వందరోజులు వట్టిమాటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా రూపొందించే సమయంలో ప్రతి నిర్మాత, తన చిత్రం వంద రోజులు ఆడాలని కోరుకుంటాడు. అయితే ఆ చిత్ర దర్శకుడి ప్రతిభ, సాంకేతిక నిపుణుల పనితనం, నటీనటుల నటనాచాతుర్యం వెరసి ఆ చిత్రాన్ని మంచి చిత్రంగా రూపుదిద్దితే ఢోకాలేదు. గతంలో గొప్ప గొప్ప డైరెక్టర్లు మంచి అభిరుచి వున్న నిర్మాతలు, కథలను అందరికీ నచ్చే విధంగా వండి వార్చే రచయితలు వుండడంతో, తెలుగు సినీ పరిశ్రమ వంద చిత్రాలు, 200 రోజుల విజయోత్సవాలు అన్నట్లుగా ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు ఆ వెలుగు తిరోగమన దిశలో సాగుతోంది. దాదాపుగా కింది స్థాయికి వచ్చిన దాఖలాలు కూడా అప్పుడప్పుడూ కొన్ని చిత్రాల విడుదల సమయంలో జరిగే సిత్రాలను చూస్తుంటే అర్థమవుతోంది. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు, సూపర్‌హిట్ వంద రోజుల వేడుకలు అనేది చరిత్ర పుటల్లో కలిసిపోతున్న వాస్తవాలు.
ఒకప్పుడు సినిమా వంద రోజులు ఆడింది అంటే అది గొప్ప చిత్రం కింద లెక్కే. కానీ ఇప్పుడు వంద రోజులు కాదు కదా, వంద షోలు ప్రదర్శించినా అది గొప్ప చిత్రమే అని పరిశ్రమ, దర్శక నిర్మాతలు పొగిడేస్తున్నారు. దీనికి కారణం ఒక్క చిత్రానే్న దాదాపు ప్రపంచంలో వున్న థియేటర్లు అన్నింటిలో విడుదల చేయడంతో పెట్టుబడితోపాటు లాభాలు కూడా వంద శాతం వస్తున్నాయని నిర్మాతలు చెబుతున్నారు. కానీ, అన్ని థియేటర్లలో ప్రదర్శించడానికి కావాల్సిన హంగు, ఆర్భాటం వున్న నిర్మాతలకు అది చెల్లుతుంది. చిన్న చిత్రాలంటూ లోబడ్జెట్ చిత్రాలను రూపొందించిన దర్శక నిర్మాతలకు అటువంటి భాగ్యం కలలో కూడా దొరకరు. వారి చిత్రాలకు థియేటర్లు దొరకవు. ఒకవేళ అదృష్టం వుండి దొరికినా ఒక్కవారానికన్నా ఎక్కువ రోజులు ఆ థియేటర్లో ఆ చిత్రం ఆడదు.
సినిమా బాగుంది అని ప్రేక్షకులు చెబుతున్నా, నిర్దాక్షిణ్యంగా ఆ థియేటర్లనుండి సినిమాను తీసివేసి పెద్ద హీరోల చిత్రాలను విడుదల చేస్తున్నారు. దాంతో మంచి సినిమా అయినా సరే, చిన్న సినిమా హత్యకు గురవుతోంది. ఇది చిన్న సినిమా అయినా సరే, మంచి సినిమా గురించిన విషయం. కానీ, చిన్న సినిమా అంటూ చెత్త సినిమాలను రూపొందించే వారికి అసలు థియేటర్లే దొరికే పరిస్థితి లేదు. ఒకవేళ ఎంతో కొంత ప్రయాసపడి, నాలుగైదు థియేటర్లు సంపాదించినా, ఆయా చిత్రాలు రెండు రోజులకన్నా ఎక్కువ ప్రదర్శించిన దాఖలాలు కనపడవు. కొన్ని సినిమాలైతే విడుదలైన రోజే మార్నింగ్ షోకు, మాట్నీకి నాలుగు టిక్కెట్లు కూడా తెగకపోయేసరికి సదరు థియేటర్ యజమాని ఫస్ట్‌షోనుంచే మరో చిత్రాన్ని మార్చేస్తున్న విషయం ప్రేక్షకులకు తెలుసు.
పొద్దునే కదా విడుదలైంది? అప్పుడే తీసేశారా? అని ప్రశ్నిస్తే ఇద్దరు ప్రేక్షకులు కూడా రాలేదని, అందుకే ఫస్ట్‌షోనుంచి పోయినవారం ప్రదర్శించిన చిత్రాన్ని మళ్లీ వేస్తున్నామని జవాబు వస్తుంది. అంటే, విడుదలైన సినిమా కేవలం రెండు షోలు మాత్రమే ప్రదర్శించబడిందన్నమాట. దాని అదృష్టం వుంటే రెండు రోజుల్లో ఎనిమిది షోలు కూడా ప్రదర్శించవచ్చు. ఏదైనా సరే, ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చి సినిమా చూడడమే అసలైన సినిమా పరిశ్రమ టార్గెట్. కానీ, టీవీల్లో, మొబైల్స్‌లో సినిమాలు చూస్తున్న ఈ రోజుల్లో ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చి సినిమాను చూస్తాడా? అందుకే టీవీల్లో, మొబైల్స్‌లో దొరకని కొత్త టెక్నిక్, విజువల్ వండర్స్‌ను (ఉదాహరణకి బాహుబలి) రూపొందించే ప్రయత్నం తెలివిగల దర్శక నిర్మాతలు చేస్తున్నారు. ఇది గమనించని చిన్న నిర్మాతలు ఇంకా రొడ్డకొట్టుడు కథలతోనే చిన్న సినిమా అంటూ అదే పంథాలో సాగుతున్నారు. రాజును చూసిన కంటితో మొగుణ్ణి చూస్తే మొట్టబుద్ధవుదూ అన్నట్లుగా హై రేంజ్‌లో సినిమా చూసిన ప్రేక్షకుడికి సామాన్యమైన కథతో తీసిన సాంఘిక చిత్రం నచ్చుతుందా? ఇన్ని కారణాలతో ఒక్క సినిమా వంద షోలు ప్రదర్శించినా గొప్పే అనుకుంటున్న ఈ రోజుల్లో, వంద షోలను కూడా ఆడలేక చతికిలపడుతున్నాయి చిత్రాలు. ఇక్కడ ప్రధానమైన లోపం థియేటర్ దొరక్కపోవడం ఒకటైతే, సినిమాలో కథ, కథనాలు చూసినవే అవడం మరోటి. ఈ రెండు కారణాల నేపథ్యంలో వౌత్ టాక్‌తో సినిమా భవిష్యత్ తేల్చేస్తున్నాడు సగటు ప్రేక్షకుడు! దీంతో థియేటర్ వైపు రావడానికే ప్రేక్షకులు భయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఒక్క చిత్రం వంద షోలు ప్రదర్శిస్తే అది హిట్ కిందే లెక్క. కాలం మారింది. సినిమాకు సంబంధించిన పడికట్టు పదాలు కూడా మారిపోతున్నాయి. అంతే మరి! ప్రేక్షకుడికి వినోదం ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుంది, ఒక్క థియేటర్‌లోనే కాదు. అందుకే సినిమాలూ తగ్గాయి, షోలు తగ్గాయి. తద్వారా నటీనటులకు సినిమాలూ తగ్గిపోతున్నాయి. ఇటీవల కొందరు నటీనటులు తమకు ముందు వరుసలో అవకాశాలు ఇవ్వాలని, పరభాషా నటులను అవసరమైతే తీసుకోవాలని, తమకింత ముద్దపెట్టండి అంటూ ధర్నాకు దిగడం ఇందులో కొసమెరుపు. ఇదంతా ఎందుకొచ్చిందీ అనంటే- పెరిగిన టెక్నాలజీ ఒకటైతే, అందుకు తగినవిధంగా సినిమా కథ, కథనాలు మారకపోవడం. ఈ పరిస్థితి మారుతుందా? అని సామాన్య ప్రేక్షకుడు ప్రశ్నించుకుంటున్నాడు. కాలమే తీర్పు చెప్పాలి!

-యు