్నది సినిమా చూస్తే తెలుస్తుంది. పక్కవాడికోసం ఎంతవరకైనా రిస్క్ చేసే పాత్ర నాది. ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషన్ అన్నీ వున్న సినిమా ఇది. సరదాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే సినిమా.
ఈ బ్యానర్‌లోనే కమెడియన్‌గా చేశారు, ఇప్పుడు హీరోగా చేస్తున్నారు, ట్రీట్‌మెంట్‌లో తేడా వుందా?
అలాంటిదేం లేదండి. దిల్‌రాజు బ్యానర్ అంటేనే పరఫెక్ట్‌గా పద్ధతి ప్రకారం వుంటుంది. ‘బొమ్మరిల్లు’ సినిమాలో కమెడియన్‌గా చేసినా, ఈ సినిమాలో హీరోగా చేసినా నేను బైటివాడిలా కాక ఇంటివాడిలాగానే ఉంటాను. అప్పుడూ ఇప్పుడూ ఎలాంటి మార్పు లేదు.
దర్శకుడు వాసూవర్మ గురించి?
ఈ కథ చెప్పిన తరువాత దర్శకుడు ఎవరని అడిగాను. వాసూవర్మ అని చెప్పగానే నాకు చాలా ఆనందం వేసింది. తనతో నాకు చాలా మంచి స్నేహం వుంది. ఎప్పటినుంచో యంగ్ బ్యాచ్‌తో పనిచేయాలనే కోరిక వుండేది. అది ఈ సినిమాతో తీరింది. అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడు వాసు. నా కెరీర్‌లో భారీ సినిమా ఇదే.
ఈ సినిమాలో కూడా సిక్స్‌ప్యాక్ చూపిస్తారా?
ఉంటుంది. ఈ సినిమాలో కేవలం రెండు సీన్లలో కన్పిస్తుంది. నిజానికి నేను సిక్స్‌ప్యాక్ చేయడానికి కారణం ఉంది. కమెడియన్‌గా లావుగా వుంటే సరిపోతుంది. నవ్వించడం ఒక్కటే బాధ్యత కనుక. కానీ హీరోగా మాత్రం రెండున్నర గంటలు ప్రేక్షకుణ్ణి ఎంటర్‌టైన్ చేయాలి. కాబట్టి మనలో నచ్చే క్వాలిటీస్ వుండాలని సిక్స్‌ప్యాక్ చేశాను.
సిక్స్‌ప్యాక్ చేసేటప్పుడు ఎవరైనా ఏమైనా కామెంట్ చేశారా?
చాలామంది అన్నారు, కమెడియన్‌కు సిక్స్‌ప్యాక్ ఎందుకు అని. కమెడియన్ అందరిలా వుంటే సరిపోతుంది. ఇప్పటివరకు హీరోగా చేసిన ఏ కమెడియన్ సిక్స్‌ప్యాక్ చేయలేదు కదా అన్నారు. ఆ ఆలోచనలతో మా అమ్మను అడిగా. కమెడియన్ ఇప్పటివరకు ఎవరూ సిక్స్‌ప్యాక్ చేయలేదంట, నేను చేస్తే బాగుంటుందా అని. దానికి మా అమ్మ అందరిలా కాకుండా నీకంటూ ప్రత్యేకత చూపించు అని చెప్పడంతో ప్రొసీడయ్యా.
కమెడియన్‌గా చేయడం కష్టమా? హీరోగానా?
కమెడియన్‌గా చేయడమే చాలా కష్టం. అవతలి వ్యక్తిని నవ్వించాలంటే దానికి చాలా సరుకు కావాలి. హీరో అంటే రకరకాల హంగామాలు చేస్తే సరిపోతుంది.
మరి త్రివిక్రమ్‌తో సినిమా ఎప్పుడు?
ఖచ్చితంగా వుంటుంది. అదెప్పుడన్నది తనే చెప్పాలి. ప్రస్తుతం తను వేరే సినిమాలతో బిజిగా వున్నాడు. నాకోసం సినిమా చేస్తాడు.
త్రివిక్రమ్‌కు మీకు మధ్య ఎలాంటి రిలేషన్ వుంది?
తను నన్ను బాగా నమ్మిన వ్యక్తి. నిజంగా అలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం. నన్ను దగ్గరినుండి బాగా గమనించాడు కాబట్టి చాలా సినిమాల్లో నాకు దగ్గరగా వుండే పాత్రలు క్రియేట్ చేసి నన్ను నిలబెట్టాడు. తను క్రియేట్ చేసిన పాత్రల్లో బంకు శీను పాత్ర నాకు బాగా ఇష్టం.
తదుపరి చిత్రాలు?
ప్రస్తుతం వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. అది దాదాపు పూర్తికావచ్చింది. దాంతోపాటు వీరుపోట్ల దర్శకత్వంలో ‘ఈడు గోల్డెహె’ సినిమా చేస్తున్నాను. ఇంకో రెండు ప్రాజెక్టులు చర్చలు జరుగుతున్నాయి.

-శ్రీ