అసాంజె స్ఫూర్తిగా ఇజం -- దర్శకుడు పూరీ జగన్నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరీ జగన్నాధ్ తెలుగుతెరపై సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసిన దర్శకుడు. ఆయన సినిమాలు కొత్తదనాన్ని ఆవిష్కరించాయి. ముఖ్యంగా హీరోయిజాన్ని మరో కోణంలో చూపించిన పూరీతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తిని చూపిస్తారు. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇజం’. కల్యాణ్‌రామ్, అథితి ఆర్య జంటగా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 21న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాధ్‌తో ఇంటర్వ్యూ..

* ఇంతకీ ఏ ఇజాన్ని చూపిస్తున్నారు?
- ఓ సిన్సియర్ జర్నలిస్టు కథే ఇజం. ప్రతి జర్నలిస్టుకీ ఓ ఐడియా, ఒక థియరీ ఖచ్చితంగా వుంటుంది. సమాజం అవివీతిలో కొట్టుకుపోతోందని ఓ నిజాయితీగల జర్నలిస్టు ఎలాంటి పోరాటం చేశాడు, ప్రస్తుతం వున్న సమస్యకు ఎలాంటి పరిష్కారాన్ని చూపించాడనేదే ఈ చిత్రం.
* వికిలీక్స్ స్ఫూర్తితో కథ రెడీ చేశారా?
- నిజానికి పదేళ్ల క్రితమే రాసుకున్న కథ ఇది. వికిలీక్స్ అనేది ఈమథ్యే ప్రచారంలోకి వచ్చింది. పదేళ్లుగా సాంకేతికతతోపాటు జర్నలిజం శైలి మారింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చేసిన కథే ఇది. వికిలీక్స్ పబ్లిషర్ జూలియన్ అసాంజెను స్ఫూర్తిగా తీసుకుని హీరో పాత్ర రూపొందించా.
* గతంలో పవన్‌తో తీసిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం కూడా జర్నలిజం నేపథ్యంలో చేశారు? దానికీ దీనికీ తేడా ఏమిటి?
- కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో రాజకీయ నేపథ్యం, అందులోని లోపాలను ఎత్తిచూపుతూ తెరకెక్కించాను. కానీ ‘ఇజం’లో అలా కాదు. కరెప్షన్ నేపథ్యంలో చేసిన సినిమా ఇది. గతంలో వచ్చిన సినిమాలకు పూర్తి భిన్నంగా వుంటుంది. రాజకీయ నాయకులతోపాటు చాలామంది అవినీతిపరుల గురించి ఇందులో ప్రస్తావిస్తున్నా.
* కల్యాణ్‌రామ్ కోసమే కథ చేశారా?
- నా దగ్గర వున్న పది స్క్రిప్టుల్లో ‘ఇజం’ సినిమా ఒకటి. కల్యాణ్‌రామ్‌తో సినిమా చేయాలనుకున్నపుడు ఆయనకు ఈ కథే చెప్పాలనిపించింది. ఎందుకంటే, జర్నలిస్టు పాత్రలో చేసే నటుడిలో నిజాయితీ, నిబద్ధత అతని ముఖంలో కనిపించాలి. అలాగే డైలాగులు చెబుతున్నా కూడా అవి సినిమాటిక్‌గా వుండకూడదు. అవన్నీ నాకు కల్యాణ్‌లో కనిపించాయి. అందుకే ఈ కథ చెప్పా. నేను అనుకున్నదానికంటే కూడా కల్యాణ్ గొప్పగా చేశాడు.
* పదేళ్ళ క్రితం కథ కదా, నేటి ట్రెండ్‌కు తగ్గట్టు మార్చారా?
- ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా కథను మార్చాను. ఇప్పుడున్న ట్రెండ్‌లో రావాల్సిన సరైన కథ ఇది. అలాగని ఈ సినిమాతో ఎలాంటి సందేశాలు ఇవ్వడంలేదు. హీరోతో ఎవర్నీ ఉద్దేశించి క్లాస్ పీకే సన్నివేశాలు వుండవు. పంచ్ డైలాగులు అసలే వుండవు.
* జర్నలిస్టు పాత్రకు సిక్స్‌ప్యాక్ అవసరమా?
- మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా వున్న యువకుడు అయితే బావుంటుంది. తనైతే చెప్పింది కరెక్టుగా చేయగలడు.
అంతేకాని లావుగా, పొట్టేసుకుని డైలాగులు చెబితే బాగుండదు. అందుకే హీరో పాత్ర కోసం కల్యాణ్‌రామ్‌తో సిక్స్‌ప్యాక్ చేయించాను. తను కూడా సీరియస్‌గా తీసుకుని మూడు నెలల్లో 14 కిలోలు తగ్గాడు.
* కోర్టు సీన్ నందమూరివారే చేయాలని అన్నారు, కారణం?
- సినిమా చివరి 15 నిమిషాలు కోర్టు సన్నివేశముంటుంది. అదే సినిమాకు హైలెట్. ఈ సన్నివేశంలో కల్యాణ్‌రామ్ నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో తాను చెప్పే డైలాగులు నిజాయితీతో చెప్పినట్టుగా అనిపిస్తాయి. ఒక జర్నలిస్టు ఫైర్‌తో ఎలా ప్రశ్నిస్తాడో అదే ఇందులో కనిపిస్తుంది.
* వర్మకు సినిమా చూపించారా?
- ఇంకా లేదు. ప్రస్తుతం ఆయన ‘సర్కార్-3’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. నా సినిమాలు ఆయన చూడరు, ఆయన సినిమాలు నేను చూడను. ట్రైలర్ నచ్చిందని చెప్పాడు. రిలీజ్ తరువాత చూపిస్తా.
* ఇందులో పాటను బాగా కసితో రాసినట్లున్నారు?
- సమాజంలో మంచివాళ్లు కరువైపోయారు మరి. అందుకే అలా అన్నానేమో!
* ఎన్టీఆర్‌తో సినిమా ఎప్పుడు?
- ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్నాయి.
* మరి మహేష్‌తో సినిమా?
- మూడేళ్లుగా ఈ సినిమా గురించి అనుకుంటూనే ఉన్నాను. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయింది. టైటిల్ ‘జనగణమణ’. కథ ఆయనకు నచ్చింది. కానీ ఆ విషయం గురించి ఇంకా మహేష్ ఏ స్పందనా ఇవ్వలేదు.
* పూరీ కనెక్ట్స్ గురించి?
- కొత్తవాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో దీనిని ప్రారంభించాం. ఇందులో యాడ్ ఏజెన్సీతోపాటు కొత్తవాళ్లతో సినిమాలు ప్లాన్ చేస్తున్నాం.
* మరి చిరంజీవి సినిమా ఏమైంది?
- నా దగ్గర వచ్చే పదేళ్లవరకూ సరిపడే కథలు ఉన్నాయి. అవి కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఒక కథ ఒకరికి నచ్చితే, మరొకరికి మరో కథ నచ్చుతుంది. అలా చాలా సినిమాలు వచ్చాయి. ఉదాహరణకు పవన్‌కు ‘పోకిరి’ కథ చెప్పా. అది ఆయనకు నచ్చలేదు. అలాగే మరో హీరోకు ‘ఇడియట్’ కథ చెప్పా. ఆయనకూ నచ్చలేదు. చిరంజీవికి కూడా మరో కథ చెబుతా.
* భవిష్యత్తులో ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నారు?
- ఇక్కడి నటులను, విదేశీ నటులను కలిపి క్రాస్ ఓవర్ సినిమా ఒకటి చేయాలని కోరిక. చూద్దాం.. ఎప్పుడవుతుందో?
* రవితేజతో సినిమా ఎప్పుడు?
- ప్రస్తుతం అతను సినిమా చేసే మూడ్‌లో లేడు. ప్రస్తుతం ప్రపంచమంతా చుట్టెయ్యాలనే ప్లాన్‌లో వున్నాడు. పదిహేళ్లుగా ఎలాంటి విరామం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. నన్ను కూడా సినిమాలు ఆపేసి, విదేశాలు తిరిగొద్దామని చెబుతున్నాడు.
* నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
- తెలుగు, కన్నడలో రూపొందించిన ‘రోగ్’ షూటింగ్ పూర్తయింది. డిసెంబర్‌లో విడుదల చేస్తాం. అలాగే మిగతా సినిమాలు చర్చల్లో వున్నాయి. త్వరలోనే తెలియజేస్తా.

-శ్రీ